వెంటాడే కాళ్ళు
28/11/2009.
మాటలన్నీ కుప్పబోసినట్లు
వెంటాడే ఒక నిశ్శబ్దరావం
భుక్తాయాసంతో తలచుట్టూ తిరిగే తుమ్మెద
నిస్వన పంజరంలో ఇరుక్కున సరస్సు
గాలుల్ని మోయలేక… ఎటూ కదలలేక…
..
.
పండుటాకులు ఒక్కొక్కటిగా రాలిపడుతుంటాయి
ఈదుతూ పోయే రాయంచపాదాలు
కళ్ళల్లో కుశల ప్రశ్నలు చిలకరిస్తూ
.
రాలిన రేకులన్నీ ఒక్కటిగా గాల్లోకెగసినప్పుడు
గులాబీయానంలో హేమంతం వెళ్ళిపోతుంది
ఆవిరై ఘనీభవించి
ఆకాశానికీ భూమికీ నడుమ పొరలు పొరలుగా
కొత్త కొత్త ఆకారాలుగా ఆత్మసృజన-
.
***
మేడ మీద కుర్చీ
కుర్చీ చుట్టూరా వెన్నెల
వెన్నెలకు పూసిన రెండు అరిచేతులు
నను నిమిరిన బిడియపు స్పర్శలు వెంటేసుకుని
ఈ దారినే వెళ్తూంటుందప్పుడప్పుడూ
ఘల్లు ఘల్లుమని
ఘుంఘురూల సవ్వడితో…
.
( …… ఒక భావనకు)
నక్షత్రపురం తోవ (అనేకవచనంపై దీపశిల కవి సిద్ధార్థ)
25/11/2009.
(అనేకవచనం కవితా సంకలనానికి మిత్రుడు సిద్ధార్థ రాసిన చివరి మాట)
.
ఈ మిలీనియంలో చివరి మెట్టు మీద నిలబడి మెలకువలోనే కలలు కనేవాడు తుది చరణాన్ని గురిపెడుతున్నాడు. తన singular solitude లోంచి పక్కకు జరిగి, తన నీడను తానే చూస్తూ, చూపిస్తూ విచిత్రానికి లోనవుతున్నాడు. పారదర్శకపు చీకటి పొరపై పుప్పొడిలా పేరుకున్న గుసగుస ఈ కవిత్వమంతా. అనుభవంలోచి తాదాత్మ్యతను వెదజల్లే నిగారింపు కవిత్వం. మనం చాలాసార్లు అనుకుంటూ వుంటాం, కవిత్వం అర్థం కావాలని, మన అర్థాల్లోనే అర్థం కావాలనీ పట్టుబడతాం. కానీ అంతా విరుద్ధంగా జరుగుతూ వుంటుంది. చాలా గొప్ప గొప్ప కవులంతా మన అర్థాల బారిన మనల్ని వదిలేసి, వొక విశాలమైన Poetic Awareness లోకి మనల్ని విడుదల చేయడానికే చాలా అస్పష్టతలన్ని తమ కవిత్వం మీద రుద్దుకుంటారు..
కవిత్వంలో కవి అర్థమైపోతాడనుకుంటే కుదరని పని. కవులు తాము ప్రపంచానికి చెప్పాలనుకున్న చాలా రహస్యాలను, పాపాలను, కన్నీళ్ళనూ మరగుపరచడానికి కూడా కవిత్వం రాశారానిపిస్తుంది. కవి తన కవిత్వంతో జ్ఞాపకాలను వెలిగించడమే కాదు, అసలు జ్ఞాపకాలలోని nounనీ, pronounనీ కూడా చెరిపేయగలడు. అందుకే, మనం ఏ ప్రపంచాన్నైతే అక్కర్లేదనుకుంటామో, అవసరం లేదనుకుంటామో దాన్ని మరుగుపరిచే ప్రయత్నానికీ సాహసిస్తుంటాడు. చాలాసార్లు మంచి కవిత్వం బ్రౌన్ షుగర్ని పీలిస్తే కలిగే సుఖానికంటే ఎక్కువ ఆనందం కలుగుతుందని అంటారు. నిజమేనేమో… అసలు కవిత్వం చేసే గొప్ప పని మనల్ని దారి తప్పేలా చేయడమే. మనల్ని పక్కదారి పట్టించటానికీ, కొత్త లోకాలకై పిల్ల బాటను వేయటానికీ దోహదపడుతుంది.
.
కవిత్వం రెండంచుల జంబియా (కత్తి). ఎడతెగక కవి లోపల మార్ఫా శబ్దం, తాషా దరువు ఎప్పటికీ వినిపిస్తూనే వుంటుంది. కవి దాన్ని శాంతపరచాలని, నిశ్శబ్దపరచాలని కూడా కవిత్వం రాస్తుంటాడు. తన లోపలి ‘కుత కుత’నీ, మంటనీ ఆవిరి చెయ్యటానికి ఎన్నో formsలోకి వొదిగి కవిత్వాన్ని ఆశ్రయిస్తుంటాడు కవి. కవిత్వంలో గనక formలో వైవిధ్యం లేకపోతే లోపల సరైన మంట లేదనిపిస్తుంది. అవును… కవిత్వం లోపలి జీవితం, లేదా కవి జీవితంలోని లోపలితనం పూర్తిగా అసమతౌల్యంగా వుంటుంది. వొక నిద్రవైపో, మెలకువ వైపో, దుఃఖం వైపో, సౌందర్యం వైపో, ఆధ్యాత్మికత వైపో, హింస వైపో, తపోగానం వైపో మొగ్గు చూపుతుంది కవి జీవితం. తన జీవితంలోని truthfulnessతో కవి కొత్త సంస్కారాన్ని, మరుగున పడిన ఆత్మగౌరవాలనీ వెలుగులోకి తెస్తుంటాడు. అందుకే కవిత ప్రతిపాదించే కొత్త sensibilitiesతో పాఠకుడు మత్తులోకి లేదా అప్రమత్తతలోకి మేలుకుంటూ వుంటాడు.
.
కవిత ఎప్పుడూ కవి కాలం కంటే ముందు leapలోనే వుంటుంది. లేదా కవి ధ్యాన పూర్వ స్థితిలో దాక్కుని వుంటుంది. కవికి జీవితం కవిత్వపు గాలిని వూదడంతో మొదలై కవిత పూర్తవడంతోనే అంతమూ అవుతుంది. మన బతుకులోని aesthetics గానీ, essence గానీ కవిత్వంతోనే ఫోకస్ అవుతూంటుంది. ఈ అనేకవచనాన కవి తాలూకు ఈస్తటిక్స్ అంతా భాషే అయ్యి మనల్ని వొక కొత్త లోతట్టు ప్రాంతాల మునకను చూపిస్తూంది. ఇదంతా, వో ఎండాకాలం వానలా చలి రాత్రుల వెన్నెలలా లేక తాటి వనాలలో నిలువుగా వీచే పొడి పొడి నీలపు గాలిలా శ్రీధర్ బాబు కవిత్వంలో ప్రసరిస్తూనే వుంది. ఈ కవిత్వంలో ఆకాశానికేసి కళ్ళనీ చేతుల్నీ కలిపి జోడించుకున్న వొక tree of life ఉంది, జామచెట్టు వుంది. వయస్సు పెరుగుతూన్న కొద్దీ దాని మోదుపై వానలు పడి ఎండలు కురిసీ పెచ్చులూడుతున్న గుర్తులూ కనబడుతున్నాయి.
.
శ్రీధర్ తన కవిత్వంలో తను పుట్టిన మోత్కూరు (నల్లగొండ జిల్లా) పొలిమేరలో తుమ్మచెట్టు మీంచి జారిపోయిన పాలపిట్ట సణుగుడుని జల్లెడ పడుతున్నాడు. కవిత్వం వొక ఉత్పాతం వొక calamity, వొక (అ)శాశ్వత సత్యాన్ని ప్రతిపాదిస్తూన్న దుఃఖం-
వెన్నుపాములో కుబుసం విడిచిన కటిక పగటి చీకటి
పక్కలో చుట్ట చుట్టుకున్న నల్లని విష సర్పంలా రాకాసి చీకటి
ఎక్కడో దీపస్తంభం మీద గూడు మరచిపోయిన పక్షి
రెక్కల్లోకి తలదోపుకుని కునారిల్లుతోంది
పుటల్లోంచి తప్పిపోయిన రెండు ఆడ, మగ ఎలిజీలు ఎక్కడో
ఒకే శరీరమై నిట్టూరుస్తున్నాయి - (ఈ రాత్రినెలా?) ఇక్కడ, ఒకే అర్థాన్ని అనేక స్పృహల్లో reverbate చేస్తున్నాడు. ఒక స్పృహనే అనేక అర్థాలుగా ప్రతిధ్వనింపజేస్తున్నాడు. చాలా కవితల్లో ఇట్లాంటి micro activity వున్న వాక్యాలుంటాయి. మనం వొక్క అనుభవాన్ని పొందీ, అర్థం చేసుకునే లోపలే మరో తాకిడి తగులుతుంది. మరో పుండూ మిగులుతుంది. చాలా వరకు కవి ఒక process నుంచి obsence వైపుకో లేక ఏమీ మిగలనితనం వైపుకో జారిపోతూ వుంటాడు.
.
తాటి చెట్ల మధ్య ప్రత్యూష నక్షత్రాలకు/ నేను వేలాడుతున్నప్పుడో వూయలూగుతున్నప్పుడో గాని ఎద్దుల మెడగంటల సవ్వడి వింటూ వెంటే వెళ్ళిపోయారు మీరంతా - అంటూ నక్షత్రపురం దోవ లోంచి అడుగుల్ని వెనక్కి మళ్ళించుకోలేక దీనుడవుతుంటాడు. ప్రతి కవితలో కొన్ని ఆర్ద్ర భాగాలుంటాయి. ఒక చోట ఆ భాగంలోని తడిదనం పువ్వులా తగులుతుంటుంది. మరొక చోట నిప్పు పువ్వులా తగులుతుంటుంది. ఇంకో చోట ఎగిరే పువ్వులా కనబడుతుంది. కవి చేసే ఈ చర్య మొత్తమూ వొక magical explosion లా దృశ్యాత్మకమవుతుంటుంది (తప్త స్వప్నమ్).
.
శ్రీధర్ కి తన సౌందర్యమంతా తన భాష. తనదనుకున్న కవిత్వపు కాస్మిక్ ధూళినంతా ఈ భాషతో తడిపి ముద్దను చేస్తుంటాడు. ఇక్కడి ఈ కవిత్వమంతా ఒక చీకటి నుంచి, రక్తమోడే వెలుగు నుంచి, గొంతు చించుకునే లోతు నుంచీ nothingness నుంచీ మొదలవుతుంది.చాలా కవితలు వొక దేహం వైపుకీ దాని నీడ వైపుకీ దూసుకుపోతాయి. ఒక వాస్తవం వైపుకు జరుగుతూ తమకు తాము ఒక నిందాపూర్వక బహిష్కారాన్ని విధించుకుంటాయి. అప్పుడప్పుడు ఈ శిక్షాస్మృతిని తనలోని సౌందర్యార్తిని పదిలపరచుకోవడానికి విధించుకుంటూ వుంటాడు. తనని మధ్యాహ్న సముద్ర పాఠకునిగా మార్చుకుని గాలిపారవశ్యపు నులివెచ్చని సంగీతాన్ని ఈ ఛిద్రాలకి అడ్డంగా పెట్టుకుని స్మృతిస్తూ వుంటాడు. అక్కడ్నుంచి తిరిగి ప్రపంచాన్ని మరోసారి చూడడం మొదలుపెడతాడు. కేవల హైకూ ధ్యానిలా విప్పారుతుంటాడు.
.
సరుగుడు చెట్ల మధ్య నుంచి
సముద్రం
మనల్ని ఎగిరెగిరి చూస్తోంది (డజన్ హైకూలు)
.
చాలా కవితల్లో మన (తన) ఆత్మల కుళ్ళిన వాసనా, పూలు విరబోస్తూ కార్చే మంచు బిందువుల వాసనా, పండ్లు, చెట్ల, వానల వాసనలూ తారట్లాడుతున్నాయి.
.
ఇప్పటికే శ్రీధర్ తన పాత కవిత్వాన్ని చాలా వరకు disown చేసుకున్నాడు. నడిచొచ్చిన దూరాన్నంతా తిరిగి కొలుస్తున్నాడు తన rector scaleతో…
.
ఈ కవిత్వంలో వొక refined వచనంలోని మఖమల్ స్పర్శ దొంగాటలాడుతుంది.
గాలొక్కత్తే… గాలొక్కత్తే… తన వెంట లోలకాల్ని లాక్కుపోతూ
లోకలోకాల కలల్ని పారదర్శకంగా లీనం చేసుకుంటూ
చిదిమి దీపం శిరస్సు మీది చీకటిని తాగి తాగి
గాలొక్కత్తే… గాలొక్కత్తే…
.
ఒక్కొక్కప్పుడు కొన్ని ప్రాకారాల మధ్య వొక ప్రశ్నలా నిలబడి తనని తాను ప్రశ్నించుకోవాలనే బయలుదేరి పక్కకు తిరుగుతుంటాడు. తన లోపలి సౌందర్యాలకో సౌందర్యరాహిత్యాలకో ఆశ్చర్యపోయి మసకల్లోకి దూరి చిట్లుతుంటాడు వెన్నెల మంచులా…
.
ఇక్కడంతా వొక చిల్లులు పడి హింసపడే ఆధ్యాత్మికత వుంది. కత్తిపోట్ల self నిర్మూలనం వుంది. The smallest unity of time consists in the strongest reality of his images. క్షణమాత్రంలో తళుక్కుమని మెరిసే అనుభవం, బల్ల పరుపుగా, తీగగా సాగే ఆలాపన. తన వొంటరితనమే తన నుంచి మెల్లగా విడుదలయ్యి మన లోపలి అభయారణ్యాల్లోకి కార్చిచ్చులా పరచుకుంటూ వుంటుంది. కవిత్వమిప్పుడు మాయా దర్పణం.
.
- సిద్ధార్థ
25.09.1999
డజన్ హైకూలు
24/11/2009
తల్లి ఒడిలో
ముద్దొచ్చే కవలపిల్లలు
ఒకరికొకరు అద్దం
.
***
గట్టు మీద కుర్రాడు
ఈత నేర్పుతా రారమ్మని
సైగ చేస్తో సరస్సు
.
***
కోనేట్లో దూకితే
జాబిల్లి
కావలించుకుంది
.
***
వంతెన మీద
ఆడపిల్ల
వాగులో కొట్టుకుపోతూ
.
***
తెలతెలవారిపోతోంది
చందమామ
చిన్నబుచ్చుకుంది
.
***
ఆరుబయట
కోయిల కూత
నేనేమో స్నానాల గదిలో
.
***
చిలక కొరికిన
జాంపండు
నాతో తీయగా మాట్లాడింది
.
***
పూల సజ్జతో
అమ్మాయి
వెనకాలే పూజారి
.
***
పొడవాటి జడతో
ఆమె వెళ్తోంది
చెవుల్లో మెత్తటి శబ్దం
.
***
డాల్ఫిన్ నోస్ మీద
ఒక పిట్ట
ఎర్రని మేఘాన్ని ఏదో అడిగింది
.
***
సరుగుడు చెట్ల మధ్య నుంచి
సముద్రం
మనల్ని ఎగిరెగిరి చూస్తోంది
.
***
చెదిరిన ముంగురుల్ని
తనే సవరించుకుంది
నాకెందుకో బాధ
.
***
అక్షర నక్షత్రాల ఆకాశం
22/11/2009.
గలగలమని నవ్వుతుంటే
ఇన్నేళ్ళుగా నిదురలోకి విచ్చుకోని కలలు
తెరలాగ తెరచిన కళ్ళ మీద మువ్వలుగా, పువ్వులుగా వాలినట్లు-
.

.
సవ్వడి ఒక జ్ఞాపకంగా గుండెలో ముడుచుకున్నాక
ఏకాంతం- ఒక శ్రావ్యమైన సంగీతం
మౌనం- కచ్చేరీ ముగించి గోడన వేలాడే వాయులీనం
.
అర్థరాత్రి ఆకాశాన్ని బోర్లించుకుని
లోయలోకి దొర్లిపోతుంటే ఒంటికి గుచ్చుకున్న నక్షత్రాలను
ఒక్కొటొక్కటిగా పట్టుకుని దాచుకుంటున్నాను-
దోసిట్లో వెలుగులా కరిగే నక్షత్రాలన్నీ ఇప్పుడు ఒకేలా ఉంటున్నాయి
ఒకే పారదర్శక శిల్పంలా మెరుస్తున్నాయి
ఒకే పాద స్పర్శలా గిలిగింతలు పెడుతున్నాయి
ఒక వెచ్చని జ్వరంలా భయపెడుతున్నాయి
మునివేళ్ళ తొలకరిలా తడిపేస్తున్నాయి
దేహ ప్రవాహం మీద సీతాకోక చిలుకల గుంపులా అల్లరి చేస్తున్నాయి
ఇది అక్షర నక్షత్రాల ఆకాశం
నేను పసిబాలుడి నఖక్షతాల గురించి మురిపెంగా మాట్లాడుతున్నాను
నేను పసిబాలుడి నక్షత్ర నేత్రార్ణవంలో తెరచాపలేని పడవలా తుళ్ళిపడుతున్నాను
.
కాలాన్ని ఇంత గొప్పగా గడిపే వీలున్నప్పుడు
నిర్దయగా
నిర్లాలనగా
గడియారాన్ని భుజాన మోస్తూ ఎక్కడికి మీరంతా?
.
***
(నా చిట్టి తండ్రి అక్షర్ కోసం)
ఒక నది కథ
20/11/2009మునకలేసి ఈదులాడిన వారందరికీ అది బాగా తెలుసు
ఆ నది… మన మధ్యే ఉంటూ
మధ్యలోనే ఒక్క చుక్క కూడా మిగలకుండా ఆవిరైపోయింది.
ఇప్పుడు మనం ఆ నది మిగిల్చిన ఇసుకలో
కొత్త గోపురాలు కట్టాలని ఆశపడ్తున్నాం
గులకరాళ్ళను ఎవరికి వాళ్ళం కుప్పలుగా పోసుకుని బొమ్మలు చెక్కుకుంటున్నాం
ఆ బొమ్మలు చెమ్మగిలితే గుండెకు హత్తుకుంటున్నాం
ఇసుకలో నారు మడులు తవ్వుకుని అక్షరాలను జల్లుతున్నాం
చీలికలు పీలికలై జారిపోయే మేఘాల కింద
బ్రహ్మజెముడు పొదల్లా ఉడుక్కుంటున్నాం-
.
సామూహిక స్వప్నమైన ఆ ఉధృత నదీ ప్రవాహం
ముంచెత్తాల్సిన భూఉపరితల అవలక్షణాలను తుడిచేయకుండానే
సారవంత క్షేత్రాలను సృష్టించకుండానే శకలాలుగా చీలిపోయింది
సంక్లిష్ట సందర్భాల్ని సృష్టించిన శత్రువు
ఆ శకలాల్ని సునాయాసంగా దారి మళ్ళించాడు-
ఆలోచనల్ని కూడా విభజించి వశం చేసుకోవచ్చని నిరూపించాడు
గతాన్ని తలచుకుని తొలుచుకునే గాయపారవశ్యంలో
బాధల్ని బ్రహ్మపదార్థంలా కొరుక్కుతింటున్న ఆకలిలో
ఉనికిని విస్మరించిన అస్తిత్వ పరివేదనలో నది చేజారిపోయింది-
.
ఒక్కొక్కరొక ప్రవాహ తరంగమై నదికి కొత్త శ్వాసలు ఇవ్వాల్సిందిపోయి
ఒక్కొక్కరొక కరి మబ్బయి నదికి కొత్త వేగం ఇవ్వాల్సిందిపోయి
ఒక్కొక్కరొక తడి అక్షరమై నదికి కొత్త భాష నేర్పించాల్సింది పోయి
నదిని ఒక్కొక్కరొక దారి పట్టించాలని ప్రయత్నించారు
పిల్ల కాలువలను కలుపుకుని వూపందుకునే నది
పిల్ల కాలువలుగా చీలిపోయి వానపాముల్లా మట్టిలో కూరుకుపోయింది-
సరిహద్దులు లేని ఆధిపత్యాన్ని కలగంటున్న వాడి దాహార్తికి బలైపోయింది-
.
మనమంతా నదికో బ్రాండ్ తగిలించి సంతోషించాం
పశ్చిమాలు పంచిన విలాస పదజాలంలో పవ్వళించాం…
ఇక ఎక్కడికని వెళ్తాం?
నడవడాన్నిప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకుందాం…
ఈ నేల మీద… ఈ మూడో ప్రపంచపు నేల మీద అరికాళ్ళు చిట్లుతున్నా
ఆకాశం వేపే చూసి నడుద్దాం…
నేలలోకి తలజొనిపి చూసుకునే ఉష్ట్రపక్షుల్లాంటి లగ్జరీ మనకు లేదు-
.
దిగులు మేఘాలు దట్టమవుతుంటే..
కన్నీళ్ళ వాన కురుస్తూనే ఉంటే..
నదీ పాయలు బిగుసుకునే అరిచేతి వేళ్ళే అవుతాయి..
.
ఏమైనా….
నదిని చూసి నడక నేర్చుకున్న వాళ్ళమేగా మనమంతా!?
.
***
జింగిల్స్
18/11/2009
.

.
జ్ఞాపకాలు గాలిలోనే ఉంటాయి
ఉన్నఫళంగా దేహాన్ని చుట్టుకుని లాక్కుపోతాయి
కన్నీళ్ళు గాలిలోనే ఉంటాయి
అదాటున గుండెలోకి చొరబడి దారులు వెతుక్కుంటాయి
మాటలూ మౌనమూ శబ్దమూ నిశ్శబ్దమూ అన్నీ గాలిలోనే
మనం ఉత్త తంబుర బుర్రలా తిరుగుతుంటాం గాలివాటుకు-
.
*
బోర్లించిన పుస్తకం కిందే రెండు కళ్ళూ
కలలకు కళ్ళూ, కారణాలూ అక్కర్లేదు
కలలో మెలకువ కోసం ఆరాటం
మెలకువలో మళ్ళీ కలల కోసం….
కోటానుకోట్ల అక్షరాలన్నీ ఏమవుతున్నాయి?
కళ్ళ మీద పడి ఏడుస్తున్నాయి
.
*
మొగలి పొదల మధ్య పాములా పడుకుంటుంది ఆశ
వెదురు పొదల మధ్య ముల్లులా నీల్గుతుంది ఆశ
దానికి వాసన తెలియదు
పాటా వినపడదు
.
*
ఎవరో వచ్చి వెళ్ళారని
పాటలు పాడుతుంటాం
వచ్చిందెపుడో వెళ్ళిందెపుడో తెలియకుండానే…
ఎప్పుడూ రావాలని పాటలు పాడుతాం
రాకూడదని కూడా
మనకు పాట ముఖ్యం-
.
*
*
చూసిన బొమ్మలన్నీ అద్దంలో అలాగే ఉంటే
ఇంక కొత్త అందాలెక్కడ కనిపిస్తాయి?
జ్ఞానంతో మోసపోకుండా ఉండడం నేర్చుకునేందుకు
తరచూ పిల్లలతో ఆడుకోవాలి
అద్దాన్ని తుడుచుకోవాలి
.
*
కొలను అల్లరి చేయకుండా
ప్రతి రాత్రీ చంద్రుడినీ తారల్నీ
తనలో దాచుకుంటుంది
తడి ఆరిపోయాక తారలూ ఉండవు
వెలుతురూ ఉండదు
అంతా ఒట్టి కరడుగట్టిన మట్టి-
.
*
ఆనందాన్ని పంచే మనుషులు వేరే ఉంటారు
వారు మనుషులకు ముఖాలు తొడిగే ప్రయత్నం చేయరు
నీటిలోకి చేతులు జొనిపినట్లుగా లోపల్లోపలికి వస్తారు
ముఖ్యంగా.. వారు నవ్వుల్ని దుబారా చెయ్యరు
దుఃఖాన్ని ఏకాంతంలో బంధిస్తారు
అలాంటి వారు ఒకరో ఇద్దరో ఎదురుపడితే చాలు జీవిత కాలంలో-
.
***
తప్త స్వప్నమ్!
18/11/2009.
స్వప్న సరోవరంలో ఎవరదీ?
పట్టుకుచ్చుల వింజామరల్ని భుజానేసుకుని
నీళ్ళూపడానికి వస్తున్న మీనమా…
ఎవరికోసమనీ… ఎవరి కోసమనీ…?
నా చేతివేళ్ళకు దొరకని నేను
నిద్రిత గగనంలో విద్యుత్పుంజమాల-
వాగులై వంకలై వరదలై ఎచటికనీ?
చీకట్లోంచి ఎగురుతూ వచ్చి వీధి దీపావర్తనంలో
పగడం పారేసుకున్న మిణుగురు పురుగు మల్లే
వెలుగుధూపమై వెళుతున్నది నేనా!?
ఒకానొక పలిత గ్రహం వాలుమీద
జారుడుబండాట ఆడుకోవల్సిందే…
ముందే తెల్సినా నిచ్చెనలుండవని!
.
బాన కడుపుతో తిమింగలం
ఆబగా అత్యాశగా మొత్తం సరోవరాన్నే
దాహానికి బలిగైకొన్నాక
ఉక్కిరిబిక్కిరై పొట్టపగిలి
దూదిరేకుల్లా చెల్లాచెదురై
అనంతపురి నడిమేనిపై ఒక్కణ్ణే వరుణ జపం చేస్తూ…
నా మోచేతుల కింద ఎవరు వీళ్ళంతా?
పాలమూరు సూడాన్ బుగ్గల మీద
పెదాలు చాలక దేహం మొత్తంతో ముద్దెట్టుకున్నా
ఏమాత్రం అంటని మట్టి….
అద్భుత ప్రాచీన గ్రంథం తాలూకు శిథిల పత్రాలై
ముద్దుల కానుకగా వాటేసుకున్న ఇసుకవనం
ననుగన్న నల్లగొండ కుచాగ్రం కుచ్చుకుని చిట్లిన పెదవి నుండి
రాలిన ఎర్రని కన్నీళ్ళ కోసం
మడిలోని పగులు మధ్య ఎండిన గడ్డి పరక పట్టిన దోసిలి….
.
ఎవరదీ.. ఎవరదీ..?
స్వప్నశిఖల్ని ఎడారుల మండించి
వజ్రాల్ని పండించాలని చూస్తున్నది?
తనువున తగరపుటేరుల సలసల….
నన్ను నేనే వీడ్కోలు తీస్కున్న విస్తృత కారడవిలో
తిరిగి నిర్దయగా కరచాలించిన జీవస్పృహతో….
రేవెలుగు కౌగిట్లో!
.
***
దుస్సహం
12/11/2009.
తెల్లారగానే సూర్యుడు అలల మీంచి దొర్లుకుంటూ వచ్చి ఒళ్ళో వాలతాడుకౌగిలించుకో ఆ వెలుగు ముద్దను ముద్దు పెట్టుకో హనుమంతుని మూతల్లే కాలితే కాలుతుంది
పారదర్శక దేహంతో ప్రపంచంలోని ప్రతి ఆకారంలోంచీ చొచ్చుకుపో….
తరువాత భళ్ళున పగిలిపో గాజు బొమ్మలా
ఆ సీసం పెంకుల్లో కవిత్వపు చెమ్మ… కలిపి కుడితే ఒక ప్రవాహం
కవిత్వం భీకర ప్రవాహంలా గిరుల మీంచి దూకనక్కర్లేదు
నాలుగైదు చినుకులుగా మోహపు పెదాలను తడుపుకుంటూ పోనూ వచ్చు
ఈ కంప్యూటర్ యుగంలో ప్రోగ్రామ్ ను చెడగొట్టే వైరస్సే గొప్ప కవిత్వం-
సందేహాలుంటే ఎవరైనా ఫార్మాట్ చేసుకోవడం మంచిది బుర్రల్ని….
ఖాళీగా… ఖాళీగా… గదులన్నీ ఖాళీగా… దేంతోనే నిండిపోయినంత ఖాళీగా
డెస్ట్రాయర్….. మోస్ట్ వెల్ కమ్!
ఇవాళ్టి నా అవసరానికి నువ్వు…..
రావా…. రావా….. ఒక్కసారి వచ్చి గొర్రెల తోకల కింద నుంచి రాలుతున్న కవిత్వాలని
కాముకత్వాలని ధ్వంసం చేసేయ్ వా ప్లీజ్!
.
క్లోనింగ్ కావాలిట నా కవులకి ఒకటి కార్పొరేటైజ్ డ్ సివిలియన్ లా బతకడానికి
మరొకటి విధాతగా ప్రదాతగా తరం మీద కూర్చోవడానికి
ఒకడి గురించి ఇంకొకడెవడూ ఆలోచించడు
కవి కూడా… ఆ స్పృహ లేని కొన్ని మధుర క్షణాల్లో తప్పితే
చీకట్లో చంద్రుణ్ణి చుట్టుకుని శూన్యంలోకి దొర్లిపోవడం ఒక అనుభవం
వానలో మట్టి కింద మగ్గిపోవడం ఒక అనుభవం
చితి మీద పదే పదే స్వీయ దహన సంస్కారమాచరించడం ఒక అనుభవం
సిగ్గు లేకుండా… కాలుజారిన అనుభవాన్ని చెప్పుకోవడం ఒక అనుభవం
బతుక్కి స్వచ్ఛత లేదు
నిజాయితీగా మురికి అక్షరాలనే రాసుకుందాం
కనీసం అక్షరాలైనా బతుకుతాయ్….
రైమింగూ రైజింగూ గెయినింగూ వద్దురా కవీ
తోచిందేదో రాసెయ్…
నిన్న నీ పెళ్ళామో ప్రియురాలో
పొత్తి కడుపులో ఫెటీల్మని తన్నిన గాయాన్నైనా సరే!
.
***
అనిర్వచనం
11/11/2009.
(అనేకవచనం కవితా సంపుటికి స్వీయవచనం)
.

.
కవిత్వం నాకొక spiritual activity. ఏమవుతుందో తెలియదు. ఉన్నట్టుండి నన్ను నేను కోల్పోతాను. నన్ను నేను పొందుతుంటాను. ముందు నుంచి వెనక్కీ, వెనక నుంచి ముందుకీ జీవిస్తుంటాను. Time is a myth కదా! మేల్కొంటాను అనేకానేక నేనులుగా. దేహాన్నొక processor గా వదిలేసి, దాని చేతుల్లో పెన్నూ పేపరూ పెట్టి మేమంతా చుట్టూ చేరి ఖేదాన్నో మోదాన్నో celebrate చేసుకుంటాం. చీకటి చిక్కనై చిక్కనై చివరకు కాటుకై అంటుకునే వేళ, కాగితంపై తెల్లదనం వెక్కిరిస్తుంటుంది.
.
కవితను పూర్తి చెయ్యడం సాధ్యమయ్యే పని కాదని నా నమ్మకం. కవి కవితను ఎక్కడో ఓ చోట వదిలేస్తాడంతే! కవిత్వం లక్ష్యం దిశగా దూసుకుపోయే బాణం అంటే నాకు నవ్వొస్తుంది. కవిత్వం ఏక కాలంలో ఆకాశంలోకీ భూమిలోకీ శాఖోపశాఖలుగా విస్తరించే చెట్టు తన ప్రాణంగా అందించే ఫలం. అలాంటి ఫలాన్ని re-design / rewrite చేయడమంటే కవిత్వపు sanctityని అవమానించడమేనని భావిస్తాను. నిన్ను నీవు వ్యక్తీకరించుకోలేక పోవడంలోని అసంపూర్ణత్వంలో ఆనందం ఉంది. అది వైఫల్యానందం. ఇతరుల కవిత్వంలో నేనీ ఆనంద ఛాయల కోసం దేవులాడుకుంటాను. కవి వదిలేసిన వాక్యాలను తడుముకోగలిగితే అంతకన్నా ఇంకేం కావాలి? అందుకే, ఇదంతా purely sensitive business.
.
Internal sufficiency వల్లనే కవిత్వం బతుకుతుంది. కవిత్వం పుట్టుకకు నిర్ణీత స్థల కాలాలు ఉన్నప్పటికీ, కవి నుంచి వేరు పడిన తరువాత అది independent entity అవుతుంది. అందుకే, కవితలకు తారీఖుల తోకలు తగిలించడమొక వ్యర్థ ప్రయాస. ఇప్పుడీ ఇరవయ్యో శతాబ్దపు తుది ఘడియల్లో, technocracy కౌగిట్లో ఉన్న మనమంతా ఒక programmeని జీవిస్తున్నామని దిగులు నాకు. కవిత్వం- దాన్ని చెడగొట్టే వైరస్ కావాలన్నది నా కోరిక.
.
తిలక్ అన్నట్టు, “కవిత్వం అల్టిమేట్గా సబ్జెక్టివ్ కదా. నా కవిత్వంలో నేను దొరుకుతాను.” రెప్పలు మూసుకున్నప్పుడు నాకు తరచూ వాన వెలిసిన తరువాత ఒకట్రెండు చినుకుల్ని మోస్తున్న పచ్చని ఆకు కనిపిస్తుంటుంది. నిద్రలో, దారీ తెన్నూ లేని నిశీధిలో పరుగు తీస్తున్న నేనో మరొకడెవడో కనిపిస్తాడు. భౌతిక ప్రపంచంలోకి తేరుకున్నప్పుడు నా గది గోడ మీద Living is Easy అన్న ముచ్చటైన మూడు పదాలు కనిపిస్తాయి. “I know that I am just part of the wind and the rain and the earth. And these things make me happy” అని ఒరియా కవి జయంత మహాపాత్ర నాలోంచే చెప్పి ఉంటాడు.
.
ఇట్లా కవిత్వంలోకి విముక్తం కావడాన్ని మా బాపు నాకు పసితనంలోనే నేర్పించారు. అయిదారేళ్ళ నన్ను మా బాపు ఒళ్ళో కూర్చోబెట్టుకుని శ్రీశ్రీ మహాప్రస్థానాన్నీ, కరుణశ్రీ పద్యాల్నీ ధారగా వినిపించి నాకు జన్మనీ, జీవితాన్నీ ప్రసాదించారు. చిన్ననాటి వ్యామోహంలో నేను రాసుకున్న కవితల ( ! ) నోట్ బుక్కును కొట్టేసి అజాపజా లేకుండా పోయిన నా మూడో తరగతి సహచరుడిని నోరారా తిట్టుకోని రోజంటూ లేదు. బాపు కవిత్వమైన ఒళ్ళోకి తీసుకుంటే, నిరాడంబర ప్రేమతో అమ్మ నా గుండెకు కంపించడం నేర్పింది. కళ్ళలో క్షమను ధరించడం చూపించింది. అందుకే, దేన్నీ దాచుకోలేని ముఖంతో, అశక్తతతో, కవిత్వంతో……
.
- పసునూరు శ్రీధర్ బాబు
.
***
సొంత వాక్యాలు
10/11/2009
.
చీకట్లో నువ్వు నన్ను తడుముతుంటే
నా దేహంలో ఎంత వెలుగో?
.
***
నిన్ను బాధించినప్పుడల్లా
నిన్ను బాధించినప్పుడల్లా
నేను భూమిలోకి దిగబడిపోతాను
మళ్ళీ నీ వేలే కావాలి లేవడానికి
.
***
ప్రేమించడం బాగా తెలుసుననే గర్వం
ప్రేమించడం బాగా తెలుసుననే గర్వం
ప్రేమిస్తున్న కొద్దీ భంగపడుతోంది
.
***
కన్నీళ్ళు వొద్దనుకున్నాను ప్రేమలో
కన్నీళ్ళు వొద్దనుకున్నాను ప్రేమలో
కానీ, మెరుపు లేకుండా, చినుకు లేకుండా
చిగురు లేదుగా
.
.
***
మెరీనా తీరంలో మనం కూర్చున్నప్పుడు
మెరీనా తీరంలో మనం కూర్చున్నప్పుడు
సూర్యుడు వెనకాల నుంచి వెళ్ళలేక వెళ్ళిపోయాడు
మళ్ళీ పొద్దున్నే నీళ్ళలోంచి లేచాడట మనల్ని చూడడానికి
.
***
ఎంత విచిత్రం కలహంలో విరహం
ఎంత విచిత్రం కలహంలో విరహం
ప్రేమ పుస్తకానికి కొత్త ముఖచిత్రం
.
***
వర్షంలో చంద్రుడు కరకు మబ్బులతో
వర్షంలో చంద్రుడు కరకు మబ్బులతో
గొడవపడి గొడవపడి చివరకు గెలిచాడు
తడిసిన చెట్టుకింద వణికే రెప్పల్ని చీల్చుకుని
అదంతా నేను చూశాను….
ఆకుల మీంచి వెన్నెల చినుకులు జలజలా రాలుతున్నాయి
ఇదంతా గదిలో నువ్వు సృష్టించే ప్రపంచంలానే ఉంది
అవన్నీ నువ్వు నా పెదాల మీద పోసే మాటల్లోనే ఉన్నాయి
.
***
వర్షం వచ్చే ముందు బాగుంటుంది
వర్షం వచ్చే ముందు బాగుంటుంది
వర్షం వచ్చేప్పుడు బాగుంటుంది
వర్షం వెలిశాక బాగుంటుంది
ఏ తడీ లేనప్పుడే….లతవై అల్లుకోనప్పుడే…
.
***



