పుస్తక సమీక్షలు, Uncategorized

మహాకవి దాశరథి ‘అచుంబిత మనోజగం’


నక్షత్రపురం తోవలో ప్రయాణం ఒక్కోసారి నాకే విచిత్రంగా తోస్తోంది. అక్షరాలు మిణుకు మిణుకుమంటూ పలకరించే బాటలో ఏ మలుపు వద్ద ఎవరు ఎదురుపడతారో తెలియదు. ఎదురుపడిన అక్షర యోగులు మిల మిల మెరిసే చూపులతో నను పట్టుకుని ఎక్కడిదాకా తీసుకువెళతారో తెలియదు. ఏ వీడ్కోలు దగ్గర ఏ చేయి నా భుజాన్ని ప్రేమగా నిమురుతుందో తెలియదు. ఏ చుక్కల చెట్టు కిందో కాసేపు విశ్రమించి కళ్లు తెరిచే వేళకు మరో ఆకాశ సాక్షాత్కారం.
రేవతీ దేవి దుఃఖ స్వగతంలోంచి ‘Man is condemned to be free’ అన్న Sartre ను గుర్తు చేసుకున్నప్పుడు, The limits of language are the limits of my world అని మథనపడుతూ, మనిషి భాషకు బందీ అయిన సంగతిని స్పృహించి, సంకెళ్ళను తెంచే ప్రయత్నం చేసిన Ludwig Wittgenstein పలకరించాడు. Ludwig తో నిశీధి అంచు వెంట సాగిన యాత్రను గమనిస్తూ ఓ మలుపు దగ్గర ‘పరాభూత కవి కరంలో విరిగిన విల్లులాంటి భాష’తో పేచీ పడిన మార్మిక స్వరంలా ఎదురయ్యాడు బైరాగి. ఇప్పుడేమో, ‘నా దారిలో ఎక్కడా మైదానం రాలేదు. బైరాగిలా నూతిలో గొంతుకలు వింటున్నాను’ అని ‘మననం’ చేసుకున్న మహాకవి దాశరథి కనిపించాడు. ‘మెట్లు లేని మేడ మీద / మేలి నీలి ముసుగు తీసి / నవ్వే అందాల తరుణి / నవశారద నిశాశశి’ని చూస్తున్నాడు, చూపిస్తున్నాడు నక్షత్రపుర వీధుల్లో.
ఇంకా ఏమంటున్నాడో తెలుసా?
అర్థమగునె సగం సగం?
అచుంబితం మనోజగం-
పవళించుము నీలో నీ
వెవరిని మేల్కొల్పబోకు;
విచ్చిన ఎద కంటి చూపు
విశాలమై క్రమ్మనీ.
పునర్నవనవోన్మేషంగా దాశరథి వెదజల్లిన ఈ నక్షత్రకాంతిని గుండెను నిండుగా తెరుచుకుని ఒంపుకున్నామా లోపలికి? ‘వెదురు పొదలలో చొరబడి/ రొదలిడు మలిసందె గాలి’ని శబ్దాల్లో పట్టి వినిపించేందుకు ఆయన పడిన వేదనను నిజంగా గుర్తించామా?
dasarathi
మర్రి ఆకుపై విష్ణువు
మాదిరి శబ్దమున శక్తి
సముద్రాన పాలవోలె
సరిగమలో సంగీతం
మనకున్న నిఘంటువులు
విననట్టిది కననట్టిది
నది తరగలలో, భావుకు
మదిలోపలి వింత పలుకు-
నీలో నీవే నిద్రిస్తూ హృదయ నేత్రాన్ని విశాలం చేసి అచుంబిత మనో జగాన్ని వీక్షించమన్నాడు దాశరథి. అంతరంగ సముద్రాన్ని మథించినప్పుడే సరిగమల సంగీతం వినిపిస్తుందనీ, నిఘంటువులకు అతీతమైన వింత పలుకేదో భావుకుని మదిలో వికసిస్తుందనీ గుర్తించిన నిఖార్సయిన కవి దాశరథి. మెట్టులేని మేడగా నభోతలాన్ని దర్శించడం ఆయనకే చెల్లింది. ఇవన్నీ దాశరథి రాసిన “పునర్నవం” సంకలనంలోని ‘అచుంబితం’ అనే కవితలోని పాదాలు.
‘Genuine poetry can communicate before it is understood’ (TS Eliot) అన్నట్లు, ‘కవిత్వం ఉఛ్వాసలోకి చొరబడి గాలికంటే ముందుగా నరాల్లోకి పాకిపోయి ఏదీ అందుకోలేని ఆత్మను తాకుతుంది’ అని గుర్తించిన ఈ కవి సారానికీ, రూపానికీ మధ్య ప్రాణంలా తపించిపోయాడు. చీకటి శిలను శిల్పంగా మలిచే వైయక్తిక సంవేదనను అనుభవించిన వాడు కనుకే నిరసనను నెత్తుటి పాటగా వినిపించాడు. ధిక్కారాన్ని భావోద్వేగభరితమైన సామాజిక ఆకాంక్షకు రూపంగా మండించగలిగాడు.
‘ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్నుబోలిన రాజు మాకెన్నడేని;
తీగలను తెంపి, అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ’
అని దాదాపు ఇరవయ్యేళ్ల ప్రాయంలోనే అని గొంతెత్తిన సాహసి దాశరథి. నిజాం నిరంకుశ పాలనలలో ప్రజలు పడ్డ అగచాట్లు, రైతులు అనుభవించిన బాధలు ఆయనను తీవ్రంగా కలచివేశాయి. ఆ వేదనే పునాదిగా ఆయన కవిత్వాన్ని ఆశ్రయించాడు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత కమ్యూనిస్టు సిద్ధాంతాలు నచ్చక,- బైరాగి లాగే – బయటకు వచ్చి, తెలంగాణ సాయుధ పోరాటానికి నడుం బిగించాడు. నిజాం సిపాయిల నుంచి తప్పించుకోవడానికి అడవుల్లో తిరిగాడు. జైలు పాలయ్యారు. వరంగల్ జైలు నుంచి దాదాపు 30 మంది రాజకీయ ఖైదీలను నిజామాబాద్ జైలుకు తరలించినప్పుడు అక్కడ “ప్రజల మనిషి” వట్టికోట ఆళ్వారుస్వామి పరిచయం కావడం వంటివన్నీ దాశరథి తొలినాళ్ళ కవిత్వానికి బాటలు వేశాయి. మఖ్దూం, కైఫీ ఆజ్మీ, ఇక్బాల్ వంటి ఉర్దూ కవుల ప్రభావం కూడా ఆయనను ముందుకు నడిపించింది.
అయితే, ఆయన కవిత్వంలో ఎప్పుడూ ఒక పార్శ్వమే బలంగా చర్చల్లో కనిపిస్తూ వచ్చింది. ఆయనకు కీర్తి కిరీటాలు తొడిగిన వారంతా చాలా వరకు తెలంగాణ ఉద్యమ కవిగానే గుర్తించేందుకు ఇష్టపడ్డారు. “నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న వాక్యం దాశరథి కవిత్వానికి ప్రతీకగా స్థిరపడిపోయింది. అగ్నిధారలోని ఈ కవితో పాటు దాశరథి అనగానే గుర్తొచ్చే మరొక గొప్ప రచన… ‘ఆ చల్లని సముద్ర గర్భం/ దాచిన బడబానలమెంతో/ ఆ నల్లని ఆకాశంలో/ కానరాని భానువులెందరో?’ అంటూ మొదలయ్యే ‘?’ కవిత.
పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం యెంతో?
గాయపడిన కవి గుండెల్లో
వ్రాయబడని కావ్యాలెన్నో?
కులమతాల సుడి గుండాలకు
బలిగాని పవిత్రులెందరో?
అంటూ స్వాప్నిక సంవేదనలా సాగే ఈ కవిత గొప్ప పాటగానూ కవిత్వ ప్రియుల హృదయాల్లో నిలిచిపోయింది. తెలంగాణను తల్లిగా భావించి, ఆ తల్లి బిడ్డగా తన కుటుంబం అనుభవిస్తున్న పేదరికాన్నీ, వేదననీ ప్రశ్నిస్తాడు దాశరథి. రాచరికాన్ని నిరసించడం, “ప్రజాస్వామ్య సోషలిజాన్ని” స్వప్నించడం వంటి ఆయన కవిత్వంలోని అంశాలు అభ్యుదయవాద విమర్శకులను బాగా ఆకట్టుకున్నాయి. తెలుగు సాహిత్యంలో యాభైలకు పూర్వం నుంచే తెలుగు సాహిత్య విమర్శలో ఆధిపత్యాన్ని చూపిస్తూ వచ్చిన కమ్యూనిస్టు విమర్శ కూడా దాశరథిలోని ఆ పార్శ్వానికే పరిమితమైందేమో అనిపిస్తుంది.
దాశరథి తొలికవితా సంకలనం ‘అగ్నిధార’ 1949లో అచ్చయింది. తెలుగు కవిత్వాన్ని భూమార్గం పట్టించిన శ్రీశ్రీతో తెలుగు సాహిత్యంలో ఆధునికత అంటే అభ్యుదయ సాహిత్యమేనని, భావ కవిత్వం అంతరించిపోయిందనే అభిప్రాయాలు బలంగా ముందుకు వచ్చిన రోజులవి. ‘అగ్నిధార’కు తొలిపలుకు రాసిన దేవులపల్లి రామానుజరావు, ‘తెలుగు కవిత్వంలో శ్రీశ్రీ ఒక కొత్త మార్గము త్రొక్కినారు. ఈ సంప్రదాయము ననుసరించి కవిత్వము వ్రాయు యువకులలో దాశరథి ప్రముఖులు” అని అన్నారు. నిజమే, అగ్నిధారలో శ్రీశ్రీ ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా, అదుగో/ అదుగదుగో/ ఉదయ దిశా వదనంలో/ కదిలే మెదిలే/ తెల తెల్లని తళుకులలో/ నిశాంతాన నశించిన/ విశాల తారకామండలం/ ప్రశాంత మృతి/ సిత ద్యుతులు… అన్నప్పుడు, ‘పదే పదే అనేస్తా, నిరుపేదా’ వంటి కవితల్లో నడక, శాబ్దిక లయ శ్రీశ్రీని గుర్తు చేస్తుంది. కానీ, అగ్నిధార మలిముద్రణకు 1963లో దాశరథి రాసుకున్న ‘పురాస్మృతులు’ పీఠికలో కానీ, అంతకు రెండేళ్ల ముందు “పునర్నవం” సంకలనానికి రాసుకున్న ముందు మాటలో కానీ ఎక్కడా శ్రీశ్రీని ప్రస్తావించకపోవడం కాకతాళీయం కాకపోవచ్చు.
వాల్మీకి నుంచి కాళిదాసును, శ్రీనాథుడినీ స్మరించుకోవడంతో పాటు స్పెన్సర్, హోమర్‌లనూ తలచుకున్న దాశరథి ‘గురజాడ’ ఇవాళ మాయింట్లో పాడుతున్నాడు అని చెప్పుకున్నాడు. ప్రబంధ సాహిత్యాన్ని విస్తృతంగా చదువుకుని సంప్రదాయిక కవిత్వాన్ని సృజిస్తూ వచన కవిత్వంలో విశ్వరూపం చూపేంతవరకు దాశరథి ఎంతో దూరం ప్రయాణించాడు. కానీ, మనమే ఆయనను అగ్నిధార వద్ద ఆపేశామేమో అనిపిస్తోంది. ముఖ్యంగా, ‘పునర్నవం’ గురించి జరగాల్సినంత చర్చ జరగలేదనే అనిపిస్తుంది.
‘అగ్నిధార’లోనూ దాశరథి కవిత్వంలో వైవిధ్యం కనిపిస్తుంది. ఇందులోని కవితలన్నీ 1949కి పూర్వం రాసినవే. చాలా వరకు దాశరథి జైల్లో ఉన్నప్పుడు రాసినవే. వరంగల్ జిల్లా మానుకోటలోని నెల్లికుదురు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయినప్పుడు ఓ ఊరిలో ఆప్యాయంగా ముంతలో మంచినీళ్ళు అందించిన రైతు పిల్ల ఒయ్యారాన్ని చూసి మైమరిచిపోయాను అని చెప్పుకున్న దాశరథికి అప్పుడు ఇరవై ఏళ్ళు. ఇఫ్పుడేమో ఆయన 1925 జూలై 22న జన్మించారని రాస్తున్నారు. వికీపీడియాలోనూ అలాగే ఉంది. కానీ, పాత పుస్తకాల్లో కొన్ని చోట్ల దాశరథి జననం 1927 అని నమోదైంది. ‘జైల్లో అడుగు పెట్టినప్పుడు నా వయసు సుమారు ఇరవై’ అని స్వయంగా చెప్పుకున్నారు కాబట్టి, 1927లో జన్మించారన్నదే నిజమేమో అనిపిస్తోంది. ఈ సంగతిని అకడమిషియన్లు నిర్ధారించాలి. ఆ వయసులో దాశరథి తనను తాను యుద్ధ రంగంలోని సైనికుడిగా సంభావించుకున్నాడు. యుద్ధ భూమిలో కూడా సైనికుడు తన ప్రియురాలిని తలచుకుంటాడని గుర్తు చేశాడు. తన కవిత్వంలో ఈ రెండూ ఉంటాయని మఖ్దూంనూ, కైఫీ ఆజ్మీనీ తనకు బాసటగా ఉదహరించాడు. బైరాగి నూతిలోని గొంతుకలూ వినిపిస్తున్నాయని ప్రకటించాడు.
అస్తమయంలో… అనే కవితలో దాశరథి ఏమంటున్నాడో చూడండి:
నేను పడమరలోకి చూస్తాను – రోజు,
కుంగిపోతున్న సూర్యుని గుండెలోని
వెలుతురులు తాగి, చీకటి కలలు లాగి
రాత్రి సాంతము నిద్దుర రాదు -రోజు.
ఇంకా, “దీపావళి” అనే కవితలో…
భూపావళి బుగ్గి చేసి
కోపావళి నగ్గి ద్రోసి
దీపావళి జరపండో
దేశ దేశ జనులార
తెలంగాణ ఘనులార…
అన్నప్పుడు… ‘దీపావళి ఉత్సవమండీ/ దీపావళి చేద్దాం రండీ/ ఆకాశం మండిద్దామా/ పాతాళం తగలేద్దామా’ అనే బైరాగి ‘దీపావళి’ (చీకటి నీడలు) గుర్తుకు వస్తుంది. కాకపోతే, ‘నైరాశ్యపు చీకటి ముసుగున దాగిన మృత్యువు’ నృత్యం గురించి బైరాగి పాడుకుంటూ పోతే, దాశరథి మాత్రం.. ‘చల్లని చమురుంటేనే దీపావళి.. ప్రజాబలం వుంటేనే ప్రభుత్వాలూ రాజ్యాలూ’ అంటూ ప్రబోధిస్తాడు. మరో దివ్య దీపావళి అంటూ ఆశావాదాన్నీ వినిపిస్తాడు.
ఈ సైనికుడి జీవితంలోని భిన్న పార్శ్వాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి “కవితా కోపం” చక్కని ఉదాహరణ.
నన్ను చూచి ఎందుకొ
మిన్నాగులు ఇట్లా
పారాడుతు జీరాడుతు
వస్తుంటాయి?
నన్ను చూచి ఎందుకు
పున్నాగలు ఇట్లా
తారాడుతు, గోరాడుతు
పూస్తుంటాయి?
ఇదే కవితలో కాస్త ముందుకు వెళితే… ‘నాకు తెలుసు, నాకు తెలుసు/ ప్రళయవేదనా పంకిల ప్రపంచ పథం మధ్య/ ప్రేమలు పొసగవనీ/ ఈ బండరాళ్లపైన ఏ మొక్కలు ఎదగవనీ’ అన్న బైరాగిని దాశరథి మళ్లీ గుర్తు చేస్తాడిలా:
ఏనాడో తెలుసు నాకు
ఈ నిరీహ
నీరవ
నిస్వార్థ
నిర్ధన
నీచ నీచ మానవునికి
నిలువ నీడ లేదు జగతి.
ఇది లోకం
నరలోకం
నరకంలో లోకం నరలోకం.
ఆ తరువాత రుద్రవీణ సంపుటి వచ్చేటప్పటికి దాశరథిలోని ఆత్మాశ్రయవాదం మరింత బలంగా కనిపిస్తుంది.
రానున్నది ఏది నిజం
అది ఒకటే సోషలిజం
అని స్వాతంత్ర్యానంతర జాతీయవాదం ఆయనలో సహజంగానే కొనసాగింది. అప్పటికింకా నెహ్రూ సామ్యవాదం మీద భ్రమలింకా తొలగిపోలేదు. అందుకే, ఆ తరువాతెప్పుడో నెహ్రూను స్మరిస్తూ కూడా కవిత రాశాడు దాశరథి. రుద్రవీణ సమయానికి తెలంగాణ స్వతంత్ర భారతంలో కలిసింది. అందుకే, దాశరథి ఇందులో తెలంగాణను “ముక్త భూమి”గా దర్శించాడు. అయితే, సామాజిక వేదనను అస్తిత్వ గాయంగా, వైయక్తిక వేదనగా వినిపించడంలో ఆయన శిల్పం కొత్త పుంతలు తొక్కిందని ‘రుధిర పక్షులు’ కవిత రుజువు చేస్తుంది.
నీలి మబ్బులు
తేలియాడే
నింగి నిండా
రుధిర పక్షులు
రుధిర పక్షుల
రెక్క బరువుకు
కూలిపోయిన
గాలి సౌధం
గాలి సౌధం
పునాదుల్లో
కాళ్లు విరిగిన
కొత్త రాజులు
కొత్త రాజుల
గుండియల్లో
వచ్చి వ్రాలిన
పక్షి రెక్కలు
పక్షి రెక్కల
పదను కోతకు
తెగిన కాలం
కొత్త రంగులు-
ఇలా సాగుతుందీ కవిత ఒక accomplishment తరువాత చిగురు తొడుగుతున్న కొత్త ఆశకు ఊపిరి పోస్తున్నట్లుగా. రుధిర పక్షులు అనే పదబంధమే అద్భుతంగా ఉంటే, కూలిపోయిన కూలిపోయిన గాలి సౌధం పునాదుల్లో… అంటూ ఒక అమూర్త భావనను conceitతో concreteగా వ్యక్తం చేస్తాడు దాశరథి.
ఆ తరువాత వచ్చిన “మహాంధ్రోదయం” సంకలనం.. ‘మూడు కోటుల నొక్కటే ముడి బిగించి’ ఏర్పడే విశాలాంధ్రను స్వాగతించాడు. అగ్రజులతో కలసిపోవడం కోరుకున్నాడు. కానీ, 1961లో వచ్చిన ‘పునర్నవం’లోని ‘ఘంటాపథం’ కవిత దాశరథి తన గతానికి చింతించాడా అనిపిస్తుంది.
అగామిని గూర్చి వీళ్లకు తోచదు!
అవును మరి, వీళ్లను కాలం దాచదు.
కానీయండి, మన పాత పుణ్యాలు కూలనీండి
మనది డీరెయిల్ అవుతోన్న పొగబండి
అవును..
ఎటొచ్చాం మనం దారి తప్పి?
అని దాశరథి సంధించిన ప్రశ్నలకు కాలమే జవాబులు చెప్పిందా అనిపిస్తుంది. ‘పునర్నవం’ సంకలనం దాశరథి కవితాయానంలో అద్భుతమైన మజిలీ అనిపిస్తుంది. ఈ వ్యాసం ప్రారంభంలో ప్రస్తావించిన ‘అచుంబితం’, జ్యోతిశ్చక్రం, బాల్యం, కిరణ శకలం వంటి కవితలు ఆధునిక శిల్పానికి, అస్తిత్వ పరివేదనకు ఆనవాళ్లుగా కనిపిస్తాయి. పునర్నవం శీర్షికన రాసిన కవితలో దాశరథి కవిత్వాన్ని నిర్వచించే పని చేస్తాడు. “ముసలి మోహం పడిన వృక్షం మీద యౌవనం చిగురించడం కవిత్వం… మనసు మల్లె పొదల్లోంచి పసందైన వాసనలు వీచి/ అవి పద్యాల సీసాల్లో/ అనంతకాలం నిలుస్తే కవిత్వం” అంటాడు.
“మతాలు, రాజకీయాలూ మనస్సుల్ని విరగ్గొడతాయి. కవిత్వం మనస్సుల్ని అతుకుతుంది” అంటూ కవిత్వంలో మానవీయ విలువల ప్రాధాన్యం గురించి చెబుతాడు దాశరథి “మననం” పేరిట రాసుకున్న ముందు మాటలో. మనిషిని మనిషిని చేరే మార్గం లోపలివైపు నుంచే ఉంటుందనీ, ఆ లోపలి మానసిక లోకం మరింత పెద్దదనీ గుర్తు చేస్తాడు.
“I love you as certain dark things are to be loved,
in secret, between the shadow and the soul” (Pablo Neruda)
అన్నట్లు ఈ సామాజికుడిలో ఒక అస్తిత్వవాది సమాంతరంగా కొనసాగాడు. అతడ్ని మనం విస్మరించామా? కేవలం గాలిబ్ గీతాల అనువాదాల్ని, గుండెలో గారాలు పోయే గజళ్లను మాత్రం ప్రత్యేకంగా ప్రేమించి, ఆయన ప్రధాన స్రవంతి కవిత్వంలో దానికి అంత ప్రాధాన్యం లేదని పరిమితమయ్యామా? అందుకే, దాశరథిని మనం మరోసారి చదువుకోవాలి. “మననం” చేసుకోవాలి. పునర్నవ కాంతులతో ఆయన కవిత్వాన్ని re-invent చేయాలి.
***

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s