శీతవేళ.. తూనీగ శబ్దం.. వసంత వర్షం.. కొన్ని జపనీ హైకూలు..!

.
(మరొకసారి హైకూ ప్రపంచంలోకి వెళితే.. కొన్నింటిని మిత్రులతో పంచుకోవాలనిపించింది. ఇది జపనీ మహనీయుల హైకూలను తెలుగులో ఒకసారి గుర్తు చేసుకోవడమే కానీ.. సాధికారిక అనువాదమనే అహంకార ప్రకటన కాదు. అందుకే.. ఇది వినమ్ర నివేదన)

మత్సువో బషో (1644-1694)


పాత సరస్సు
నీళ్ళ శబ్దంలోకి
కప్ప దుమికింది
.
ప్రశాంత నిశ్శబ్దం
తూనీగ శబ్దం
బండరాయిలోకి చొచ్చుకుపోతోంది
.
కొంగ కాళ్ళు
చిన్నవైనాయి
వసంత వర్షంలో
.
శీతల ఉద్యానం
నూలుపోగులా సన్నబడ్డ చంద్రుడు
కీటకాల పాట
.
***

యోసా బుసాన్ (1716-1783).


శీతవేళ
గంట శబ్దం
గంటను వదిలి వెళ్తోంది
.
వేసవి నదిని
దాటుతున్నా
చెప్పుల్ని చేతబట్టుకుని
.
ఖాళీ అయిన పొలంలో
దిష్టిబొమ్మ కాళ్ళు
ఎంత పొడుగ్గా, ఎంత సన్నగా ఉన్నాయి?
.
***

కోబాయాషీ ఇస్సా (1763-1827).


కీచురాయి
దిష్టిబొమ్మ పొట్టలోంచి
అరుస్తోంది
.
ఇదంతా నీదే
సీతాకోకచిలుకా, ఓ పుట్టగొడుగు మీద
విశ్రాంతి తీసుకో!
.
సూర్యాస్తమయాన్ని
గుర్రం పిల్లతో పంచుకుంటూ…
ఓ నత్త
.
పిల్లి పిల్ల నర్తిస్తోంది
గిరగిరా తిరుగుతూ…
రాలుతున్న ఆకులు
.
గడ్డిలో దాగుడు మూతలు
ఆడుతూ..
కప్ప
.
***

మసావోకా షికి (1867-1902).


చెట్టు తెగిపడింది
నా చిన్ని కిటికీలో
తొందరగా సూర్యోదయం
.
నిశ్చలం…
కొలను నీటి మీద
మెరుస్తున్న మిణుగురులు
.
ఎలా పాడాలీ అని
కప్పల బడి, కోకిలల బడి
కలబడుకుంటున్నాయి
.

***

Advertisements

లేదు

.
సమాధిలో
కన్నీటి చుక్కలు
చిగురు తొడుగుతున్న చప్పుడు
.
నల్లమబ్బుల్లో
సెగలు కక్కుతున్న
ఆత్మల ధూమపు రొద
.
వీధి గాలి తంత్రులపై
మొదలు తెగిన ఆలోచనల
నాద విషాదం-
.
రెల్లు గడ్డి దోసిళ్ళలో
జారిపడిన
రెక్కలు తెగిన చూపులు-
.
రెప్పల్ని కప్పుకున్న కళ్ళను
తెరిచేందుకు కలల నిష్ఫలయత్నం-
.
చివరి పాద ముద్రల
అసంపూర్ణ స్వర విరహం
అహరహం అనంతగీతం
ఎదురు చూపుల
వెదురు పాముల్లో-.

***

Orange Review * కొత్త ప్రేమల కలకలం – ఆరెంజ్!

కొత్త కథలు ఎక్కడ్నించి వస్తాయి? పాత కథల్నే అటూ ఇటూ మార్చడమే కదా కొత్త కథ అంటే? కథ ఎలా ఉందన్నది కాదు కథనం కొత్తగా ఉండాలి, ట్రీట్ మెంట్ లోనే డైరెక్టర్ టచ్ ఏమిటో తెలుస్తుంది. ఇలాంటి మాటలు మన దర్శక వరేణ్యులు ఎన్నోసార్లు అనగా విన్నాం. ఎన్నో హిట్ చిత్రాలు అందించిన దర్శకులు కూడా అలాగే అనగా అనగా విని.. ప్రేక్షకులుగా అందుకు ట్యూనై పోవాలని కూడా ప్రయత్నించాం. అలా సృజనాత్మక దివాళాకోరుతనమనే ప్రమాదాన్ని తెలిసో తెలియకో ఆహ్వానించి భరిస్తున్నాం.

కొందరు దర్శకులైతే అన్ని కథలూ రామాయణంలో, మహాభారతంలో ఉన్నవే అని గంభీరంగా సెలవిచ్చారు కూడా. అలాంటి వాళ్ళు రామాయణ, మహాభారతాలను సరిగ్గా చదవని వాళ్ళయినా అయి ఉండాలి లేదంటే.. మానసికంగా ఆ కాలంలోనే జీవిస్తున్న వారైనా అయి ఉండాలి. కాలం మారుతోంది. జీవితం మనిషికి కొత్త పాఠాలు నేర్పుతోంది. మార్పు మనిషిని కొత్త సంఘర్షణలకు గురి చేస్తోంది. ఇవేవీ గమనించకుండా స్టూడియో గోడల మధ్య పరిభ్రమిస్తూ, గంతలు కట్టిన ఖరీదైన కార్లలో ప్రయాణించే వారికి జీవితం ఇంకా అశోకవనంలో మగ్గిపోతున్నట్లే ఉంటుంది. కురుక్షేత్ర సీమ రక్తంతో మరిగిపోతున్నట్లే కనిపిస్తుంది. పుస్తకాలనే కిటికీలు ఉన్నాయని, వాటిని తెరిస్తే ఎంతో కొంత కొత్త ప్రపంచం కనిపిస్తుందని తెలిసినా మన దర్శకులు చాలా మందికి అంత తీరిక లేదు, ఓపిక అంతకన్నా లేదు.పాపులర్ సినిమా పరిధిలోనే, పరిమితుల్లోనే మారుతున్న ప్రపంచాన్ని, మారుతున్న మానవ సంబంధాల్ని, సంబంధాల మధ్య ఉన్న ఘర్షణల్ని ఎంతో కొంత సున్నితంగా ఆవిష్కరించవచ్చని బొమ్మరిల్లు కట్టి చూపించిన దర్శకుడు భాస్కర్. ఆధునిక ఇన్ఫర్మేషన్ యుగంలో జీవిస్తున్న కొత్త తరం.. తల్లితండ్రుల ప్రేమ, పెంపకాలకు ఇస్తున్న సరికొత్త నిర్వచనాన్ని బొమ్మరిల్లు సినిమా బొమ్మ కట్టి చూపించింది. పరుగు చిత్రంలోనూ భాస్కర్ తన కథానాయకుడి సంఘర్షణను కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. ప్రేమించిన అమ్మాయిని ఆమె కుటుంబానికి దూరం చేస్తే.. ఆ కుటుంబం పడే బాధను చూసి హీరో సంఘర్షణకు గురి కావడమన్నది కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు భాస్కర్.. మరో సున్నితమైన అంశాన్ని ఆరెంజ్ పేరుతో తెరకెక్కించాడు. ప్రేమను కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో ఒకటిగా మార్చేసిన నేటి ప్రాక్టికల్ ప్రపంచంలో జీవితాంతం ప్రేమించడమన్నది సాధ్యమా అన్న ప్రశ్నను రెండున్నర గంటలు ట్రెండీగా అనలైజ్ చేయడమే ఆరెంజ్.

ప్రేమ చుట్టూ అల్లుకునే మార్మికత, తీయని మాయ, వ్యామోహాలను ఆవిరి చేసే సందర్భాలను ఆధునిక ప్రపంచం అతి తరచుగా ఆఫర్ చేస్తుంటుంది. వాటిని తట్టుకుని నిలబడడానికి ఏం చేయాలి? ప్రేమ పుట్టడానికి ఓ క్షణం చాలు. అలాగే ప్రేమికులు విడిపోవడానికి ఓ కారణం చాలు. ఆ కారణాన్ని ప్రేమికులు ఉపయోగించుకోకుండా ప్రేమరాహిత్యాన్ని భరిస్తుంటారని అనుభవంతో తెలుసుకుంటాడు భాస్కర్ సృష్టించిన ఆరెంజ్ కథానాయకుడు రామ్. ఇన్ సెక్యూరిటీ, ఓవర్ పొసెసివ్ నేచర్, ఇన్ ఫెడిలిటీ, వ్యక్తిగతాన్ని ఆక్రమించే అనుబంధాల చట్రంలో ఇప్పుడు ప్రేమ.. రోజుకు నాలుగు ఎస్.ఎం.ఎస్ లు, రెండు కుళ్ళు జోకులు.. మరికొన్ని తీపి అబద్ధాల కాంబినేషన్ గా మారిపోయింది. ఇలాంటి నేటి కాలేజ్ ఏజ్ ప్రేమల ప్రపంచంలోకి నిజంగా  నిజాయితీగా, అంతఃకరణ ప్రకారం నడుచుకునే హీరోను ప్రవేశపెడతాడు దర్శకుడు భాస్కర్. జీవితాంతం ప్రేమించడం సాధ్యమా అని ఆరెంజ్ హీరో రామ్ అడిగిన ప్రశ్న కొత్తగా పుట్టిన ప్రశ్నేమీ కాదు. ఈ ప్రశ్నకు కనీసం రెండు దశాబ్దాల వయసుంది? ఈ ప్రశ్నకు సిన్సియర్ గా జవాబు చెప్పుకోవడానికి.. ప్రేమను ఆరాధనగా కీర్తించే హిపోక్రాట్స్ కు చాలా కష్టం. ప్రేమ అంటే ఒకరి పట్ల మరొకరికి కలిగే అపారమైన ఇష్టం. ఇష్టమైన వస్తువును తింటున్నప్పుడు విటమిన్ల గోల కానీ, షుగర్ కంటెంట్ కు సంబంధించిన దిగులు కానీ ఉండదు. ఒక ఎగ్జయిటెడ్ స్టేజ్ లో ఐ లవ్ యూ చెబుతుంది జెనీలియా రూపంలో ఉన్న జాహ్నవి. ఈ ప్రేమ నాకు జీవితాంతం కావాలని చెబుతుంది. అప్పుడు హీరో రామ్ ఏమంటాడు? నేను కూడా నిన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నానంటాడు. కానీ, జీవితాంతం ప్రేమించలేను.. కొంతకాలం ప్రేమిస్తాను.. అంటాడు. అలా చెప్పడంతో హీరోయిన్ షాక్ అవుతుంది. అలా అని అతడిని వదలి వెళ్ళలేదు. తన ప్రేమ కోసం క్యూ కట్టిన ముగ్గురు కుర్రాళ్ళలో ఎవరో ఒకరిని ఎంచుకోలేదు. అలా ఎంచుకుంటే నేనూ ప్రేమలో పడ్డానూ, నాకూ ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పుకోవడానికి తప్ప మరే మానసిక ఉపయోగమూ లేదు. అందుకని, జాహ్నవి తన క్లాస్ మేట్స్ లాగా సోకాల్డ్ లవ్ ట్రాప్ కు దూరంగా.. రామ్ అప్రోచ్ కు తన మైండ్ లో చాలా స్పేస్ ఇస్తుంది. అలా ఆ సంఘర్షణ కొనసాగుతుంది.

ఒక లాజికల్ కంక్లూజన్ దిశగా సినిమాను తీసుకువెళ్ళడానికి దర్శకుడు కొంచెం తగ్గి, కొంచెం వెనక్కి వెళ్ళి హీరో ఫ్లాష్ బ్యాక్ ను ప్రజెంట్ చేస్తాడు. ప్రేమలో తనను తాను మిస్ అవడం వద్ద తీవ్రంగా డిస్టర్బ్ అయిన హీరో.. రూబా రూబా.. తూహై మేరీ దిల్రూబా అని పల్లవించినందుకు పరితపిస్తాడు. శాశ్వత ప్రేమ ఒక మిథ్య అని నిర్థారణకు వచ్చిన ప్రేమికుడు.. ఐలవ్ యూ ఫరెవర్ అనే అబద్ధంతో ప్రేమను కొనసాగించలేక తొమ్మిది మందిని దూరం చేసుకుంటాడు. లవర్ నెంబర్ టెన్ జాహ్నవితో జరిపిన కెమిస్ట్రీలో.. హీరో మనసు కూడా రసాయినిక చర్యలకు గురి కావడం ఈ కథను ఆసక్తికరంగా ముందుకు నడిపిస్తుంది.ప్రేమ శాశ్వతంగా ఉండడమన్నది ఆచరణాత్మకంగా సాధ్యం కాకపోవచ్చన్నది ఎంత నిజమో, శాశ్వత ప్రేమ కూడా ఉంటుందన్నది అంతే నిజం. అయితే, మొదటి నిజం మీద రెండో నిజానిది పైచేయి ఎప్పుడవుతుంది? ఈ ప్రశ్నకు జవాబు కూడా భాస్కర్ స్క్రిప్టులో స్పష్టంగానే ఉంది. తరచూ అనుమానంతో తిట్ల దండకాన్ని మొదలుపెట్టి బాల్కనీ లోంచి పూల కుండీ విసిరేసే భార్య కోసం.. నాగబాబు మళ్ళీ సాయంత్రానికి కొత్త పూలకుండీ కొనుక్కుని తీసుకువెళ్ళే దృశ్యాన్ని పాసింగ్ సీన్ లా వదిలేసే ప్రేక్షకులు దర్శకుడు సినిమాకు ముగింపు ఇవ్వడంలో కన్ఫ్యూజ్ అయ్యాడనే ఆరోపిస్తారు. దృశ్య వ్యాకరణం అంతో ఇంతో తెలిసిన వారెవరూ నాగబాబు పాత్రకున్న ఇంపార్టెన్స్ ను విస్మరించడానికి వీల్లేదు. బొమ్మరిల్లు క్లయిమాక్స్ లో చూపించిన తండ్రీ కొడుకుల సుదీర్ఘ సంభాషణను.. దర్శకుడు ఈ చిత్రంలో నాలుగైదు నిమిషాలు మాత్రమే కనిపించే నాగబాబు పాత్రతో సాధించాడు. కారణాలతో విడిపోవడం కాదు.. ప్రేమించడానికి కారణాలు కొత్తవి ఎప్పుడూ ఉంటాయి.. వాటిని గుర్తిస్తూ పోవాలనే అర్థంలో హీరో రామ్ తన బావతో చెప్పిన మాటలు.. మానసికంగా అతడిలో వచ్చిన మార్పును సూచిస్తాయి. అంతా జరిగాక, చివర్లో హీరో మళ్ళీ ఈ అమ్మాయి అప్పుడెలా ఉండేది.. ఎంత అల్లరిగా అమాయకంగా నవ్వేది.. అదంతా ఇప్పుడుందా అని ప్రశ్నించే సన్నివేశమే కొంత అబ్సర్డ్. జీవితం నిన్నలా ఉండదు. అలాగే ప్రేమ కూడా. ప్రేయసి నవ్వు కూడా..నిజానికి ఈ కథను.. నాగబాబు పూల కుండీని కొనుక్కుని ఇంటికి వెళ్ళే దగ్గరే ఆపేయొచ్చు. కానీ, పాపులర్ ఫార్మాట్ లో ఇంకొంత క్లారిటీ అవసరం అనుకున్నాడు భాస్కర్. ఎంతకాలం కలిసి ఉంటారో తెలియదు.. ఉన్నన్నాళ్ళూ ప్రేమగా జీవిస్తారు.. వాళ్ళనలా వదిలేద్దామని హీరోయిన్ తండ్రితో చెప్పిస్తాడు. కథకంతా.. ఒక సూత్రంగా నిలిచిన ప్రకాశ్ రాజ్.. చివరి దృశ్యంలో ఇప్పుడు నేను నా భార్య దగ్గరకు వెళ్ళాలి అని కారెక్కుతాడు. ఇంకెంత క్లారిటీ కావాలి?

ఇక.. మేకింగా వాల్యూస్ విషయానికి వస్తే.. ఆరెంజ్ ను భాస్కర్ అప్ టు డేట్ మల్లీ ప్లెక్స్ స్టాండర్డ్స్ లో రూపొందించారు. టేకింగ్ వాల్యూస్ విషయంలో వంక పెట్టాల్సిన పని లేదు. కలర్ ఫుల్ ఇమాజినేషన్, ఈస్తటిక్స్ సినిమా అంతటా ఫ్రేమ్ బై ఫ్రేమ్ కనిపిస్తాయి. స్క్రిప్ట్ నిర్మాణం.. బొమ్మరిల్లు తరహాలోనే సాగింది. హీరోను గ్రాఫిటీ ఆర్టిస్ట్ గా, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా చూపించడం ఓ వెరైటీ. ఆస్ట్రేలియాలో ఇప్పుడు భారతీయ విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది కాబట్టి.. సిడ్నీ కాలేజి బ్యాక్ డ్రాప్ కూడా నప్పినట్లే అనుకోవాలి. కమర్షియల్ అట్రాక్షన్స్ కోసం నేపథ్యాన్ని లావిష్ గా చూపించే ప్రయత్నం చేసినా చెప్పదలచుకున్న కథ విషయంలో అప్రమత్తంగానే వ్యవహరించాడు దర్శకుడు భాస్కర్. రాజే శేఖర్, కిరణ్ రెడ్డిల సినిమాటోగ్రఫీ ల్యాండ్ స్కేప్స్ క్యాప్చర్ చేయడంలో గొప్పగా ఉంది. కళాదర్శకుడు ఆనంద్ సాయి పనితనం ఇంటీరియర్స్ తో పాటు ఔట్ డోర్ సాంగ్స్ లోనూ కనిపిస్తుంది. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ నైపుణ్యానికి.. నువ్వే నేనంటూ.. పాట, టైటింగ్ సాంగ్ కు ముందు క్లబ్ లో జరిగిన బాటిల్ గేమ్ సీన్లు మేలైన మచ్చుతునకలు.

నువ్వు చెప్పింది అర్థమైంది.. కానీ, చెప్పిన దాంట్లోనే అర్థం లేదనిపిస్తుంది వంటి మెరుపుల్ని డైలాగ్ రైటర్స్ తోట ప్రసాద్,  సురేంద్ర కృష్ణలు చాలో చోట్ల కురిపించారు. ఇక.. ఆరెంజ్ కు హారిస్ జయరాజ్ ఇచ్చిన మ్యూజిక్ కచ్చితంగా ఓ రేంజ్ లో ఉంది. నరేష్ అయ్యర్, నదీశ్ పాడిన నేనూ నువ్వంటూ.. కారుణ్య సిడ్నీ నగరం, విజయ్ ప్రకాశ్-దేవన్ లు పాడిన హలో రమ్మంటె వచ్చేసిందా చెలీ నీపైన నా ప్రేమ., శైలేష్ అదా-చిన్మయి శ్రీపాదల రూబా రూబ రూబా.. పాటలు చాలా కాలం వినాలనిపించేలా ఉన్నాయి. నేపథ్య సంగీతంలోనూ హారిస్ స్పెషాలిటీ చాలా చోట్ల కొట్టొచ్చినట్లు వినిపిస్తుంది. ఇక, ఆర్టిస్ట్స్ పర్మార్ఫెన్స్ విషయానికి వద్దాం. కొత్త లుక్ తో రామ్ చరణ్ చాలా బాగా కనిపించడమే కాదు. కొత్త తరం కుర్రాడిగా చాలా బాగా యాక్ట్ చేశాడు. మెగా హిట్ అయిన మగధీర చిత్రం ఆరెంజ్ చూస్తున్నంత సేపు ఏమాత్రం గుర్తుకు రాకపోవడం రామ్ చరణ్ చూపించిన వైవిధ్యానికి నిదర్శనం. జెనీలియా నటన.. సినిమా ఫస్టాప్ కు బాగా సూట్ అయింది. సెకండాఫ్ లో మారిన పాత్ర స్వభావానికి.. ఆమెకు మధ్య కొంత గ్యాప్ కనిపిస్తుంది. అందమైన ముంబయ్ అమ్మాయి రూబాగా షాజాన్ పదంసీ ప్రామిసింగ్ గా మెరిసింది. యాక్షన్ సన్నివేశాల్లో గ్రాఫిటి వాల్స్ మధ్య సాగిన స్టంట్స్ కట్టిపడేసాలా ఉన్నాయి. స్కై డైవింగ్ స్టంట్స్ చెప్పుకోదగిన స్థాయిలో రాలేదు.

ముఖ్యంగా, ఆరెంజ్ చూసిన తరువాత రామ్ చరణ్, మేకోవర్ ను, కాస్య్టూమ్స్ ను మెచ్చుకోకుండా ఉండలేం. ఫ్రేమ్ లోకి వచ్చే ప్రతి పాత్ర, ప్రతి వస్తువు కొత్తగా ఉండేలా చూసుకోవడంలో డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్లు చాలా కేర్ తీసుకున్నారు. అవన్నీ కలసి ఆరెంజ్ ను ఒక ఫీల్ గుడ్ మూవీగా మార్చేశాయి.మొత్తంగా చూస్తే.. దర్శకుడు భాస్కర్ మరోసారి ఓ సున్నితమైన అంశాన్ని.. కమర్షియల్ ఫార్మాట్ లో భారీగా డీల్ చేయడానికి సాహసించి.. సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈ చిత్రంలో హీరో చెప్పినట్లు జీవితాంతం ప్రేమిస్తాను అనే అబద్ధంతో ప్రేమను మొదలు పెట్టడం కరెక్ట్ కాకపోవచ్చు. కానీ, ఈ ప్రేమ జీవితాంతం ఉండదనే అపనమ్మకంతోనూ ప్రేమను ప్రారంభించడం కూడా కరెక్టు కాదు. దర్శకుడు కథను రెండవ లాజిక్ దిశగా నడిపించడం ఆరెంజ్ సినిమాను టైటిల్ స్పిరిట్ కు తగినట్లుగా ఉత్తేజంగా సాగింది. మండే సూర్యుడికి సంకేతం ఎరుపు రంగు అయితే, ఉదయించే సూర్యుడి వెచ్చదనానికి నారింజ రంగు ప్రతీక. ఆరెంజ్ అంటే.. యౌవనం.. కొత్తదనం.. ఉత్సాహం. . వీటన్నింటి అందమైన కలయికే ఆరెంజ్.

(హెచ్.ఎం.టి.వి షోటైమ్ లో ప్రసారమైన సమీక్ష)

***