ఏటి ఒడ్డున…

ఏటి ఒడ్డున ఏం ఉంటుంది?
ఎవరో విడిచి వెళ్ళిన నాలుగు కన్నీటి చుక్కలు
విడిది చేసిన కొన్ని మసక సంభాషణలు
విడిచేసిన ఏకాంతపు ముఖాలు
ఇసకలో దిగులు గుంతల వలయాలు..
ఏటి ఒడ్డున అంతకన్నా ఏం ఉంటాయి?

pic 1జలజల పారే ఏటి సవ్వడిలో
కలిసి తడిసిపోయిన
కొంత పొడి దుఃఖం
ఏటి ఒడ్డున అంతకన్నా ఏం ఉంటుంది?

ఏటి ఒడ్డున ఇంకా..
రంగు రంగుల గులకరాళ్ళు
పగిలిన నత్త గుల్లలు
మువ్వల శబ్దాలు మోసే పాద ముద్రలు..
పగటి మబ్బుల మీద కొలువుదీరిన వెన్నెల దీపాలు-

అంతేనా..
ఒక పేరు లేని ప్రేయసి
ఊరు లేని స్నేహితుడు
ఒక అభౌతిక కౌగిలింత
ఒక ఆధిభౌతిక కరచాలనమూ ఉంటాయి
ఏటి ఒడ్డున..

ఇంకా.. ఏటి ఒడ్డున ఇవేవీ పట్టనట్లు
తుళ్ళుతూ.. పరవళ్ళు తొక్కుతూ పారే ఏరు కూడా ఉంటుంది!

(మధ్యాహ్నం 12.55 గం.లు, జనవరి 22, 2014)

***

Advertisements

చీకట్లో చెట్టు

ఆకాశాన్ని కప్పుకున్నట్లు

నక్షత్రాల్ని పూసినట్టు

నదిని ప్రసవించినట్టు

అందరూ పడుకుంటే తనొక్కత్తే ఆకుల కళ్ళతో

కలియచూస్తూ గలగలమని పాడుతున్నట్టు

night-tree

చీకట్లో చెట్టు

చాలా అందంగా ఉంటుంది

ఆనందంలా వినిపిస్తుంది

హాయిగా పలకరిస్తుంది

ఆత్మీయంగా పరామర్శిస్తుంది

 

 

చీకట్లో చెట్టును

దగ్గరకు వెళ్ళి చూస్తున్న కొద్దీ

రారమ్మని పిలుస్తున్నట్లే ఉంటుంది-

కొంత చీకటిని, కొంత వెన్నెలను, కొన్ని నక్షత్రాల్ని దాచిపెట్టి

వచ్చి తీసుకోమని చేతులు చాస్తున్నట్లే ఉంటుంది-

 

చీకట్లో చెట్టు

ఆకాశానికి అతుక్కున్న బొమ్మలా ఉంటుంది

రంగులన్నీ కడిగేసుకుని స్వచ్ఛంగా నల్లగా మెరుస్తూ ఉంటుంది

ఆకాశాన్ని వందల చేతుల్తో మోస్తున్నట్లుంటుంది

భూమిలో పాదాల్ని నాటుకుని… భూమితో పాటే విశ్వమంతా ప్రయాణించే చెట్టు

బుద్ధునిలా తపస్సు చేస్తుంది చీకట్లో ఆకాశం చెట్టు కింద-

గారాలు పోతూ గలగలల నవ్వులు పంచే గాలి కూడా

చీకట్లో ధ్యానముద్రలో ఉన్న చెట్టుకు ఊపిరి బిగబట్టి నమస్కరిస్తుంది

దట్టమైన ఆకుల మధ్య నుంచి నేర్పుగా దారి చేసుకుని బుద్ధిగా వెళ్ళిపోతుంది-

 

చీకట్లో చెట్టు

చూపున్న శిల్పం

మాట్లాడే మౌనం

స్పృశించే దేహం

స్పృహించే దైవం

ఎడతెగని ధ్యానం-

 

చీకట్లో చెట్టు కింద జ్ఞానోదయం కాదు

చీకట్లో చెట్టును

అలా దూరం నుంచే చూడాలి

చీకట్లో చెట్టుకు చేతులు జోడించి ప్రదక్షిణం చేయాలి

ముడుపులు కట్టుకుని వెళ్ళిపోవాలి..

మళ్ళీ ఎప్పుడైనా అదే దారిలో వెనక్కి వస్తున్నప్పుడు

ఇక్కడొక చెట్టుండాలి కదా అన్న ప్రశ్న ఎదురవనూ వచ్చు-

 

శీతల హేమంత సౌందర్యంలోకి శిశిరం చొరబడినప్పుడు

చీకట్లో చెట్టు కూకటి వేళ్ళతో లోతుల్లోతుల్లోకి ప్రయాణిస్తుంది

లోపల్లోపల వసంతానికి ప్రాణం పోసి చిటారుకొమ్మన పచ్చగా ప్రసవిస్తుంది

అయినా.. చైత్రం గురించి చిత్రంగా పాడుకునేదేముంది?

మార్గశిరం చీకట్లో చెట్టు ముందు మోకరిల్లాలి కాని-

—-

(రాత్రి 1.34 గం.లు, జనవరి 9, 2014)

 

ఈ రాత్రికి చచ్చిపోతావా?

ఈ రాత్రి… వెచ్చని అగరొత్తుల ధూమంలా మత్తెక్కించవచ్చు

లేదా కాలుతున్న దేహం నుంచి చిమ్ముతున్న పొగలా కమ్మేయవచ్చు

నెలవంకల గుంపు కన్రెప్పలకు వేలాడుతూ కలల సంగీతంతో జోకొట్టవచ్చు ఈ రాత్రి

లేదూ.. కొండ చిలువలా అమాంతం మింగేసి మెలిపెట్టి నలిపేయనూవచ్చు

 

david byrne-fear

రాత్రంటే.. శబ్దం లాంటి నిశ్శబ్దం

రాత్రంటే.. లోపలి అడవిలో కురిసే జడివాన

రాత్రంటే.. తెలియని లోతుల్లోకి లాక్కెళ్ళే సుడిగుండాల కర్రె సముద్రం

రాత్రంటే.. తీరానికి కొట్టుకొచ్చిన చివికిపోయిన కాగితప్పడవ

రాత్రంటే.. పగలు చేసిన గాయాలపై ముద్దులు అద్దే ప్రేయసి

ప్రేమగాయం నుంచి చిక్కగా స్రవించే జలదరింపు కూడా రాత్రంటే-

రాత్రి…

వెన్నెల పూలు.. వెలుగు చుక్కలతో అలరించే ఉద్యానం

కాలే శరీరాలు.. మూల్గే నక్కలతో భయపెట్టే దెయ్యంలాంటి శ్మశానం

రాత్రి

వెదురు పొదల్లో సేద దీరుతున్న పగటి గీతం

మట్టి పుట్టలో బుసలు కొట్టే మిన్నాగుల గతం

రాత్రి…

చావునీ ఇస్తుంది

బతుకునూ తెస్తుంది

నువ్వేం తీసుకుంటావ్?

నీకేం కావాలో తేల్చుకో ఈరాత్రి గడవక ముందే

లేదంటే… పొద్దుటి వాకిలి తలుపు తెరవడానికి నువ్వుండవ్-

—-

-పసునూరు శ్రీధర్ బాబు

(ఉ. 1.47 గం.లు, జనవరి 7, 2014)