ఫలించిన అరవై ఏళ్ళ కల.. తెలంగాణ


అరవయ్యేళ్ళ కల ఫలించింది.
అలుపెరుగని నిరంతర ఉద్యమం విజయపతాకాన్ని ఎగురవేసింది.
ఉద్యమంతో ఆశయం సిద్ధిస్తుందన్న నమ్మకాన్ని ప్రజాస్వామ్యం పరిరక్షించింది.
తెలంగాణ ప్రజలకొక ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించడానికి రంగం సిద్ధమైంది.
నా తెలంగాణ… కోటి రతనాల వీణ అని పల్లవించిన దాశరథి కైత.. తెలంగాణ ఉనికి పోరాటాన్ని ఉత్సవ సౌరభంలో ముంచెత్తింది.

Jai Telangana
ఒప్పందాలను నమ్మి ఒప్పుకుంది చాలమ్మా.. ఎవరి ప్రాంతమును వారిని ఏలనియ్యి ఇందిరమ్మా అని కాళోజీ అప్పుడెప్పుడో నినదిస్తే.. ఇప్పుడు సోనియమ్మకు వినిపించింది.
పదరా పోదాం పదా.. తెలంగాణ సాధిద్దాం పదా.. అన్న ప్రజాకవి ఘోష వర్తమాన నినాదంగా మార్మోగుతుంటే…. దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం గమ్యాన్ని అధిగమించింది.
జైతెలంగాణ నినాదానికి పర్యాయపదమై బతికిన జయశంకర్ సారు ఆత్మసాక్షిగా.. యుపిఏ కూటమి ఏకగ్రీవ తీర్మానం చేసింది. సి.డబ్ల్యు.సి తెలంగాణను 29వ రాష్ట్రంగా ప్రకటించింది.
1956లో సమైక్య రాష్ట్రంలో అయిష్టంగానే భాగమైన తెలంగాణ.. దశాబ్దం తిరిగే సరికే.. మా రాష్ట్రాన్ని మేమే పాలించుకుంటామని గొంతెత్తింది. 1969లో తెలంగాణ హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష.. 2001లో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో బలంగా తెర ముందుకు వచ్చింది. నాటి నుంచి పుష్కర కాలంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో సాగుతున్న ఉద్యమం ఎన్నో ప్రతిబంధకాలను ఎదుర్కొని నిలిచింది.
విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, విద్యావేత్తలు,. విభిన్న రంగాల్లో జీవనపోరాటం చేస్తున్న వారంతా సంయుక్త కార్యాచరణ సంఘాలుగా ఏర్పడి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. సకల జనుల సమ్మెతో తెలంగాణ ఆకాంక్ష వినిపించారు. మానవహారంగా ఏర్పడి మౌనంగా తమ డిమాండ్ ను వినిపించారు. చలో అసెంబ్లీ అన్నారు. పోలీసుల దెబ్బలు కాచారు. బాష్పవాయువులను భరించారు. ఉస్మానియా,.. కాకతీయ.. తదితర విద్యాలయాల్లో ఎమర్జెన్సీని తలపించిన అణచివేతను సహించారు. సొంత ఇంట్లోనే పరాయీకరణకు గురయ్యారు. నిర్బంధాన్ని సహించారు. బాధను పంటి బిగువున భరించారు. సహనమే ఉద్యమ స్వభావమని చాటారు. నైరాశ్యానికి లోనైన వందలాది యువకులు ప్రాణత్యాగాలు చేశారు. ఆకాంక్షను అర్థం చేసుకోమని ఆక్రోశించారు.
ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం. హింసను ఆశ్రయించకుండా లక్ష్యం సాధించవచ్చని నిరూపించిన ఉద్యమం. రాజకీయ వ్యూహాలను ప్రజా చైతన్యం దిశగా నడిపించిన ఉద్యమం.
ఇది ఒకరిని ఓడించేందుకు నడిచిన పోరాటం కాదు. ఇది ఒకరిని పరాజితుల్ని చేసే విజయం కాదు. ఇది ప్రజల ఆకాంక్ష ఫలించిన సందర్భం. సాటి ప్రజల ఆకాంక్ష ఫలించినందుకు సమైక్యంగా ఆమోదించాల్సిన తరుణం. తెలుగువారి చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టం. ఇది తెలుగు ప్రజలందరి సమష్టి ప్రగతికి ప్రణాళికలు రచించాల్సిన తరుణం. కార్యాచరణకు సిద్ధం కావాల్సిన తరుణం. మన ముందున్నది మహత్తర లక్ష్యం. అరవయ్యేళ్ళ ప్రయాణం ముగియలేదు. ఇప్పుడే ఒక మలుపు తిరిగింది.

Advertisements

3 thoughts on “ఫలించిన అరవై ఏళ్ళ కల.. తెలంగాణ

  1. అవును!తెలంగాణా ప్రజల 60 ఏళ్ల స్వప్నం సాకారం కాబోతున్నట్లు ప్రకటన వెలువడింది!ఇది తెలంగాణా విభజన కాదు!ఇది అలనాటి హైదరాబాద్ రాష్ట్రం పునర్విభజన!ఇది ఆత్మగౌరవ సమస్య!స్వయంపాలన కోసం పోరాట సాఫల్యం!రాష్ట్రాలుగా విడిపోతున్నాం తెలుగువాళ్ళుగా కలిసుంటాం!తెలంగాణా వారు తెలంగాణా రాష్ట్ర పాలనాపగ్గాలు స్వీకరిస్తారు!పది జిల్లాలు పది సింగపూర్ లుగా అభివృద్ధి అవుతాయి!అక్షరాస్యత పెంచుకుంటాం!కొత్త పరిశ్రమలను నెలకొల్పి నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం!అవినీతిపరులను చట్టానికి పట్టిస్తాం!ఆత్మాహుతి చేసుకున్నతెలంగాణా అమరవీరుల కుటుంబాలవారికి 5 ఎకరాల భూమి ,ఒకరికి ఉద్యోగం ఇస్తాం! కాంగ్రెస్ ఈ తెలంగాణా ప్రకటన ముందే చేసివుంటే ఎంతో జన హననం తప్పేది!ఇక సీమాంధ్ర ప్రజలకు ముంచుకొచ్చే ఉపద్రవం ఏమీ లేదు !ఆంధ్ర ప్రదేశ్ పేరు మీకే ఉంటుంది!మీ కిరణ్ కుమార్ రెడ్డి గారే మీకు ముఖ్యమంత్రిగా ఉంటారు !మీ రాజధాని మీరు సరికొత్తగా అత్యాధునికంగా నిర్మించుకోవచ్చు! మీరూ ఒక్కొక్క జిల్లానూ ఒక్కొక్క న్యూ యార్క్ గా అభివృద్ధి చేసుకోవచ్చు !కొంతమంది పెట్టుబడిదారులైన రాజకీయనాయకులు మిమ్మల్ని కొన్ని రోజులు రెచ్చగొట్టి హడావుడి చేయిస్తారు!కాని తెలంగాణా ఆగదు!ఇది మా చిరకాలవాంఛ !దానికి అడ్డు నిలవకండి!చిన్న రాష్ట్రాలతోనే పాలనా సౌలభ్యం మెరుగుపడుతుందని అంబేద్కర్ చెప్పారు!

  2. నా తెలంగాణ మానవ సంబంధాల మహోన్నత కావ్యం
    నా తెలంగాణ జానపదుల జావళి
    నా తెలంగాణ ప్రకృతి ఒడిలో నిదురించే శిల్పం
    నా తెలంగాణ భరతమాత కాలి అందెల రవళి, పుడమి తల్లి నొసటి తిలకం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s