పాత సంగతులు

..
తెగిన దుఃఖపు గాలిపటంలో
మృత్యుబింబం-
బతుకుదారం మెడని మెలిపెట్టిన గొంతు ముడిలో
ముక్కలు ముక్కలైన మాటలు-
.
Loneliness20x24
.
గుండెలు వేలాడుతున్న చీకటి మైదానంలో
చిప్పిల్లిన ఆరుద్ర పురుగు
ఎడతెగని వర్షోధృతిలో
చివికిపోయిన జ్ఞాపకాల వాల్జడలు
నిటారుగా నిల్చున్న పంజరంలో
రెప్పవాల్చని చూపుల మార్మిక మౌనం
.
కదలని కన్నీటి గోళాల్లో
కరగని స్మృతి శకలం-
.
వాయువే అంతటా
రేణువైపోదీ శిశిర శరీరం
భగ్నమైపోదు ఏ ఆశా
రచియింపకు రుచియించదు ఏ వాస్తవమూ
కన్నీటి కశ్మలంలో చిగురిస్తాయి జీవన సౌరభాలు
దారితప్పిన పాట కన్నా
గొప్ప కవిత్వం లేదు-
.
***
Advertisements

ఎండాకాలం వాన

.
మబ్బుల్ని తొలిచిన పిట్ట గూళ్ళలో
ముందస్తుగానే వచ్చిన సాయంత్రంలో
వచ్చీరాని టెన్నిస్సాటాడుతున్నప్పుడు
ఒగ్గంట పర్మిషన్ తీసుకున్న సూర్యుడు
పడమటి గంగలో స్నానానికై వెళ్ళిపోయాడు
.
Summer Rain
.
బూడిద రంగు ఆకాశంలో
గంధర్వ కన్య జారవిడుచుకున్న పైట చెరగులా
విన్పించని సంగీత ప్రవాహమై
తరలిపోతుంది పక్షుల గుంపు-
.
గాలి దుమారంలో
కాగితప్పూల చెట్లూ
శోకతప్త హృదయాలూ
రంగు మాసిన బాధల్ని రాల్చేసుకుంటూ-
.
బెరడ్లు లేచిన జామెచెట్టు కాండమూ
చివుళ్ళు తొడిగిన మావిడి తోపులూ
రెక్కలల్లాడిస్తూ… లేచిపోవడానికే!?
.
గువ్వలన్నీ గూళ్ళల్లోనే
గూళ్ళన్నీ చెట్లల్లోనే
చెట్లన్నీ పిట్ట గూళ్ళల్లోనే!
leaves.
ఎక్కడిదో సరస్సు వచ్చి
ఇక్కడ వాలినంతలో
తడిసి ముద్దయిన కవిత్వాన్నై నేను….!
.
వొలికిన రాగాలు
అలసిన ప్రవాహమ్మీదకు
రైలు బండిలా వచ్చిన చీకటి నిశ్శబ్దంలో
టెన్నిస్ టేబుల్ మీద విస్తరించిన బంతి
తుళ్ళిపడుతూ లేస్తూ
ఎగిరి వచ్చి పెదాల్ని తాకుతూ-
.
నిర్మలమైన ఆకాశంలో ఇప్పుడు
దొంగలు రాహుకేతువులు కానే కారు!!
.
***

గాలొక్కత్తే…!

గాలొక్కత్తే…!
గాలొక్కత్తే… గాలొక్కత్తే… తన వెంట లోలకాల్ని లాక్కుపోతూ
లోకలోకాల కలల్ని పారదర్శకంగా లీనం చేసుకుంటూ
చిదిమిన దీపం శిరస్సు మీది
చీకటిని తాగి తాగి
గాలొక్కత్తే… గాలొక్కత్తే…
వాయులీనాలనకీ వన కుహూరాలకీ
తనువు తననానమాడించి
నన్నల్లుకుని శబ్దమూ కాని మౌనమూ కాని
ఏకాంతంలోకి తోడుగా వచ్చేది
గాలొక్కత్తే-
ఏకాంత వనమూ ఐ, వనమాలీ ఐ…
పొద్దుటి మంచు కింది నల్లటి కొండ మీంచి
నను భద్రంగా నగ్నంగా తనలోంచి జ్ఞాతంగా…
.
గాలొక్కత్తే…!
గాలొక్కత్తే… గాలొక్కత్తే… తన వెంట లోలకాల్ని లాక్కుపోతూ
లోకలోకాల కలల్ని పారదర్శకంగా లీనం చేసుకుంటూ
చిదిమిన దీపం శిరస్సు మీది
చీకటిని తాగి తాగి
గాలొక్కత్తే… గాలొక్కత్తే…
.
Lent Wind - the pencil sketch
.
వాయులీనాలనకీ వన కుహూరాలకీ
తనువు తననానమాడించి
నన్నల్లుకుని శబ్దమూ కాని మౌనమూ కాని
ఏకాంతంలోకి తోడుగా వచ్చేది
గాలొక్కత్తే-
.
ఏకాంత వనమూ ఐ, వనమాలీ ఐ…
పొద్దుటి మంచు కింది నల్లటి కొండ మీంచి
నను భద్రంగా నగ్నంగా తనలోంచి జ్ఞాతంగా…

***

డెజావూ

.
నేల రాలిన శిశిర పత్రంలా
చెంగు చెంగున దొర్లుకుంటూ పోతున్నాను
పరిగెత్తే కాలం పాదం మోపినప్పుడు
ముక్కలు ముక్కలుగా విరిగి
పొడిగా పొడిగా నలిగిపోయాను
ధూళిలో తేలిపోయాను-
ఎంతగా విడిపోయినా
ప్రతి శకలంలోనూ ప్రాణ స్పందన వెంటాడుతూనే ఉంది
ప్రయాణం సాగుతూనే ఉంది
ఇది దారి తప్పడమా?
అసలు దారి ఎవరికి తెలుసు?
అన్నీ తప్పనిదారులే-
.
Single Dry Leaf
.
ఒక్కోసారి వేయి హస్తాల ఆక్టోపస్ లా
వేనవేల వాంఛల్ని పట్టుకోవాలని చూస్తాను
అంతలోనే సముద్రమంతా ఇంకిపోయి
నేనొక్కడినే ఎడారి ఇసుకలా
వలయాలు వలయాలుగా సొగసుగా పరచుకుంటాను-
వడగాడ్పు తడవ తడవకీ
నన్ను కొంచెం కొంచెంగా తెరచాపలా చేసి విసిరేస్తుంటుంది-
ఇసుక రేణువులై ఎండమావిలా కనిపించడం ఎంత మోసం?
కరగడమూ ఆవిరవడమూ చేతకాని
ఈ ప్రాణం దేనికి?
.
సాయంకాలపు గాలి నా ప్రశ్నలను
తుపానులాగా లాక్కుని పోతుంది….
అప్పుడొక నిఖార్సయిన ఖాళీతనం!
పారదర్శకపు నీటి బుడగ దేహంలో
చుక్కలూ చంద్రుడూ వెన్నెలా…. కొంత సముద్రమూ
కొలువుదీరుతాయి-
.
నాతో సహా అక్కడ అప్పుడు మనుషులెవ్వరూ ఉండరు-
క్షణాలు మల్లెపూవుల్లా దొర్లిపోతాయి
బోర్లించిన రెప్పల కింద
పాత కల ఒకటి ముల్లులా విచ్చుకుంటుంది
నీటి బుడగ టప్పున పేలిపోతుంది….
***
.
నేలరాలిన ఆకు చేసే గరగర శబ్దం
పరమ దుర్భరంగా ఉంటుంది-
డెజావూ…. డెజావూ….
నిన్ను హత్య చేయడానికి
నేనో కొత్త ఆయుధం కోసం అక్షరాన్ని మోహించాను-
.
***

వేడన్ తాంగల్

.
bird sanctuary.
.
కనిపించినంతమేరా పక్షులు
రకరకాల రంగు రంగుల పక్షులు
ఆకుపచ్చగా పరచుకున్న చెట్లన్నీ
హృదయాల్ని ఆరబోసుకున్నట్లు
నేనొక్కడినే అందరిలో ఒంటరిగా
కాసేపటికి ఆ ఒక్కడూ జాడలేడు
జ్ఞాపకాల పుట్టకు రెక్కలొచ్చాయి
నన్ను నేను పట్టుకోలేకపోయినప్పుడే
నేను జీవిస్తుంటాను
అప్పుడు కొన్ని భవిష్యత్ జ్ఞాపకాలు
పలకరిస్తాయి-
ఈ జీవితం పెద్ద గొప్పదేం కాదు
దీన్ని మళ్ళీ జీవించాల్సిన పని లేదు
సరే… నిద్దరొస్తోంది
రేప్పొద్దున పన్లోకెళ్ళాలి
.
***
(వేడన్ తాంగల్ అన్నది తమిళనాడులోని పక్షుల పునరావాస కేంద్రం)

నాలుగు నీలికళ్ళ లిట్మస్ పరీక్ష

.
Maldin eye
.
నీతో ప్రత్యేకంగా మాట్లాడడం
నీకే కాదు
నాకు కూడా శిక్షే
జాలి కొద్దీ క్షమించు
.
అది సరే-
నీ దగ్గర సమాధానాలే కాదు
ప్రశ్నలూ ఉంటాయని
అప్పటికి గాని తెలియలేదు
ఈ హిపోక్రాట్ ని మళ్ళీ క్షమించు
.
నేను కొన్ని నిజాలు చెబుతాను
నువ్వు కొన్ని అబద్ధాలూ నిజాలూ చెప్పు
రెండింటి మధ్య నేను నానా కారణాలకు వేలాడుతుంటాను-
ఒక విధంగా నిన్ను నేను తూకానికి పెడతాను
నీ అంచనాల స్ప్రింగ్ కొక్కేనికి నేనూ
వేలాడుతుంటాను… అవునా?
.
కొన్ని ప్లస్ లు కొన్ని మైనస్ లు
ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ….
బీజగణితం ఎంత తరచినా
ఎక్స్ విలువ ఎంతో తెలియదు-
చివరకు ఆలోచనకు చిక్కనిదేదో
రెటీనా తెరకూ గుండె గుహకూ మధ్య
లీలా వినోదంలా స్పృహను తడుముతున్న స్పర్శ
.
చివరాఖరికి
ఏ కారణమూ పని చేయదు
ఏ లెక్కల సూత్రాలూ అక్కరకు రావు
అంతా తెలిసీతెలీనితనమే….
నిర్ణయించుకునే హక్కుంటుందేమో కానీ
ఆ తాహతు ఉంటుందా ఎవరికైనా?
.
***

నిదుర

.
Salvador Dali - Sleep
.
తుమ్మచెట్టు గాటులోంచి కారే జిగురులా
కనుగుడ్ల మీదకు జారుతుంది పచ్చి నిద్ర-
పగలంతా రోడ్లమ్మట నడిచి నడిచి అలసిన కాళ్ళు
కళ్ళల్లో ముడుచుకుంటయ్ మోకాళ్ళు మడచి-
మూసిన పుస్తకంలా మాట్లాడని పెదాలు
ముసిరిన ఆలోచనల్నుంచి వూపిరి తీసే బెల్లం ముక్క
.
కణతల్లో తంత్రుల్ని వదిలేసి
వాయిద్యకారులు రెప్పల సందుల్లోంచి నిష్క్రమిస్తారు-
నా దేహాన్ని వేలాడదీసే నా స్వప్నాల
దూది చిత్తర్వుల్లోకి సరీసృపాలై మళ్ళీ వస్తారు
తెల్లని శూన్యంలోకి తలకిందులుగా పడిపోతున్నప్పుడు
గాభరాగా అందుకుని మళ్ళీ జోకొట్టే మెలకువ…..
నా మూర్త దేహం నాతో మాట్లాడే మహత్తర
సన్నివేశం కోసం చూపులు వెనక్కి తిరుగుతాయ్…..
.
ఒక్క రాత్రిని ఎన్ని ముక్కలు చేసి నిద్రపోవాలి?
.
***