“నిర్వేదం ఉన్నా నిరాశ లేదు” – పాపినేని శివశంకర్

అనేకవచనం కవితా సంకలనంపై
ప్రముఖ కవి, విమర్శకులు పాపినేని శివశంకర్ ఆత్మీయ లేఖ:
.
“అనేకవచనంలోని కవిత్వం చదువుతుంటే ప్రతి చోటా అనిపిస్తుంది కవిలో చాలా మృదుత్వం ఉందని, జీవితం ఎన్నో విధాల వికలమూ,  విచ్ఛిన్నమూ అవుతున్న దశలో మనో మార్దవాన్ని కోల్పోకుండా ఉండటం ముఖ్యం, కవిగానైనా మనిషిగానైనా.
…..ఒక్కో కవితలోంచి వెళ్తున్నప్పుడు ఎందుకో ‘శ్రీ 420’ సినిమా పాటలో పాదాలు… ‘కహతాహై దిల్.. రస్తా ముష్కిల్… మాలూమ్ నహీ హై కహా మంజిల్’ అనుకోకుండా గుర్తొస్తున్నాయి. మీరే అన్నారు కదా ‘నా ప్రయాణం దిశ కోల్పోయింది’ అని. అందులో ఎంతో అశాంతి ఉంది. దుఃఖం లేదు. అంటే ప్రయాణంలో ఎక్కడా స్థయిర్యం కోల్పోలేదనే నా నమ్మకం. ఒక నిర్వేదం ఉన్నా నిరాశ లేదు.
…..‘మళ్ళీ మళ్ళీ’ లాంటి కవితలు ఎంత సుకుమారంగా ఉన్నాయి! వాటిని వ్యాఖ్యానించరాదు, ఆస్వాదించాల్సిందే. ‘దారి తప్పిన పాట కన్నా గొప్ప కవిత్వం లేదు’- ఇట్లాంటి వాక్యాలు మనస్సుని వదిలిపెట్టవు.
…..గమనించారో లేదో, మీ కవిత్వంలో ఎన్నోచోట్ల ‘రాత్రి’ కన్పిస్తుంది. అది యాధృచ్ఛికం కాదు. తన్ను తాను గుర్తించటానికీ, ప్రపంచాన్ని గుర్తించటానికీ, మార్గాన్వేషణకీ అవసరమైన సందర్భమేమో రాత్రంటే. నాకిప్పటికీ పగలు కన్న రాత్రే యిష్టం.
…..ప్రతి కవీ తన భాష తను వెతుక్కోవాల్సిందే. కానీ, ఎంత మంది కవులు వెతుక్కోగలిగారు? మీ వేదన కనువైన భాషనీ, భాషణనీ మీరు వెతుక్కోగలుగుతున్నారని, మీ భావాలకు తగిన బొమ్మల్ని సరిగ్గానే గీయగలుగుతున్నారనీ ‘మళ్ళీ’ లాంటి కవితలు, ‘తుమ్మచెట్టు గాటు లోంచి కారే జిగురు’ లాంటి చిత్రాలు చెప్తున్నాయి. ఎంతో ఫ్రెష్ గా ఉన్నాయి మీ వూహలు, వూహల బొమ్మలు.
…..కొత్త తరం కవుల్లో మామూలుగా కన్పించని భాషాధికారం మీకుంది. కొత్త తరం కవిత్వంలో మామూలుగా కన్పించే ‘అ-లయ’ కూడా మీ కవిత్వంలో ఉంది. మళ్ళీ మళ్ళీ మననం చేసుకునే విధంగా వచన కవిత్వంలో ఒక అంతర్లయ ఉండాలని నేననుకుంటాను. లేకపోతే పైపైన అట్లా చదివి, ఇట్లా వదిలేసే అవకాశం ఉంటుంది. ఈ అంతర్లయ ఏర్పడటాని కవసరమైన సమాధ్యవస్థ గురించి బాగా ఆలోచించగలరు. ఎందుకంటే మీరు కవిత్వాన్ని సరదాగా కాక సీరియస్ గానే తీసుకుంటున్నారు.
…..‘ఈ జీవితాన్ని మళ్ళీ జీవించాల్సిన పని లేద’న్నారు. మీ కవిత్వాన్ని మాత్రం మళ్ళీ మళ్ళీ చదవాల్సిన పని పెట్టండి. ఎల్లప్పుడూ మీకు నా శుభాకాంక్షలు.
…..ప్రేమతో…
…..మీ
…..పాపినేని శివశంకర్
Advertisements

మీ కవిత్వం చదివి నా కళ్ళు ధన్యమయ్యాయి… -“మో”

అనేకవచనం కవితా సంకలనం చదివాక.. బతికిన క్షణాల రహస్తంత్రీ నాదాన్ని సాంధ్య భాషలో పలికించిన  ప్రఖ్యాత కవి వేగుంట మోహన్ ప్రసాద్.. రాసిన లేఖ. తొమ్మిదేళ్ళుగా కాగితాల దొంతర్ల మధ్య ఉక్కిరి బిక్కిరైన ఈ అక్షరాలను ఇలా బ్లాగు మిత్రుల కోసం భద్రం చేస్తున్నా…