చంచలీ!

.
చీకటిని తడిపి
వెలుగును ఉడికించి
గాలి చేతులకు కొండంత బలాన్నిచ్చి
గట్టిగా, గమ్మత్తుగా హత్తుకుంటుంది చలి-
.
చెరకు విల్లు నుంచి
జివ్వున దూసుకొచ్చిన మంచుపూల పరాగం
దేహార్ణవంపై దాడి చేసి గిలిగింతలు పెట్టి.. గిల్లి కజ్జాలు పెట్టుకుని
శ్వాసను ధూమంగా మార్చేస్తే..
అలలన్నీ అల్లరల్లరి పిల్లకాలువలై
నరాల్ని అల్లుకుపోతాయ్-
వానపాములై సాగుతూ గింజుకుంటూ జలదరిస్తాయి-
.
చలి…
శరీరం పుట్టలో చుట్టచుట్టుకున్న జల సర్పం
వెన్నుపాము సొరంగంలో జలజలా ఈదుతూ పోయే చేపల దండు
రెప్పల మీద పడి దొర్లే మేఘం
కంట్లోకి గాలం వేసి కలల్ని లాగే రాని నిద్ర-
.
ఘనీభవించిన చీకటి.. దారిపొడుగునా ఒరుసుకుపోవడం
పగటి వెలుగును పగిలిన అద్దంగా మార్చేయడం
సాయంత్రాన్ని ఆన్ రాక్స్ చిల్లింగ్ సెషన్ గా మత్తెక్కించడం…
దుప్పట్లోకి దూరిన రాత్రిని దేహంగా ధరించి
ఒళ్ళునల్లుకుపోవడం…
.
చలీ.. నువ్వు నిజంగా దేవగాంధారివే..
మబ్బు దొంతర్ల మీంచి మసక తెరలా నువ్వొస్తుంటే
నీ కాటుక చీకటిలో చిక్కబడ్డాను..,.
నీ వెన్నెల పైటలో కన్నులు దాచుకున్నాను-
వాగుల గల గలల మీద జూకాల మిణుగురులతో
నువు ఒయారాలు పోతుంటే… బరువుగా వాలిన ఆకులల్లే తుళ్ళిపడ్డాను…
నువ్వు సముద్ర తల్పం మీంచి మహా మాయా విహంగమై తీరం దాటినప్పుడు
అల-జడికి తడిసి చెదిరిన సైకత శిల్పమయ్యాను…
.
మా వూళ్ళో గొంగళ్ళు కప్పుకుని మంట చుట్టూ కూర్చున్నప్పుడు
తూనీగల రెక్కలు కాలిన వాసనలా నీ ఉడుకుమోత్తనం
పొద్దున కట్టెల పొయ్యి మీద నీళ్ళ కుండ పెట్టినప్పుడు…
నీ కళ్ళల్లో క్షణికావేశం…
గట్టువెంబడి నడిచే అడుగు జారినప్పుడు
బురదపాములా చుట్టుకునే నీ మొండితనం…
భరిస్తూనే ఉన్నానిన్నాళ్ళూ…
.
చెలీ చలీ.. ఉన్ని దారాల వలలో ముడుచుక్కూచున్నా..
ఒళ్ళంతా నీ అల్లరేమిటే?
స్పర్శల్ని రగిలించే నీ రహస్య భాషేమిటే?
దేహ చాపల్యంలో నీ తడిసిన మెరుపుల విరుపులేమిటే?
.
చంచలీ.. నిన్ను పిడికిళ్ళలో దాచుకుంటాను
చుబుకం కింద హత్తుకుంటాను..
పెదాల మీద వెలిగిస్తాను
గుండెలో జోకొడతాను-

***

Advertisements

క్షణాలన్నీ ఎదలోయల్లో పూసే వెలుతురు పూలు కావాలని …

సాహితీ మిత్రులందరికీ..

క్షణాలన్నీ ఎదలోయల్లో పూసే వెలుతురు పూలు కావాలని

నిమిషాలన్నీ చైత్ర జైత్రయాత్రలో మైలు రాళ్ళు కావాలని

కాలంతో సహజీవనం నీటి మీద అలల్లాగా

ఎగసిపడుతూ, తుళ్ళిపడుతూ సాగిపోవాలని

మనసారా కాంక్షిస్తూ…

…కొత్త సంవత్సర శుభాకాంక్షలు…

…………………………………………….– పసునూరు శ్రీధర్ బాబు