అగ్ని వర్ణం

పొద్దుటి గాలిలో ప్రవహించే ఊదారంగు

ఊపిరితిత్తుల్లోకి ఒక ఉదయాన్ని ఒంపినప్పుడు

నాలోంచి ఒక చీకటి పక్షి భయంకరంగా రెక్కలు దులుపుకుని

పడమట్లోకి ఎగిరిపోవడం చూశాను… ఎన్నోసార్లు!

ఎన్నోసార్లు ఈ పక్షి లోపల్లోపలికి ఎట్లా చొచ్చుకొస్తుందో తెలియడం లేదు-

తలుపులు మూసుకున్నా దెయ్యంలా అది చొరబడుతూనే ఉంటుంది

తలుపులు మూసి ఉంచి దాన్ని తరిమేయడమెట్లా?

ఏది ఏమైనా.. తలుపులు తెరుచుకునే ఉండాలి-

night birds

ఒక్కోసారి ఈ పక్షి.. లోపల గూడుకట్టి గుడ్లుపెట్టి పిల్లల్ని పొదిగి

నాలోపలి శిథిలంతో తన పరివారాన్ని పోషించుకోవడమూ నాకు తెలుస్తూనే ఉంటుంది-

శిథిలమై పోవడం కన్నా తగులబడి పోవడమే మంచిదని

దావానలంతో దాహం తీర్చుకోవడానికి తెగిస్తాను-

పాడుబడిన బావిలోంచి కాలిన రెక్కలతో పక్షులు టపటపా పైకెగిరిపోయే అందమైన దృశ్యాన్ని

ఎన్నిసార్లని తనివితీరా చూడను?

సాయంత్రపు గాలిలోని అగ్నివర్ణం మీది మోజుతో

ఆల్చిప్పల్లా కళ్ళు తెరుచుకుని

ఆశగా నోరు తెరుచుకుని

ముక్కుపుటాలను ఎగరేసుకుని

కర్ణభేరుల్ని పగలగొట్టుకుని

ఒళ్ళంతా కిటికీలై తెరుచుకున్న తేనెతుట్టెనైపోతాను-

ఉదయానికీ సాయంకాలానికీ మధ్య

కురిసే ఏడు రంగుల వానలు..

సాయంకాలానికీ ఉదయానికీ మధ్య

అనంత వర్ణాలుగా పరావర్తనం చెందే చీకటి కిరణాలు..

వాటి మూలంగా గాజు పట్టకంలాంటి నాలో కొంచెం తడి.. కొంచెం వేడి..

అడవి గాలి నాలోకి ఆకుపచ్చ రంగును ఒంపినప్పుడు

ఈ ఒంటి మీద గిలిగింతల పాదాలతో పిట్టలు.. పాలపిట్టలు వాలుతాయన్న నమ్మకం

కూలిన తాతలనాటి జాజు గోడల జ్ఞాపకాల అవర్ణం వెంటాడుతున్నప్పుడు

ఈ కట్టెలోంచి కొత్త రుతువు రావి చిగురులా పొడుచుకొస్తున్న నిజం-

ఇదిగో చూడండి…

చీకటిని చూపుడు వేలి మీద పావురాన్ని చేసి నిమంత్రించి

నేనెలా వేనవేల పక్షుల్లా.. ఆకాశంలోకి చిలకరించిన రంగుల్లా ఎగిరిపోతున్నానో!

నీ గుండె లోనో… పోనీ నీ భుజం మీదో

ఒక పిట్ట వాలిన సంగతి నీకు తెలుస్తూనే ఉంది కదా?

ఒక రంగు.. నీకు తెలిసిన ఏ రంగుతోనూ పోల్చడానికి వీల్లేని ఒకానొక అమలిన సరోవరంలాంటి రంగు

నీ ఊపిరిలోకి జారుతున్న స్పర్శ తెలుస్తూనే ఉంది కదా?

పొద్దుటి గాలిలోని ఊదారంగు

ఉరః పంజరంలో ఒక ఆకాశాన్ని దాచినప్పుడు

ఒక చీకటి పక్షి భయవిహ్వలంగా రెక్కలు దులుపుకుని

అనంతంలోకి పారిపోవడం నువ్వూ చూస్తావ్… ఎన్నోసార్లు-

-పసునూరు శ్రీధర్ బాబు

( ఉ. 1.40 గంటలు, 30 అక్టోబర్, 2013)

Advertisements

చీకట్లోంచి రాత్రిలోకి…

.

ఎంతసేపని

ఇలా

పడిపోతూనే ఉండడం?

పాదాలు తెగిపడి

పరవశంగా

ఎంతసేపని ఇలా

జలపాత శకలంలా

లేనితనంలోకి

దిగబడిపోతూనే ఉండడం?

.

రాలిన

కనుగుడ్ల నడుమ

కాలిన దృశ్యంలా

ఎంతసేపని

ఇలా నుసిలా

రాలిపోతూ ఉండడం?

plenty-of-emptiness-horacio-cardozo

గాలి

ఎదురుతన్నుతున్న

స్పర్శ లేదు-

జాలి

నిమిరి నములుతున్న

జాడ లేదు-

ఎవరో.. పైనుంచి

దిగాలుగా చూస్తున్నారన్న

మిగులు లేదు-

లోలోతుల్లో ఎవరో

చేతులు చాచి

నిల్చున్నారన్న

మిణుగురులూ లేవు-

.

ఎంతసేపని

ఇలా

అడ్డంగా

తలకిందులుగా

చీకట్లోంచి రాత్రిలోకి?

రాత్రిలోంచి చీకట్లోకి?

పొగల

వెలుగు సెగలకు

ఒరుసుకుపోతూ

తరుక్కుపోతూ

ఎంతసేపిలా

లోతుల్లోంచి లోతుల్లోకి..?

.

వేళాపాళా లేని

ఖాళీలోకి

ఎండుటాకుల గరగరలతో

కూలే చెట్టులా

ఇలా

ఎందుకని

బోర్లపడ్డ ఆకాశంలోకి?

జ్ఞాపకమూ

దుఖ్కమూ

ఆనందమూ

నేనూ

ఎవరికెవరం కానివారమై

రేణువుల్లా చెదిరిపోతూ

పట్టుజారుతున్న

చీకటి వూడల నడుమ

నిద్ర స్రవించిన మెలకువలతో

గాట్ల మీద కట్లు కట్టుకుని

ఇలా ఎంతసేపని

కలల్లోకి

కల్లల్లోకి

కల్లోలంలోకి?

(12 గంటలు, 11 సెప్టెంబర్, 2013)

* సారంగ వెబ్ మేగజైన్ లో ప్రచురితం:

http://www.saarangabooks.com/magazine/2013/10/02/%E0%B0%9A%E0%B1%80%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%BF/