ఏమయ్యాను…?

వాద్యమూ వాద్యకారుడూ ఒక్కటైపోయారు
జలజల పారే సెలయేరు
ఓ క్షణం ఆగి అలలెత్తి చూసి.. మళ్ళీ నడక సాగించింది
రాలే రంగు రంగుల ఆకులు
గాలిలో కాసేపు నిశ్చలమై సున్నితంగా నేల వాలాయి-
Image
వాద్యమూ వాద్యకారుడూ సంగీతమూ ఒక్కటై పోయారు
ధ్వని తరంగాల నడుమ చిక్కుకున్న హృదయం…
పియానో మెట్ల మీద ఉలికులికి పడుతున్న హృదయం…
.
వాద్యమూ వాద్యకారుడూ సంగీతమూ..
శ్రోతా… ఒక్కటైపోయారు-
నిశ్శబ్దం చీకట్లో ఒదిగిపోయింది
చెర్రీ పూలలా మౌనం మత్తుగా రాత్రిని సేవిస్తోంది..
.
గడియారాల ధూళి పచ్చిక బయళ్ళలో సద్దుమణిగింది
ధ్వని తరంగాలు పుప్పొడి రేణువుల్లా పరిభ్రమిస్తున్నాయి
వాద్యమూ వాద్యకారుడూ సంగీతమూ శ్రోతా
ఏమయ్యారు?
(వాషింగ్టన్ డి.సిలోని కెనెడీ సెంటర్ లో He Qizhen, Zhang Haochen అనే చైనా చిన్నారుల Piano Duet ను 2005 అక్టోబర్ లో విని తరించినప్పుడు రాసిన కవిత…)
Advertisements