జింగిల్స్

.
జ్ఞాపకాలు గాలిలోనే ఉంటాయి
ఉన్నఫళంగా దేహాన్ని చుట్టుకుని లాక్కుపోతాయి
కన్నీళ్ళు గాలిలోనే ఉంటాయి
అదాటున గుండెలోకి చొరబడి దారులు వెతుక్కుంటాయి
మాటలూ మౌనమూ శబ్దమూ నిశ్శబ్దమూ అన్నీ గాలిలోనే
మనం ఉత్త తంబుర బుర్రలా తిరుగుతుంటాం గాలివాటుకు-
.
*
బోర్లించిన పుస్తకం కిందే రెండు కళ్ళూ
కలలకు కళ్ళూ, కారణాలూ అక్కర్లేదు
కలలో మెలకువ కోసం ఆరాటం
మెలకువలో మళ్ళీ కలల కోసం….
కోటానుకోట్ల అక్షరాలన్నీ ఏమవుతున్నాయి?
కళ్ళ మీద పడి ఏడుస్తున్నాయి
.
*
మొగలి పొదల మధ్య పాములా పడుకుంటుంది ఆశ
వెదురు పొదల మధ్య ముల్లులా నీల్గుతుంది ఆశ
దానికి వాసన తెలియదు
పాటా వినపడదు
.
*
ఎవరో వచ్చి వెళ్ళారని
పాటలు పాడుతుంటాం
వచ్చిందెపుడో వెళ్ళిందెపుడో తెలియకుండానే…
ఎప్పుడూ రావాలని పాటలు పాడుతాం
రాకూడదని కూడా
మనకు పాట ముఖ్యం-
.
*
చూసిన బొమ్మలన్నీ అద్దంలో అలాగే ఉంటే
ఇంక కొత్త అందాలెక్కడ కనిపిస్తాయి?
జ్ఞానంతో మోసపోకుండా ఉండడం నేర్చుకునేందుకు
తరచూ పిల్లలతో ఆడుకోవాలి
అద్దాన్ని తుడుచుకోవాలి
.
*
కొలను అల్లరి చేయకుండా
ప్రతి రాత్రీ చంద్రుడినీ తారల్నీ
తనలో దాచుకుంటుంది
తడి ఆరిపోయాక తారలూ ఉండవు
వెలుతురూ ఉండదు
అంతా ఒట్టి కరడుగట్టిన మట్టి-
.
*
ఆనందాన్ని పంచే మనుషులు వేరే ఉంటారు
వారు మనుషులకు ముఖాలు తొడిగే ప్రయత్నం చేయరు
నీటిలోకి చేతులు జొనిపినట్లుగా లోపల్లోపలికి వస్తారు
ముఖ్యంగా.. వారు నవ్వుల్ని దుబారా చెయ్యరు
దుఃఖాన్ని ఏకాంతంలో బంధిస్తారు
అలాంటి వారు ఒకరో ఇద్దరో ఎదురుపడితే చాలు జీవిత కాలంలో-
.
***
Advertisements