అలారం పెట్టి భయపెట్టొద్దు!

ఈ రాత్రిలోంచి కొంత సంగీతాన్ని కొన్ని పాటల్ని కొన్ని నక్షత్రాల్ని కొంత నిద్రను తీసుకుని వెళ్ళిపోతున్నాను
నాకు నేనుగా తిరిగి వచ్చేంతవరకు నన్నెవరూ పిలవొద్దు
ముఖ్యంగా, అలారం పెట్టి భయపెట్టొద్దు-
night
చూపులేని రాత్రికి నేను చూపించాల్సినవి చాలా ఉన్నాయ్
చెవులు లేని ఆకాశానికి నేను వినిపించాల్సిన పాటలెన్నో ఉన్నాయ్
స్పర్శ తెలిసిన నేలకు నేను ఇవ్వాల్సిన ముద్దులెన్నో ఉన్నాయ్
రహస్యాల్ని మోసే గాలిని వినేందుకు నేను వెదురుగా ఎదగాల్సి ఉంది-

దయచేసి.. నాకు నేనుగా తిరిగి వచ్చేంతవరకు నన్నెవరూ పిలవొద్దు
అలారం పెట్టి మరీ భయపెట్టొద్దు-

***
(12.40 గం.లు, 27 ఫిబ్రవరి, 2014, )

Advertisements

సిగ్గుమాలిన అరాచకీయం

సిగ్గుమాలిన అరాచకీయం.
అనివార్యతల్ని అర్థం చేసుకోలేని మూర్ఖత్వం.
ప్రజల్ని నీచంగా అంచనా వేసి పబ్బం గడుపుకునే దౌర్భాగ్యం.
ధనమదాంధులకు గుడ్డిగా టికెట్లు కట్టబెట్టి చట్టసభల గేట్లు బార్లా తెరిచిన ప్రమాదకర సంస్కృతికి పర్యవసానం..
నిన్న పార్లమెంటులో జరిగిన దుర్మార్గం.
సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఏం కొంప మునిగిందని ఇంత యాగీ చేస్తున్నారు? తెలంగాణ విడిపోతే సీమాంధ్ర ప్రజలకు కాదు ఈ నాయకులకే బోలెడంత నష్టం. ఇన్నేళ్లూ సాగించిన దౌర్జన్యం, ఆధిపత్యాలతో పెరిగిన బలుపంతా కరిగి శల్యమైపోతామేమోనన్న భయం. అందుకే, వారు కనివిని ఎరుగని నిరాశా నిస్పృహలతో విలవిల్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలకు తమ నుంచి విముక్తి ఎంత అవసరమో చెప్పకనే చెబుతున్నారు.
అరవయ్యేళ్ళ స్వతంత్ర భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య 14 నుంచి 28కి పెరిగింది. ముందు ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఒకే భాష మాట్లాడే ప్రజలే రెండు మూడు కాదు అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలుగా ఏర్పడిపోవచ్చు. దాన్ని విడిపోవడంగా చూసే సంకుచితత్వం నుంచి బయటపడాలి. ఒక రాష్ట్రం భౌగోళికంగా రెండు పాలన వ్యవస్థలుగా మారడం కొంత కాలం తరువాత చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. అయినా, ఈ పరిణామం మీకు తెలియకుండా సంభవిస్తోందా? మీరు ఇంతకాలంగా కళ్ళకు గంతలు కట్టుకున్నారా?telangana_ap
పుష్కర కాలం కిందటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నియమించిన అధ్యయన బృందం తెలంగాణ, విదర్భ ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లను పరిశీలించి పార్టీకి నివేదిక అందించింది. ఆ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ పార్టీ తాను తెలంగాణ, విదర్భ రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమేనని 2001లోనే ప్రకటించింది. అప్పుడు అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ సీమాంధ్ర నాయకుడూ బయటకు రాలేదేం? రాష్ట్ర విభజనకు అంగీకరించిన కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేది లేదని ఏ ఒక్క సీమాంధ్ర నాయకుడూ పెదవి విప్పి నిందించలేదేం?
2004లో కాంగ్రెస్ నాయకత్వంలోని యు.పి.ఏ అధికారం చేపట్టింది. తొలి యు.పి.ఏ సంకీర్ణం తన కనీస ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేర్చినప్పుడు ఏ జగడపాటీ రగడ చేయలేదే? ఎప్పటికప్పుడు పబ్బం గడుపుకునే హరిబాబులెవ్వరూ నిరసన కీర్తనలు వినిపించలేదే? పదేళ్ళ కింద ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందామని పార్టీ అధ్యక్షురాలు చెబితే.. చరమాంకంలో సీమాంధ్ర నాయకులు వెర్రిబాగుల వేషాలు చూసి అక్కడి ప్రజలు కూడా హర్షిస్తారని అనుకోలేం. నీతీ రీతీ లేనిది ఇటలీ నుంచి ఇండియాను సొంతిల్లు చేసుకున్న సోనియా గాంధీకా లేక సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకా?
ఇక, ఘనత వహించిన చంద్రబాబునాయుడు గారు 2008 అక్టోబర్ 18న ప్రణబ్ కమిటీకి లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటుకు తాము అనుకూలమేనని ఆ లేఖలో వక్కాణించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో తెలంగాణ అంశాన్ని క్షుణ్ణంగా చర్చించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అఁగీకరించిందని తెలుపుతూ బాబుగారు రాసిన నాటి ఆ లేఖ అంతర్జాలంలో ఇప్పటికీ అనాయాసంగానే లభిస్తుంది. అదే బాబు 2009లో మొదటిసారి తెలంగాణ ప్రకటన వెలువడినప్పుడు ఏం చేశారు.. అర్థరాత్రి ప్రకటిస్తారా అని కుటిలసాకులు చెప్పుకొచ్చారు. “తెలంగాణ అంశాన్ని ఇంకెంత కాలం నాన్చుతారు? సత్వరమే పరిష్కరించండి” అంటూ 2012 సెప్టెంబరులో ఈ సీమాంధ్ర నాయుడుగారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు మరో లేఖ రాశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక మీద నిర్ణయం తీసుకోవడం కూడా మీకు చేతకాలేదా అని ప్రధానిని నిందించారు.
అంతా మీ కోరిక ప్రకారమే జరిగింది కదా బాబుగారూ.. మరెందుకు ఇప్పుడు గొడవ చేస్తున్నారు? తొందరగా తేల్చండని ఒత్తిడి చేసిన మీరే తీరా తెలంగాణ తీర్మానం జరిగిన తరువాత హడావిడిగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయమని నోరుపారేసుకుని అమాయక ప్రజలను రెచ్చగొడతారేమిటి? మీ పార్టీలోని సీమాంధ్ర నాయకులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే నైతిక శక్తి నిజంగానే ఉందనుకుంటున్నారా?
ఇక, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా 2012 డిసెంబర్ 28న కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు లేఖ రాస్తూ, “తెలంగాణ ప్రజల మనోభావాలను మా పార్టీ గౌరవిస్తుందని మరోసారి గుర్తు చేస్తున్నాం. అయితే, ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం” అని రాశారు. ఇప్పుడేమో సమైక్య నీతులు చెబుతున్నారు.
సిడబ్ల్యుసి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, పార్టీ అధిష్టానాన్ని గౌరవిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ చరిత్రాత్మక అంశాన్ని బంతులాట స్థాయికి దిగజార్చారు. తెలిసో తెలియకో సామాజిక తెలంగాణ అనే నినాదాన్ని వల్లించిన చిరంజీవి ప్రజారాజ్యం జెండాను క్యాబినెట్ బెర్తు మీద కర్చీఫ్ లా విసిరేసి క్లయిమాక్స్ లో యాంటీహీరో అవతారమెత్తారు. ఈ యూటీవాలా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయండని సీమాంధ్ర ప్రజల సాక్షిగా, సీమాంధ్ర మీడియా సాక్షిగా లిఖిత పూర్వకంగా సమ్మతి తెలిపిన వారు ఇప్పుడు నోటి మాటలతో యాగీ చేస్తున్నారు. తెలుగువారి పరువును ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారు. పార్లమెంటు భవనంలో తమ మూర్ఖత్వాన్ని, అసాంఘిక నైజాన్ని పెప్పర్ స్ప్రేలా ఎగజిమ్ముతున్నారు.
సీమాంధ్ర నాయకుల్లారా.. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా మనమంతా తెలుగువాళ్ళమే. తెలుగువాళ్ళంటే దేశమంతా అసహ్యించుకునేలా చేయకండి. సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేసే పరిష్కారం తెలంగాణ ప్రజలకు కూడా సమ్మతం కాదు. మీరంతా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని ప్రకటించారు కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారు కాబట్టి తెలంగాణ బిల్లును అడ్డుకునే నైతిక హక్కు మీకు లేదు. సీమాంధ్ర ప్రజలు కూడా మీ నుంచి ఈ చండాలాన్ని కోరుకోవడం లేదు. భగత్ సింగ్ పేరును భ్రష్టు పట్టించే దివాళాకోరు ఉపమానాలను తలకెత్తుకోవడానికి తలలో గుజ్జున్న వాడెవడూ ఇష్టపడడు. మీరు నిజంగా సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరగకూడదనుకుంటే, ఈ విభజన ద్వారా ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకుంటున్నట్లయితే బిల్లు మీద చర్చకు సిద్ధంకండి. తెలంగాణ ఏర్పాటు అనివార్యమైతే సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏయే అంశాలను ప్రస్తావించాలనే ఆలోచన కూడా చేయకపోవడమే ఇప్పటి మీ దివాళాకోరుతనానికి ప్రధాన కారణం.
మీరు నిజమైన సీమాంధ్ర ప్రజా ప్రతినిధులైతే ఇకనైనా.. అక్కడి సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించండి. హైదరాబాదులో వందలు వేల ఎకరాలను, కోట్లకు కోట్లు దండుకున్న గుప్పెడు మంది కోసం గాభరాపడిపోవడం మానండి. అలాంటి వారు ఏ రాష్ట్రంలోనైనా, ఏ యూటీలోనైనా దర్జాగా బతికేస్తూనే ఉంటారు. వారికోసం ఎలాంటి ఉద్యమాలు అక్కర్లేదు. నిజంగా సామాన్య సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలే మీకు ముఖ్యమైతే అవి ఎలా నెరవేరుతాయో చర్చించండి. అంతేకానీ, సమైక్య సింహాలమని మాస్కులు వేసుకుని రేపటి ఎన్నికల రణరంగంలోకి దిగితే సీమాంధ్ర ప్రజలే మిమ్మల్ని గ్రామసింహాలను తరిమినట్లు తరుముతారు. ప్రజాస్వామ్య దేశంలో చట్టసభలు ఉన్నవి సమస్యలను చర్చించుకోవడానికే. చారిత్రక సందర్భాల్లో సాలోచనగా దిశానిర్దేశం చేసుకోవడానికే. ఇప్పటికైనా, ఈ నిజాన్ని గ్రహించండి. లేదంటే, సీమాంధ్ర ప్రజ గుత్తేదార్లు, అక్రమవ్యాపారవేత్తలు, అసాంఘిక శక్తుల ప్రాతినిధ్యం నుంచి విముక్తమయ్యేందుకు కొత్త నాయకత్వాన్ని నిర్మించుకుంటుంది. ఈ నిర్మాణానికి తెలంగాణ కూడా మినహాయింపు కాదు.
ఏకగ్రీవంగా తెలంగాణ బిల్లును తిరస్కరిస్తున్నామంటూ రాష్ట్ర అసెంబ్లీలో మీరు చేసిన తీర్మానం సమైక్యాంధ్రప్రదేశ్ లో మీ దాష్టీకానికి తుది తార్కాణం. అక్కడితో మీ కథ ముగిసింది. తెలంగాణ కల నిజమవుతోంది. మీరు ఇప్పుడు సీమాంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అనే కొత్త అధ్యాయాన్ని రచించేందుకు ఉపక్రమించాలి. ఆ ప్రక్రియను పార్లమెంటులో చర్చ ద్వారా ప్రారంభించాలి. అది తప్ప మీకు ప్రత్యామ్నాయం లేదు. సభ ఇంకో వారం రోజులు కొనసాగుతుంది. ఈలోగా మీకు జ్ఞానోదయం కలుగుగాక!

***

The Wolf of Wall Street

చెప్పకూడనివి చెప్పాలనిపిస్తుంది
దాచుకోవాల్సినవి చూపించాలనిపిస్తుంది
చచ్చేదాకా బతికేందుకు ఇన్నేసి రహస్యాలను కాపాడాల్సిన దౌర్భాగ్యమేమిరా దేవుడా?
చీకటిలో తెరుచుకున్న రంగస్థలం మీద రహస్యాలభంజికలతో రాజుకుని మాడి మసైపోయి
పొగల సెగల ఆనవాళ్ళతో లుంగలు చుట్టుకుపోతూ ఏదేదో రాసేయాలనిపిస్తుంది
నెత్తుటి వెలుతురులో దుఃఖపు చీకటి అక్షరాలతో..
కోర్కెల రాత్రిలో మసిలే కన్నీటి వ్యాకరణంతో.. ఒక బ్లాక్ కామెడీ..
కరెన్సీ నోట్ల మీద కెలికేసి నలిపేసి… చెత్తబుట్టలో పారేసి-
చెత్తబుట్టలు టేబుల్ కిందే ఉండవు..
లేబిల్ లేకుండా లోపల్లోపల నోరు తెరుచుకుని చూస్తూనే ఉంటయ్..
దీర్ఘాలోచనల నిట్టూర్పులను బుసకొడుతూ జుర్రుకునేందుకు-
the-wolf-of-wall-street-8
ముసలాడు మార్టిన్ స్కోర్సీస్ ఎప్పటికీ ఓ పాతికేళ్ళ తోడేలు
భయపెడుతున్నాడు ముసుగులన్నీ పరపరా చింపేసి-
సిగ్గుతో చచ్చిపోతున్నామిక్కడ..
వలువలన్నీ తీసేస్తుంటే.. విలువలు లేని బతుకులు తట్టుకునేదెట్లారా?

టెడ్డీ బేర్ కన్ను ఆవురావురుమంటూ ప్రియురాలి రహస్సౌందర్యంలోకి చొరబడి చొంగకారుస్తుంటే..
ముక్కుపుటాలదిరేలా మాదక ద్రవ్యాన్ని మస్తిష్కంలోకి పీల్చుకున్నాక
నైతికత ఒక అస్పష్ట కళాఖండం.. ఆధునిక దృశ్య కావ్యం…
‘ఓహ్… ఐ జస్ట్ కేమ్.. డిడ్ యూ?’
…..
(12.35 a.m. ఫిబ్రవరి 4, 2014)