వ్యాసాలు, Uncategorized

సీమాంధ్ర నేతల్లారా.. తెలంగాణపై ఎందుకింత రగడ?

సీమాంధ్ర నాయకుల్లారా.. దయచేసి ఒక విషయం గమనించండి. తెలంగాణ ప్రజలు విడిపోతామని అంటున్నారు. తమకొక ప్రత్యేక రాష్ట్రం ఇమ్మని ఏమీ అడగడం లేదు. కలిసి చేసిన ప్రయాణంలో కష్టం మాది, సుఖం మీది అయిందని లెక్క చెబుతున్నారు. కష్టమో నష్టమో మా రెక్కల కష్టమ్మీద మేం బతుకుతామని అంటున్నారు. ఇందులో మీరు ఇచ్చేదేమీ లేదు. మాకున్న రాష్ట్రాన్ని మాకు ఎప్పట్లా వదిలేయండని అడుగుతున్నారు. ఇంత చెప్పినా, ఇంకా నూటొక్క అబద్ధాలంటూ బొంకు అంటగట్టే ఆధిపత్యాన్నే ప్రదర్శిస్తున్నారు. హైదరాబాదును తామే అభివృద్ధి చేశామనే అహంకారాన్నే ప్రదర్శిస్తున్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల భావోద్వేగాలను లాబీయింగుతో తొక్కేయగలమన్న అప్రజాస్వామిక నైజాన్నే చాటుకుంటున్నారు. వందలాది మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చని మీరు కలసిమెలసి బతుకుదామని కబుర్లు చెబితే నమ్మి నశించాలా? మీ ఆధిపత్యాన్ని భరించి ఉనికిని కోల్పోవాలా?

మీది సమైక్యవాదం కాదు.

సమైక్యతకు అర్థం తెలిసిన వాడెవ్వడూ

ఉద్యమాన్ని హేళన చెయ్యడు

ఉప్పొంగే భావోద్వేగాలకు వక్రభాష్యాలు చెప్పడు-

మీది సమైక్య వాదం కానే కాదు..

ఒక ప్రాంతం మీద

ఒక భాష మీద

ఒక సంస్కృతి మీద

ఒక సంపద మీద ప్రారంభించిన దాడిని పరిపూర్ణం చేయడమే మీ సమైక్యవాదం-

అర్థ శతాబ్దానికి పైగా కొనసాగుతున్న ఈ దాడి మీద ప్రతిదాడే ప్రత్యేక తెలంగాణ పోరాటం. విశాలాంధ్ర నాటకానికి మీరు తెరదించడమే ఈ సంఘర్షణకు ప్రజాస్వామిక పరిష్కారం.

తెలంగాణ అన్న మాట లేని మీ సమైక్య నినాదాలకు

తెలంగాణ ఆత్మ లేని మీ సోదర భావనకు

తెలంగాణను హైదరాబాదు లేని అనాథను చేయాలనే మీ పెద్దరికానికి

తెలంగాణ గుండె మీద కుంపటిలా కూర్చుని, గుండెను పెరికి.. మీకు లేనిది ఎవరికీ లేకుండా చేయాలనే మీ అమానవీయ రాజకీయ వ్యూహాలకు పెడ్తున్నాం… పెద్ద దండం.

మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. మీ రాజకీయాలు మీరు ఆడుకోండి. మీ ఆటలకు సమైక్యవాదంతో ముడిపెట్టకండి. ఇంకా మేము ఓపిగ్గా ముడులు విప్పుకుంటూ పోయే ప్రయత్నమే చేస్తున్నాం. మీరు దారాలు తెంపాలని చూడకండి.

మేం ప్రజలం కలిసే ఉంటాం. తెలుగువారిగా కలిసే ఉంటాం. విశాల భారతంలో తెలుగువారికి రెండు రాష్ట్రాలున్నాయని గర్వంగా చెప్పుకుంటాం. తెలంగాణది ప్రాంతీయాధిపత్యం లేని స్వపరిపాలనను స్వప్నించే ఉద్యమం. ప్రాంతాల మధ్య యుద్ధం కాదు. తలెత్తుకుని నిల్చున్న చార్మినార్ బురుజుల్ని చూసి, గోల్కొండ కోట చెప్పే చారిత్రక ప్రాభవాన్ని విని ఎవరైనా పరవశించిపోవచ్చు.  దివిసీమ ఇసుకతిన్నెల మీద వెన్నెల్లో, కోనసీమ పచ్చల హారాల వంపుల్లో  ఎవరైనా కవిత్వమైపోవాలని, విశాఖ తీరంలో పాదముద్రల జ్ఞాపకాల్ని రచించాలని… ఏడుకొండల వెంకన్న ఆశీస్సులు ఎప్పటికప్పుడు అందుకోవాలని.. మాకూ వుంటుంది. ఈ ఆకాంక్షల నుంచి మనల్ని ఏ సరిహద్దులూ ఆపలేవు. సరిహద్దులు పటంలోనే ఉంటాయి. పాలనా సౌలభ్యం కోసమే ఉంటాయి. రాజకీయ, వ్యాపార కుయుక్తులు చేసే గాయాలే చరిత్రలో నెత్తుటి మరకలుగా మిగిలిపోతాయి.

మనం ఎలా మిగిలిపోవాలో తేల్చుకునే సమయం వచ్చింది.

ఇంకా నాన్చుకుంటూ పోతే గాయాన్నే కెలుక్కుంటూపోతున్నట్లవుతుంది.

ఆధిపత్య దాడిని అప్రతిహతంగా కొనసాగించాలనే దుర్మార్గానికి సమైక్యవాదమని పేరు పెట్టకండి. నిజమైన సమైక్యత అంటే ద్వేషాన్ని పెంచకపోవడమేనని, సాటి ప్రజల భావోద్వేగాల్ని గౌరవించడమేనని తెలుసుకోండి. తెలంగాణ ప్రజలు కోరుతున్నది కొత్త రాష్ట్రం కాదని, ఒకప్పుడు తమదిగా ఉన్న రాష్ట్రమేనని గుర్తించండి. ఇంగ్లీషులో చెప్పాలంటే, ఇది సెపరేట్ స్టేట్ డిమాండ్ కాదు. ఇది డీ-మెర్జర్ కోసం చేస్తున్న విజ్ఞాపన. అర్థం చేసుకోండి.

—-

Uncategorized

కొత్త సంవత్సర శుభాకాంక్షలు

హితులకు, సన్నిహితులకు, మిత్రులకు, శత్రువులకు, ఆప్తులకు, ప్రత్యర్థులకు, ఆత్మీయులకు, అసూయాగ్రస్థులకు… తమ ప్రపంచంలో నన్ను ఎప్పుడో ఒకప్పుడు, ఎంతో కొంత సేపు, ఏదో ఒకలా చూసుకున్న వారందరికీ….

కొత్త సంవత్సర శుభాకాంక్షలు..

happy new year

మీరు ఆశించే మంచి పనులన్నీ హాయిగా జరిగిపోవాలని..

నలుగురికీ మంచి చేసే విజయాలను మీరు సొంతం చేసుకోవాలని…

ఆనందమే జీవితం కావాలని ఆశిస్తూ…

మీ..

పసునూరు శ్రీధర్ బాబు