వ్యాసాలు, Uncategorized

గగనానికి పయనమైన పాటసారి వేటూరి

“పాట నాకు ప్రాణం.. పాట లేనిదే నేను లేను” అని ప్రతి క్షణం పదాల తిల్లానాలో పల్లవించిన వేటూరి ఇక లేరు. పాటే ప్రాణం అని చెప్పిన వేటూరి తన ప్రాణాన్ని వేనవేల పాటలుగా మనకు ధారపోసి.. భౌతికంగా మిన్నేటి సూరీడి కౌగిట్లోకి వెళ్ళిపోయారు. చినుకులా రాలి వరదలైపోయి.. నదులుగా సాగి కడలిలా పొంగి.. కనుమరుగైపోయారు. వేటూరీ నీ పాటలో మేం పల్లవిస్తాం. నీ పదాలకు ప్రాణమై మనసుతో.. తనువుతో నర్తిస్తుంటాం నిరంతరం.
***
పాటకు నిలువెత్తు ప్రతిరూపం.. పాండిత్యానికి హిమ శిఖరం.. గంభీరమైన ముఖ వర్ఛస్సు, సాధువులాంటి సంభాషణ శైలి, కలువల కోనేరు లాంటి తడి తడి నయనాలు, వెరసి పాటలు వర్షించే మేఘం వేటూరి సుందర రామమూర్తి. స్వరాలకు, పదాలకు ఇక సెలవంటూ.. పరమపదసోపానం మీదుగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. మే 22, శనివారం నాటి రాత్రిని మరపురాని రేయిగా మార్చి, మౌనంగా వినువీధుల్లోకి వెళ్ళిపోయారు.
తెలుగు సినిమా పాటను సకల రసాలతో శోభాయమానం చేసి తెలుగు నేల నలుచెరగులా యమక, గమకాల సుమధుర పద ప్రవాహాన్ని పరుగులెత్తించిన సుందరరాముడు.. జంత్రగాత్రముల లయలలో తారాడి, నాట్య విలాసాలలో నాద వినోదాలు గుప్పించి, పాటల ప్రియుల పెదాలపై తీయగా, పుల్లగా, వెచ్చగా, గిలిగింతగా అల్లరల్లరి చేసిన అక్షర తపస్వి వేటూరి.. జీవితం గురించి చెప్పడమంటే… తెలుగు సినిమా పాట ప్రయాణాన్ని, ప్రయాణంలోని పదనిసలను ప్రేమగా అక్కున చేర్చుకోవడమే.
భారతనారీ చరితము.. మధుర కథా భరితము.. పావన గుణ విస్ఫురితము అంటూ అక్షర తూణీరంలోంచి హరికథను ఓ సీతకథ చిత్రం ద్వారా తొలి గీతంగా సినీ పరిశ్రమ మీదకు సంధించిన వేటూరి.. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అక్షర జైత్రయాత్ర కొనసాగించారు.
కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ 1974లో విడుదలైంది. ఆ తరువాత రెండేళ్ళకు బాపు రమణల కలయికతో రూపుదిద్దుకున్న భక్త కన్నప్ప చిత్రం వేటూరిని తిరుగులేని సినీ రచయితగా మార్చేసింది. జగములేలిన వాని సగము నివ్వెరబోయె,. సగము మిగిలిన వాని మొగము నగవైపోయె… ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా.. అని వేటూరి రాయగా.. సినీ జగతి నివ్వెరబోయింది. ఆ తరువాత కె. విశ్వనాథ్ సృష్టించిన కరుణ రసాత్మక దృశ్య కావ్యం సిరిసిరి మువ్వ చిత్రం వేటూరి పాట లేకుండా సినిమా ఏమిటనే ప్రశ్నను పరిశ్రమలో ప్రతిష్ఠించింది.
మల్లాది రామకృష్ణశాస్తి, సముద్రాల సీనియర్, పింగళి, కొసరాజు, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, దాశరథి, సినారె వంటి మహా మహా పాటల రచయితలు సినిమా పాటల ప్రపంచాన్ని ఏలుతున్న సందర్భంలో ఒక నవ యువ కవి.. నేను సైతం అంటూ సగర్వంగా గళం విప్పడం సామాన్యమైన విషయం కాదు. అది వేటూరికే సాధ్యమైంది.
న్యాయ శాస్త్రం చదివి లాయర్ కావాల్సిన వేటూరి.. 1956లో మద్రాసు ఆంధ్రప్రభలో జర్నలిస్టుగా మారారు. ఆయన రిపోర్టింగ్ చేస్తే రికార్డర్లు అక్కర్లేదు. నాగార్జున సాగర్ ప్రారంభోత్సవంలో నాటి ప్రధాని నెహ్రూ చేసిన ప్రసంగమంతా పొల్లు పోకుండా అప్పజెప్పగలిగిన ఏకసంథాగ్రాహి ఆయన. పత్రికా రంగంలో పదిహేనేళ్ళ పాటు వేటూరి చేసిన కృషి తెలుగు జర్నలిజం చరిత్రలో ఓ చిరస్మరణీయ అధ్యాయం. నా జీవితంలో సినిమా పాట రచనకు ఎంత ప్రాధాన్యం ఉందో.. పాత్రికేయ వృత్తికీ అంతే ప్రాధాన్యం ఉందని అనేవారు వేటూరి.
మీ ప్రతిభ సినిమా పాటలకు చాలా అవసరం బ్రదర్ అని అన్న ఎన్టీరామారావు ఇచ్చిన పిలుపుతో పాటల రచయిత కావాలని సినీ రంగానికి వచ్చారు వేటూరి. 1969లో ఆయన రాసిన సిరికాకుళం చిన్నది అనే శ్రవ్యనాటకంలో కృష్ణదేవరాయల పాత్రను పెంచి సినిమా తీయాలని ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ, ఓ సీతకథ చిత్రం ఈ కవి పండితునికి సినీ రంగ మహాద్వారాన్ని తెరచి ఘన స్వాగతం పలికింది.
శంకరాభరణం, సాగర సంగమం, ఆనందభైరవి, నాలుగు స్తంభాలాట, అమావాస్య చంద్రుడు.. అడవిరాముడు.. ప్రతిఘటన, సీతాకోకచిలుక.. ఇలా ఇలా అలలై ఎగసే గోదావరి, ఆనంద్.. వంటి చిత్రాల దాకా ఆయన పద విన్యాసం అప్రతిహతంగా సాగింది. త్వరలో విడుదల కానున్న మణిరత్నం విలన్ (హిందీ, తమిళ భాషల్లో ‘రావణ్’)  ఆయన పాటకు తుది చిరునామాగా చరిత్రలో నిలిచింది.
ఆధ్యాత్మిక తపనను పలికించిన పోతన, ఆత్మవేదనను సాహిత్యం చేసిన త్యాగయ్య, పడమటి వాగ్గేయకారుడు కీట్స్, తలకట్టును దిద్ది తెలుగుభాషను నిలబెట్టిన అన్నమయ్య నను నడిపించారని చెప్పుకునే వేటూరి.. తెలుగు సినిమా పాటకు కొత్త వ్యాకరణాన్ని ఇచ్చారు. కొత్త కట్టూ బొట్టును ఇచ్చారు. కొత్త సొగసును కట్టబెట్టారు.
కృష్ణా తరంగాల సారంగ రాగాలు
కృష్ణలీలా తరంగిణీ భక్తి గీతాలు
సస్య కేదారాల సరస గాంధర్వాలు
సరస హృదయక్షేత్ర విమల గాంధర్వాలు… ఆయన పాటలు.
ఏటిలోని అలల వంటి.. కంటిలోని కలలు కదిపి.. గుండియలను అందియలుగ చేసిన ఈ పాటసారి బాటలో ఎన్ని పూదోటలో.. ఆ తోటల్లో ఎన్ని తమకాలో.. ఎన్ని యమకాలో..?
చుక్కా నవ్వవే.. నావకు చుక్కానవ్వవే..
.
*
కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాల మాబాలగోపాలుని
అచ్చెరువున.. అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ….
…మధురా నగరిలో యమునా లహరిలో
ఆరాధ ఆరాధనాగీతి పలికించి..
.
*
ఇలా సుందరమయమైన వేటూరి పాటల గురించి ఎంత చెప్పినా అదంతా సెలయేటి నీటిని దోసిటపట్టి చూసుకోవడమే!
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే.. అంటూ తాత్వికంగా పల్లవించి.. తెలుగు సినిమా పాటకు రెండోసారి జాతీయ అవార్డును సాధింఛారు వేటూరి.  తెలుగు వనంలో నాలుగు దశాబ్దాల వసంతమై భాసించిన ఈ విద్వత్కవి ఆయన పాటలోనే చెప్పాలంటే.. వేణువై వచ్చాడు భువనానికి.. వాయువై పోయాడు గగనానికి.
ఈ వాయువులో వేటూరి పాట ప్రాణ వాయువై పల్లవిస్తుంటే.. ఆ పండిత కవి ఇక లేరనే మాటకు అర్థమేముంది? పొద్దున్నే లేచి రేడియో పెట్టినా, పాటల చానళ్ళ టీవీ మీట నొక్కినా, గుడికి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా.. ఎక్కడికీ వెళ్ళకుండా ఏకాంతంలో ఉన్నా వేటూరి పాట తెలుగువాడికి జీవితంలో ఎప్పుడూ తారసపడుతూనే ఉంటుంది.  పది వేల పాటలతో వేటూరి పది కాలాల పాటు మన మధ్య పచ్చగా ఉంటారు.
.
*** ***