అప్రయాణం

రోడ్డు మీదకు వెళ్ళి కాసేపలా కదలకుండా నిల్చుంటే
ఒకడు నా మీదకు నిచ్చెనేసుకుని ఎక్కి కొత్త సినిమా పోస్టర్ అంటించి వెళ్ళిపోతాడు
జీరో సైజు హీరోయిను కరెంటు నరాల మీద వాలి ముక్కుతో గిల్లుతుంటే
పోస్టరుకు పూసిన జిగురు వాసనకు గిలిగింతల్ని వాంతి చేసుకుంటాను-
మరొకడు వినైల్ హోర్డింగ్ మీంచి జారి నా భుజాలపై కూర్చుని నన్నో గాడ్జెట్ ను చేసి
లేటెస్ట్ వెర్షన్ సాఫ్ట్ వేర్ ను నాలోకి డౌన్ లోడ్ చేస్తాడు-
నేను డిజైనర్ వెబ్ లో ఎలక్ట్రానిక్ కీటకాన్నై కొట్టుమిట్టాడుతూ డిశ్చార్జ్ అయిపోతాను-


ఇంకా కాసేపలా కదలకుండా నిల్చుంటే..
రద్దీ రోడ్డు నాలోకి మళ్ళుతుంది
నేనొక సొరంగంలా ఉండచుట్టుకుపోతాను తుదీ మొదలూ లేని సున్నాలా-

అలా రోడ్డు మీద కదలలేక నిల్చున్న కొద్దీ
నేను క్రమక్రమంగా రాయిలా మారుతుంటాను
శిల్పి నన్ను లోలోపల చెక్కుతూనే ఉంటాడు
ఏళ్ళకేళ్ళుగా లోపలికి కురుస్తున్న కన్నీటి వర్షానికి గుంతలు పడిన గుండె
మూడో ప్రపంచం గాయంలా ఒక రూపం తీసుకుంటూ ఉంటుంది-

శిలలానో శిల్పంలానో చౌరస్తాలో నిల్చున్నప్పుడు
తలమాసిన బిచ్చగత్తె
ఆమె చంకన మురికి బిడ్డ
జాతీయజెండాలు అమ్మే యువతీయువకులు
చిట్టి చిట్టి భూగోళాల్ని రంగు రంగుల బొమ్మల్ని కొనమని వెంటపడే
పోస్ట్ మాడరన్ సేల్స్ బాయ్స్ అండ్ గాళ్స్
అదంతా ఒక రెడ్ సిగ్నల్ బీభత్సం-
నేనొక విండో సన్ షేడ్ ను మాత్రం కొనుక్కుని కళ్ళకడ్డంగా తగిలించుకుని
గ్రీన్ సిగ్నల్ వేసుకుంటాను-
ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు పరుగులు తీస్తున్నారు
మోటారువాహనాల కు మొలిచిన ఇనుప దేహాల్లా
రోడ్డంతా హ్యూమన్ పొల్యూషన్-

సిగ్నల్ పడినా కదలని బండరాయిలా రోడ్డు మీద అలాగే పడి ఉన్నప్పుడు
ఈ వేగవంతమైన ప్రపంచం నన్ను కనీసం తొక్కుకుంటూ కూడా వెళ్ళదు
పక్కకు తప్పుకుని పరుగు తీస్తుంది నా ఉనికితో పని లేకుండా-
పరుగులు తీసే ప్రపంచంలో ఆగి చూడడం ఒక జబ్బు…
ఆగి చూస్తే.. సాగే కన్నీటిస్రావాన్ని ఆపేందుకు అయోడిన్ టింక్చర్ తో కట్టు కట్టే కాలం కాదిది
నాడి పట్టుకుని ఒడుపుగా వివరం చెప్పే డాక్టర్లు ఇప్పుడు ఎక్కడున్నారు?
ఇప్పుడు బతకాలంటే… ఎన్నెన్నో టెస్టులు పాసవ్వాలి
బీమాపత్రం సమర్పించాలి-
అప్పుడు ప్రేమించే భార్య ఏ లిమిటెడ్ కంపెనీలోనో లీవు చిక్కక చిక్కుకుపోయి ఉండవచ్చు
కన్నబిడ్డలు పరీక్ష హాలులో ఆన్సరు పేపర్లయి పెన్ను గాట్లను భరిస్తూ ఉండవచ్చు
తల్లితండ్రులు వృద్ధాశ్రమంలో గతం కొక్కేలకు ఉమ్మడిగా వేలాడుతూ ఉండవచ్చు
స్నేహితులు ఆత్మీయతను సైలెంట్ మోడ్ లో పెట్టేయవచ్చు
రెండు సెకండ్ల కాల్ కు ఒక పైసాయే అయినా ఎవరూ పలకరించకపోవచ్చు
ఒక కండోలెన్స్ మెసేజ్ సేవ్ డ్ డ్రాఫ్ట్ గా సిద్ధమై ఉండవచ్చు
ఎన్నెన్నో టెస్టులు పాసవ్వాలి ఒంటరిగా.. బతకాలంటే-

రోడ్డు మీద కదలకుండా దొంగెద్దులా కూలబడి ఇలా ఏవేవో నెమరేస్తున్నప్పుడు
కాలాన్ని ఆకలితో నమిలేస్తున్నప్పుడు
చీకటి రాకాసి గద్ద విహ్వలంగా వాలుతుంది…
అప్పుడు రోడ్డు కూడా కదలదు-

లోన ఎవడో చెక్కుతూనే ఉంటాడు ఉలీ సుత్తీ పట్టుకుని టప్ టప్ మంటూ చీకటి నిశ్శబ్దంలో…
రక్తం చిట్లుతున్న చప్పుడు మెరుపులా వినిపిస్తూనే ఉంటుంది-
కంకర రాళ్ళుగా ముక్కలైపోయి రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాక
బండెడు తారు పోసి రోడ్డు రోలర్ తో తొక్కేయడానికి పొద్దున్నే వస్తాడొక కంట్రాక్టరు
వాడి వెనకాలే వస్తాడొక పార్టీ నాయకుడు వాడి కార్యకర్తలూ-
అభివృద్ధికి వేసిన ఈ బాటలోనే బ్యాలట్ దాకా నడవండని చేతులు జోడిస్తారు
లేదా బ్యాలట్ నుంచే కొత్త బాట మొదలవుతుందని నమ్మిస్తారు-

రోడ్డు మీద కాసేపలా కదలకుండా నిల్చుని… కలకలమై… కలహననమై…
రాతి ధూళిగా మట్టిలో కలిసిపోయింతర్వాత కూడా
చచ్చిపోని కళ్ళు మాత్రం వచ్చే పోయే వాళ్ళను చూస్తూనే ఉంటాయ్
తారు చీకటి రహస్యాల్ని కథలు కథలుగా చెప్పే ప్రయత్నం చేస్తుంటాయి-
మనుషులు వాటిని పుస్తకాలుగా షెల్ఫుల్లోనే పెట్టుకుంటారు
లేదంటే సాఫ్ట్ కాపీలుగా ల్యాప్ టాప్స్ లో స్టోర్ చేస్తారు
దొంగతనంగా డౌన్ లోడ్ చేసుకుని మురిసిపోతారు..
అక్షరాలు గాయాలు చేస్తున్న సలపరింత మొదలవగానే అన్ ప్లగ్ అయిపోతారు-

అడవిలో పండుకోసుకున్నవాడికి చెట్టుతో ఉండే అనుబంధం
మార్కెట్ లో సీల్డ్ కవర్ తో పండు కొనుక్కున్నవాడికి ఎట్లా ఉంటుంది?
తోటలో పల్లవించే పూవుల మీద పరిమళమై వెలిగిపోవడం మానేసిన తరువాత
ప్లాస్టిక్ ఫ్లవర్ హ్యాంగింగ్స్ ను రెటీనాలతో మీటి ముచ్చటపడాల్సిందే-
బతుకు అడవి నుంచి ఉద్యానాల నుంచి హృదయాల నుంచి
మనిషినీ మనిషినీ కలిపే బాటల నుంచి రోడ్డున పడింది-
ఇక.. రోడ్లకిరువైపునా నాటిన ఏటీఎంలు పనికొస్తాయా
ఇమోషన్స్ ను విత్ డ్రా చేసుకోవడానికి?
జ్ఞాపకాలను డిపాజిట్ చేయడానికి?

ఒక మనిషిని మరొక మనిషిలోకి తీసుకుపోలేని ఈరోడ్డు
మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది?
రోడ్డు మీదకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేకపోతే
ఈ ప్రయాణం దేనికి?
***
(శుక్రవారం 14 మార్చి, 2014; కవితా! 25 మార్చి-ఏప్రిల్ 2014లో ప్రచురితమైన కవిత)

Advertisements

తెలంగాణ మహోదయం

చరిత్రలో కొన్ని క్షణాలు అద్భుతమైనవి. అవి అద్భుతమైనవని ముందే తెలియడం ఒక గొప్ప అదృష్టం. ఆ క్షణాల్ని అద్భుతంగా జీవించాలి. జీవిత పర్యంతం ఆస్వాదించేంత మహత్తరంగా జీవించాలి. ఉద్విగ్న క్షణాలు ఎప్పుడూ జ్వలిస్తూనే ఉంటాయి. ఆనందాన్ని కొత్తగా నిర్వచించే అనంతానంద క్షణాలను తెలిసి తెలిసీ చేజార్చుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది? ఆనందం విలువ తెలియని వాళ్ళకు, జ్ఞాపకాల పుస్తకం ముఖచిత్రంగా నిన్ను నీవే తడుముకోవడం ఎంత బాగుంటుంది?
సమయం: 2014 జూన్ 1, ఆదివారం. మామూలుకన్నా నెమ్మదిగా గడిచిపోతుందేమిటీ అన్న సందేహం పగలంతా! రాత్రి అవుతున్న కొద్దీ ఆకాశంలో చుక్కలు ఒక్కొక్కటే పొడుస్తున్నట్లు లోపల్లోపల ఎడతెగని జ్ఞాపకాల గాయాలు గానాలు రెక్క విప్పుతున్న చప్పుడు. సాయంత్రం ఏడు గంటలకు హైదరాబాద్ నగరంలోని సైనిక్ పురిలో చల్లని జల్లు కిటికీ రెక్కల పక్కన కురుస్తున్న చప్పుడు. ఆరు దశాబ్దాల ఉద్యమంలో ఆత్మత్యాగం చేసిన అమర వీరుల ఆనందబాష్పాలు కురుస్తున్న దిగులు లాంటి వెలుగులాంటి చప్పుడు. గుండెలో పొడుస్తున్న కొత్త పొద్దు లాంటి చప్పుడు. ఇంకొన్ని గంటల్లో ఒక కల నిజంగా మారుతున్న ఉద్విగ్న సందర్భం. ఒక మహోదయాన్ని స్వాగతిస్తున్న అర్థరాత్రికి ఇవతలి గట్టున సంధ్యారవం స్వరకల్పన చేసుకుంటున్న తరుణం.

వాన చినుకులు నేల మీద ఒదిగిపోయాయి. చెట్ల ఆకుల గలగలల్లోంచి లేత రంగు చీకటిలో తడిసిన గాలి మెత్తగా మీద వాలుతోంది. పక్షుల గుంపులోకి అల్లరిగా చొరబడినట్లు ఉత్సాహంగా గాలిలోకి దూసుకుపోయాను. టపటపా రెక్కలు కొట్టుకుంటున్న వివశత్వంలాంటి శబ్దంలోకి బైకు మీద పరుగుతీశాను.
ధగద్ధగాయమానంగా వెలుగుతున్న నగరం. గులాబీవనంలా పరిమళిస్తున్న నగరం. యుద్ధం గెలిచిన వీరుడి కళ్ళల్లా మిరమిట్లు గొలుపుతున్న నగరం. వీరుడ్ని అక్కున చేర్చుకున్న కన్నతల్లి కన్నీటిలో తడిసిన వేసవి నగరం. వేడుకలో మురిసిపోతున్న నగరం. మునుపెన్నడూ లేనంత ముచ్చటేస్తున్న నగరంలోకి ప్రయాణించాను.
తొలి మజిలీ.. మిత్రుడు రఘురాములు కుమారుడు అమన్ పెళ్ళి విందు జరిగిన ఉప్పల్ లో. అలాయ్ బలాయ్ గా మారిన విందులో అన్న సురేంద్రరాజు, ఏలె లక్ష్మణ్, దుర్గం రవిందర్, కాసుల ప్రతాపరెడ్డి, రాజా రమేశ్, మోహన్ రుషి, బ్రహ్మం, ప్రసాదమూర్తి, వికటకవి అవినాష్, చక్రి, కొండల్, గుర్రం సీతారాములు, ఇంకా ఎందరెందరో మిత్రులతో ఆత్మీయ ఆలింగనం.
అక్కడి నుంచి నేరుగా సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ కు ప్రయాణం. దారిలో దీపాల తోరణాలతో మెరిసిపోతున్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజి బిల్డింగును చూడడం ఒక కన్నీటి జ్ఞాపకాన్ని దాచుకున్న ఉద్విగ్న సందర్భం. ప్రెస్ క్లబ్ చేరుకునేప్పటికి అర్థరాత్రికి సరిగ్గా అయిదు నిమిషాలుంది. టిజెఎఫ్ మిత్రులు పెద్ద కేక్ తో సంబరాలు చేస్తున్నారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా… పోరు తెలంగాణమా.. అంటూ గద్దరన్న గొంతు స్పీకర్లలో మార్మోగుతోంది. అక్కడికి అడుగుపెట్టగానే మిత్రులు వాసన్, జనార్దన్ లు ఆత్మీయంగా హత్తుకున్నారు. మిత్రుడు క్రాంతి, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, టంకశాల అశోక్, 10టీవీ సిఇఓ అరుణ్ సాగర్, స్టూడియో ఎన్ డైరెక్టర్ శైలేశ్ రెడ్డి వంటి జర్నలిస్టులంతా తెలంగాణ హోరులో చిందేయడం ప్రెస్ క్లబ్ కొక చిరస్మరణీయ ఘట్టం.
అర్థరాత్రి పన్నెండు దాటింది. టపాసులు పేలాయి. ఆకాశం మెరిసింది. గాలి దద్దరిల్లింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆనందం అర్ణవమైంది. గంటలు నిమిషాలైపోయాయి. తెల్లవారుజామున 2 గంటలకు గన్ పార్క్ కు వెళ్ళాం. తొలి ముఖ్యమంత్రి నివాళిని అందుకునేందుకు పూలమాలలతో అలంకృతమవుతోంది అమరవీరుల స్మారక స్థూపం. పదిలంగా రెండు అరిచేతులతో తాకి.. చేతులెత్తి మొక్కాం తెలంగాణ త్యాగధనుల ప్రతీకకు. మొబైల్ ఫోన్లలో కెమేరాలు తెరిచి ఫోటోలు దిగాం.. ముఖ్యంగా తెలంగాణ రాజముద్ర రచించిన చిత్రకారుడు మా ఏలె లక్ష్మణన్నతో కలిసి.
మళ్ళీ ప్రెస్ క్లబ్ కు వచ్చాం. రాత్రి తెల్లవారేందుకు తొందరపడుతోంది. అల్లమన్న, కృష్ణమూర్తి, చల్లా శ్రీనివాస్, సుధీర్ తదితరులతో తెలంగాణ పోరు జ్ఞాపకాలను తరిచి చూసుకున్నాం. తరించిపోయాం. అయిదు గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరాం. వెలుగు వాకిళ్ళుగా స్వాగతం పలికిన నెక్లెస్ రోడ్ చౌరస్తా, సెక్రటేరియట్, టాంక్ బండ్ ల మీదుగా ప్రయాణం. సికింద్రాబాద్ ప్యాట్నీ చౌరస్తాలో చల్లాతో కలిసి ఓ మీఠా పాన్.
ఆకాశం ఊదారంగులోకి మారింది. కొత్త వెలుగు హాయిగా ఆవరిస్తోంది. మాతో పాటే మేల్కొన్న రాత్రి.. ఆరు దశాబ్దాల కలను నిజం చేసింది. మా తరానికి ఉద్యమ ఫలాన్ని కానుక చేసింది.
మా ఇంటి బాల్కనీలో శుభోదయం.
తెలంగాణ మహోదయం.

– పసునూరు శ్రీధర్ బాబు
సైనిక్ పురి,
హైదరాబాద్,
తెలంగాణ రాష్ట్రం
(ఉదయం 6.30 గం.లు, సోమవారం 2 జూన్, 2014)