వనం ఝాన్సీ అప్పుడే వెళిపోతే ఎలా?

.
భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా మొదలై..  శక్తిమంతమైన నాయకురాలిగా ఎదుగుతున్న చురుకైన మహిళ వనం ఝాన్సీ అచ్చంపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్న వార్త విన్నప్పుడు మనసు చాలా భారంగా మారింది. ఇది నిజం కాకుండా ఉంటే ఎంతో బాగుండుననిపించింది. ఆమె మృతిని ధ్రువీకరిస్తూ చానెళ్ళలో కనిపించిన బ్రేకింగ్ ప్లేట్స్ ఆందోళనను మరింత పెంచాయి. గతంలో ప్రింట్ మీడియా జర్నలిస్టుగా, ప్రస్తుతం టీవీ జర్నలిస్టుగా, ప్రజెంటర్ గా చాలా మంది రాజకీయ నాయకులతో మాట్లాడాను. కానీ, వ్యక్తిగత స్థాయిలో అనుబంధం ఏర్పడడమన్నది కొందరి విషయంలోనే జరిగింది. అలాంటి వారిలో వనం ఝాన్సీ ఒకరు.
.
ప్రజల పట్ల నిజమైన కన్సర్న్ తో రాజకీయాల్లో ఎదగాలనుకునే వారు మనకు చాలా తక్కువ మంది ఉన్నారు. ఝాన్సీగారు టీవీ కెమెరా ముందే కాకుండా ప్రైవేటు సంభాషణల్లోనూ తన జిల్లాలోని ప్రజల సమస్యల గురించి, వారు పడే యాతనల గురించి కళ్ళు చెమ్మగిల్లుతుండగా చెప్పడం నాకు బాగా గుర్తు. ఆమె నిజంగా.. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలనే తపనతోనే రాజకీయాల్లోకి వచ్చారని నాకు చాలా సార్లు అనిపించింది.
.
వనం ఝాన్సీగారిని చూసినప్పుడు, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏ పార్టీకి చెందిన వారన్న ప్రశ్నే తలెత్తదు. విద్యార్థి దశ నుంచి ఒక పార్టీ లైన్ ను నమ్ముకుని, దానికి కట్టుబడి ఆమె తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. తెలంగాణ ఉద్యమంలో ఆమెను నాకు తెలిసి ఏ నాయకుడూ ఒక పార్టీ ప్రతినిధిగా చూడలేదు. గురి తెలిసిన బాణంలాగే ఆమె ఉద్యమంలో దూసుకుపోయారు. మహిళా చైతన్యం గురించి, వెనుకబడిన తరగతుల నుంచి నాయకత్వం ఎదగాల్సిన అవసరం గురించి ఆమె తరచూ మాట్లాడేవారు. బి.జె.పి ప్రత్యేక తెలంగాణ వాదానికి బలమైన వాణి వనం ఝాన్సీయే. ఆమె యాక్సిడెంట్ లో చనిపోయారన్న వార్త విని.. బాగా డిస్టర్బ్ అయి హాస్పిటల్ బయలుదేరబోతుంటే.. “ఝాన్సీ మృతిపై లైవ్ షో నువ్వే చేయాలం”టూ చీఫ్ ఎడిటర్ నుంచి కబురు. భారంగా స్టూడియోలో కూర్చోవడం ఎంత పెద్ద సమస్యో నాకు బాగా అనుభవంలోకి వచ్చింది. గొంతు గద్గదమవకుండా మాట్లాడాల్సి రావడం ఒక శిక్ష. నిన్న హెచ్.ఎం.టి.విలో ఉదయం 11.30 గం.ల నుంచి గంట వరకూ నేను నిర్వహించిన లైవ్ షోలో అన్ని పార్టీల వారూ ఝాన్సీని ఆత్మీయంగా తలచుకోవడం ఆశ్చర్యమనిపించలేదు. నన్నపనేని, రోజాల నుంచి కవిత, విమలక్క గద్దర్ ల వరకూ అందరూ ఝాన్సీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజల పక్షాన నిలిచిన రాజకీయవేత్తగా ఆమెకు “జయహో” అని నీరాజనాలు పలికారు.
.
నాకు తెలిసిన ఝాన్సీ ఒక సింపుల్, హంబుల్.. డైనమిక్ లీడర్. నిజామాబాద్ అర్బన్ ఉప ఎన్నికలో వేల మంది మహిళా కార్యకర్తలను, బి.జె.పి అభ్యర్థి గెలుపును తెలంగాణ ఉద్యమానికి ఓ విజయంగా అభివర్ణించి నడిపించిన ఝాన్సీ.. వ్యక్తిగత సంభాషణల్లో ఎంతో నిరాడంబరంగా కనిపించే ఝాన్సీ ఒక్కరేనా అనిపించేది. ఆచరణలో దూకుడుగా, ప్రవర్తనలో మర్యాదగా మెలగడం ఝాన్సీ నుంచి నేర్చుకోవలసిందే.
.
పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఝాన్సీ.. తన కులాన్ని పోలరైజ్ చేయడానికి కూడా ఎంతో కృషి చేశారు. వెనుకబడిన సామాజిక వర్గాల చైతన్యాన్ని స్వప్నిస్తూ.. ఆ సామాజిక వర్గాలలోని ఫ్రాగ్మెంటెడ్ వాస్తవికతలను అర్థం చేసుకుని, దాన్ని మహిళా చైతన్యంతో సమన్వయ పరచడం తెలిసిన ఝాన్సీ అప్పుడే ఈ లోకం నుంచి వెళ్ళి పోవడం చేనేత బాధితుల ఉద్యమానికి, వెనుకబడిన సామాజిక వర్గాల పోరాటానికి, మహిళా రాజకీయాకాంక్షల సంఘర్షణకు, తెలంగాణ సమరానికి తీరని లోటు. ఝాన్సీ ఏయే వ్యవస్థల నుంచి విచ్చుకత్తిలా దూసుకొచ్చారో.. ఆ వ్యవస్థల నుంచి… ఆ సామాజిక నేపథ్యాల నుంచి మరెంతో మంది ఝాన్సీలు రావాలి. అదే ఆమెకు మనమిచ్చే నివాళి.
.
***
Advertisement

12 Comments »

  1. 1
    usha Says:

    వనం ఝాన్సీ నాకు ఎన్నో ఏళ్ళ నుంచి స్నేహితురాలు. నన్ను ఆరెస్సెస్స్ హిందూ మహిళా ఆలోచకుల సదస్సు లో పాల్గొనేందుకు పిలిచినప్పుడు, నేను తన తో పాటు బెంగళూరు కి ప్రయాణించి కొన్ని రోజులు గడిపాను. అంతకు ముందు కొద్దిగా ఉన్న పరిచయం అప్పుడు స్నేహం గా మారింది. నేను ఇంగ్లీష్ మీడియా ప్రతినిధిగా వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనడంతో, ఇంగ్లీష్ పేపర్లో హిందుత్వ గురించి సమతూకంతో రాయడం ఎలా అనే విషయమై మా ఇద్దరికీ ఎన్నో చర్చలు జరిగేవి. నా జర్నలిజం కెరీర్, ఝాన్సీ రాజకీయ జీవితం సమాంతరంగా సాగడంతో, తనతో టచ్ లో ఉంటూ వచ్చాను. జస్ట్ కొన్ని నెలలుగానే కలవడం తగ్గింది. తెలంగాణా వేదికలపై తనని చూసినప్పుడల్లా సంతోషం కలిగేది.
    స్నేహశీలి, నిజాయితీపరురాలు ఝాన్సీ. తనది వెళ్ళిపోవలసిన వయసు కాదు, సమయం కాదు. ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే చూసుకుని ఆనందపడే అవకాశాన్ని తనకీ, తను నిలువెత్తు నాయకురాలిగా, ఉద్యమకర్తగా ఇంకెంతో ఈ దేశానికి చేస్తుంటే చూసే అవకాశాన్ని మనకీ లేకుండా దేవుడు ఇలా ఎందుకు చేశాడో!

  2. 2
    S.Ramu Says:

    Dear Mr.Sridhar,
    It’s indeed touching. I too felt sad to know the early demise of the dynamic leader. When Nannapanenis and Rojas are resorting to ugly verbal fights much to the chagrin of Telugus, Jhansi garu has represented decency and decorum during the TV shows. I appreciate her frankness and her bias towards the poor and downtrodden.
    Boss, I couldn’t figure out as to why you were talking about her caste in the last paragraph of this post.
    May her soul rest in peace.
    Ramu
    apmediakaburlu.blogspot.com

    • 3
      pasunuru sreedhar babu Says:

      డియర్ రామూ,
      దాచేస్తే దాగని సత్యాలను దాచాలని ప్రయత్నించడం ఎందుకు? మనం ఇప్పుడేమీ ముసుగులో గుద్దులాడుకోవడం లేదు. Caste culture is all around us. అందరికీ అన్నీ తెలియాలి. ముఖ్యంగా, రాజకీయ శక్తుల సామాజిక నేపథ్యాలు. కులం ఏమిటో చెప్పుకోవడం, చెప్పుకోకపోవడం గొప్పగా లేదా న్యూనతగా ఉండకూడదు కాబట్టి, కొందరు గొప్పలు పోవడం మానుకోవాలి, కొందరు న్యూనతను అధిగమించాలి. మరీ ముఖ్యంగా, మనకు ప్రజాస్వామ్యంలో గణాంకాలు కావాలి. ఏ కులం వారిని ఈ సమాజం ఎంత వరకు రానిచ్చిందో తెలుసుకోవాలి. సామాజిక న్యాయం ఇంకెంత దూరంలో ఉందో లెక్క తేలాలి. లెక్క తెలిస్తే కానీ చేయాల్సిన పోరాటం ఎంతో తెలియదు. ప్రతి వ్యవస్థలో స్త్రీ, పురుషుల దామాషా తెలిసినంత స్పష్టంగా సామాజిక వర్గాల లెక్కలు తెలియాలి. Democracy is in effect a system of numbers. అందుకే, లెక్కలు ఎక్కడ తేలుతాయోనని సెన్సస్ కు అడ్డుపడుతున్నారు. లెక్కలు తేలాలి. ఎవరెవరు ఏమిటో తెలియాలి. ఎవరో అన్నట్లు, ఈ భారత సమాజాన్ని మతం నుంచి, ప్రాంతాధిపత్య భావనల నుంచి బయటపడేయవచ్చేమో కాని, కులం నుంచి బయటపడేయలేం. అందుకే, లెక్కలు తేలాలి. వనం ఝాన్సీ విషయంలో ఆమె సామాజిక నేపథ్యాన్ని కావాలనే, అది గర్వకారణమనే రాశాను.

  3. dr pasunurisri,
    i reciprocate the same with u.. she is one of the ray of hope in the mainstream politics of telangana and i do have great expectations on her,as her commitment and conviction made me to feel like that, though i dont have any personal acquanitance with her.. sorry, we lost a true leader of the deprived masses..

  4. 5
    Rakesh Says:

    Very touching. May her soul rest in peace…

  5. 6

    శ్రీధర్‌ గారూ..
    ఝాన్సీ గారిని సమీప భవిష్యత్తులో.. ఓ మంచి పదవిలో చూస్తాను అనుకునే వాడిని. అయితే అనూహ్యంగా ఆమె మరణించిందని తెలిసిన వెంటనే.. వెనుకబడ్డ పాలమూరు జిల్లాపై ఆమె concern గుర్తొచ్చింది. సహజంగా సర్దుకుపోయే మెత్తటి మనస్తత్వమే అధికంగా ఉండే పద్మశాలి కులంలో.. అంతలా డైనమిక్‌గా ఎదిగిన మహిళ.. ఇలా అర్ధంతరంగా తనువు చాలించి దివికేగడం జీర్ణించుకోలేని విషయం. ఆమె ఆశ నెరవేరి.. ఆమె ఆత్మకు నిజమైన శాంతి చేకూరాలని మనస్పూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుతున్నాను.
    విజయ్‌

  6. 7
    Neelesh Says:

    సర్, ఝాన్సక్క లేదనే విషయం గుర్తుచేసుకుంటే బాధకలుగుతోంది. పొలిటికల్ లీడర్స్ చాలా మందిని చూశాను. కానీ… పీజేఆర్ తర్వాత జనాలను అంతగా ఆకట్టుకున్న లీడర్ ఝాన్సక్కే అనేది నా అభిప్రాయం. అఫ్‌కోర్స్ వైయస్ చనిపోతే… ఎందరో చనిపోయారు.. అంతిమయాత్రకు అంతకన్నా ఎక్కువ జనాలే వచ్చారు. కానీ… ప్రతిపక్షపార్టీల నాయకులు, ముఖ్యనేతలు…. ఆరెస్సెస్ వ్యతిరేక సంఘాలైన హార్డ్‌కోర్ కమ్యూనిస్టులు.. కూడా ఝాన్సక్క ఇకలేరని తెలిసి కన్నీరు పెట్టుకున్నారు. బీజేపీ పార్టీ ఆఫీస్ మొహం కూడా చూడని నేతలెందరో.. ఝాన్సక్కను చివరిసారి చూసేందుకు గంటన్నరసేపు వేచిచూశారు. దటీజ్ ఝాన్సక్క. పీజేఆర్ పోయినప్పుడు కూడా.. పార్టీలకతీతంగా నాయకులు ఇలాగే ఫీలయ్యారు. తమ్ముడూ.. బాగున్నావా అని ఆప్యాయంగా పిలిచే ఝాన్సక్క లేకపోవటం బాధాకరమే. రాఖీపౌర్ణమి వస్తే మళ్ళీ ఝాన్సక్క గుర్తుకొస్తుంది. సార్థకనామధేయురాలైన వీరనారి ఝాన్సీరాణి మరణం పార్టీతోపాటు.. అభిమానులందరికీ.. తీరని లోటు. నాలాంటి తమ్ముళ్ళ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా రాయాలని ఉన్నా… మనసు రావటం లేదు.. చేయి కదలటం లేదు..
    ఝాన్సక్కా we miss u a lot

    జోహార్ ఝాన్సక్క

    May ur soul rest in peace

  7. 8
    Ramu Says:

    Yes boss, I appreciate your logic. Your argument holds water as every sphere of our life is effected by caste.
    Ramu
    apmediakaburlu.blogspot.com

  8. $శ్రీధర్ బాబు గారు

    వనం ఝాన్సీ గారి గురించి హృదయానికి హత్తుకునేవిధంగా చక్కగా రాసారు. వారి మరణవార్త విని మనసు కలతపడింది. ప్రత్యెక తెలంగాణా ఉద్యమంలో తనదైనా బాణిని పలికిస్తూ పోరాడుతున్న ఆమెకి చిన్నవయసులోనే నూరేళ్ళు నిండడం చాలా బాధాకరం!.
    దేవుడు ఆమె ఆత్మకి శాంతి కలుగజేయాలని, వారి కుటుంబసభ్యులకి ముఖ్యంగా వారి ఇద్దరిచిన్న పిల్లలకి మనశ్శాంతిని ఇవ్వాలని కోర్కుంటున్నా!

    #..ఆ సామాజిక నేపథ్యాల నుంచి మరెంతో మంది ఝాన్సీలు రావాలి..

    తప్పకుండా రావాలి. తాము దేన్నైతే ఆసరాగా చేసుకుని పైకి వచ్చామో ఆ సామాజికతని మరువకుండా కృషిసల్పుతూ వనంఝాన్సీ గారిలాగా మరింతమంది ఝాన్సీలుగా తయారవ్వడానికి ఊతమివ్వాలని కోరకుందా౦.

    #..ఏ కులం వారిని ఈ సమాజం ఎంత వరకు రానిచ్చిందో తెలుసుకోవాలి. సామాజిక న్యాయం ఇంకెంత దూరంలో ఉందో లెక్క తేలాలి…

    నిజాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కచ్చితంగా లెక్కలు తేలాలి, నేడు బలసినవెన్ని, బలహీనమైనవి ఏవి అనేవి నిర్ధ౦ద్వంగా తేల్చాలి. కులాధిపత్యం, కులగజ్జిల మీద మిద్దెలు, మేడలు కట్టుకుని ఆనక అవసరం తీరాక ఇప్పుడు వచ్చి కులాభిమానం వద్దు అనే కులకుహానావాదుల చెంపలు వాయగొట్టాలి.
    ఈ “వద్దు” అనేది అందరికీ సమసామాజిక న్యాయం జరిగినరోజు చూద్దాం!

    #ఈ భారత సమాజాన్ని మతం నుంచి, ప్రాంతాధిపత్య భావనల నుంచి బయటపడేయవచ్చేమో కాని, కులం నుంచి బయటపడేయలేం. అందుకే, లెక్కలు తేలాలి.

    Well said sir. “Castism” is wafting stink all around and that distubing even good people to opt castism, though unwilling, since no other option, So unfortunate!.

  9. 10
    RAMARAO PEDDI Says:

    Dear Sridhar,
    Just now red ur article on Jhansi garu and the comments of a few friends. the article was very heart touching and the discussion on caste is really good.

  10. 11

    vanam Jhansi garu chanipoyarani telisi, chaala baada paddaanu. aameku manchi bhavisyattu undanipinchedi. ame bjp ki chendin vyakti ayina naaku aamenu chuste alaa anipinchedi kadu. aame t.v lo matladatam chese vadini. manchi argue ment chesevaru. ame maranam nijamga desaniki nastame!

  11. 12
    Balakrishna, Editor, Yojana Says:

    డియర్ శ్రీధర్ బాబుగారు,
    మొన్న సంఘటన జరిగిన రోజు మనసు బాధపడితే, ఈ రోజు మీ బ్లాగ్ చదివి ఇంకొకసారి మనసు బరువెక్కింది. ఆ రోజు విషయం తెలిసి నా భార్య బాధపడిన తీరు నాకు ఇంకా గుర్తుంది. ఝాన్సీగారు ఛానెళ్ళలో మాట్లాడుతుండగా ఎన్నోసార్లు చూసి, ఆవిడ మాట్లాడుతున్న తీరుకు మేము ఆమె అభిమానులమయ్యాము. అటువంటి ఆమె ఇక కనిపించదు అని తెలిసి బాధపడ్డాము.
    ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ…
    బాలకృష్ణ, ఎడిటర్, యోజన (తెలుగు)


RSS Feed for this entry

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 487 other followers