ముళ్ళపూడి, మిక్కిలినేని… ఒక రచయిత, ఒక పాత్ర!

.
ముళ్ళపూడి వెంకటరమణకు ఎనభయ్యేళ్ళేమిటి? ఆయన నవయౌవనుడు అంటారు ఆత్మీయులు. కానీ, ఆత్మకు దేహంతో రుణం తీరిపోయే ఘడియ రాకమానదు. ఆ క్షణం వస్తేనేం? ముళ్ళపూడి మన మధ్యే ఉంటాడు నిత్వయౌవనుడిగా. ఇక, ఆయనను రెండోసారి మన నుంచి దూరం చేసే శక్తి ఏ శక్తికీ లేదు. బాపూరమణల ద్వంద్వ సమాసానికి వచ్చిన ఇబ్బంది అంతకన్నా లేదు. బాపూరమణీయం కాలాన్ని జయించి చాలా కాలమే అయింది. ముళ్ళపూడి సాహిత్యంలో సంప్రదాయ వాసనలు.. తెలుగుదనం వంటి పడిగట్టు పదాల సంగతి ఎలా ఉన్నా.. ఆయన మధ్య తరగతి జీవితంలోంచి పాత్రలను చిత్రించిన తీరు అద్భుతం. ఆయన కథానాయకుడు నేల విడిచి సాముగరిడీలు ఎన్నడూ చేయలేదు. సినిమాల్లో కూడా. ఆరోగ్యకరమైన హాస్యం, ఇంకా చెప్పాలంటే మర్యాదపూర్వకమైన హాస్యం.. ఆ నవ్వుల మాటున ఆర్ద్రంగా స్పృశించే కరుణ రసం ముళ్ళపూడి వెంకటరమణ సాహిత్యాన్ని చిరస్మరణీయం చేసింది. మనసుకు తగిన గాయాలను కూడా అందమైన అధిక్షేపణగా బంధించే విద్య తెలిసిన ముళ్లపూడి.. బాధను చమత్కారంగా మార్చడం కొత్తగా కోతికొమ్మచ్చి చదివినవారికి కూడా బాగా తెలుసు. బాపు, రమణలు పక్కపక్కనే కూర్చుంటే.. వారితో మాట్లాడ్డం ఒక మరిచిపోలేని అనుభవం. సంభాషణలోనూ అల్లరితనం.. క్షణక్షణం వినిపిస్తుంది. జర్నలిస్టులు బాపు గారి బైట్ కోరితే.. రమణ గారివ్వడం చాలా మామూలు. రమణ గారి మాటనే నా మాటగా తీసుకోండి అని ఆయన తరచూ చెప్పేవారు. ఓసారి బాపు గారి వద్దకు వెళ్ళి రమణగారు ఎక్కడున్నారని అడిగితే, “ఇన్నాళ్ళూ నా పక్కనే తోడుగా ఉన్నారు. ఇప్పుడు ఆయనను నా తలపై పెట్టుకున్నాను” అని మేడపైన గది చూపించారు నవ్వుతూ. అమ్మ లాంటి రమణ అని చెప్పుకున్న బాపు నిజంగానే ఆయనను తలపైన పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇరు దేహాలలోని సగం ఆత్మ ఎక్కడికని వెళ్తుంది? మిగిలిన సగంలోనే కదా కలుస్తుంది. అందుకే, బాపులో రమణ కనిపిస్తాడు. బాపు రేఖల్లో, చిత్రాల్లో వినిపిస్తూనే ఉంటాడు. పాత్రికేయునిగా, కథకునిగా, స్క్రైబ్ గా, సినీ సంభాషణల రచయితగా, నిర్మాతగా బహుముఖంగా రాణించిన ముళ్ళపూడి వెంకటరమణ.. మూగమనసు బాసలు తెలిపేందుకు మళ్ళీ తప్పకుండా వస్తారు.
.
ఒకే వారంలో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తిని, ముళ్ళపూడి వెంకట రమణ వంటి ఉద్ధండులను కోల్పోవడం తెలుగు జాతికి తీరని లోటే. నాటక రంగానికి మిక్కిలినేని చేసిన సేవ చిరస్మరణీయం. సామాజిక, కళా చైతన్యంతో ఎదిగిన మిక్కిలినేని భీముడంటే భీముడే.. యమధర్మరాజు అంటే యమ ధర్మరాజే. స్వతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్న ఈ రాజకీయ చైతన్యశీలి.. తన 95 ఏళ్ళ జీవితంలో 80 ఏళ్ళు కళామతల్లి సేవలోనే గడిపారు. లభించిన పేరు ప్రతిష్ఠలకన్నా ఉన్నతమైన జీవితాన్ని గడిపిన మిక్కిలినేని గురించి అత్తలూరి విజయలక్ష్మి గారు ఆంధ్రభూమిలో చక్కని వ్యాసం రాశారు: http://www.andhrabhoomi.net/kalabhoomi/mikkilineni-37 . ఆయన స్మృతికి నీరాజనం.
.
***
Advertisements

వనం ఝాన్సీ అప్పుడే వెళిపోతే ఎలా?

.
భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా మొదలై..  శక్తిమంతమైన నాయకురాలిగా ఎదుగుతున్న చురుకైన మహిళ వనం ఝాన్సీ అచ్చంపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్న వార్త విన్నప్పుడు మనసు చాలా భారంగా మారింది. ఇది నిజం కాకుండా ఉంటే ఎంతో బాగుండుననిపించింది. ఆమె మృతిని ధ్రువీకరిస్తూ చానెళ్ళలో కనిపించిన బ్రేకింగ్ ప్లేట్స్ ఆందోళనను మరింత పెంచాయి. గతంలో ప్రింట్ మీడియా జర్నలిస్టుగా, ప్రస్తుతం టీవీ జర్నలిస్టుగా, ప్రజెంటర్ గా చాలా మంది రాజకీయ నాయకులతో మాట్లాడాను. కానీ, వ్యక్తిగత స్థాయిలో అనుబంధం ఏర్పడడమన్నది కొందరి విషయంలోనే జరిగింది. అలాంటి వారిలో వనం ఝాన్సీ ఒకరు.
.
ప్రజల పట్ల నిజమైన కన్సర్న్ తో రాజకీయాల్లో ఎదగాలనుకునే వారు మనకు చాలా తక్కువ మంది ఉన్నారు. ఝాన్సీగారు టీవీ కెమెరా ముందే కాకుండా ప్రైవేటు సంభాషణల్లోనూ తన జిల్లాలోని ప్రజల సమస్యల గురించి, వారు పడే యాతనల గురించి కళ్ళు చెమ్మగిల్లుతుండగా చెప్పడం నాకు బాగా గుర్తు. ఆమె నిజంగా.. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలనే తపనతోనే రాజకీయాల్లోకి వచ్చారని నాకు చాలా సార్లు అనిపించింది.
.
వనం ఝాన్సీగారిని చూసినప్పుడు, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏ పార్టీకి చెందిన వారన్న ప్రశ్నే తలెత్తదు. విద్యార్థి దశ నుంచి ఒక పార్టీ లైన్ ను నమ్ముకుని, దానికి కట్టుబడి ఆమె తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. తెలంగాణ ఉద్యమంలో ఆమెను నాకు తెలిసి ఏ నాయకుడూ ఒక పార్టీ ప్రతినిధిగా చూడలేదు. గురి తెలిసిన బాణంలాగే ఆమె ఉద్యమంలో దూసుకుపోయారు. మహిళా చైతన్యం గురించి, వెనుకబడిన తరగతుల నుంచి నాయకత్వం ఎదగాల్సిన అవసరం గురించి ఆమె తరచూ మాట్లాడేవారు. బి.జె.పి ప్రత్యేక తెలంగాణ వాదానికి బలమైన వాణి వనం ఝాన్సీయే. ఆమె యాక్సిడెంట్ లో చనిపోయారన్న వార్త విని.. బాగా డిస్టర్బ్ అయి హాస్పిటల్ బయలుదేరబోతుంటే.. “ఝాన్సీ మృతిపై లైవ్ షో నువ్వే చేయాలం”టూ చీఫ్ ఎడిటర్ నుంచి కబురు. భారంగా స్టూడియోలో కూర్చోవడం ఎంత పెద్ద సమస్యో నాకు బాగా అనుభవంలోకి వచ్చింది. గొంతు గద్గదమవకుండా మాట్లాడాల్సి రావడం ఒక శిక్ష. నిన్న హెచ్.ఎం.టి.విలో ఉదయం 11.30 గం.ల నుంచి గంట వరకూ నేను నిర్వహించిన లైవ్ షోలో అన్ని పార్టీల వారూ ఝాన్సీని ఆత్మీయంగా తలచుకోవడం ఆశ్చర్యమనిపించలేదు. నన్నపనేని, రోజాల నుంచి కవిత, విమలక్క గద్దర్ ల వరకూ అందరూ ఝాన్సీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజల పక్షాన నిలిచిన రాజకీయవేత్తగా ఆమెకు “జయహో” అని నీరాజనాలు పలికారు.
.
నాకు తెలిసిన ఝాన్సీ ఒక సింపుల్, హంబుల్.. డైనమిక్ లీడర్. నిజామాబాద్ అర్బన్ ఉప ఎన్నికలో వేల మంది మహిళా కార్యకర్తలను, బి.జె.పి అభ్యర్థి గెలుపును తెలంగాణ ఉద్యమానికి ఓ విజయంగా అభివర్ణించి నడిపించిన ఝాన్సీ.. వ్యక్తిగత సంభాషణల్లో ఎంతో నిరాడంబరంగా కనిపించే ఝాన్సీ ఒక్కరేనా అనిపించేది. ఆచరణలో దూకుడుగా, ప్రవర్తనలో మర్యాదగా మెలగడం ఝాన్సీ నుంచి నేర్చుకోవలసిందే.
.
పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఝాన్సీ.. తన కులాన్ని పోలరైజ్ చేయడానికి కూడా ఎంతో కృషి చేశారు. వెనుకబడిన సామాజిక వర్గాల చైతన్యాన్ని స్వప్నిస్తూ.. ఆ సామాజిక వర్గాలలోని ఫ్రాగ్మెంటెడ్ వాస్తవికతలను అర్థం చేసుకుని, దాన్ని మహిళా చైతన్యంతో సమన్వయ పరచడం తెలిసిన ఝాన్సీ అప్పుడే ఈ లోకం నుంచి వెళ్ళి పోవడం చేనేత బాధితుల ఉద్యమానికి, వెనుకబడిన సామాజిక వర్గాల పోరాటానికి, మహిళా రాజకీయాకాంక్షల సంఘర్షణకు, తెలంగాణ సమరానికి తీరని లోటు. ఝాన్సీ ఏయే వ్యవస్థల నుంచి విచ్చుకత్తిలా దూసుకొచ్చారో.. ఆ వ్యవస్థల నుంచి… ఆ సామాజిక నేపథ్యాల నుంచి మరెంతో మంది ఝాన్సీలు రావాలి. అదే ఆమెకు మనమిచ్చే నివాళి.
.
***