ప్రేమ!

ప్రేమ మాటలా మౌనంగా ఉంటుందా?
మౌనంలా మాటగా ఉంటుందా?
మౌనమూ… మాటల తుట్టె లాంటి మోహంలా ఉంటుందా?

మోహంలో స్పర్శలా ఉంటుందా?
స్పర్శలో నలిగి వెలిగే దీపంలా ఉంటుందా?
దీపం లాంటి దేహంలా ఉంటుందా?
దేహంలోని ధూపంలా ఉంటుందా?
దూరంలా దగ్గరగా ఉంటుందా?
దగ్గరలా దూరంగా ఉంటుందా?

love
***
పచ్చికపై తడిసే వెచ్చదనంలో
తీరంలో కరిగే పాదముద్రల్లో
సందేశాలుగా కురిసే వానమబ్బుల్లో
ఎండలో వెంటరాని నీడల్లో
భుజాల మీద సూర్యాస్తమయాల్ని దాచిన సాయంత్రాల్లో
కోరికతో చీకటిని పూయించిన పున్నమి రాత్రుల్లో
చీకటి మీద కోరికను వెలిగించిన అమావాస్యల్లో
అమావాస్యల్లో సిగ్గుతో వంకర్లు పోయిన ఇంధ్రధనువుల్లో
తనువుల్లో రుతువులు చిగురేసిన పగళ్ళలో
కళ్ళల్లో శిశిరం విసిరిన విరహంలో
రాసుకోలేక దాచుకున్న కవిత్వంలో
ఎక్కడో… ఏ మూలో.. ఏదోలా… ప్రేమ!

***
ప్రేమ.. చీకటిలా మెత్తగా ఉంటుందా?
వెలుతురులా పదనుగా ఉంటుందా?
కన్నీటి వాసనలా ఉంటుందా?
చెమట పరదాలా ఉంటుందా?
పెదవుల హార్మోనియం మీద తెలియని చివరి మెట్టులా ఉంటుందా?
మెట్టు దిగాక బెట్టు చేసే దేహాల్లో అహాల్లో కలహాల్లో…
ఉత్థానపతనాల్లో
ఉడికించే క్షణాల్లో
ఊరించే మరుక్షణాల్లో
వేషంలో ద్వేషంలో ఉంటుందా?

***
శ్వాసించే వేణువులో పాటయ్యే ప్రాణవాయువులో
ఎగిరే పక్షి రెక్కల కింద నమ్మకంలాంటి శూన్యంలో
కౌగిలిలో ఇరుక్కుని ముక్కలై రాలిపడిన కాలంలో
పాదాల చెంత భృత్యుడిలా మోకరిల్లిన భవిష్యత్తులో
ప్రేమ… ప్రేమగా..!

***
ప్రేమ… ఏకాంతంలో శాంతమా?
జ్ఞాపకంలో దాగే ప్రాణమా?
చూడడానికీ దర్శించడానికీ మధ్య ఉన్న అగాధమా?
అంతుచూడమని కవ్వించే ఆకాశ నీలమా?

***
ప్రేమకు అటూ ఇటూ ఆకాశమే
ప్రేమలోనూ ఆకాశమే
మెరుపు తీగల మీద కుదురుగా వాలిన పక్షులు
వెలుతురు పూలల్లే పరిభ్రమిస్తున్న అంతరిక్షానివైనప్పుడు….
నీవు.. ప్రేమ!
నీవే ప్రేమ!!

(5 డిసెంబర్, 2012, రాత్రి 1.49 గం.లు)

Advertisements