వ్యాసాలు

పదే పదే గుర్తొస్తోంది Pablo Neruda కవిత ‘Nothing but Death’


10 quotes by Pablo Neruda on love and loss to awaken the romantic in you -  Education Today News

I thought the love would last forever, I was wrong అని WH Auden అన్నప్పుడు గుండె చెదిరిపోయింది. ఇప్పుడు నక్షత్రాలు అక్కర్లేదు, చంద్రున్ని పొట్లాం కట్టి పారేయండి. సూర్యుడ్ని ముక్కలు ముక్కలు చేసేయండి. సముద్రాల్ని గుమ్మరించి అడవుల్ని తుడిచిపెట్టేయండి. ఇప్పుడిక దేనితోనూ ఏ మంచీ జరిగేలా లేదని Funeral Blues https://allpoetry.com/Funeral-Blues కవితలో పిచ్చెక్కినట్లు అరుస్తాడు ఆడెన్. ఒక మరణం మిగిల్చిన వేదన. మృత్యువు దాహం తీర్చుకుని వెళ్లిపోయిన తరువాత మిగిలిన ఎడారిలో మోగే ఒంటరి రోదన.

గడియారాలన్నీ ఆపేయండి

ఫోన్లన్నీ కట్ చేయండి

మొరగకుండా ఆ కుక్కకు ఓ బొక్కను పడేయండి

పియానోల నోరు నొక్కి, మూగబోయిన డప్పుల చప్పుడుతో

శవ పేటికను బయటకు తెండి, ఏడ్చేవాళ్లను పిలిపించండి.

ఎందుకీ దుఃఖం అంటే, ప్రేమ ఎప్పటికీ ఉంటుందనుకున్నాడు. అది తప్పని తెలుసుకున్నాడు. మనిషి అది తప్పని పదే పదే తెలుసుకుంటూనే ఉన్నాడు. అంటే, తెలిసి తెలిసీ తప్పు చేస్తూనే ఉన్నాడు.

ఇప్పుడెందుకీ కవిత్వం అంటే, గడియారాలు ఆగిపోలేదు. ఫోన్లు మోగుతూనే ఉన్నాయి ఆర్తనాదాల్ని, మరణవార్తల్ని చెవుల్లో గుమ్మరించేందుకు. గుండెను జలదరించేందుకు. కరచాలనాలను దూరం చేసిన కరోనా కాలంలో కర స్పర్శలే కనుమరుగవుతున్నాయి. ఆలింగనాలు నేరమైన రోజుల్లో ఆత్మీయుల డిజిటల్ ప్రజెన్స్ కంట్లో పిక్సెలేట్ అయిపోతోంది.

ఎక్కడిదీ బాధ. ఎందుకీ కష్టం? నిశ్చల సమాధిలో కళ్లు తెరిచి చూస్తున్నప్పుడు వినిపిస్తున్న చీకటి వికారాన్ని ఎట్లా జయించడం? శబ్దం మేల్కొలుపుతుంది, నిశ్శబ్దం నిద్రపోనివ్వదంటాడు ‘మో’ బహుశా పునరపిలో అనుకుంటా. అదీ పరిస్థితి. “నేను మృత్యువు కోసం ఆగలేను కాబట్టి, అతనే దయతో నాకోసం ఆగాడు’ అన్న ఎమిలీ డికిన్సన్, ఇంకా… “మృత్యువు ఎక్కడో లేదు/ నా పక్కనే/ అతని చిరునవ్వు కోసమేగా నేను/ గంటలు గంటలు వేచి చూస్తూ వుంటాను” అంటూ మృత్యువు హాస్య ప్రియత్వానికి హసించి, పరవశించిన అజంతా గుర్తుకు వస్తున్నారు, మృత్యువాక్య పరిష్వంగంలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

ఎవరో ఎందుకు? నేను కూడా రాసుకున్నాను కదా ‘నువ్వు నేను మృత్యువు’ https://anekavachanam.wordpress.com/…/%E0%B0%A8%E0%B1…/ అనే కవితలో… ‘వెలుగులోకి చీకటి జూలు విదిల్చి నెమ్మదిగా అడుగుపెడుతున్నట్లు ప్రాణంలోకి మృత్యువు చొరబడుతున్న క్షణాల్లో గుర్తొచ్చే బతికిన క్షణాల్లో వినిపించే రాగాల నయగారాలు ఉవ్వెత్తున ఎగసిపడి మీద పడి తడిమేసి తడిపేసి తోసేసినప్పుడు నువ్వు నేను మృత్యువు కలిసే కదా ఆ సంబరంలో కొట్టుకుపోయాం’ అని. అవాంఛిత అతిథితో ఈ funeral celebration పుట్టినప్పుడే మొదలైందన్నాను కదా?

అయినా, మృత్యువు భయపెడుతుంది, బాధిస్తుంది. ఎందుకంటే, అది శాశ్వతంగా కోల్పోవడం అంటే ఏమిటో అనుభవంలోకి తెస్తుంది. అందుకే, అదంటే భయం, గౌరవమూనూ.

అందుకేనేమో, కవిత్వంలో మృత్యువు ఎంతో అందంగా, ఆత్మీయంగా కనిపిస్తుంది. ఏ అవలి తీరాల నుంచి వచ్చానో అక్కడికే వెళ్లాలి కదా అన్న స్పృహ కవిని మృత్యు సాహచర్యానికి ప్రేరేపిస్తుంది. సజీవ మృత్యు సాక్షాత్కారానికీ కరుణిస్తుందేమో.

అందుకే, మృత్యు సంచలనం లోలోన చెలరేగినప్పుడల్లా నాకు గుర్తొస్తుంది Pablo Neruda రాసిన ‘Nothing but Death’ కవిత. We die going into ourselves, as through we were drowning inside our hearts, as though we lived falling out of the skin into the soul అంటాడు నెరూడా మృత్యువును అంతర్ బహిర్లోకాలలో దర్శిస్తూ, దాని వర్ణాన్ని, శబ్దాన్ని చూపిస్తూ, వినిపిస్తాడు.

మృత్యువు మనతోనే, మనలోనే ఉంటుంది. మృత్యువు అంటే మనలోకి మనం వెళ్లిపోవడమే అనీ అంటాడు. మన శిథిల నౌకాయానాల తుది తీరాల వద్ద స్వాగతం పలికే అడ్మిరల్ మృత్యువు. ఒకసారి చదివితే ఈ కవిత ఇక మృత్యువులా వెంటాడక మానదు.

ఈ కవితను తెలుగులో ఇప్పటికే కొందరు అనువదించారు. మహాకవి శ్రీశ్రీ కూడా “మరేముంది మరణం తప్ప” అని తెలుగులోకి తర్జుమా చేశారు. కానీ, నాకెందుకో అవేవీ సంతృప్తినివ్వలేదు. అనువాదాల్లో ఎక్కువ స్వేచ్ఛ తీసుకోవడం న్యాయం కాదన్నది నా నమ్మకం.

నేను కూడా ఆ కవితను తెలుగు చేయాలని ప్రయత్నించి చాలా సార్లు కాగితాలు చించి చెత్తబుట్టలో పారేశాను. నెరూడా స్పానిష్‌లో రాసిన ఆ కవితను ఇంగ్లిషులోకి కూడా చాలా మందే అనువదించారు. అయితే, Robert Bly చేసిన అనువాదమే https://poets.org/poem/nothing-death నెరూడా సమగ్ర కవితల సంకలనంలో కనిపిస్తుంది. దాన్నే ప్రామాణికంగా చూస్తున్నారు. నిజానికి, మనకు స్పానిష్ తెలియకపోయినా ఇంగ్లిషులో ఆయన అనువాదంలోనే ఒక ధార కనిపిస్తుంది. ఈ కవిత ప్రతిసారీ కొత్తగా, తన లోతులు ఇంకా కనుక్కోమంటూ సవాలు విసురుతున్నట్లే కనిపించేది.

కానీ, ఈ సందర్భంలో మళ్లీ చదివినప్పుడు అది మరింతగా దగ్గరైనట్లనిపించింది. ఆ అనుభవాన్ని సమీపించిన అనుభూతి కలిగింది. ఇదిగో చూడండి నా అనువాదం. ఎక్కడైనా తప్పడటడుగు వేసి ఉంటే నిర్దయగా కామెంట్లతో విరుచుకుపడండి.

.

మృత్యువొక్కటే”

…..

ఒంటరి శ్మశానవాటికలు

చప్పుడు చేయని ఎముకలతో నిండిన సమాధులు

చీకటి చీకటి చీకటి సొరంగంలోకి

శిథిల నౌకలా కొట్టుకుపోతున్న గుండె

మనం మనలోకే పోతూ చచ్చిపోతాం,

మన గుండెల్లోనే పడి నిండా మునిగిపోతాం,

చర్మం లోపల బతికి ఆత్మలోకి రాలిపోతున్నట్లు.

.

అవిగో అక్కడ శవాలు

చల్లటి బంక మట్టితో చేసిన పాదాలు

ఎముకల లోపల మృత్యువు

కుక్కలు లేకుండానే అరుపులు వినిపిస్తున్నట్లు,

ఎక్కడో గంటల నుంచి, శ్మశానాల నుంచి వస్తో

వాన కన్నీళ్ల వంటి తడి గాలిలో ఎగబడుతోంది

.

కొన్నిసార్లు నేనొంటరిగా

తెరచాపల కింద పాలిపోయిన శవాలు, మృత శిరోజాల స్త్రీలు

దేవ కన్యల మల్లే తెల్లగా ఉన్న రొట్టెలు చేసే వాళ్లు

నోటరీ గుమస్తాలను పెళ్లాడిన తెలివైన యువతులతో

కొట్టుకొస్తున్న శవ పేటికలను చూశాను

మృత్యు నది మీద

నిటారుగా దూకే చిక్కటి ఊదా రంగు మృత్యు నది మీద

చితా భస్మ పేటికలు పైపైకి పోతుంటాయి

ప్రవాహానికి అభిముఖంగా మరణ మృదంగ నాదం చేస్తూ

అదంతా ఒక నిశ్శబ్ద నాదం.

.

మృత్యువు

పాదాలు లేని చెప్పుల్లా

మనిషి లేకుండా నడిచి వచ్చే దుస్తుల్లా

రకరకాల శబ్దాలతో సమీపిస్తుంది

తలుపు తడుతుంది ఉంగరంతో టక్ టక్ మని కొడుతూ

ఆ ఉంగరానికి ఏ రంగు రాయి ఉండదు, అసలు వేలు కూడా ఉండదు.

వచ్చి బిగ్గరగా అరుస్తుంది నోరు లేకుండా నాలుక లేకుండా

కంఠం కూడా లేకుండా.

దాని అడుగుల చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది

అది వేసుకున్న దుస్తులు గాలికి ఊగే చెట్టులా నెమ్మదిగా సడి చేస్తుంటాయి

.

కచ్చితంగా చెప్పలేను, కానీ నాకు ఏదో కొద్దిగా అర్థమవుతూంటుంది, నాకేమీ కనిపించదు కూడా

కానీ, దాని పాట నాకు తడిసిన ఊదా రంగులా తోస్తుంది

ఈ భూమే సొంత ఇల్లయిన ఊదా వర్ణాలు,

మృత్యువు ముఖం ఆకుపచ్చ రంగులో ఉంది కదా…

అందుకే, అది చూసే చూపు కూడా ఆకు పచ్చ వర్ణమే,

అది ఊదారంగు పత్రం తేమలా

కోపంతో ఊగిపోయే శీతాకాలం మసక రంగులా లోలోకి చొరబడుతుంది.

.

మృత్యువు…

ఇంకా చీపురులా ముస్తాబై లోక విహారానికి బయలు దేరుతుంది

గచ్చును తుడిచేస్తూ, మృతదేహాల కోసం వెతుకులాడుతూ,

మృత్యువు చీపురు లోపలే ఉంది

చీపురు.. శవాల కోసం మృత్యువు సాచిన నాలుక

అది దారాన్ని దేవులాడుతున్న సూది

.

మృత్యువు

మడత పెట్టిన మంచాల్లో ఉంటుంది:

అది బద్ధకపు పరుపుల మీద,

నల్లని కంబళ్లలో నిద్రపోతూ బతుకుతూ

అకస్మాత్తుగా ఊపిరి వదిలేస్తుంది:

విషాద ధ్వనిలా పేలిపోయి దుప్పట్లను ఎగరేస్తుంది

మంచాలు తెరచాపలతో ఆ రేవు వేపు కొట్టుకుపోతాయి

అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది

అత్యున్నత నౌకాదళాధికారి దుస్తుల్తో…

మృత్యువు.

***

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s