విభజన కాంక్షను ఆపగలిగే నైతిక స్థయిర్యం ఎవరికైనా ఉందా?

తెలంగాణపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ల్ లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామన్నారు ఎపిఎన్జీవో అధ్యక్షుడు.
అసెంబ్లీలో తీర్మానం వీగిపోయేలా చేయాలి, అప్పటికీ ఢిల్లీ నిర్ణయం మారకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామన్నారు సీమాంధ్ర మంత్రులు. మొదటిది బలప్రదర్సన. రెండోది రాజకీయ వ్యూహం.
ఈ రెండూ తెలంగాణ ప్రజలను సమైక్య భావనకు ఒప్పించే విధానాలు కావు. లొంగదీసుకునే విధానాలు మాత్రమే. సమైక్యత అన్నది ఆధిపత్యానికి సంబంధించిన విషయం కాదు. అనుబంధానికి సంబంధించిన విషయమని గుర్తించకపోవడమే సీమాంధ్ర రాజకీయ నాయకుల వైఫల్యం. విభజనకు కారణలను గుర్తించడానికి అహంకరించేవారికి సమైక్యతను కోరే అర్హత ఎక్కడిది?
సీమాంధ్ర నాయకత్వం తెలంగాణను లొంగదీసుకునే రాజకీయాలకు పాల్పడుతున్నంత కాలం విభజనవాదం బలపడుతూనే ఉంటుంది. సమైక్య రాష్ట్రం అందరికీ మంచిదని వారు చెప్పలేకపోతున్నారు. తమకు అవసరమని మాత్రమే చెబుతున్నారు. అవసరాలు తీరడానికి ప్రత్యామ్నాయాలుంటాయి. ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి మాత్రం విడిపోవడమొక్కటే మార్గం.
ముఖ్యంగా, తెలంగాణ ప్రజల్లో విభజన కాంక్షను ఆపగలిగే నైతికత, మానవత సీమాంధ్ర నాయకత్వానికి లేదని వారు అనుసరిస్తున్న వ్యూహాలతో తెలుస్తూనే ఉంది. ఆ రకంగా తెలంగాణవాదాన్ని రెచ్చగొడుతున్నది, రాష్ట్ర విభజనను అనివార్యం చేస్తున్నది ఈ ద్వంద్వ వైఖరుల నాయకత్వమే.

Advertisements