దేఖొ దేఖో గబ్బర్ సింగ్..

దేఖొ దేఖో గబ్బర్ సింగ్.. ఆల్ ఇండియాకు హైపర్ సింగ్.. టైటిల్ సాంగ్ దుమ్ము రేపింది. పిల్లా నువ్వు లేని జీవితం నూనె లోంచి వానలోకి జారిపడ్డ అప్పడం… పాట రిఫ్రెషింగ్ విజువల్స్ లోకి డోర్ తెరిచినట్లు స్వాగతం పలికింది. కెవ్వు కేక.. పాట స్పీకర్లలోనే గోల పెట్టింది. తెర మీద బొమ్మకూ సాంగుకూ ఎక్సయిటింగ్ లింకూ లేదు.. సింకూ లేదు. ఫిర్ భీ తమాషా చాలూ రహా! ఫక్తు మాస్ మాసాలా ఫార్ములాయే… విలన్ కు ఓ చిన్న కోరిక ఉంటుంది. అది తీర్చుకోవాలన్న మూర్ఖత్వం ఉంటుంది. అంతకు మించి వాడు పెద్ద తెలివిమంతుడేమీ కాదు. కాబట్టి, అన్ని సినిమాల్లో లాగే నాలుగు తన్నులు గట్టిగా తన్నగలిగిన వాడు ఎదురైతే మటాష్ అయిపోతాడు.  ఇక హీరోయిన్ అలా బొమ్మలా కనిపిస్తుందంతే.. అంతకన్నా ఎక్కువ చేస్తే మన గబ్బర్ సింగ్ కు ఎలాగూ నచ్చదు. అంతా రొటీన్.. రొటీన్…. మరి వెరయిటీ ఎక్కడుందని గబ్బర్ సింగ్ హైపర్ సింగ్ అయ్యాడు?

వెరయిటీ ఏంటంటే.. ఓపెన్ డ్రై ల్యాండ్ లో ఏ మలుపులూ లేకుండా కనిపించడం. కథంతా స్టేజీ మీద చెబ్తున్నట్లే కనిపించడం. కథ జోలికి వెళ్ళకుండా ప్రేక్షకుల మీద ఏ బరువూ పెట్టకపోవడం. టపా టపా సీను మీద సీను పడిపోతూ.. ఏం జరుగుతోందో తెలిసే లోపే ఇంటర్వెల్ బ్యాంగ్ పడిపోవడం. ఇంటర్వెల్ కే ఫుల్ మీల్స్ ఫీలింగ్ కలగడం. ఇక.. ఆ తరువాతంతా బోనస్సే అనిపించడం. బాబోయ్.. నాకేం తెల్వదు.. కల్యాణ్ బాబు అలా చేసుకుంటూ పోతుంటే నేనలా కెమేరా చిచ్చి నొక్కించానంతే అని హరీశ్ శంకర్ నిజాయితీగా చెప్పుకోవడం.

ఏదేమైనా.. ఇదంతా కూడా ఒకప్పుడు రొటీనే. ఇప్పుడు డిజైనర్ కత్తులతో, ఇద్దరు లేక ముగ్గురు హీరోయిన్ల స్టెప్పులతో… కెమేరా లెన్సు మీద చిందే రక్తపు మరకలతో ముదిరిపోయిన ఫియాక్షన్ సినిమాల వెరయిటీ ప్రేక్షకుల్ని దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో.. గబ్బర్ సింగ్ ట్రెండ్ ను ఫాలో అయినట్లుగా కాకుండా ట్రెండును సెట్ చేసినట్లుగా భ్రమ కల్పిస్తుంది. ఇంకా.. టాంటటాంట.. టటటాం.. అనే సిగ్నేచర్ ట్యూన్ ల మధ్య.. పేరు, గోత్రాలు చెప్పడానికి నేనేమైనా గుడికొచ్చానేంట్రా లాంటి గబ్బర్ పంచ్ లు, దేవిశ్రీ ట్యూనులు టైమ్ చూసుకోకుండా చేశాయి. ఒక్క ముక్కలో ఈ సినిమాకు కొంచెం తిక్కుంది. కానీ, దానికో లెక్కుంది. సీను సీనుకో కిక్కుంది. అందుకే, టికెట్ ఖర్చుతో హిసాబ్ సెటిలైంది. అందుకే.. నాలుగు ముక్కలు రాయాలన్పించింది.

Advertisements

పార్లమెంట్ సాక్షిగా…

పార్లమెంటు తొలిసారి సమావేశమై 60 ఏళ్ళు అయిన సందర్భంగా ఏర్పాటైన ఉభయసభల ప్రత్యేక సమావేశంలో చట్టసభల ప్రతినిధులు ఉదాత్తమైన తీర్మానాలు చేశారు. పార్లమెంటు గౌరవాన్ని ఔన్నత్యాన్ని పవిత్రతను కాపాడతాం. ప్రజాస్వామ్య విలువలను పటిష్ట పరచి, మార్పునకు పార్లమెంటును తిరుగులేని వేదికగా తీర్చిదిద్దుతాం. పార్లమెంటు ద్వారా ప్రజా ప్రతినిధుల జవాబుదారీతనాన్ని పెంపొందిస్తాం. మరీ ముఖ్యంగా.. జాతి నిర్మాణమనే పరమ పవిత్ర లక్ష్యాన్ని సాధించేందుకు పునరంకితమవుతాం.

వినడానికి ఎంతో ఓదార్పుగా ఉన్నాయి ఈ తీర్మానాలు. గాయపడ్డ వారికి కావల్సింది ఓదార్పే. ఈ అరవై ఏళ్ళలో ముఖ్యంగా.. గత రెండు దశాబ్దాలలో పార్లమెంటు గౌరవం ఎన్నోసార్లు గాయపడింది. దేశంలో మార్పు సాధించడానికి పార్లమెంటే వేదిక అన్న సంగతి జాతి జనులు దాదాపు మరచిపోయారు.ఇక,  ప్రజా ప్రతినిధుల జవాబుదారీతనం గురించి చెప్పాలంటే.. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఎన్నికల్లో గెలవడంతోనే గౌరవ సభ్యుల యుద్ధం ముగిసిపోతుంది. ఇక, సిద్ధాంతం.. లక్ష్యం.. అనేవి ఉంటాయని, వాటికోసం పోరాడి గెలవడమే అసలైన యుద్ధమని, అది పార్లమెంటులోనే జరగాలన్న ఎరుక చచ్చి చాన్నాళ్ళయింది. అందుకే, జాతి నిర్మాణమనే పరమ పవిత్రమైన లక్ష్యాన్ని సాధించేందుకు మరొక్కసారి అంకితం కావాల్సిన అగత్యం ఏర్పడింది.

పదిహేనేళ్ళ కిందట భారతదేశ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంగా కూడా గౌరవ సభ్యులు దాదాపు ఇలాగే.. సభా కార్యక్రమాలకు అడ్డం పడమని చెప్పుకున్నారు. కానీ, ఎంత మంది ఆ మాట మీద నిలబడ్డారో మనకు తెలుసు. అరుపులు, కేకలు, వెల్ లోకి దూసుకెళ్ళడం.. సభను పదే పదే వాయిదా వేయించి విజయ గర్వంతో బయటకు రావడం.. మీడియా మైకుల ముందు గొంతు చించుకోవడం ఒక సంస్కృతిగా స్థిరపడుతోంది.

సభ జరిగే రోజులు తగ్గిపోయాయి. సభ్యుల హాజరు తగ్గిపోయింది. ఒక అంశంపై లోతుగా, శ్రద్ధగా చర్చించడమన్నది కాలం చెల్లిన విధానమైపోయింది. అట్లా చేస్తే.. ఒక్క మీడియా కెమేరా కూడా తమ ముఖాన్ని చూడదన్న అభిప్రాయం దాదాపు అన్ని రాజకీయ పార్టీల నాయకుల్లో గూడు కట్టుకుంది. అట్రాక్టింగ్ అటెన్షన్ ఆఫ్ ది మాస్ ఆడియన్స్ అన్నది ఎలక్ట్రానికి లైవ్ టెలికాస్టింగ్ యుగంలో మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. లైవ్ లో దేశమంతా చూస్తున్న సభలో ఇష్యూను ఫోకస్ చేయడం కన్నా తమను తాము ఫోకస్ చేసుకోవడానికి షార్ట్ కట్స్ వెతుక్కునే చౌకబారు ఎత్తుగడల రాజ్యం నడుస్తోంది.

ఒక సమస్య పరిష్కారం కావాలంటే భిన్న అభిప్రాయాల మధ్య సంఘర్షణ జరగాలి. కానీ, ఇప్పుడు జరుగుతున్నవి అభిప్రాయాల సంఘర్షణలు కావు. వ్యక్తుల మధ్య సంఘర్షణలు. పాపులారిటీ కోసం అడ్డంగా తెగబడే ఇమేజ్ వార్స్. ఈ గొడవల్లో సమస్యలు.. అభిప్రాయాలు నలిగిపోతున్నాయి. విలువైన సభా సమయం మంటగలిసిపోతోంది. చివరకు సభ్యుల నోటి దుబారా ఖర్చు.. సామాన్యుడి నడ్డి మీదే పడుతోంది. సిపిఎం నేత బాసుదేవాచార్య చెప్పినట్లు.. చాలా మంది తమ జీవితంలో ఎలాంటి మార్పూలేకుండా ఇదే ఆకాశం కింద పుట్టి.. ఇదే ఆకాశం కింద చనిపోతున్నారు.

ఎందుకిలా జరుగుతోంది? ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటి పార్లమెంటులో విలువలు అడుగంటి పోతున్నాయెందుకు? ఎన్నికల రాజకీయాల్లో గెలుపు గుర్రాల కోసం వెతికే సంస్కృతే ఈ దురవస్థకు ప్రధాన కారణం. అక్రమమో.. అరాచకమో చేసి వోట్లు కొల్లగొట్టేవాడే మొనగాడన్న భావనతో ఉన్నాయి రాజకీయ పార్టీలు. అందుకే, నేర చరిత్ర ఉన్న వాళ్ళు, అవినీతి మామూలేననే స్వభావంతో కరడుగట్టిన వాళ్ళు చట్ట సభల్లోకి ఎంటరవుతున్నారు.

బొంబాయి బులియన్ అసోసియేషన్ నుంచి 2 వేల 700 రూపాయల లంచం తీసుకున్నారని హెచ్.జి. ముద్గల్ ను బహిష్కరించింది 1951 నాటి పార్లమెంట్. ఇప్పుడు వేల కోట్ల రూపాయల అక్రమార్కులు పార్లమెంటులోకి వస్తున్నారు. అధికార ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ నేర చరిత్రులు ఉన్నారు. కనీసం 76 మంది ఎం.పిలు క్రిమినల్ రికార్డులతో పార్లమెంటులోకి అడుగు పెడుతున్నారు. వీరు కూడా ప్రజా సమస్యల కోసమే మాట్లాడతారని అనుకోవాలా?

హత్య, అత్యాచారం, దోపీడీ, ఫోర్జరీ వంటి దారుణమైన నేరాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా ఇప్పుడు చట్ట సభల్లో తెల్ల బట్టలు వేసుకుని కనిపిస్తుంటే.. పార్లమెంటులో జవాబుదారీతనం గురించి మాట్లాడడం విచిత్రంగా ఉంటోంది. ఎన్నికల్లో గెలవడానికి ఇరవై… ముప్ఫై కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో రాజకీయం తక్కువ పెట్టుబడి మీద వందల రెట్ల లాభాలు ఆర్జించగల వ్యాపారంగా మారిపోయింది. ఒక వైపు దేశంలో మెజారిటీ యువతరం నెలకు వేయి, రెండు వేల రూపాయల ఉద్యోగాల కోసం నానా చాకిరీ చేస్తుంటే, మరో వైపు వేలు, లక్షల కోట్ల రూపాయలను నాయక నేరస్థులు అలవోకగా దండుకుంటున్నారు. నడుస్తున్న చరిత్రను చూస్తుంటే.. సామాన్యుడి కడుపు రగిలిపోతోంది. 50 ఏళ్ళ స్వాతంత్రమని, 60 ఏళ్ళ పార్లమెంటు అని మొక్కుబడిగా ఈ ప్రతినిధులు చేస్తున్న తీర్మానాలు సగటు మనిషికి హిపోక్రసీకి పరాకాష్ఠగా కనిపిస్తున్నాయి.

1993లో స్పీకర్ శివరాజ్ పాటిల్ కమిటీల వ్యవస్థను ఏర్పాటు చేశారు. పార్లమెంటు కార్యకలాపాలను టీవీలో చూపించేందుకు అనుమతించారు. ఆ ప్రయత్నంతో పరదా తొలగింది. నాయకులు బాధ్యతగా ప్రవర్తిస్తారనుకుంటే.. ఫాల్స్ హీరోయిజాన్ని ప్రదర్శించే చీప్ లీడర్షిప్ టాక్టిక్స్ ను జనం టీవీ తెరలో చూడాల్సి వచ్చింది. పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి ఎం.పిలు లంచం తీసుకున్నారు. అది 2005లో జరిగిన దారుణం. ఒక్కో ప్రశ్నకు 30 వేల నుంచి లక్షన్నర రూపాయల దాకా లంచం తీసుకున్నారని ఓ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్.. చట్ట సభల చెత్త సభ్యులను ఏకి పారేసింది. పార్లమెంటు ఓ కమిటీ వేసి ఆ పదకొండు మందిని వెలేసింది. కానీ, వారిలో ఎవరికీ శిక్ష పడలేదు. అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు యూ.పిఏ ప్రభుత్వానికి దూరం జరిగిన 2008లో పార్లమెంటులో నోట్ల కట్టల ప్రహసనం మన చరిత్రకు మరో తలవంపు. పార్లమెంటులో మర్యాద లోపించిన సందర్భాలు ఇలా అనేకం. ఘనత వహించిన మరో సభ్యుడు మనుషులను అక్రమంగా తరలించే నేరంలో చిక్కుకుని పరువు తీశాడు. ఎం.పి ల్యాడ్స్ అక్రమాల గురించి చెప్పుకోవడమే సిగ్గు చేటు.   చట్ట సభల్లో ఏం చేసినా శిక్ష పడదు. అదే పని బయట చేస్తే ఏ అనామకుడైనా జైలు వూచలు లెక్కించాల్సిందే. అందరికీ ఒకే న్యాయం అంటే ఇదేనా? ఈ ప్రశ్నకు 60 ఏళ్ళ తరువాత కూడా సమాధానం లేదు.

డిస్ రప్షన్, కరప్షన్… రెండూ ప్రజాస్వామ్యంలో ప్రజల జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయి. ప్రజల డబ్బుతో నడుస్తున్న సభల్లో ప్రజల సమస్యల గురించి చర్చలు జరగడం లేదు. మొన్నటి శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ సమయం 71 శాతం, లోక్ సభ సమయం 67 శాతం వృథా అయిందని లెక్కలు చెబుతున్నాయి. వందకు పైగా బిల్లులు ఆమోదం పొందాల్సి ఉండగా.. 17 బిల్లుల్ని మాత్రమే వింటర్ సెషన్ ఆమోదించింది. అంటే, మన చట్ట సభల సభ్యులకు చట్టాలు చేసే తీరిక కూడా లేదు. మహిళా బిల్లు, లోక్ పాల్ బిల్లుల గొడవల్తో సాగి సాగి పోతున్నాయి. మహిళా బిల్లును వ్యతిరేకించినందుకు మమతా దీదీ ఓ ఎస్.పి సభ్యుడ్ని గల్లా పట్టుకున్న సంగతి కూడా తెలిసిందే. ఆవేశాలు.. ఆగ్రహాలు.. సీన్ క్రియేట్ చేయడం వంటివి కొంత మంది లీడర్లకు అబ్సెషన్ గా మారిపోయాయి. అసలే సెషన్ జరిగే రోజులు తగ్గిపోయాయి. మెంబర్స్ అటెండెన్స్ దారుణంగా పడిపోతోంది. స్పెషల్ సెషన్ కు కూడా సగం మంది సభ్యులు రానే లేదు. రానివాళ్ళు రాకపోగా, ఉన్న వాళ్ళయినా.. ఉన్న సమయంలో చట్టాల గురించి చర్చించకపోతే.. ఎన్నికలెందుకు.. ఇంత మంది సభ్యులు గెలిచి.. పార్లమెంటులోకి రావడమెందుకు?

ఆత్మపరిశీలన కోసం.. జరిగిన తప్పుల్ని దిద్దుకోవడం కోసం.. భవిష్యత్తును బాగు చేసుకోవడం కోసం.. ఈ స్పెషల్ సెషన్ జరిగింది. ఈ సెషన్ లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, స్పీకర్, ప్రతిపక్ష నాయకుడు చాలా ఆత్మపరిశీలన చేసుకున్నారు. తమ బాధ్యతను గుర్తు చేసుకున్నారు.

ఈ ఆత్మ పరిశీలన బాగుంది. కానీ, దీనికోసం అరవయ్యేళ్ళు ఆగాల్సిన పని  లేదు. డబ్బులకు ప్రశ్నలు అమ్ముకున్న నాడే జరిగి ఉండాల్సింది. పోనీ.. ఈ సందర్భంగానైనా జరిగినందుకు సంతోషిద్దాం. పార్లమెంటు ఔన్నత్యాన్ని కాపాడడం.. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ వంటి భాషణల సంగతి ఎలా ఉన్నా.. ఈ మెంబర్లు తాము ప్రజలకు బాధ్యులమన్న సంగతి గుర్తుంచుకోవాలి. పార్లమెంటు సమయాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా వారు వేస్ట్ చేస్తున్నది ప్రజల కష్టార్జితాన్ని అన్న సంగతి గుర్తుంచుకోవాలి. రాజకీయ నాయకులు అంటే సోషల్ పారసైట్స్ కాదని నిరూపించుకోవాలి. పది శాతం మంది కరప్ట్ అండ్ డిస్ రప్టివ్ ఎలిమెంట్స్ ఉన్నా మొత్తం ప్రజాస్వామ్య సంస్కృతే దెబ్బతింటుందని తెలుసుకోవాలి. పార్టీలకు అతీతంగా మంచిని, చెడును చెడు అనే నాయకత్వం కావాలి. వీళ్ళ అదృష్టం కొద్దీ ప్రజలకు ఇంకా ప్రజాస్వామ్యంలో నమ్మకం చావలేదు. ఆ నమ్మకాన్ని బతికించడం ప్రతి సభ్యుడి బాధ్యత. సమాజ గౌరవం, అభివృద్ధి నాయకుడి బాధ్యత నుంచి మొదలవుతాయి. ఇన్నేళ్ళ ప్రయాణం నుంచి దేశాన్ని వెనక్కి తీసుకుపోవద్దన్నదే ఈ దేశ ప్రజల ఆశ.. ఆకాంక్ష.

—–

రోగ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ అంటే కొందరికిష్టం. కొందరికి కష్టం. మరికొందరికి అయిష్టం. ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా.. ఆయనను పట్టించుకోకుండా ఉండలేం. You may not like him, but you cannot ignore him… అనే వాక్యం వర్మకు బాగా సరిపోతుంది. లేటెస్ట్ గా ఆయన డిపార్ట్ మెంట్ అనే సినిమా తీశారు. ముందుగా మేకింగా ఆఫ్ డిపార్ట్ మెంట్ ఇంటర్నెట్లో రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ విజువల్స్ చూస్తే ఆయన కెమేరాతో కాదు.. సినిమా మీడియాతోనే ఓ ఆట ఆడుకున్నారనిపిస్తుంది.

This is not about reinventing rules. Its about destroying them. డిపార్ట్ మెంట్ సినిమా మేకింగ్ విజువల్స్ చివరల్లో కనిపించే వర్మ సైన్డ్ స్టేట్ మెంట్ ఇది. రూల్స్ కొత్తగా నిర్వచించడం కాదు. వాటిని ధ్వంసం చేయడమే డిపార్ట్ మెంట్ మేకింగ్ అని దానర్థం. చాలా బాగుంది కదా. ఇంటిగ్రిటీ ఉన్న వాడికి రూల్సే అక్కర్లేదంటాడు ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత ఆల్పర్ట్ కామూ. మంచి సినిమా తీసినా.. చెత్త సినిమా తీసినా.. రాముకు ఫిల్మ్ మేకింగ్ అంటే ప్యాషన్. అందులో డౌట్ లేదు.

ఓ చిన్న డి.ఎస్.ఎల్.ఆర్ కెమేరా.. క్యానన్ 5డి. దాన్ని కర్రకు కట్టేసి.. చేతికి కట్టేసి.. కారు టైర్స్ వెనకాల బిగించి.. షూటింగ్ చేసేశాడు వర్మ. వందల సినిమాలు చేసిన బిగ్ బీకే ఇదంతా వింతగా ఉంది. ఈ అన్ కన్వెన్షనల్ మేకింగ్ చూసి ఆశ్చర్యపోయిన అమితాబ్ బచ్చన్ ఏదో రిహార్సల్ కు వచ్చినట్లుందన్నారు.

ఈ సినిమా చిత్రీకరణకు రాము ఓ పేరు కూడా పెట్టాడు. రోగ్ ఫిల్మ్ మేకింగ్ అని. రోగ్ ఫిల్మ్ మేకింగ్ అంటే.. ఉన్న పద్ధతులకు భిన్నంగా.. కొత్తగా చేయడం. అది కొంత కాలానికి ఓ పద్ధతిగా మారడం.

నిజమే.. రోగ్ ఫిల్మ్ మేకింగ్ ఓ పద్ధతిగా స్థిరపడుతుందో లేదో కానీ.. ప్రస్తుతానికి కొత్తగా.. డైనమిక్ గా ఉంది. డిజిటల్ రెవల్యూషన్ రామ్ గోపాల్ వర్మనే రీ ఇన్వెంట్ చేస్తున్నట్లుంది.

ఏమైనా.. రూల్స్ ను కొత్తగా నిర్వచించడం కాదు.. వాటిని ధ్వంసం చేయాలన్న వర్మ కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది. వరసగా చెత్త సినిమాలు చుట్టి ప్రేక్షకుల ముఖాన కొడుతున్నా… ఆయనంటే మొహం మొత్తడం సినీ ప్రేక్షకులకు. ఏమో.. ఆయన ఎప్పుడైనా ఏదో అద్భుతం చేయొచ్చు.. అన్న క్యూరియాసిటీ కూడా జనంలో చావలేదు.

రూల్స్ ప్రకారమే వెళ్తే.. నేనెక్కడో ఉండేదాన్ని. ఇక్కడి దాకా వచ్చే దాన్నే కాదు అంది సెల్యులాయిడ్ సుందరి మార్లిన్ మన్రో. అది ఫిమేల్ గ్లామర్. మేల్ గ్లామర్.. ఇదిగో ఇట్లాగే ఉంటుంది వర్మ డెస్ట్రాయింగ్ యాటిట్యూడ్ లాగే.

—-