కొత్త కవితలు, Uncategorized

నిదురపోని మెలకువ చెప్పిన కల

.
అపరిచితుడెవరో చేయి పట్టుకుని
ఆ పెరట్లోకి తీసుకెళ్ళాడు-
సాయంత్రమూ చీకటీ ఉదయమూ పగలూ కాని
ఓ చిత్రమైన వేళలో పెరటి గది తలుపు తీయగానే
కంటి చూపుకందినంత మేర ఓ అద్భుత దృశ్యం…
చుట్టూరా కొండలు… కొండల మధ్య కొండల్లోపల కొండలు…
కొన్ని పచ్చనివి… కొన్ని నల్లనివి
కొన్ని నా నిద్రరాని రాత్రుల రంగుల్లో మసక మసగ్గా-
ఆ కొండలన్నీ దూరంగా వలయంగా నిల్చుని నన్ను చూస్తుంటే
నేను ఆ ముందరున్న నదిలో, ఇసుక మాసికలు వేసుకున్న నదిలో
మూడు నౌకలను చూశాను-
పాతబడి అడ్డంగా వాలిపోయి
యాంటిక్ సౌరభంలా వ్యాపిస్తున్నవి రెండైతే…
వాటి మధ్య నుంచి కాస్త దూరాన నల్లగా ఎత్తుగా
ప్రాణాలతో నిగ నిగ లాడుతోంది మూడో నౌక-
.
*
అయ్యో!
ఒక కెమేరా ఉంటే బాగుండునే
నన్ను నేను ఆ కొండల్లోకి నీళ్ళలోకి నౌకల్లోకి విసిరేసుకుని
కాగితం మీద భద్రపరచుకునేవాణ్ణి-
.
*
ఒక కవి పుంగవుడు
ఆ దృశ్యంలో ఒక్కసారిగా మృత్యుశయ్య మీద ప్రత్యక్షమై
చివరి అక్షరాలేవో ముద్దముద్దగా వినిపిస్తున్నాడు-
“పని లేదనీ… పనికి రాదనీ…” ఇంకా అస్పష్ట వాక్యాలేవో
వూపిరి బిగబట్టి చెబుతున్నాడు….
“అంతా కాయితాలతోనే అయిపోయింది” అని కళ్ళ నీళ్ళెట్టుకున్నాడు-
కన్నీళ్ళు, కొన్ని నెత్తుటి చారలతో, చెమటతో తడిసిన అతడి ముఖాన్ని
ఎవరివో రెండు అరిచేతులు పొదివి పట్టుకున్నాయి-
గాఢ నిద్రలో అతుక్కుపోయిన నా కనురెప్పలను చీల్చుకుని కన్నీళ్ళు
నా బుగ్గల మీంచి జారిపోయాయి-
.
*
కొండలూ నీళ్ళూ నౌకలూ ఇంకా ఏవేవో ఉన్న ఈ పెరట్లోకి
నాతోపాటు మరికొందరు వచ్చినట్లు గుర్తు-
ఏమయ్యారు వాళ్ళంతా?
వాళ్ళే కాదు… చూస్తుండగానే పెరడులోని చిత్రమంతా రంగుల పొగలా మాయమై
తెల్ల కాగితంలా భయపెట్టింది-
నెత్తుటి మరకల కవీ…
నువ్వూ వెళ్ళిపోయావా నన్ను నిద్రలేపి-
.
***