లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

అంతా బాగానే ఉంటుంది
కానీ.. ఎప్పుడూ ఎక్కడో కన్నీరు చిగురు తొడుగుతున్న చప్పుడు

వూపిరి సలపరిస్తూనే ఉంటుంది..
కానీ.. గొంతుకీ గుండెకీ మధ్య గాలి క్లాట్ అయిన ఇంట్రికసీ
అన్నం సయిస్తూనే ఉంటుంది..
కానీ.. ఆకలి మలమల మాడ్చేస్తున్న మంట
నిద్ర పడుతూనే ఉంటుంది
కానీ.. రెప్పలు పడగానే ఒంటి చుట్టూ గబ్బిలాలు మాటేసిన నిశ్శబ్దం

అందరూ పలకరిస్తూనే ఉంటారు..
కానీ.. దొంగెద్దు మెడలో వేలాడే దుంగలా
నిర్దయగా వెంటాడే ఒంటరితనం

ఎన్నెన్నో నవ్వులు ఎదురవుతూనే ఉంటాయి

కానీ, లోపలి ఎడారిలో ఒక్క రాతి పలుకూ
కాంతి పరావర్తనంతో మెరవదు

స్పర్శలెన్నో దేహాన్ని తడుముతూనే ఉంటాయి
కానీ, వెచ్చదనం లేక తడి కొడిగడుతూనే ఉంటుంది..

అడుగులు ముందుకే పడుతుంటాయ్
కానీ, అంగుళం కూడా తరగని దూరం..
అందరూ.. చెరువులో చేపల్లా వీధుల్లో ఈదుతూనే ఉంటారు
కానీ, ఎవరూ ఎవరిలోంచీ వెళ్ళరు.. ఎటు వెళతారో తెలియదు!

టవర్ల మీంచి మాటలు టైఫూన్లలా
విరుచుకుపడుతూనే ఉంటయ్
కానీ, ఎవరికీ సిగ్నల్ దొరకదు-
మల్టిపుల్ అప్లికేషన్స్‌తో మైండ్ స్టక్ అవుతే..

కంట్రోల్.. ఆల్ట్.. డిలిట్ ఉండనే ఉంది..
ఒక పచ్చని వెచ్చని గాలిపరకో లేక
చల్లని చెలమల నీటిబుడగో.. వైరస్ లాగా
సాఫ్ట్‌వేర్ లోకి చొరబడితే

యాంటీ వైరస్‌ను అప్‌డేట్ చేసుకోవడానికి ఒక్క క్లిక్ చాలు-

మరీ రెస్ట్‌లెస్‌గా ఉంటే.. కావాలొక మెలికలు పోతూ
మైమరిపించే స్క్రీన్ సేవర్…
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్…

– పసునూరు శ్రీధర్‌బాబు

(Published in Andhra Jyothi “Vividha” dated 22 October, 2012)

Advertisements