ఏమయ్యాను?

.
వాద్యమూ వాద్యకారుడూ ఒక్కటైపోయారు
జలజల పారే సెలయేరు
ఓ క్షణం ఆగి అలలెత్తి చూసి.. మళ్ళీ నడక సాగించింది
రాలే రంగు రంగుల ఆకులు
గాలిలో కాసేపు నిశ్చలమై సున్నితంగా నేల వాలాయి-
.
వాద్యమూ వాద్యకారుడూ సంగీతమూ ఒక్కటై పోయారు
ధ్వని తరంగాల నడుమ చిక్కుకున్న హృదయం…
పియానో మెట్ల మీద ఉలికులికి పడుతున్న హృదయం…
.
వాద్యమూ వాద్యకారుడూ సంగీతమూ..
శ్రోతా… ఒక్కటైపోయారు-
నిశ్శబ్దం చీకట్లో ఒదిగిపోయింది
చెర్రీ పూలలా మౌనం మత్తుగా రాత్రిని సేవిస్తోంది..
.
గడియారాల ధూళి పచ్చిక బయళ్ళలో సద్దుమణిగింది
ధ్వని తరంగాలు పుప్పొడి రేణువుల్లా పరిభ్రమిస్తున్నాయి
వాద్యమూ వాద్యకారుడూ సంగీతమూ శ్రోతా
ఏమయ్యారు?
(వాషింగ్టన్ డి.సిలోని కెనెడీ సెంటర్ లో He Qizhen, Zhang Haochen అనే చైనా చిన్నారుల Piano Duet ను 2005 అక్టోబర్ లో విని తరించినప్పుడు రాసిన కవిత…)
Advertisements

200 రోజులు 10,000 హిట్లు

బ్లాగులోకానికి నమస్సులు…

ఆగస్టు 26, 2009న ప్రారంభమైన అనేకవచనం బ్లాగును అత్మీయంగా అహ్వానించిన సాహితీ ప్రియులందరికీ 10 వేల 1వ హిట్ సందర్భంగా ధన్యవాదాలు..

ఇదీ డాష్ బోర్డు సమ్మరీ టేబుల్..

బ్లాగు గణాంకాలు Summary Tables

మొత్తం వీక్షణలు:10,001

అత్యంత రద్దీ దినం:803 — Thursday, September 3, 2009

మొత్తాలు

టపాలు:104

వ్యాఖ్యలు:234

వర్గాలు:4

***

కాలగతిలో కొత్త కృతి… వికృతి

సాహితీ ప్రియులకు, బ్లాగు మిత్రులందరికీ..

హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు..

కొత్తదనం మహదానందం

కొత్త పథం సదాశయం

నవ్యభవ్య పరివ్యాప్తం..

నూత్న వత్సరానికి స్వాగతం.

……………………..– పసునూరు శ్రీధర్ బాబు

విమోహం

.
అస్పష్ట రాగచ్ఛాయల వినీల తరంగాల వలయ లయల ధ్వన్యాకృతుల్ని లోలోపలి పరదాలపై పేర్చుకుని తడుముకుని తడిదేరిన మొనదేలిన పదాల తిల్లానాలో ముదిమి మీద ముసురుకున్న మృత్యుకాంక్షా పరిష్వంగంలో చేతనావర్తపు పెదిమల్ని గాట్లదీరా చుంబించి చిగురించి రెప్పలల్లార్చి అంతర్దిగంతాలలో సర్పంలా విస్తరించిన నిచ్చెనపై జారగిలబడి ఒక్కో మెట్టే ఎక్కుతూ ఎక్కడికో తెలియని విమోహ విహంగంలా రహస్యాలభంజికల కథలన్నీ కనుగొంటూ కలగంటూ వలపంటూ విలపిస్తూ… కవిత్వమా నువు పరచిన పచ్చని పైరులపై తుషారమై నువు చీల్చిన వెచ్చని బీళ్ళపై విషాదమై పరిచితమై అపరిచితమై పారదర్శకమై చుట్టూరా తెరుచుకున్న అనేకానేక ద్వారాల గుండా ప్రవాహమై చివరికి మిగిలిన ఒకే ఒక్క నీటి బొట్టునై వూపిరి గాడ్పుల బుసలో కదిలీ కదలని ప్రతిబింబాన్నై ఆవిరినై…. నిరాచ్ఛాదననై….

***

చంచలీ..!

.
చీకటిని తడిపి
వెలుగును ఉడికించి
గాలి చేతులకు కొండంత బలాన్నిచ్చి
గట్టిగా, గమ్మత్తుగా హత్తుకుంటుంది చలి-
.
చెరకు విల్లు నుంచి
జివ్వున దూసుకొచ్చిన మంచుపూల పరాగం
దేహార్ణవంపై దాడి చేసి గిలిగింతలు పెట్టి.. గిల్లి కజ్జాలు పెట్టుకుని
శ్వాసను ధూమంగా మార్చేస్తే..
అలలన్నీ అల్లరల్లరి పిల్లకాలువలై
నరాల్ని అల్లుకుపోతాయ్-
వానపాములై సాగుతూ గింజుకుంటూ జలదరిస్తాయి-
.
చలి…
శరీరం పుట్టలో చుట్టచుట్టుకున్న జల సర్పం
వెన్నుపాము సొరంగంలో జలజలా ఈదుతూ పోయే చేపల దండు
రెప్పల మీద పడి దొర్లే మేఘం
కంట్లోకి గాలం వేసి కలల్ని లాగే రాని నిద్ర-
.
ఘనీభవించిన చీకటి.. దారిపొడుగునా ఒరుసుకుపోవడం
పగటి వెలుగును పగిలిన అద్దంగా మార్చేయడం
సాయంత్రాన్ని ఆన్ రాక్స్ చిల్లింగ్ సెషన్ గా మత్తెక్కించడం…
దుప్పట్లోకి దూరిన రాత్రిని దేహంగా ధరించి
ఒళ్ళునల్లుకుపోవడం…
.
చలీ.. నువ్వు నిజంగా దేవగాంధారివే..
మబ్బు దొంతర్ల మీంచి మసక తెరలా నువ్వొస్తుంటే
నీ కాటుక చీకటిలో చిక్కబడ్డాను..,.
నీ వెన్నెల పైటలో కన్నులు దాచుకున్నాను-
వాగుల గల గలల మీద జూకాల మిణుగురులతో
నువు ఒయారాలు పోతుంటే… బరువుగా వాలిన ఆకులల్లే తుళ్ళిపడ్డాను…
నువ్వు సముద్ర తల్పం మీంచి మహా మాయా విహంగమై తీరం దాటినప్పుడు
అల-జడికి తడిసి చెదిరిన సైకత శిల్పమయ్యాను…
.
మా వూళ్ళో గొంగళ్ళు కప్పుకుని మంట చుట్టూ కూర్చున్నప్పుడు
తూనీగల రెక్కలు కాలిన వాసనలా నీ ఉడుకుమోత్తనం
పొద్దున కట్టెల పొయ్యి మీద నీళ్ళ కుండ పెట్టినప్పుడు…
నీ కళ్ళల్లో క్షణికావేశం…
గట్టువెంబడి నడిచే అడుగు జారినప్పుడు
బురదపాములా చుట్టుకునే నీ మొండితనం…
భరిస్తూనే ఉన్నానిన్నాళ్ళూ…
.
చెలీ చలీ.. ఉన్ని దారాల వలలో ముడుచుక్కూచున్నా..
ఒళ్ళంతా నీ అల్లరేమిటే?
స్పర్శల్ని రగిలించే నీ రహస్య భాషేమిటే?
దేహ చాపల్యంలో నీ తడిసిన మెరుపుల విరుపులేమిటే?
.
చంచలీ.. నిన్ను పిడికిళ్ళలో దాచుకుంటాను
చుబుకం కింద హత్తుకుంటాను..
పెదాల మీద వెలిగిస్తాను
గుండెలో జోకొడతాను-

***