ఎన్.వి.పి లా కళాశాల పూర్వ విద్యార్థుల (1986-92) సమావేశం – ఒక పునరుత్తేజం

.
గతం గతిస్తుందా? చిన్నప్పటి అమ్మ చేతి గోరు ముద్దల రుచి లీలగా మదిలో మెదులుతూనే ఉన్నప్పుడు, బండ రాతి కొండలపైకి ఎక్కి మగ్గిన సీతాఫలాలను తెంపుకుని మిత్రులతో కలిసి పంచుకున్న జ్ఞాపకం మూసిన రెప్పల తెరపై స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, సిటీ బస్సుల ఫుట్ బోర్డుల మీద వేలాడుతూ కాలేజీకి వెళ్ళినప్పుడు భుజాలు లాగిన తీపి బాధ ఇంకా అక్కడే సద్దుమణగకుండా గొణుగుతున్నప్పుడు, స్నేహితుల భుజాల మీద చేతులు వేసినప్పుడు రుచి తెలిసిన అభిమాన స్పర్శ ఇంకా అరిచేతుల్లో వెచ్చగా విచ్చుకుంటూనే ఉన్నప్పుడు. తోటి విద్యార్థినుల వాలు చూపుల క్రీనీడల్లో జ్ఞాపకాలు వూయలూగుతూనే ఉన్నప్పుడు.. జడ కుచ్చుల లోలకాల నడుమ కాలం వేలాడిన వైనం.. కళ్ళల్లో సెకనుకు ఇరవై నాలుగు ఫ్రేములుగా పరిభ్రమిస్తూన్నప్పుడు.. క్లాసులు, కలహాలు, పరీక్షలు, ప్రణయాలు, ఫలితాలు, నవ్వులు, కన్నీళ్ళు కలగలసిన తోటలో.. దేహం విహరిస్తూనే ఉన్నప్పుడు.. గతం గతిస్తుందా?
.
గతం గతించదు. గతం, వర్తమానం, భవిష్యత్తులు ఒకే సరళ రేఖ మీద ఉంటాయి. మనమే ఇష్టం వచ్చినట్లు అటూ ఇటూ తిరుగుతాం. ఒక్కోసారి ఈ సరళ రేఖ వృత్తంగా మారుతుంది. కాలంలో గత,వర్తమాన, భవిష్యత్తులనే విభజన రేఖలు గల్లంతవుతాయి. మనం మన జీవితంలోనే చుట్టూ తిరుగుతాం.
ఈ నెల 21, 22 తేదీల్లో నా జీవితంలో గతం వర్తమానమైంది. వృత్త భ్రమణంలో మనసంతా మురిసిపోయింది. విశాఖపట్నంలోని న్యాయ విద్యాపరిషత్ (ఎన్.వి.పి) లా కళాశాలలో మొదటి అయిదు సంవత్సరాల లా కోర్సు విద్యార్థులమంతా ఆరోజు మళ్ళీ కలుసుకున్నాం. మేమంతా ఎన్.వి.పి లా కాలేజి తరగతి గదిలో కలుసుకుని ఇప్పటికి అక్షరాలా పాతికేళ్ళు. 1986 చివరలో ఈ రాష్ట్రంలో తొలి ఫైవ్ ఇయర్ లా కోర్సు ప్రారంభమైంది. అప్పుడు మొదటిసారిగా ఆ కోర్సును ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోనే ప్రారంభించారు. లాసెట్ మొదలైంది కూడా మా బ్యాచ్ తోనే. లాసెట్ లో క్వాలిఫై అయి ఎన్.వి.పి లా కళాశాలలో మొత్తం 72 మంది విద్యార్థులు చేరారు. మా కోర్సు 1986 చివర్లో మొదలై 1992 ఫిబ్రవరితో ముగిసింది. మార్చిలో ఫలితాలు వచ్చాయి. అంటే, మేం విడిపోయి దాదాపు ఇరవయ్యేళ్ళు కావస్తోంది. ఆ 72 మందిలో యాభైకి పైగా క్లాస్ మేట్స్ మే నెల 21, 22న జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరయ్యారు. వారిలో చాలా మంది లాయర్లుగా స్థిరపడ్డారు. కొందరు జి.పిలు, ఎజిపిలు అయ్యారు. ఒకరిద్దరు మెజిస్ట్రేట్లు అయ్యారు. మిత్రుడు కె.ఎస్.ఎన్ రాజు చోడవరం నుంచి టి.డి.పి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నారు. ఫర్వాలేదు, దాదాపు అందరూ, అతి కొద్ది మంది మినహాయిస్తే, జీవితంలో చెప్పుకోదగ్గ స్థాయికి ఎదిగారు. నేనొక్కడ్నే మీడియాలో ఉన్నాను.
అయిదేళ్ళు కలిసి చదువుకున్నప్పటికీ, 19 ఏళ్ళ గ్యాప్ తరువాత చాలా మందిని గుర్తుపెట్టుకోలేకపోయాను. జీవితం ముందుకు వెళ్తున్న కొద్దీ కొన్ని జ్ఞాపకాలు అన్ యూజ్డ్ డేటా లాగా ఎలా ఇరేజ్ అయిపోతాయో కదా అనిపించింది. ఈ ఆలమ్నీ మీట్ ఆ ఫైల్స్ అన్నింటినీ ఒక్కసారి రెట్రీవ్ చేసింది.
అలా మైండ్ రివైండ్ అవుతున్న కొద్దీ అనుభవించిన ఉద్వేగం అంతా ఇంతా కాదు. ప్రతి ఆలింగనంలో ఒక జ్ఞాపకం కొత్తగా వూపిరి పోసుకుంది. కరగని ప్రతి కన్నీటి చుక్కా మిత్రుల కళ్ళలోంచి జాలువారిన ఆత్మీయతను అతి జాగ్రత్తగా భద్రపరిచింది. ఇప్పుడు, నాలో జ్ఞాపకమై ఒదిగిన ప్రతి కన్నీటి బిందువూ ఓ ప్రిజమ్. సహచరులు గుర్తుకు వచ్చే క్షణాలే కిరణాలు. జ్ఞాపకాల పరిమళమే సప్తవర్ణాలు.
.
From Left: Rammohan, KSN Raju, Sreedhar, Reddy
హ్యాట్సాఫ్ టు రామ్ మోహన్ మై డియర్ క్లాస్ మేట్… నువ్వెంత శ్రమ తీసుకుంటే ఇంతమందిమి ఇలా తగరపువలసలోని హయగ్రీవ రిసార్ట్స్ లో కలిశాం! లాలో మాస్టర్స్ చేసి ఆ తరువాత డాక్టరేట్ పట్టా అందుకున్న రామ్మోహన్ అప్పటి మా క్లాసులోని 72 మంది విద్యార్థుల జాబితాను తీసుకుని ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్ సేకరించి.. ఈ సమాగమాన్ని సాధ్యం చేశారు. ఎమ్మెల్యే రాజు ఈ కృషికి అండగా నిలిచారు. హైదరాబాద్ నుంచి నేను, మెదక్ నుంచి రవిందర్, సిద్దిపేట నుంచి జీవన్ రెడ్డి కలిసి ఇన్నోవాలో విశాఖకు పయనమయ్యాం. ఆరోజు మాకు ఆ ఇన్నోవా ఒక టైమ్ మెషీన్. పని ఒత్తిడిలో పడి ఒకవేళ అక్కడికి వెళ్ళకపోయి ఉంటే.. అన్న ప్రశ్నే ఇప్పుడు భయంకరంగా కనిపిస్తోంది. ఎంత సంతోషం, ఎంత ఆనందం, పాత క్లాస్ మేట్స్ తో కలిసి పాత జ్ఞాపకాల్లోకి ప్రయాణించడం ఎంత అద్భుతమైన ఫీలింగ్? చదువుకుంటున్నప్పుడు ఎదురైన భేషజాలు, కోపాలు, తాపాలు.. అన్నీ మరిచి.. ఎన్ని చేసినా, ఏం చేసినా మనం చివరకు మనుషులమే కదా.. అన్న సత్యాన్ని గుర్తు చేసే సందర్భం ఎంత గొప్పది. మిత్రులారా.. మీతో గడిపిన ఈ క్షణాలన్నింటినీ పదిలంగా దాచుకుని మళ్ళీ మా వూరొచ్చాను. కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో, ఇంకా చెప్పాలంటే కొత్త జీవంతో.. మనం మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ఈ జీవనయానంలో కొంత వెనుకబడిన సహాధ్యాయులకు చేయూతనిచ్చేందుకు మనం ఏర్పాటు చేయాలని నిశ్చయించిన ట్రస్తును నిలబెడదాం. స్నేహం గొప్పదనాన్ని చాటి చెబుదాం.
***
Advertisements