తెలంగాణను ప్రత్యేక రాష్టంగా ఏర్పాటు చేయాలా?

మీ అభిమతం టిక్ చేయండి. మీ అభిప్రాయం తెలపండి.

Advertisements

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ

.

అందగత్తెలు

అందగత్తెలు కొందరు అతి గుంభనంగా ఉంటారు
వారు అందరిలా నేల మీద నడవరు
మగాళ్ళ గుండెల మీద నుంచే నడుస్తుంటారు
వారి మౌనం మంద్రంగా ఎగసే తుపాను
వారి మాట మంచుకొండను తటాలున కరిగించే సెగలేని జ్వాల

వారు చూపుతో గుండెలను చిచ్చుబుడ్లు చేసి వెలిగిస్తూ పోతారు
అతి వెచ్చని వెలుతురు పూలను లోలోపలే ఎగజిమ్ముతూ ఎగజిమ్ముతూ
చిచ్చుబుడ్లు ఓరోజున ఖాళీ అయిపోతాయి
బూడిద చిప్పల్లా నోళ్ళు తెరచుకుని తనువు చాలిస్తాయి-

మళ్ళీ కొత్త చిచ్చుబుడ్లు మొలకెత్తుతూనే ఉంటాయి
కాకరపూవొత్తుల్లాంటి కళ్ళతో రాజుకుంటూనే ఉంటాయి
కొత్త కవిత్వాలు ఉదయిస్తూనే ఉంటాయి
భాషకు వసంతోత్సవాలు జరుగుతూనే ఉంటాయి-

ఎన్ని చెప్పినా..
ఆత్మాభిమానాల్ని గంగలో కలిపేసేది అందగత్తెలే-

***

‘నక్షత్రపురం తోవ’ (అనేకవచనం సంపుటిపై కవి మిత్రుడు సిద్ధార్థ)

..
ఈ మిలీనియంలో చివరి మెట్టు మీద నిలబడి మెలకువలోనే కలలు కనేవాడు తుది చరణాన్ని గురిపెడుతున్నాడు. తన singular solitude లోంచి పక్కకు జరిగి, తన నీడను తానే చూస్తూ, చూపిస్తూ విచిత్రానికి లోనవుతున్నాడు. పారదర్శకపు చీకటి పొరపై పుప్పొడిలా పేరుకున్న గుసగుస ఈ కవిత్వమంతా. అనుభవంలోచి తాదాత్మ్యతను వెదజల్లే నిగారింపు కవిత్వం. మనం చాలాసార్లు అనుకుంటూ వుంటాం, కవిత్వం అర్థం కావాలని, మన అర్థాల్లోనే అర్థం కావాలనీ పట్టుబడతాం. కానీ అంతా విరుద్ధంగా జరుగుతూ వుంటుంది. చాలా గొప్ప గొప్ప కవులంతా మన అర్థాల బారిన మనల్ని వదిలేసి, వొక విశాలమైన Poetic Awareness లోకి మనల్ని విడుదల చేయడానికే చాలా అస్పష్టతలన్ని తమ కవిత్వం మీద రుద్దుకుంటారు.
.
కవిత్వంలో కవి అర్థమైపోతాడనుకుంటే కుదరని పని. కవులు తాము ప్రపంచానికి చెప్పాలనుకున్న చాలా రహస్యాలను, పాపాలను, కన్నీళ్ళనూ మరగుపరచడానికి కూడా కవిత్వం రాశారానిపిస్తుంది. కవి తన కవిత్వంతో జ్ఞాపకాలను వెలిగించడమే కాదు, అసలు జ్ఞాపకాలలోని nounనీ, pronounనీ కూడా చెరిపేయగలడు. అందుకే, మనం ఏ ప్రపంచాన్నైతే అక్కర్లేదనుకుంటామో, అవసరం లేదనుకుంటామో దాన్ని మరుగుపరిచే ప్రయత్నానికీ సాహసిస్తుంటాడు. చాలాసార్లు మంచి కవిత్వం బ్రౌన్ షుగర్ని పీలిస్తే కలిగే సుఖానికంటే ఎక్కువ ఆనందం కలుగుతుందని అంటారు. నిజమేనేమో… అసలు కవిత్వం చేసే గొప్ప పని మనల్ని దారి తప్పేలా చేయడమే. మనల్ని పక్కదారి పట్టించటానికీ, కొత్త లోకాలకై పిల్ల బాటను వేయటానికీ దోహదపడుతుంది.
.
కవిత్వం రెండంచుల జంబియా (కత్తి). ఎడతెగక కవి లోపల మార్ఫా శబ్దం, తాషా దరువు ఎప్పటికీ వినిపిస్తూనే వుంటుంది. కవి దాన్ని శాంతపరచాలని, నిశ్శబ్దపరచాలని కూడా కవిత్వం రాస్తుంటాడు. తన లోపలి ‘కుత కుత’నీ, మంటనీ ఆవిరి చెయ్యటానికి ఎన్నో formsలోకి వొదిగి కవిత్వాన్ని ఆశ్రయిస్తుంటాడు కవి. కవిత్వంలో గనక formలో వైవిధ్యం లేకపోతే లోపల సరైన మంట లేదనిపిస్తుంది. అవును… కవిత్వం లోపలి జీవితం, లేదా కవి జీవితంలోని లోపలితనం పూర్తిగా అసమతౌల్యంగా వుంటుంది. వొక నిద్రవైపో, మెలకువ వైపో, దుఃఖం వైపో, సౌందర్యం వైపో, ఆధ్యాత్మికత వైపో, హింస వైపో, తపోగానం వైపో మొగ్గు చూపుతుంది కవి జీవితం. తన జీవితంలోని truthfulnessతో కవి కొత్త సంస్కారాన్ని, మరుగున పడిన ఆత్మగౌరవాలనీ వెలుగులోకి తెస్తుంటాడు. అందుకే కవిత ప్రతిపాదించే కొత్త sensibilitiesతో పాఠకుడు మత్తులోకి లేదా అప్రమత్తతలోకి మేలుకుంటూ వుంటాడు.
.
కవిత ఎప్పుడూ కవి కాలం కంటే ముందు leapలోనే వుంటుంది. లేదా కవి ధ్యాన పూర్వ స్థితిలో దాక్కుని వుంటుంది. కవికి జీవితం కవిత్వపు గాలిని వూదడంతో మొదలై కవిత పూర్తవడంతోనే అంతమూ అవుతుంది. మన బతుకులోని aesthetics గానీ, essence గానీ కవిత్వంతోనే ఫోకస్ అవుతూంటుంది. ఈ అనేకవచనాన కవి తాలూకు ఈస్తటిక్స్ అంతా భాషే అయ్యి మనల్ని వొక కొత్త లోతట్టు ప్రాంతాల మునకను చూపిస్తూంది. ఇదంతా, వో ఎండాకాలం వానలా చలి రాత్రుల వెన్నెలలా లేక తాటి వనాలలో నిలువుగా వీచే పొడి పొడి నీలపు గాలిలా శ్రీధర్ బాబు కవిత్వంలో ప్రసరిస్తూనే వుంది. ఈ కవిత్వంలో ఆకాశానికేసి కళ్ళనీ చేతుల్నీ కలిపి జోడించుకున్న వొక tree of life ఉంది, జామచెట్టు వుంది. వయస్సు పెరుగుతూన్న కొద్దీ దాని మోదుపై వానలు పడి ఎండలు కురిసీ పెచ్చులూడుతున్న గుర్తులూ కనబడుతున్నాయి.
.
శ్రీధర్ తన కవిత్వంలో తను పుట్టిన మోత్కూరు (నల్లగొండ జిల్లా) పొలిమేరలో తుమ్మచెట్టు మీంచి జారిపోయిన పాలపిట్ట సణుగుడుని జల్లెడ పడుతున్నాడు. కవిత్వం వొక ఉత్పాతం వొక calamity, వొక (అ)శాశ్వత సత్యాన్ని ప్రతిపాదిస్తూన్న దుఃఖం-
వెన్నుపాములో కుబుసం విడిచిన కటిక పగటి చీకటి
పక్కలో చుట్ట చుట్టుకున్న నల్లని విష సర్పంలా రాకాసి చీకటి
ఎక్కడో దీపస్తంభం మీద గూడు మరచిపోయిన పక్షి
రెక్కల్లోకి తలదోపుకుని కునారిల్లుతోంది
పుటల్లోంచి తప్పిపోయిన రెండు ఆడ, మగ ఎలిజీలు ఎక్కడో
ఒకే శరీరమై నిట్టూరుస్తున్నాయి – (ఈ రాత్రినెలా?) ఇక్కడ, ఒకే అర్థాన్ని అనేక స్పృహల్లో reverbate చేస్తున్నాడు. ఒక స్పృహనే అనేక అర్థాలుగా ప్రతిధ్వనింపజేస్తున్నాడు. చాలా కవితల్లో ఇట్లాంటి micro activity వున్న వాక్యాలుంటాయి. మనం వొక్క అనుభవాన్ని పొందీ, అర్థం చేసుకునే లోపలే మరో తాకిడి తగులుతుంది. మరో పుండూ మిగులుతుంది. చాలా వరకు కవి ఒక process నుంచి obsence వైపుకో లేక ఏమీ మిగలనితనం వైపుకో జారిపోతూ వుంటాడు.
.
తాటి చెట్ల మధ్య ప్రత్యూష నక్షత్రాలకు/ నేను వేలాడుతున్నప్పుడో వూయలూగుతున్నప్పుడో గాని ఎద్దుల మెడగంటల సవ్వడి వింటూ వెంటే వెళ్ళిపోయారు మీరంతా – అంటూ నక్షత్రపురం దోవ లోంచి అడుగుల్ని వెనక్కి మళ్ళించుకోలేక దీనుడవుతుంటాడు. ప్రతి కవితలో కొన్ని ఆర్ద్ర భాగాలుంటాయి. ఒక చోట ఆ భాగంలోని తడిదనం పువ్వులా తగులుతుంటుంది. మరొక చోట నిప్పు పువ్వులా తగులుతుంటుంది. ఇంకో చోట ఎగిరే పువ్వులా కనబడుతుంది. కవి చేసే ఈ చర్య మొత్తమూ వొక magical explosion లా దృశ్యాత్మకమవుతుంటుంది (తప్త స్వప్నమ్).
.
శ్రీధర్ కి తన సౌందర్యమంతా తన భాష. తనదనుకున్న కవిత్వపు కాస్మిక్ ధూళినంతా ఈ భాషతో తడిపి ముద్దను చేస్తుంటాడు. ఇక్కడి ఈ కవిత్వమంతా ఒక చీకటి నుంచి, రక్తమోడే వెలుగు నుంచి, గొంతు చించుకునే లోతు నుంచీ nothingness నుంచీ మొదలవుతుంది.చాలా కవితలు వొక దేహం వైపుకీ దాని నీడ వైపుకీ దూసుకుపోతాయి. ఒక వాస్తవం వైపుకు జరుగుతూ తమకు తాము ఒక నిందాపూర్వక బహిష్కారాన్ని విధించుకుంటాయి. అప్పుడప్పుడు ఈ శిక్షాస్మృతిని తనలోని సౌందర్యార్తిని పదిలపరచుకోవడానికి విధించుకుంటూ వుంటాడు. తనని మధ్యాహ్న సముద్ర పాఠకునిగా మార్చుకుని గాలిపారవశ్యపు నులివెచ్చని సంగీతాన్ని ఈ ఛిద్రాలకి అడ్డంగా పెట్టుకుని స్మృతిస్తూ వుంటాడు. అక్కడ్నుంచి తిరిగి ప్రపంచాన్ని మరోసారి చూడడం మొదలుపెడతాడు. కేవల హైకూ ధ్యానిలా విప్పారుతుంటాడు.
.
సరుగుడు చెట్ల మధ్య నుంచి
సముద్రం
మనల్ని ఎగిరెగిరి చూస్తోంది (డజన్ హైకూలు)
.
చాలా కవితల్లో మన (తన) ఆత్మల కుళ్ళిన వాసనా, పూలు విరబోస్తూ కార్చే మంచు బిందువుల వాసనా, పండ్లు, చెట్ల, వానల వాసనలూ తారట్లాడుతున్నాయి.
.
ఇప్పటికే శ్రీధర్ తన పాత కవిత్వాన్ని చాలా వరకు disown చేసుకున్నాడు. నడిచొచ్చిన దూరాన్నంతా తిరిగి కొలుస్తున్నాడు తన rector scaleతో…
.
ఈ కవిత్వంలో వొక refined వచనంలోని మఖమల్ స్పర్శ దొంగాటలాడుతుంది.
గాలొక్కత్తే… గాలొక్కత్తే… తన వెంట లోలకాల్ని లాక్కుపోతూ
లోకలోకాల కలల్ని పారదర్శకంగా లీనం చేసుకుంటూ
చిదిమి దీపం శిరస్సు మీది చీకటిని తాగి తాగి
గాలొక్కత్తే… గాలొక్కత్తే
.
ఒక్కొక్కప్పుడు కొన్ని ప్రాకారాల మధ్య వొక ప్రశ్నలా నిలబడి తనని తాను ప్రశ్నించుకోవాలనే బయలుదేరి పక్కకు తిరుగుతుంటాడు. తన లోపలి సౌందర్యాలకో సౌందర్యరాహిత్యాలకో ఆశ్చర్యపోయి మసకల్లోకి దూరి చిట్లుతుంటాడు వెన్నెల మంచులా…
.
ఇక్కడంతా వొక చిల్లులు పడి హింసపడే ఆధ్యాత్మికత వుంది. కత్తిపోట్ల self నిర్మూలనం వుంది. The smallest unity of time consists in the strongest reality of his images. క్షణమాత్రంలో తళుక్కుమని మెరిసే అనుభవం, బల్ల పరుపుగా, తీగగా సాగే ఆలాపన. తన వొంటరితనమే తన నుంచి మెల్లగా విడుదలయ్యి మన లోపలి అభయారణ్యాల్లోకి కార్చిచ్చులా పరచుకుంటూ వుంటుంది. కవిత్వమిప్పుడు మాయా దర్పణం.
.

– సిద్ధార్థ

25.09.1999

జింగిల్స్

.
jingles
.
జ్ఞాపకాలు గాలిలోనే ఉంటాయి
ఉన్నఫళంగా దేహాన్ని చుట్టుకుని లాక్కుపోతాయి
కన్నీళ్ళు గాలిలోనే ఉంటాయి
అదాటున గుండెలోకి చొరబడి దారులు వెతుక్కుంటాయి
మాటలూ మౌనమూ శబ్దమూ నిశ్శబ్దమూ అన్నీ గాలిలోనే
మనం ఉత్త తంబుర బుర్రలా తిరుగుతుంటాం గాలివాటుకు-
.
*
బోర్లించిన పుస్తకం కిందే రెండు కళ్ళూ
కలలకు కళ్ళూ, కారణాలూ అక్కర్లేదు
కలలో మెలకువ కోసం ఆరాటం
మెలకువలో మళ్ళీ కలల కోసం….
కోటానుకోట్ల అక్షరాలన్నీ ఏమవుతున్నాయి?
కళ్ళ మీద పడి ఏడుస్తున్నాయి
.
*
మొగలి పొదల మధ్య పాములా పడుకుంటుంది ఆశ
వెదురు పొదల మధ్య ముల్లులా నీల్గుతుంది ఆశ
దానికి వాసన తెలియదు
పాటా వినపడదు
.
*
ఎవరో వచ్చి వెళ్ళారని
పాటలు పాడుతుంటాం
వచ్చిందెపుడో వెళ్ళిందెపుడో తెలియకుండానే…
ఎప్పుడూ రావాలని పాటలు పాడుతాం
రాకూడదని కూడా
మనకు పాట ముఖ్యం-
.
*
చూసిన బొమ్మలన్నీ అద్దంలో అలాగే ఉంటే
ఇంక కొత్త అందాలెక్కడ కనిపిస్తాయి?
జ్ఞానంతో మోసపోకుండా ఉండడం నేర్చుకునేందుకు
తరచూ పిల్లలతో ఆడుకోవాలి
అద్దాన్ని తుడుచుకోవాలి
.
*
కొలను అల్లరి చేయకుండా
ప్రతి రాత్రీ చంద్రుడినీ తారల్నీ
తనలో దాచుకుంటుంది
తడి ఆరిపోయాక తారలూ ఉండవు
వెలుతురూ ఉండదు
అంతా ఒట్టి కరడుగట్టిన మట్టి-
.
*
ఆనందాన్ని పంచే మనుషులు వేరే ఉంటారు
వారు మనుషులకు ముఖాలు తొడిగే ప్రయత్నం చేయరు
నీటిలోకి చేతులు జొనిపినట్లుగా లోపల్లోపలికి వస్తారు
ముఖ్యంగా.. వారు నవ్వుల్ని దుబారా చెయ్యరు
దుఃఖాన్ని ఏకాంతంలో బంధిస్తారు
అలాంటి వారు ఒకరో ఇద్దరో ఎదురుపడితే చాలు జీవిత కాలంలో-
.
***