మళ్ళీ మరొక్కసారి ప్రేమ గురించి…

మరొక్కసారి ప్రేమ గురించి
మళ్ళీ మళ్ళీ మరొక్కసారి వెళ్ళిపోయిన ప్రేమ గురించి

రాలిన పూవు మట్టిలో కలిసిపోతుంది
వాలిన చూపు ఎక్కడో నాటుకుపోతుంది

కురిసిన వర్షం వంకలో వాగులో చివరకు సముద్రంలో కలిసిపోతుంది
తడిసిన దేహం చివరి నిట్టూర్పు దాకా వణుకుతూనే ఉంటుంది

పొద్దుటి వెలుగు మీదకు చీకటి తరుముకొస్తుంది
చీకటి పంచిన కలలను ఏ వెలుగు తుడిచేయగలుగుతుంది?
lonely

శిశిరానికి కానుకైన మొదటి హరిత పత్రం
వసంతాన్ని స్మరిస్తుందా.. స్వప్నిస్తుందా?

నిన్నటి రాత్రి నేటి రాత్రి ఒక్కటి కాదు
నిన్నటి వెన్నెల ఇవాళ్టి వెన్నెల వేరు వేరే
మధ్యలో ఈ కాలం గొడవేమిటి నేనెప్పుడో నీదారి నీదే నాదారి నాదే అని చెప్పింతర్వాత!
గుండ్రని భూమికి ధిశలేమిటి?
ఎటు వెళ్ళినా నేను ముందుకే వెళ్తాను-

నా జీవితాన్ని నేను ఇటు నుంచి అటూ
అటు నుంచి ఇటూ జీవిస్తాను
ఎటు వెళ్ళినా ఇక్కడికే వస్తానో లేక ఎక్కడికైనా పోతానో?

ఏమైతేనేం?
నేను
నా కాలం
నా ప్రాణం
నా ప్రయాణం
ఒక్కటే అయినప్పుడు!

ఏమైపోతేనేం?
నేను
నా గానం
నా గాయం
నా జ్ఞాపకం
వెన్నంటే వస్తున్నప్పుడు!

అందుకే మరొక్కసారి ప్రేమ గురించి
ప్రతిక్షణాన్ని ప్రతీక్షణంతో వెలిగించి వెళ్ళిపోయిన ప్రేమ గురించి
వెళ్ళిపోయిన ప్రేమ వెంటే వెళ్ళిపోయిన నాగురించి

శిలువ మీద క్రీస్తులా
కాగితాల మీద అక్షరాలుగా వేలాడే క్షణాల గురించి
మళ్ళీ మరొక్కసారి నావెంటే వెళ్ళిపోయిన ప్రేమ గురించి…!

                                                                 – పసునూరు శ్రీధర్ బాబు
                                                                         (24 ఏప్రిల్ 2014)

Advertisements

మల్లె పువ్వు

 

ఒక మల్లెపువ్వు

ఈ రాత్రి కిటికీలోంచి తారకలా వచ్చి పలకరించింది

వెలుతురు భాషలో మాట్లాడుతూ

నా కళ్ళల్లో కొన్ని మిణుగురుల్ని వెలిగించింది

తెల్లని మౌనంలా సిగ్గుపడుతూ

నా చెవుల్లోకి ఒక ప్రేమకవితను ఒంపింది

ఒక ఇంధ్రధనుసు ఈ అర్థరాత్రిలో వెచ్చని పైట చెంగులా

నా ముఖాన్ని నిమురుతూ వెళ్ళిపోయింది

jasmine-flower

మల్లెపువ్వు నా భుజం మీద వాలి

వెళ్ళిపోయిన కాలంలోని వెలిగిన క్షణాలను నా దోసిట్లో పోసింది

రెక్కల గుర్రం మీద ఎవరో దేవకన్య నిరుటి జన్మ స్నేహంలా ఎదుట వాలింది

పెదాల మీద తలకిందులుగా వాలిన మల్లెపూవు

గుండెలో నలిగి మలిగిన పాత పాటనొకదాన్ని సన్నని తీగలా బయటకు లాగింది

అది చీకటి కొలనులో వెన్నెల వలయాలుగా కంపించి కనుమరుగైంది

అరిచేతిలో ప్రేయసి చుబుకంలా ఒదిగిన ఆ మల్లెపూవు

నిశ్శబ్దం వెచ్చగా గుబాళించడమంటే ఏమిటో చూపించింది

మౌనం ఎంత లయాత్మకంగా కల్లోలపరుస్తుందో అనుభవంలోకి తెచ్చింది

ఆ మల్లెపూవును అలాగే గుప్పిట్లో దాచినప్పుడు

ఆకాశమంత జ్ఞాపకం చల్లని దీపంలా నన్ను లోలోపల వెలిగించింది-

దాన్ని కదిలిస్తే..  మువ్వల శబ్దం

ఎద మీద హత్తుకుంటే… శంఖపు హోరు

అది చీకట్లో తేలుతూ ఏకాంతంలోకి చొరబడుతుంటే

నాలో తలుపులు తెరుచుకుంటున్న చప్పుడు-

కుంటాల జలపాతంలా నేను నాలోకే దుముకుతున్నప్పుడు

ఎగిరే నీటి నురగల మీద తుళ్ళిపడుతూ గంతులేస్తూ మురిసిన ఆ సిరిమల్లి

మళ్ళీ వస్తానంటూ వెళ్ళిపోయింది-

వీడ్కోలు గాయం చేయకుండా వెళ్ళిపోగల మహత్యం దానిది-

ఈసారి వచ్చేటప్పుడు తన తోటనంతా తీసుకువస్తానంది

అప్పుడు నక్షత్రాల ఆకాశం తలకిందులై నన్ను తన మీద నడిపిస్తుందేమో చూడాలి-

***

(2 -11 ఏప్రిల్ 2014)