రాత్రి ప్రయాణం

చీకటిని ఈదుకుంటూ ఇంటికి పోతుంటే

పొద్దుటి చేపపిల్లలు నక్షత్రాల గుంపులుగా చుట్టుముడుతున్నాయ్

వెనుక జేబులో దాచిపెట్టుకున్న పొద్దుటి సూర్యుడు…

లాలిపాప్స్ లా తొంగిచూస్తున్నాడు-

బుగ్గల మీద అద్దుకున్న వీడ్కోలు ముద్దులు

చెలమల్లోంచి సీతాకోకచిలుకల్లా రెక్కవిప్పుతూ రాత్రిని వెలిగిస్తుంటే..

రోడ్డు వెంబడి స్ట్రీట్ లైట్స్ తలవంచుకుని చూస్తున్నయ్-

ఒక జేబులో పర్సు, ఒక జేబులో కర్చీఫు, ఇంకో జేబులో దువ్వెన…

సంచీలో కాగితాలు.. కాగితాల్లో అక్షరాలు…

వీటన్నింటితో పాటు నాలోపలి గోడలకు అతికించిన చూపులు

ఆ చూపులకు వేలాడే చిన్ని చిన్ని జ్ఞాపకాలు… చిన్ని చిన్ని గాయాలు…

తెరవెనుక సంగీతంలా వాటన్నింటినీ కప్పేసిన ఆకాశ గానం..

చీకట్లో తోసుకుంటూ వెళుతుంటే.. గాలిబుడగ ఆకాశం

నన్ను బెలూనులా పైపైకి తీసుకెళ్ళడం…

చీకట్లో ఇంటికి ప్రయాణం బాగుంటుంది..

దూరం వెలుగులా తెరుచుకుని కరిగిపోతుంటే మరీ బాగుంటుంది..

రాత్రినీ చందమామనీ వెన్నెలనీ అయి గుమ్మంలోకి వెళ్ళాక..

నన్నల్లుకుపోవాల్సిన వర్షం

దుప్పట్లో మబ్బులా అప్పుడే ఒదిగిపోయిందేమో అన్న దిగులు తప్ప…

నలిగిన గుండెను మెత్తగా నిమిరి కొత్త ఆయువును ఊదే శ్వాసలు

కలలయానానికి లంగరు తీసేశాయేమోనన్న బెంగ తప్ప…

రాత్రినీ చందమామనీ వెన్నెలనీ విప్పేసి… ఒక్కడినే… మళ్ళీ ఒక్కడినే

చీకట్లోకి కూరుకపోతానేమోనన్న భయం తప్ప…

రాత్రి ప్రయాణం బాగుంటుంది ఎప్పుడూ..

ఈ రాత్రి ప్రయాణం లాగే!

****

రాత్రి 12.15 గం.లు, 14 మార్చి, 2012.

Advertisements