ప్రజల భాగస్వామ్యమే ఉత్తమ జర్నలిజానికి ప్రాతిపదిక

(చెన్నైలోని తెలుగు జర్నలిస్టుల సంఘం TEJOUS దశాబ్ది సంచికలో ప్రచురితమైన వ్యాసం. ఆ సంచికలో కొన్ని పేరాలు ముందు, వెనక అచ్చవడంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఇక్కడ.. ఆ వ్యాసం అసలు ప్రతిని పోస్టు చేస్తున్నాను. జర్నలిస్టులు, మిత్రులు, జర్నలిస్టు మిత్రులు, బ్లాగ్హితులు ఈ వ్యాసంపై విలువైన అభిప్రాయాలు తెలుపుతారని ఆశిస్తాను.)

“You can trust in us for correcting our mistakes”

‘నిజమే చెబుతాం. అబద్ధం అస్సలు చెప్పం. మమ్మల్నే నమ్మండి’ వంటి ప్రకటనల కన్నా పైవాక్యం ఒక జర్నలిస్టుగా నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా, మూడేళ్ళ కిందట టెలివిజన్ జర్నలిజంలోకి వచ్చిన తరువాత ఆ వాక్యానికున్న ప్రాధాన్యం మరీ బాగా తెలిసివచ్చింది. ప్రింట్ జర్నలిజంలో పని చేసిన పదహారేళ్ళలో తప్పు చేయడం మహాపరాధమనే భావనే వెంటాడింది. జర్నలిస్ట్ తప్పు చేయకూడదు. ఏది రాసినా సరిగా నిర్థరించుకున్న తరువాతే రాయాలి. మన రాత రిజాయిండర్ కు దారితీసిందంటే తలకొట్టేసినంత పని.

టీవీ జర్నలిజంలోకి వచ్చిన తరువాత తప్పులు చేయడం తప్పనిసరి అనిపించింది. అది అనుభవం నేర్పిన పాఠం. మేగజైన్ జర్నలిజంతో పోల్చితే డైలీల్లో కూడా ఇలాంటి పాఠాలు మామూలైపోయాయి. ఊహాత్మక, వ్యూహాత్మక కథనాలు ఫ్రంటు పేజీల్లో చపాయిస్తున్న దుర్భర సందర్భంలో జర్నలిస్టులు వలువలొక్కక్కటే వదిలేస్తున్నారని చిర్రెత్తుకొస్తుంది. ఇలాంటి ఉద్దేశపూర్వక పాత్రికేయ వృత్తి ధర్మాల సంగతి అలా ఉంచితే, టీవీ జర్నలిజంలో ఎలాంటి దురుద్దేశాలు లేకున్నా కూడా తప్పుల్లో కాలేస్తుంటాం. ఎందుకంటే, తుదిగా తేలే నిజాన్ని కాకుండా.. నిజం కోసం చేసే ప్రయాణాన్ని కూడా న్యూస్ చానల్లో చూపించాల్సి ఉంటుంది. ప్రయాణమన్నాక ఒక్కోసారి దారితప్పవచ్చు.

అందుకే, ఆరేళ్ళ కిందట  అమెరికాలోని జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్ స్టీవెన్ వి. రాబర్ట్స్ ప్రస్తావించిన ఆ వాక్యం నాకు  మళ్ళీ మళ్ళీ గుర్తుకువస్తోంది. స్టీవ్ రాబర్ట్స్ 20 ఏళ్ళు న్యూయార్క్ టైమ్స్ లో పని చేశారు. ఆ తరువాత జర్నలిజం బోధన వైపు మళ్ళారు. జర్నలిస్టు కావడానికి లైసెన్స్ అక్కర్లేదు. ఆ మాటకొస్తే పత్రికలోనో, టీవీలోనో ఉద్యోగమూ అక్కర్లేదు. లైసెన్స్ లేని వృత్తిలో బాధ్యత ఎక్కువ. ఎవరూ అడిగేవారు లేరని తప్పులు చేస్తే, సరిదిద్దుకునే బాధ్యత జర్నలిస్టుదే. పత్రికలదే. చానళ్ళదే. అందుకే, విశ్వసనీయతకు మేమే కేరాఫ్ అడ్రస్ అని డోలు బజాయించుకునే బదులు, తప్పులు చేస్తే సరిదిద్దుకునే మా నిజాయితీని నమ్మండి అని చెప్పుకోవడం.. ఎథికల్ జర్నలిజాన్ని తలదాల్చడానికి ఇంకా ఆపసోపాలు పడుతున్న టీవీ జర్నలిజానికి చాలా అవసరం. ఏది నైతికం, ఏది అనైతికమనే శాస్త్ర మీమాంస, news script with emotional graph అనే సెన్సేషనల్ జోరులో, వెర్రిలో నవ్వుల పాలవుతోంది. టీవీ జర్నలిజానికి సంబంధించి భావాలు ఇంకా పాఠాలుగా మారలేదు. కాబట్టి, నేర్చుకోవడమన్నది పనిలో భాగంగానే కొనసాగుతోంది.

తెలుగు జర్నలిస్టుల సంఘం (తేజస్) దశాబ్ది సంచిక కోసం వ్యాసం రాయాలని మిత్రులు కోరినప్పుడు, ఆ సంస్థ  ఫౌండర్ జాయింట్ సెక్రటరీగా అది నా బాధ్యత అనిపించింది. దేనిపై రాయాలన్నప్పుడు, అమెరికాలో నెల రోజుల పాటు అక్కడి మీడియాతో జరిపిన ఇంటరాక్షన్స్ గురించి ఎక్కడా రాయలేదు కదా, ఆ విశేషాలు రాస్తే బాగుంటుందని ఆర్టిస్ట్-కార్టూనిస్ట్ నర్సిం చేసిన సూచన బాధ్యతను ఇష్టంగా మార్చింది. “Role of the Press for Vernacular Journalists” ప్రాజెక్టు కింద 2005 అక్టోబర్ లో అమెరికా విదేశాంగ శాఖ నాతో కలిపి అయిదుగురు తెలుగు జర్నలిస్టులను – కె. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి), ఎన్. రాహుల్ కుమార్ (ఈనాడు), ఎం. మురళీకృష్ణ (టివి9), ఐ. సురేశ్ (ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్) – ఆహ్వానించింది. వాషింగ్టన్ డి.సి, న్యూయార్క్ సహా అయిదు నగరాల్లోని మీడియా సంస్థలతో ప్రాంతీయ భాషల సమాచార మాధ్యమాల గురించి అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడం ఆ కార్యక్రమం ప్రధానోద్దేశం. ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్ షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా నిర్వహించిన ఆ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా ధోరణులను, మీడియా ఎదుర్కొంటున్న ఆందోళనలను అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడింది.

ధోరణులు, ఆందోళనలు చాలా వరకు అక్కడా ఇక్కడా ఒకే విధంగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాను చూస్తే మనకు రాబోయే సమస్యలేమిటో కూడా అర్థమవుతాయి. టీవీ, ఇంటర్నెట్ జనంలోకి వేగంగా చొచ్చుకుపోవడంతో పత్రికల సర్క్యులేషన్ పడిపోవడం ఒక సమస్య. విస్తరిస్తున్న టెలివిజన్ న్యూస్ రంగంలో వాస్తవాలపై వేగానిదే పైచేయి కావడం మరో సమస్య. చానళ్ళతో పోటీ, చానళ్ళ మధ్య పోటీ వల్ల “నిజమైన ప్రజలు” వార్తల్లో లేకుండా పోవడమన్నది అతి పెద్ద సమస్య. అత్యంత ప్రమాదకరమైన సమస్య. Who is ahead, not what do they say అన్నట్లుగా తయారైన horse race coverage లో ముందుండేందుకు న్యూస్ చానల్సే కాదు అచ్చు మాధ్యమం కూడా రెట్టించిన ఉత్సాహంతో పోటీ పడుతోంది. ఫ్రంట్ పేజీల్లో ఐటమ్ నంబర్స్ తో ఊదరగొడుతోంది. ఫలితంగా మన రాష్ట్రంలోని పెద్ద పత్రికలు, సర్క్యులేషన్ సమస్యల దశాబ్దాన్ని సులువుగానే దాటగలిగాయి. పైగా మనది మోస్ట్ హాపెనింగ్ స్టేటాయె!

అందుకే, సర్క్యులేషన్ పడిపోవడం, రీడర్షిప్ దిగజారడం, ప్రింట్ రంగంలో వేల ఉద్యోగాలు హుళక్కి అయిపోవడం వంటివి మనకు చాలావరకు నాన్-ఇష్యూస్. వార్తల్లో “అసలైన ప్రజలు” లేకుండాపోవడమే మనం ఎదుర్కొంటున్న ప్రధాన, ప్రమాదకర సమస్య. పెట్టుబడిదారి మీడియా ప్రజల నుంచి పాఠకుల్ని/ప్రేక్షకుల్ని సమర్థంగా వేరు చేయగలిగిందా? పెట్టుబడి లక్ష్యం రాబడి కాబట్టి వినియోగదారుల్ని గుర్తించడం, మచ్చిక చేసుకోవడం ఎలాగూ జరుగుతుంది. కానీ, పత్రిక లేదా చానలే పెట్టుబడి కావడం నేటి విపరీతం. ఇది 2జి స్పెక్ట్రమ్ స్కామ్ లు, ఎమార్ కుంభకోణాలు, ఔటర్ రింగురోడ్లు వార్తలు రాసుకోవడం లాంటిది.

మీడియా రీడర్షిప్/ వ్యూయర్షిప్ కోల్పోతుండడం, ప్రజాస్వామ్య వ్యవస్థ రాజకీయ, పౌర భాగస్వామ్యాన్ని కోల్పోతుండడం వర్తమాన సమాజపు కవల సమస్యలని నార్త్ కెరోలినా యూనివర్సిటీ జర్నలిజం అధ్యాపకులు డాక్టర్ ఫ్రాంక్ ఫీ చెప్పిన మాటలను మన రాష్ట్రంలోని మీడియా పరిణామాలు, ప్రమాణాలకు అన్వయించి చూస్తే చిత్రమైన లాజికల్ కంక్లూజన్స్ ఎదురవుతున్నాయి.

ఒకటి: రీడర్షిప్/వ్యూయర్షిప్  పడిపోతోంది, ప్రింట్ మీడియా ప్రమాదంలో పడిందని అనుకోవడం మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక సిగ్గుమాలిన పని. ఎందుకంటే, అవి పాఠక లేదా ప్రేక్షకాదరణపై మాత్రమే ఆధారపడి లేవు.

రెండు: రాజకీయ శక్తులు ప్రజాస్వామ్యంలో భాగస్వాములు అవకుండా, మీడియాస్వాములు కావడం (ప్రత్యక్షంగానో పరోక్షంగానో) వల్ల పాత్రికేయ విలువల గురించి మాట్లాడేవారు చాదస్తులనే ముద్రతో చరిత్ర పుటల్లో కలిసిపోతున్నారు.

మూడు: పీపుల్స్ అజెండా కాకుండా ఓనర్స్ (ఎడిటర్స్’ కాదు) అజెండాలు మీడియా సంస్థలపై రెపరెపలాడుతుంటే, ప్రజలు రెంటికి చెడ్డ రేవళ్ళయ్యారు. అంటే, ఇటు పత్రికల్లోనూ అటు ప్రజాస్వామ్యంలోనూ ప్రజల పాత్ర తగ్గిపోతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర బలంగా తెర ముందుకు వచ్చినప్పుడు కూడా ఆ భాగస్వామ్యం కనిపించని దుస్థితి. ఇది పత్రికల్లో ప్రజల భాగస్వామ్యరాహిత్యం వల్ల కలుగుతున్న అనర్థం.

నాలుగు: ప్రజాస్వామ్యం, పాలన, నిఘాలకు బదులు అధికారం, అవినీతి, ప్రచారాలే రాజ్యమేలుతున్నాయి.

మరి, పాలన ఎవరు చేస్తున్నారు? ఎవరూ చేయడం లేదు. ఇప్పుడు నడుస్తున్నది పీపుల్స్ మేనేజ్ మెంట్ యుగం. జనాన్ని ఎంత బాగా మేనేజ్ చేస్తే అంత అధికారం, అంత సంపద. ఈ అజమాయిషీ కళను ప్రదర్శించే తాహతు సంపద పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది. ఎంత తాహతు ఉంటే అరిచేతిలో అంత మీడియా! లేకుంటే, శ్రీకృష్ణ కమిటీ తన అష్టమ అధ్యాయంలో స్ట్రింగర్ల నుంచి ఎడిటర్ల దాకా చేయాల్సిన మీడియా మేనేజ్ మెంట్ గురించి అంత నిస్సిగ్గుగా ఎలా రాయగలుగుతుంది?

మీడియాకు ప్రజల అజెండా లేనప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యాన్ని ”కనిపించనీయకుండా” చేసే కుయుక్తులు ఫలిస్తాయి. అయితే, రెక్కవిప్పుకున్న ప్రాంతీయ, కుల ఉద్యమాలు, అవినీతి వ్యతిరేక పోరాటాలు ఆ ఫలితాలు తాత్కాలికమేనని గుర్తు చేస్తున్నాయి. ఆశకు శ్వాసనిస్తున్నాయి.

మీడియాలో వస్తున్న అవాంఛనీయ ధోరణులను కట్టడి చేసి, దిద్దుబాటు సూచనలు చేసే సంస్థలు అమెరికాలో బలంగా ముందుకు రావడం గత దశాబ్దపు కీలక పరిణామం. ఉదాహరణకు, న్యూయార్క్ లో Fairness and Accuracy in Reporting (FAIR) అనే లాభాపేక్ష లేని సంస్థనే తీసుకుందాం. అమెరికాలోని ఈ ఏకైక వామపక్ష మీడియా నిఘా సంస్థ మీడియాలో వచ్చే వార్తలకు, ప్రజల మనోగతానికి మధ్య ఉన్న తేడాను వివరించేందుకు కృషి చేస్తుంది. ఇరాక్ మీద యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికన్ మీడియాలో 71 శాతం వార్తలు యుద్ధానికి అనుకూలంగా వచ్చాయి. యుద్ధ వ్యతిరేక వార్తలకు లభించిన చోటు కేవలం 3 శాతమే. కానీ, ప్రజల మనోభావాలు పత్రికల రాతలకు భిన్నంగా మారుతూ వచ్చాయి. యుద్ధం ముగిసే సమయానికి 59 శాతం అమెరికన్లు ఇరాక్ నుంచి సేనల ఉపసంహరణ జరగాలని కోరుకున్నారు. 60 శాతం మంది ప్రజలు యుద్ధం ఒక ఘోర తప్పిదమనే అభిప్రాయంతో ఉన్నారు. కేవలం 8 మందితో పని చేసే ఈ సంస్థ ప్రజల మనోగతాన్ని సర్వేక్షిస్తూ మీడియాను గైడ్ చేస్తుంది. సామ్రాజ్యవాద ధోరణి అమెరికన్ మీడియాను ప్రభావితం చేస్తుంది, న్యూయార్క్ టైమ్స్ పత్రిక అమెరికా ఇమేజ్ కు సంరక్షకుడిననే భావనతో పని చేస్తుందని FAIRలోని సీనియర్ విశ్లేషకుడు స్టీవ్ రాండల్ అన్నారు.

ఫ్రీడమ్ ఫోరమ్ అనే మరో స్వచ్ఛంద సంస్థ వర్జీనియాలో ఉంది. ఈ సంస్థ పని కూడా మీడియాను ట్రాక్ చేయడమే. అమెరికాలో మీడియా లిబరల్, కన్సర్వేటివ్ కూటములుగా విడిపోయిందని ఆ సంస్థ ఒక జాబితానే చూపించింది. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటివి లిబరల్ వాదాన్ని ప్రచారం చేస్తుంటే కన్సర్వేటవ్ మౌత్ పీస్ లుగా ఫాక్స్ న్యూస్ వంటివి పని చేస్తున్నాయి. పెడ ధోరణులను గుర్తించి చూపించడమే కాకుండా, మీడియాలో వస్తున్న మార్పుల మీద సశాస్త్రీయ నివేదికలు తయారు చేస్తున్నాయి ఇలాంటి సంస్థలు. 13,000 రేడియో స్టేషన్లు, 1700 టీవీలు ఉన్న అమెరికాలో పత్రికల సర్క్యులేషన్ మొత్తంగా 5.53 కోట్లు. యాభయ్యేళ్ళ కిందట అంటే 1960లో ఆ సంఖ్య 5.89 కోట్లు. అందుకే, ప్రింట్ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న ఆందోళనకు గురి చేస్తోంది. అదే సమయంలో ఇంటర్నెట్ యూజర్స్ సంఖ్య 20 కోట్లకు చేరుకుంది. జనాభాలో 68 శాతం మంది ఇంటర్నెటిజన్సే. కోటిన్నర లక్షల శ్రోతలను సంపాదించడానికి అమెరికన్ రేడియోకు 40 ఏళ్ళు పట్టింది. అదే కోటిన్నర ప్రేక్షకుల్ని సంపాదించడానికి టీవీకి పట్టిన సమయం కేవలం 13 ఏళ్ళు. సమాన సంఖ్యలో యూజర్స్ ను గెల్చుకోవడానికి ఇంటర్నెట్ కు నాలుగేళ్ళు సరిపోయాయి. ఆ తరువాత పదేళ్ళలో 20 కోట్ల మంది నెట్ లో మునిగితేలుతున్నారు. ఇలాంటి డేటాను సిద్ధం చేయడమే కాకుండా సెమినార్లతో భవిష్య కార్యాచరణను రచించే బాధ్యతను కూడా ఫ్రీడమ్ ఫోరమ్ నిర్వర్తిస్తుంది. పత్రికా పాఠకుల సంఖ్య పెరగడం మాని తగ్గుముఖం పడుతున్న కష్ట కాలంలో స్థానిక వార్తలు (local content) అచ్చు మాధ్యమానికి కొత్త ఊపిరినిస్తున్నాయి. అమెరికాలోని 85 శాతం వార్తా పత్రికలు 50,000 కన్నా తక్కువ సర్క్యులేషన్ కలిగినవేని ఫ్రీడమ్ ఫోరమ్ కన్సల్టెంట్ జీన్ మేటర్ చెప్పారు. పడిపోతున్న సర్క్యులేషన్ సమస్యను  ఎదుర్కోవడానికి న్యూస్ పేపర్ సంస్థలను కాకుండా సమాచార సంస్థలను నడపాలనే సూచన అమెరికన్ మీడియానే కాదు మన తెలుగు మీడియాను కూడా పదేళ్ళ కిందటే మేల్కొల్పింది.

నార్త్ కెరోలినా రాష్ట్ర రాజధాని ర్వాలీ నగరంలో పని చేస్తున్న సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ జర్నలిస్ట్స్ (SPJ) కూడా ఇలాంటిదే. నిజాన్ని చెప్పినందుకు సమస్యల పాలైన జర్నలిస్టులకు ఈ సంస్థ అండగా నిలుస్తుంది. అంతేకాదు, నైతిక విలువలు లేని జర్నలిస్టుల పేర్లతో బ్లాక్ లిస్ట్ కూడా తయారు చేస్తుంది. ఇలాంటి సంస్థలన్నీ సభ్యత్య రుసుముతో పని చేస్తున్నాయి. ఎస్.పి.జేలో సభ్యత్వ రుసుము ఏడాదికి 80 డాలర్లు. అందులోని సభ్యుల సంఖ్య 10 వేలకు పైమాటే. పబ్లిక్ ఎడిటర్ లేదా ఓంబుడ్స్ మన్ లను నియమించుకోవడం ఒక పక్క జరుగుతూనే ఉంది. మరో వంక మీడియా విలువల మీద నిఘా వేసే సంస్థలూ పని చేస్తున్నాయి. మన దగ్గర కూడా ఇలాంటి ఫోరమ్ లు రావాల్సిన అవసరం చాలా ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థల వల్ల ఎంతో కొంత పని జరిగితే జరిగి ఉండవచ్చు. కానీ, పర్యవేక్షణ కోణంలో వాటి కృషి అంతంత మాత్రం. రాష్ట్రంలో 2009 ఎన్నికల సందర్భంగా పెయిడ్ న్యూస్ పేరుతో పత్రికలు కోట్లకు కోట్లు నొక్కేసిన వైనం మీద భారత ప్రెస్ కౌన్సిల్ నియమించిన ఇద్దరు సభ్యుల (కె. శ్రీనివాసరెడ్డి, పరంజయ్ గుహ ఠాకూర్తా) సబ్ కమిటీ ఇచ్చిన 71 పేజీల నివేదికను తొక్కి పట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు జరిగాయో తెలిసిందే. “Publishers’ Interests” కోసే ప్రెస్ కౌన్సిలే ప్రెస్ సెన్సార్ షిప్ కు పాల్పడేందుకు సిద్ధపడింది. “Payper” Culture అంటూ హిందూ పత్రికలో రాసిన ఎడిట్ పేజి వ్యాసంలో సీనియర్ జర్నలిస్ట్ పి. సాయినాథ్, “అలాంటి చారిత్రక తప్పిదానికి ప్రెస్ కౌన్సిల్ పాల్పడకూడదని ఘాటుగా హెచ్చరించిన సంగతి కూడా మనకు తెలుసు. Paid News Syndrome ఎలక్ట్రానిక్ మీడియాకూ విస్తరించింది. పెయిడ్ న్యూసే కాదు మీడియాను ప్రలోభపెట్టే మార్గాలు ఇంకా చాలానే ఉన్నాయి.

ఇలాంటి ధోరణుల మధ్య మన మీడియా ఆత్మావలోకనం చేసుకోవాలి. వాటర్ గేట్ కుంభకోణం వెలుగు చూసిన ఉదంతం అమెరికాలో ఒక తరాన్ని జర్నలిస్టులు కావడానికి ప్రేరేపించింది. ఇటీవలి కాలంలో మన రాష్ట్రంలో దళిత, స్త్రీవాద, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు యువతను జర్నలిజం వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నాయి. వరదలు, ప్రకృతి బీభత్సాలు సంభవించినప్పుడు మీడియా ద్వారా మంచి చేయవచ్చనే ఆలోచన నవతరానికి కలుగుతోంది. ఇక భావజాలవ్యాప్తి ప్రభావం ఎంత ఉద్ధృతంగా ఉంటుందో తెలంగాణ ఉద్యమం చాటి చెప్పింది. మెదళ్ళలో రగులుతున్న భావాలు ఉన్న వారు సహజంగానే జర్నలిజం పట్ల ఆకర్షితులవుతారు. పైగా, టీవీ న్యూస్ తో జర్నలిజానికి గ్లామర్ పెరిగింది. ఈ దశలో మార్గదర్శకత్వం వహించే వ్యవస్థల నిర్మాణం జరగాలి. జర్నలిస్టు సొసైటీలు ఇళ్ళ స్థలాల కోసం కాకుండా చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని జనానికి, జర్నలిస్టులకు తెలియాలి.

చివరగా, ప్రస్తుతం వృత్తిలో కొనసాగుతున్న మనలాంటి జర్నలిస్టులు ఈ దిశగా ఏం చేయాలి? “రోల్ ఆఫ్ ది ప్రెస్ ఫర్ వెర్నాక్యులర్ జర్నలిస్ట్స్” పేరుతో నెలరోజుల పాటు అయిదు నగరాల్లో జరిగిన ఈ ప్రోగ్రామ్ లో అక్కడి సీనియర్ జర్నలిస్టులతో జరిపిన సంభాషణలో నాకు నచ్చిన విషయాలు ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తాయని ఆశిస్తాను.

–      వార్త అంటే కేవలం వాస్తవాలేనా? వాస్తవాలను యథాతథంగా నివేదించడం వల్ల “సత్యం” తెలుస్తుందా? అందుకే, వార్తను భిన్న కోణాల నుంచి నివేదించాలి.

–      ప్రతి వార్తా కథనానికి, దానికి సంబంధించిన జన సామాన్యం ఒకటుంటుంది. కథనంతో సంబంధం ఉన్న ప్రజలతో మాట్లాడాలి.

–      పాత్రికేయుడు ఒక కార్పొరేట్ ఉద్యోగిలాగా ప్రజా జీవితం నుంచి బయటకు రాకూడదు. నిత్యజీవితంలో సగటు, సామాన్య ప్రజలతో సంబంధాలు లేని వాడికి సమాజం పట్ల కన్సర్న్ ఉండదు.

–      సమస్య దొరగ్గానే పండగ చేసుకోవద్దు. మీడియాలో పరిష్కారాలను సెలబ్రేట్ చేయాలి.

–      సంబంధిత రంగాల నిపుణుల మద్దతు తీసుకోవాలి.

–      ముఖ్యంగా, ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను బాధ్యులను చేసి ప్రశ్నించడంలో సామాన్య ప్రజలకు సహకారం అందించాలి.

వ్యక్తి నిర్వర్తించదగిన ఈ బాధ్యతలతో పాటు మనం ఒక సమాజంగా జర్నలిజాన్ని బోధించే సంస్థలను పెంచాలి. వాటిల్లో వయసుతో నిమిత్తం లేకుండా విద్యార్థులను చేర్చుకోవాలి. పాజిటివ్-ప్రాక్టికల్ జర్నలిజం పాఠ్యాంశాలను సమకాలీన పరిణామాలతో సమన్వయిస్తూ రూపొందించాలి. మల్టిపుల్ వేస్ ఆఫ్ జర్నలిజం బోధిస్తున్నన్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీ జర్నలిజం కళాశాలలో ఇంజనీర్లు, డాక్టర్లు, ఇంకా ఇతర వృత్తి నిపుణులు విద్యార్థులుగా ఉన్నారు. “అంతేకాదు, నాకు ఒక 66 ఏళ్ళ విద్యార్థి కూడా ఉన్నారు” అని ఆ కళాశాల డీన్ శ్రీనాథ్ శ్రీనివాసన్ అన్నారు. ఎన్. రామ్, బర్ఖా దత్, ఇందర్జీత్ బధ్వార్ వంటి ప్రముఖ జర్నలిస్టులెందరో కొలంబియా జర్నలిజం కాలేజిలో చదువుకున్నారు.

జర్నలిజానికి విశ్వసనీయతే ఆయువు. అందుకే, స్వచ్ఛంద పర్యవేక్షణ సంస్థల రూపంలో స్వీయ రక్షణ కవచాన్ని మనమే నిర్మించుకోవాలి. జర్నలిజం బోధనను విస్తరించాలి. ఆ దిశగా తేజస్ కూడా కృషి చేయడం నాకు ప్రత్యక్షంగా తెలుసు. జర్నలిజం విద్య వ్యాప్తి చెందడం వల్ల అందరూ జర్నలిస్టులు అయిపోతారా? కానక్కర్లేదు. కానీ, people will be their own editors అన్న వాక్యం నిజమౌతుంది. అప్పుడు, You can trust in us for correcting our mistakes” అని ప్రతి మీడియా పౌరుడూ చెప్పుకోకతప్పదు.

—–

Advertisements

టీవీ న్యూస్ చానళ్ళపై కొలవెరి

టీవీ చానళ్లు ముఖ్యంగా తెలుగు వార్తా చానళ్ళ మీద కొలవెరి బాణీలో యూట్యూబ్ లో ప్రత్యక్షమైన పాట: