నేనొక కల

An opium influenced dream ఎవరో తట్టి లేపితే చెదిరిపోతే.. ఎవడు పూర్తి చేయాలిరా అక్కడితో ఆగిపోయిన కవిత్వాన్ని..? తెల్లని వేర్లలా భూఉపరితలం మీద వంకర్లు పోతూ పాయలు పాయలుగా విస్తరిస్తున్న నదీ ప్రవాహం ఉన్నట్లుండి ఇసుకలోకి ఇంకిపోతే దోసిలిలో పట్టుకున్న నీళ్ళను ఎంతసేపని ఎట్లా దాచుకోవాలిరా..? ఇలా చీకట్లో జపం చేస్తుంటే లేని నది మీంచి పొగ మంచులా వెన్నెల తెరలు తెరలుగా సెలవు చెప్పి వెళ్ళిపోతుంటే.. could I revive within me/ her symphony and song అని పలవరిస్తూ.. Xanadu సౌందర్యోపాసనలో విచ్చుకత్తుల్లా గాలికి రెపరెపలాడే కుబ్లా ఖాన్ జుత్తునూ.. మెరిసే కళ్ళనూ.. తరిమే dreamsస్వప్నంలా ఆవిష్కరించిన కోలరిడ్జ్ మూడు శతాబ్దాల ముసుగును లాగిపారేసి నను చలి రాత్రిలోకి ఒంటరిగా లాక్కెళుతుంటే.. నువ్వెప్పుడో నాకు కలలోనో నిదురలోనో కలనిదురలోనో పరిచయమయ్యావని.. నా “నిదురపోని మెలకువ చెప్పిన కల”కు నువ్వే పుట్టుకనిచ్చావని ఎంత చెప్పినా పట్టు వదలకుండా మూడో జాములో గాఢ నిద్రలో మగ్గిన జనం కంటున్న కలల పరదాలను పరపరా చీల్చుకుంటూ పైపైకి తీసుకెళ్తుంటే.. భయమూ మోహమూ కలగలిసిన తెగింపుతో ఇక నువ్వు నన్ను వదిలేసినా ఫర్వాలేదన్నప్పుడు.. అంతదాకా నీ చిటికెన వేలు పట్టుకున్న పిడికిలి తెరిచి చూస్తే సెగలు కక్కుతున్న నీ జ్వలిత నేత్రం… నాకు చూపిస్తుందా నీవు చూసిన ఆ అబిస్సీనియన్ యువతిని? వినిపిస్తుందా ఆమె పాడిన మౌంట్ అబోరా గీతాన్ని? చంద్రుడు అటు తిరిగిన చీకటి రాత్రిలో పారదర్శకపు తూనీగ రెక్కలతో నీ నయనం ఒక దేవకన్యలా ఎగిరిపోతుంటే మిరమిట్లు గొలిపే వెన్నెలలో నా చెక్కిలి మీద జారిన కన్నీటి చుక్క కాలిపోతుంటే.. I speak not, I trace not, I breath not thy name అని లార్డ్ బైరన్ భరించిన నిశ్శబ్ద హృదయంలోలోతుల నాటుకున్న ఆలోచనలన్నీ నా నుంచి సెలవు తీసుకుంటాయా ఈ రాత్రి నను నిదురకూ మెలకువకూ మధ్య ఫట్ ఫట్ మని తెగిపోతున్న కలల వంతెన మీద వదిలేసి? నేనూ విముక్తుడనవుతానా ప్రేమలు చేసిన గాయాల నుంచి.. అబద్ధాలు పంచిన అశ్రువుల నుంచి.. జ్ఞానం పెంచిన అవివేకం నుంచి.. విస్ఫురించలేని అశక్తత నుంచి..? దుఃఖం విలువ తెలుపని ఆనందం నుంచి..? నేనూ నీలాగా ఒక కలనై… ఒకే ఒక్క కన్నీటి బిందువునై ఈ అంతరిక్ష ధూమంలోకి నిష్క్రమిస్తానా?

-పసునూరు శ్రీధర్ బాబు
(రాత్రి 2 గం.లు 22 నవంబర్, 2013 )

(కోలరిడ్జ్ 1797లో రాసిన కుబ్లాఖాన్ కవిత గుర్తొచ్చింది అని లేఖ రాశారు “మో” 2003లో ఆంధ్రజ్యోతి వివిధలో అచ్చయిన నా కవిత “నిదురపోని మెలకువ చెప్పిన కల”ను చదివి. నిజానికి నేను అప్పటికి కుబ్లాఖాన్ కవిత చదవలేదు. మో చెప్పిన తరువాత ఆ కవితను చాలా సార్లు చదివాను. చదువుతూనే ఉన్నాను. నా “నిదురపోని మెలకువ చెప్పిన కల”లో అంతా కాయితాలతోనే అయిపోయిందని కళ్ళనీళ్ళెట్టుకున్న కవి పుంగవుడు “మో” అప్పటికి మూడు దశాబ్దాల కిందటే “నుంచుని చూసే కల” పేరుతో కవిత రాసేశారు. ఈ రెండు శీర్షికల మధ్య సారూప్యం యాధృచ్ఛికం కాదు. “నిదురపోని మెలకువ చెప్పిన కల” కవితకు లింక్: https://anekavachanam.wordpress.com/2010/06/10/నిదురపోని-మెలకువ-చెప్పిన/#comments)

Advertisements