పూర్వ వచనం – ఇస్మాయిల్

Ismail

(అనేకవచనం కవితా సంపుటికి ప్రసిద్ధ కవి రుషి ఇస్మాయిల్ రాసిన ముందుమాట)

‘అనిర్వచనీయమైన విషయాల గురించి మౌనం వహించమన్నా’డు తాత్వికుడూ, అంతకు మించిన
తార్కికుడూ అయిన విట్ గెన్ స్టైన్ (Ludwig Wittgenstein). అనిర్వచనీయమైన వాటి గురించి మౌనం పాటిస్తే ఇక కవిత్వమే లేదు. విట్ గెన్ స్టైన్ సూక్తి శాస్త్రానికి (Science), తర్కానికీ వర్తిస్తుందేమో కాని, సాహిత్యానికి కాదు. అనిర్వచనీయమైన వాటిని నిర్వచించడమే కవిత్వం పని..

అనిర్వచనీయాల్ని నిర్వచించటానికి కవికి ఉపయోగపడే ముఖ్య సాధనం భాష. ఐతే, ఈ భాషే ఒక్కొక్కప్పుడు గొప్ప ఆటంకంగా పరిణమిస్తుంది. అందుకనే మన శ్రీధర్ బాబు ఆక్రోశం “అన్నింటికన్నా భాషే నన్ను ఎక్కువగా బాధించింది అక్షరాలకు అపరిచితుడిగా నేనో మరి ఎవరో?” (అపరిచితుడి ఆనవాళ్ళు).

ఈ కవి మాటలతో పడే సంఘర్షణ అడుగడుక్కీ ఎదురౌతుంది మనకు. మాటలు మాత్రం మనల్ని ఎంత దూరం తీసుకువెడతాయి? నిశ్శబ్దపు అంచుల వరకు తీసుకువెళ్ళి ఆ సరిహద్దులో మనల్ని దిగవిడుస్తాయి.
అక్కణ్ణించి మన దారి మనం వెతుక్కోవలసిందే. అందుకే అంటాడు

“మాటలన్నీ కుప్పబోసినట్టు

వెంటాడే ఒక నిశ్శబ్దరావం” (వెంటాడే కాళ్ళు)

కవిత్వం క్లిష్టంగా, సంక్లిష్టంగా ఉండటానికీ, అందరికీ సులువుగా బోధపడకపోవడానికీ ఇదో కారణం.. సుష్టుగా భోంచేసి పవ్వళించేవాడు కవిత్వం జోలికి వెళ్ళడు.

నీలో పట్టలేని అశాంతీ, అలజడీ ఉంటేనే కానీ నువు కవిత్వంలోకి బద్ధలవవు. “నీలో విలయం (Chaos) తాండవిస్తేనే కాని నర్తించే నక్షత్రానికి జన్మనివ్వలేవు” అంటాడు జర్మన్ రుషి నీషే (Nietzche).
అటువంటి అంతరంగ సంక్షోభంలోంచి జన్మించిందే ఈ అనేకవచనమనే కావ్యం.

(మిగతా భాగం రేపు చూడండి)
(ఈ రంగులెందుకంటే.. ఆయన ఇలా రంగుల్లోనే రాసిచ్చారు మరి.. అందుకని)
.

 

Advertisements

మౌనలిపి

.
……..ఎప్పుడో ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఓ కొత్త శబ్దంగా ఆవిర్భవించింది మొదలు నడిచిందే దారవుతున్న అంసదర్భ ప్రయాణంలో ఆలోచనకు తావి చేకూరిన బిందువు వద్ద తొలిగా ఆనందంలోకి ప్రవేశించిన ఆ సన్నివేశం గుర్తుంచుకోవడానికీ మరచిపోవడానికీ అతీతమైంది!
.
Memory 3
…………………………………………………2
..
…….. ధృఢత్వమంటే హృదయానిదే అనుకునే మనోగతిలో స్పష్టమైన ఛాయాచిత్రాల్ని డెవలప్ చేసేందుకై  చీకటి లేని ఒంటరితనం లేని ఏకాంతానికై నిరీక్షణ. సాహసం స్వార్థాన్ని ప్రేరేపించలేక పోవడమే సమస్య. సాన్నిహిత్యం చూపుల మీద చలించి చలించి తరించనిదై పెక్కు స్ఫటికాల్ని కన్నుల్లో రంగరించింది.
…………………………………………………3
…….. అనుభవాల్ని జీవించాలి కదా! అనుభూతి పక్వం చెందే లోపే రహదారి చీలిపోయింది. నే పొందని ఆహ్వానాన్ని పురస్కరించుకుని చిత్త లేఖ వెళ్ళిపోతుంది. నా చుట్టూరా దారులు మాయమవుతాయి. ఆమె ప్రయాణపు బడలికలో నేను కొంత సేదదీరాలని ఆశ!
.
…………………………………………………4
.
……..తొలిగా ఆనందం అందించిన బిందువు దేహంలో న్యూక్లియస్ గా మారి జీవన చర్యల్ని నియంత్రిస్తోంది. అనావర్తనీయమైన చూపుల సందిగ్ధతలోంచి జారిన ఓ చూపు నా నిరీక్షణా తంత్రుల్ని మీటిందన్న తరంగ ధైర్ఘ్యాన్నితార స్థాయికి నెట్టేస్తుంది.
.
………………………………………………… 5
.
Memory
.
…….. కలుక్కుమన్న బాధ కవిత్వీకరించినంత మాత్రాన్నే తీరిపోతే ఎంత బాగుణ్ణు! అనుభూతుల్ని అసంకల్పితంగా మేకప్పేసుకునే సహజత్వం మొగలి దోసిట్లో అద్దుకోవాలని…. ఒక మెత్తని సంఘర్షణలో విచ్చుకున్న హృదయం మౌనలిపిని లిఖించాలని తహ తహ!
……..కృష్ణపక్షపు సాయం సంధ్యలో ఓ కొమ్మ మీద ఒంటరి చకోరం ధ్యానముద్రలో ఇంకా ఉంది-
.
***

అనేకవచనం

foot prints

నేను నీలోంచీ
నీవు నాలోంచీ
మనిద్దరమూ మరెవడిలోంచో
సామూహిక ఆత్మల సహస్ర విచ్ఛేదనల్లోంచి!

రెప్పలు తెరచిన చూపే స్వాధీనం
రెప్పలు మూశాక అంతా అనాధీనం
ఒకడు పడుకుంటాడు
ఒకడు లేచి గోడకు వీపునానించి కూచుంటాడు
ఒకతె వచ్చి నిమురుతుంది
చీలిన చెంద్రబింబం లాంటి అరచేత్తో
ముఖంలో రూపాలు మారుతుంటాయి
అంచెలంచెలుగా…

దృక్కులుగా చీలిన దేహంలో
చీరిన గాయమైనా గానమైనా
నన్నే స్పృహిస్తుంది-

నాలో ఎవరు ఆమెకు
దాసోహమయ్యారో తేల్చుకోవాలి
ఆమెలో ఎవరు నాలో ఎవడ్ని
ధ్వంసం చేయాలనుకుందో, ఎవడ్ని
ధన్యం చేయాలనుకుందో తేల్చుకోవాలి
ఇలా తేల్చుకోవాల్సినవి
ఇంకా ఉన్నాయి చాలా….

పంచేంద్రియాలూ
జననేంద్రియాలూ సొంత ఆస్తులైనట్లు ఏవిటిదంతా?
అంతా కలసి అరవై కేజీల మాంసపు ముద్దేనా, లేక
యోజనాల విస్తీర్ణంలో పరచుకున్న
ప్రాకృతిక సంయోజనమా?

ఇంకా
ఏకవచనంలో సంబోధిస్తున్నారే…
ఆ మాత్రం గౌరవం లేదూ మనిషంటే?

నా సగం కప్పు ఇరానీ చాయ్

.
ఫో…
తెలియని లోతుల్లోకి
తెలిసి తెలిసీ జారిపో-
నీ కిటికీ అవతల మెరిసిన
నా మెరీనా తీరంలోకో, లేక
నా కిటికీకివతల వెలసిన
నీ క్రాస్ రోడ్స్ ధూమంలోకో…
పిలవకుండానే లాక్కుపోతావా
నన్నూనూ…?
.
2
.
ఎన్నిసార్లని ఇలా
రాత్రుల చీకట్లని చీలుస్తూ ఝూమ్మని
ఇంకా చలి వొణికిస్తూనే ఉంది-
పోయినేడాది డిసెంబర్ పన్నెండు… పోనీ
ఏదోవొక నా ఇష్టమొచ్చిన తేదీని
చెవిపట్టి మెలిపెట్టి నుంచోబెడతానిక్కడ
కావలసినప్పుడల్లా కావలసినంత సేపు….
ఆ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే
నేన్నెమ్మదిగా నిద్దర్లోకి జోగుతా-
.
Irani Chai Half
.
రా…
నడిచే నగరంలానో
నిద్రించిన పల్లెలానో వొచ్చి
నా ముఖం మీది దుప్పటి లాగెయ్-
బొర్లించుకున్న రాత్రుళ్ళూ
పొర్లించుకున్న పాటలూ
నిరామయ ప్రపంచాలూ
చెరిసగమూ పంచుకుందాం ఇరానీ కప్పుల్లో
గోర్వెచ్చగా-
.
3
.
ఎదురుగా కూర్చున్న స్నేహితుడ్ని, పోనీ
కనీసం ప్రియురాల్ని కదలకుండా
కావలించుకోగల వారెవ్వరైనా ఉన్నారా?
.
4
.
ఇప్పుడు
ఎవరి నగరాలు వారికున్నాయ్
చీకటి పడని రాత్రిలో
గుప్పిట్లో పూసే చిటికెన వేలు
తెల్లారితే కనిపించదు-
అవును…. ఇప్పుడు
ఎవరి పగళ్ళు వారికున్నాయ్
.
(కవి మిత్రుడు సిద్ధార్థకు… మా సాయంత్రాల తీయని అబద్ధాలను నమ్మినట్లు నటించే సునీతక్కకు నిజంగానే)
.
***

మళ్ళీ

.
శుక్లపక్షపు రాత్రి పుష్పం వెదజల్లిన
పుప్పొడి దప్పికలో శిల్పించుకున్న మౌనలిపికి
ఇంకా శబ్దాన్ని ఆపాదించక మునుపే
మనస్తంత్రిపై కల్లోలిత రహస్య ప్రకంపనా తరంగం
పాయలు పాయలుగా విస్తరించుకున్న
అద్వైత రాగ దిగ్బంధనం లోంచి
జ్ఞాపకానికి జీవం పొదిగినట్టు-
.
Rassouli  Painting
.
నిద్రలోంచి అర్థాంతరంగా వైదొలగిన స్వప్నాన్ని
మెలకువలో వెతుక్కునే అమాయకత్వానికి
లేదా…
నిజంలో అపురూపమై అరూపమైన వైనాన్ని
స్వప్నంలో వెతుక్కునే భావుకత్వానికి చేతనవై
మళ్ళీ నీవు వచ్చావ్-
.
మంచు బిందువుల వాహకత్వంలోంచి
వేకువకై నిరీక్షించే హరిత పత్రం
ఉదయ సంధ్య నిష్క్రమణంతో పొడిగా అల్లాడినట్టు-
చందమామను గుండె లోతుల దాచి
వెన్నెలై పరచుకున్న కొలను
లోకం నిద్ర లేవడం మూలాన్న
అలలుగా చీల్చుకుపోయినట్టు
నీవు వచ్చి వెళ్ళే క్షణపు నిరంతరత్వం మీద
పిడికెడు ద్రాక్ష పండు ఒరుసుకుపోతూ ఉంటుంది-
.
చూపుల్ని చుంబించే అద్వితీయ దృశ్య గాఢతవై
తీగల కొమ్మల మీంచి సంగీత విహంగానివై
వెళ్ళిపోవడానికే కదా……
నీవు మళ్ళీ మళ్ళీ మళ్ళీ……
.
***

….లో

మిత్రుడా నీవు దేవుడి హృదయంలో ఉన్నావు
నీ హృదయంలో ఉన్నదే ఈ సకల ప్రపంచం
నిన్ను నీవు అద్దంలో కాకుండా మరెక్కడైనా చూసుకోగలిగావా?
నీలి ఆకాశంలోనో… నీటి అలల్లోనో… నీలోనో… పోనీ మరెవరిలోనో?
నీవు నడుస్తున్న దారికి ద్వారాలు తెరుచుకున్నవి నీ గుండెలోనే
నీ దుఃఖగంగ సుడులు తిరుగుతున్నది ఆ చిట్టి గుండెలోనే
ప్రవాహ జడిలో కొట్టుకుపోతున్నది నీవు కాదు….
నీలోనే ప్రవాహం కొట్టుకుపోతోంది-
ఆనందం మేఘంలా కమ్ముకుందా?
నీవే మేఘమై వర్షిస్తున్నావా?
మిత్రుడా…
నీలోని అడవులు, సెలయేళ్ళు, శిఖరాలు, లోయల మధ్య
నీవు ప్రయాణిస్తూనే ఉన్నావు కదా…..
ఒక పూవును కోసినా గాయం నీకే అవుతుంది-
పూలు నీవి… చెట్లు నీవి…. సకల సమస్తం నీది-
వెళ్తూ ఉండు అలా ధ్యానంలా…
నువ్వు పువ్వై వికసించే క్షణం నీకోసం తప్పకుండా వస్తుంది
అప్పుడు నేను నిశ్శబ్ద సంగీతమై పరిమళిస్తాను…
***
.
మిత్రుడా నీవు దేవుడి హృదయంలో ఉన్నావు
నీ హృదయంలో ఉన్నదే ఈ సకల ప్రపంచం
నిన్ను నీవు అద్దంలో కాకుండా మరెక్కడైనా చూసుకోగలిగావా?
నీలి ఆకాశంలోనో… నీటి అలల్లోనో… నీలోనో… పోనీ మరెవరిలోనో?
.
raquib-shaw-absence-of-god-iv
.
నీవు నడుస్తున్న దారికి ద్వారాలు తెరుచుకున్నవి నీ గుండెలోనే
నీ దుఃఖగంగ సుడులు తిరుగుతున్నది ఆ చిట్టి గుండెలోనే
ప్రవాహ జడిలో కొట్టుకుపోతున్నది నీవు కాదు….
నీలోనే ప్రవాహం కొట్టుకుపోతోంది-
ఆనందం మేఘంలా కమ్ముకుందా?
నీవే మేఘమై వర్షిస్తున్నావా?
మిత్రుడా…
నీలోని అడవులు, సెలయేళ్ళు, శిఖరాలు, లోయల మధ్య
నీవు ప్రయాణిస్తూనే ఉన్నావు కదా…..
ఒక పూవును కోసినా గాయం నీకే అవుతుంది-
పూలు నీవి… చెట్లు నీవి…. సకల సమస్తం నీది-
వెళ్తూ ఉండు అలా ధ్యానంలా…
నువ్వు పువ్వై వికసించే క్షణం నీకోసం తప్పకుండా వస్తుంది
అప్పుడు నేను నిశ్శబ్ద సంగీతమై పరిమళిస్తాను…
.
***

జీలాల్ *

.
ఎడారిలో శిర్సూడిన ఒంటరి ఖర్జూరపు చెట్టు
వళ్ళంతా కళ్ళు చేసుకుని
అశ్రురహిత దుఃఖంలో పాతుకుపోయింది-
విధ్వంసమైపోయిన ఒయాసిస్సుల శకలాలు సైతం
నేత్ర కుహరాల్లో రోదనకు భాష్యంగా ఏమాత్రం ఒలకవు-
ఆకు రాలిన రుతువు మీద అమావాస్య కప్పినట్టున్న
Sudanదేహాల్ని మోస్తున్న సోమాలియా…
జీలాల్ * కౌగిట్లో నీవొక ద్రవ్యగీతానివై
ఈ ప్రాపంచిక క్యాపిటల్ దృక్పథం మీద వర్షిస్తే
ఆఫ్రికా ఖండ దేశాలకన్నా అఖండమైన
ఎడారి హృదయాల మీద
నిజానికి, నిజంగా చిగురించని పచ్చదనం మీది ఆశతో
వెల్లకిలా పడుకుని జానెడు పొట్టనే
భిక్షా పాత్ర చేసుకున్నావ్-
దశాబ్దాలకు దశాబ్దాలుగా ప్రకృతి విషాద గీతానికి
వైషమ్య సంగీతాన్ని మేళవించే
ఈ అంతర్యుద్ధం ఇంకెన్నాళ్ళు?
.
ఇంకా ఏం మిగిలిందని?
కరవు ఖండం రెండు అగ్రరాజ్య వర్గాలుగా మారి
దోసెడు జలాశయాల్ని సైతం
పరస్పరం విచ్ఛిన్నం చేసుకున్నాక…
ఆకలి తుపానులో అనుబంధాల్ని మోసే
చూపుల వంతెన కూలి
స్మృతికి రాని దృష్టాంతాలుగా చెల్లాచెదరై పోయింతర్వాత
తనవాళ్ళు ఆనవాళ్ళు అన్నీ మర్చిపోయిన కనుగుడ్లు
కపాలపు గూళ్ళలో వదులై
బతుక్కి మరోవైపు వేలాడబడ్డాక
ఇంకా ఏం మిగిలిందని??
.
దహించి పారెయ్ జీలాల్…
దహించి పారెయ్-
ఈగలు తేనెటీగల మాదిరి తమవి కాని
కంటి తుట్టెల మీద కూసింత తడికై ముసురుకుంటే
విసుర్కోవటానికి చేతులు వినక
వాడుక లేక కిర్రు కిర్రుమనే పనిముట్టు మాదిరిగా
ఎటు వాలినా ఏ కోశమో కొంత కదిలినా
లోనంతా సున్నపు రజం పూత
భగభగమంటున్న ఉడుకు శబ్దం-
దహించి పారెయ్ జీలాల్…
దహించి పారెయ్…
చిల్లులు పడ్డ మానవత్వపు కంట్లోంచి ప్రవహిస్తున్నవి
ఉడుకుమోతు కన్నీళ్ళే కాని
కారుణ్యం కాదని తేలిపోక ముందే
జీలాల్… దహించి పారెయ్
రెల్లు ఎముకల మీద ఇంతటి విస్తారమైన చర్మాన్ని
మోయడం ఇంక సాధ్యం కాదని తేలిపోయింది-
.
***
(జీలాల్ అంటే సోమాలియా భాషలో కరవు. ఇది 1990లలో రాసిన కవిత)