Uncategorized

పోగొట్టుకున్నవన్నీ భద్రంగా దాచుకున్నవాడు Yehuda Amichai


ఇతడు ఇంతదాకా నువ్వు రాసిన కవిత్వాన్ని మార్చగలడు. ఇతడు ఇంతదాకా నువ్వు సత్యం అనుకున్న దాన్ని సందేహంలా నిలబెట్టగలడు. ఇతడు నీ నిఘంటువులోని పదాలను కొత్త అర్థాలతో దారి తప్పించగలడు. నీదీ తనదీ కాని దారిలోకి ఇతడు నిన్ను సునాయాసంగా తోసేయగలడు. నీకు కనిపించే ప్రతి దాన్నీ నీ కంటిలో యౌవన ప్రతిమగా ప్రతిష్ఠించగలడు. గాయాలను దోసిళ్లలో పోసి నిన్నొక నిప్పుల కుంపటి చేయగలడు. రక్తాన్ని రణంతోనూ, ప్రణయంతోనూ మరిగేలా చేయగలడు. చివరికి నిన్ను చరిత్రలోకి వేళ్లూనుకున్న చెట్టును చేసి నిన్ను నేటి తుపానులో నిలబెట్టగలడు. నీ శిరస్సు మీద రేపటి సూర్యోదయం మొగ్గ తొడిగేలా చేయగలడు. ఒక్క మాటలో… అతడు నిన్ను నీకివ్వగలడు.

అతడు యెహుదా అమిహాయ్ (Yehuda Amichai).

అతడు నిన్ను నీకిచ్చిన తరువాత నువ్వేమంటావంటే:

Now I have recovered from the lesson.

The hair of my head

Is cropped, like a soldier from the

Second World War,

Round and round, and my ears not only hold up my skull

but the whole sky.

అవును. నీ తల మీద మోపబడిన పాఠాల బరువును దింపుకుంటావు. యుద్ధానికి దిగిన సైనికుడిలా నీ తలనంతా ఎవరో మట్టంగా గొరిగేస్తారు. ఇక అప్పుడు నీ చెవులు నీ కపాలాన్ని కాదు, మొత్తం ఆకాశాన్ని తొడుక్కుంటాయి.

‘బాగా అలసిపోయిన నా తల

ఒకసారి తెగిపడి నా వెంట్రుకల ఛాతీ మీద పడింది

అక్కడే మా నాన్న వాసన నాకు తగిలింది మళ్లీ,

చాలా ఏళ్ల తరువాత’ (Things that have been lost)

ఇలాంటి కవిత్వాన్ని ఇటీవలి కాలంలో ఎక్కడైనా విన్నారా? తండ్రి ఛాతీ మీద తల వాల్చిన చిన్ననాటి అనుభూతిని ఎంత బలంగా గుర్తు చేసుకున్నాడు అలసిపోయిన క్షణాల్లో.

“I don’t live like a poet, nor do I look like one, and I have the child in me. My escape route to childhood is always open.” ఆ దారులన్నీ మనకు కనిపిస్తాయి ఆయన కవిత్వంలో. కానీ, ఎక్కడికి తప్పించుకుంటాడు? మహా అయితే, కుడి కంట్లోంచి ఎడమ కంట్లోకి. లేదంటే అట్నుంటి ఇటూ.

‘నా కళ్లు

పక్క పక్కనే ఉన్న రెండు సరస్సుల్లాగా

ఒక దానిలోకొకటి ప్రవహించాలనుకుంటున్నాయి

తాము చూసిందంతా పరస్పరం చెప్పుకోవడానికి’ (Six poems for Tamar)

ఆయన metaphorsలోజీవం ప్రవహిస్తుంటుంది. ‘మా నాన్న చేతులు నదులై ఆయన చేసిన పుణ్య కార్యాల్లోకి ప్రవహించాయి’ అంటాడొక చోట. తల్లిని స్మరించుకుంటూ, ‘ఆమె దుఃఖాల నడుమ లోతైన అగాధాల్లోకి అలా నడిచి వెళ్లిపోవాలనుకుంటాను’ అంటాడు. అదొక కొత్త గొంతుక. అతనిదొక సరికొత్త aesthetic identity. అతడు మరీ పాతవాడేం కాదు. నిన్న మొన్నటి దాకా మన మధ్యే ఉన్నాడు. రెండో ప్రపంచ యుద్ధం చేసిన గాయాల నుంచి, ఇజ్రాయెల్ – పాలస్తీనాల ఎడతెగని హింసాత్మక శిథిలాల నుంచి, కొత్త మిలీనియం ముంగిటి దాకా ఒక స్ఫటికంలా జీవితంలోని భిన్న కోణాలను, వర్ణాలను కవిత్వంగా పరావర్తనం చెందించాడు. 2000 సెప్టెంబర్ 22న భౌతికంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. కానీ, తరతరాలకు సరిపడా జీవితాన్ని తన సాహిత్యంలో ఆవిష్కరించాడు. ముఖ్యంగా, కవిత్వంలో విస్తృతి, వస్తు వైవిధ్యం ఏ స్థాయిలో సాధ్యమవగలదో చూపించాడు.

అందుకే, ఆయన కవిత్వంలోకి వెళ్తుంటే చారిత్రక విషాదాలు ఉప్పెనలై విరుచుకుపడతాయి. అమానవ యుద్ధ బీభత్సాలు హృదయాన్ని కకావికలం చేస్తాయి. మానవ ప్రేమలు, వాంఛల సహజాతాల ఉత్సవ సౌరభాలు దేహాన్ని ఆలింగనం చేసుకుంటాయి.

జర్మనీలోని Wurzburgలో సంప్రదాయ యూదు కుటుంబంలో పుట్టిన Amichai అసలు పేరు Ludwig Pfeuffer. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ఆ కుటుంబం 1936లో పాలస్తీనాకు వలసపోయింది. అప్పుడు ఆయన వయసు 12 ఏళ్లు. Amichai రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యంలో పని చేశాడు. అప్పటికింకా ఇజ్రాయెల్ ఏర్పడలేదు. స్వాతంత్ర్యం కోసం ఇజ్రాయెల్ 1948లో చేసిన యుద్ధంలో పాల్గొన్నాడు. 1956, 1973లో జరిగిన ఇజ్రాయెల్ – అరబ్ యుద్ధాలలోనూ పోరాడిన ఈ కవి హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేంలో చాలా ఏళ్లు సెకండరీ స్కూలు విద్యార్థులకు పాఠాలు బోధించారు.

ఇజ్రాయెల్ స్వతంత్ర పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనడంతోనే ఆయన కవిత్వ ప్రస్థానం మొదలైంది. వలస జీవన విషాదాన్ని, యుద్ధ భూమిలో ప్రత్యక్ష నరకాన్ని చూసిన అనుభవాలు యెహూదాను పూర్తిగా విలక్షణ కవిగా మలిచాయి. 1955లో (Now and in Other Days) తొలి కవితల పుస్తకాన్ని ప్రచురించిన యెహూదా ఆ తరువాత మరో 10 సంకలనాలు ప్రచురించారు. కథలు, నవలలు కూడా రాశారు. యుద్ధం నుంచి శాంతిని, శిథిలాల నుంచి నిర్మాణాన్ని, గాయాల నుంచి ప్రణయాన్ని ఆశించడమే ఆయన కవిత్వ సారాంశంగా కనిపిస్తుంది. ఆయన పోరాటం పట్ల మాత్రమే నిబద్ధుడు కాదు. ఆయన పరిపూర్ణంగా మనిషి జీవితం పట్ల నిబద్ధుడు. సగటు మనిషి కోరుకునే ప్రేమానందాల స్వచ్ఛమైన జీవనకాంక్షకు నిబద్ఢుడు.

ఇజ్రాయెల్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఈ కవి అక్షరాలు దాదాపు 40 భాషల్లోకి తర్జుమా అయ్యాయంటే ఆయన కవిత్వంలోని వైవిధ్యం, సార్వజనీనత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. జర్మన్ భాష మీద మంచి పట్టు ఉన్నప్పటికీ యూదుల ప్రజల భాష హిబ్రూనే తన కవిత్వ భాషగా ఎంచుకున్న ఈ కవి తల్లి గురించి రాశాడు. తండ్రి గురించి రాశాడు. స్నేహితుల గురించి రాశాడు. శత్రువుల గురించి రాశాడు. ప్రియురాళ్ల గురించి రాశాడు. ‘Houses are always like ships’ అంటూ బతుకులోని అస్థిరత్వం మీద రాశాడు. శిథిల నగరం మీద రాశాడు. కొత్త గోడలో పొదిగిన సమాధి ఫలకాలతో తన కవిత్వాన్ని నిర్మించుకున్నాడు.

నా కామ్రేడ్‌ను నేను నా వీపు మీద మోశాను

అప్పటి నుంచి ఆ బరువు ఎప్పుడూ నాతోనే ఉంది

ఏదో బరువైన స్వర్గం నా మీద వాలినట్లు,

అప్పటి నుంచీ అతడికి తన కింద

విల్లులా వంగిన నా వెన్ను స్పర్శ తెలుస్తూనే ఉంది. (Since then)

In the Mountains of Jerusalem అనే కవితలో, ‘ఇక్కడ శిథిలాలు మళ్లీ భవనంగా నిలబడాలని కోరుకుంటున్నాయి/ …ఇక్కడ ముళ్లు కూడా గాయపరచీ పరచీ అలసిపోయి, ఇక ఓదార్పు ఇవ్వాలనుకుంటున్నాయి’ అంటాడు.

Here where a ruin wants

to be a building again, its wish is added to ours.

Even thorns are tired of hurting and want to console,

and a tombstone, torn from a desecrated grave,

is placed in the new wall with its name and dates,

happy that now it will not be forgotten.

ఈ నగరంలో దేనికీ తీరిక లేదు. ఇక్కడి తోటలు, చెరువులు, సమాధులు అన్నీ గతాన్ని గుర్తు చేసుకునే పనిలో తీరిక లేకుండా ఉన్నాయంటాడు. తమను మరిచిపోతారేమోనని దిగులుపడుతుంటాయనీ అంటాడు. ఎందుకంటే, మరిచిపోవడమన్నది మామూలు విషయం కాదు. అది లోపలి దీపాన్ని ఆర్పేసుకోవడం లాంటిదేననీ ఒక భరించలేని దట్టమైన చీకటిని గుర్తు చేస్తాడు.

To forget someone

Forgetting someone is like

Forgetting to put out the light in the back yard

And leaving it on all day:

But it’s the light

That makes you remember.

యెహూదా కవిత్వమంతా ఒక దట్టమైన జ్ఞాపకం, ఆయన కవిత్వంలో చరిత్ర ఒక వేళ్లూనుకున్న జ్ఞాపకంలా వెంటాడుతుంది. సంప్రదాయబద్ధంగా మత గ్రంథాలు చదువుకున్నవాడు కావడం వల్ల బైబిల్ కథలనూ, పురాగాథలనూ తన కవిత్వ శైలికి ఒక అంతర్లయగా నిర్మించుకున్నాడు. మనిషి నిర్మించుకున్న భాష, సంస్కృతి, జీవన విధానాల నడుమ హృదయం ఉనికి ఎక్కడ ఉందని ప్రశ్నిస్తాడు చాలా చోట్ల.

యెహూదా కవిత్వంలో magnum opus గా భావించే ‘Jerusalem 1967’ అనే దీర్ఘ కవిత ఎలా మొదలవుతుందో చూడండి:

This year I travelled a long way

To view the silence of my city.

నిశ్శబ్దాన్ని వినడానికి కాదు, చూడడానికి వెళ్తున్నాడు. ‘మళ్లీ నా నగరానికి వచ్చాను. మళ్లీ గొంతెంత్తి ఏడుస్తున్నాను. ప్రతి ఉదయం నేను అప్పుడే పుట్టిన ఒక పసిబిడ్డ గొంతునై ఏడుస్తున్నాను. ఈ నగర రాత్రిలో తారలు నీటి బుడగలై మెరుస్తున్నాయి’ అంటాడు.

Jerusalem, the only city in the world

Where the right to vote is granted even to the dead

అన్నప్పుడు నిరంతర యుద్ధాల నడుమ శిథిలమైన రక్తమోడుతున్న గాయం ఎంత తీవ్రంగా ఉందో మన అనుభవంలోకి వస్తుంది. ఈ నగరం ఇప్పుడు ఇద్దరు ప్రేమికులను విడదీసినట్లుగా ఉందంటాడు ఇదే కవితలో మరో చోట. ఇటు ఇజ్రాయెల్‌లో Yehuda అయినా, ఆయనకు దాదాపు సమకాలికుడైన పాలస్తీనా కవి Mehmoud Darwish అయినా ఆధిపత్య హింసనే వ్యతిరేకించారు. Plural society లో సామరస్యాన్నే కోరుకున్నారు. ఇద్దరూ ‘Resistance Poets’ అయినా, Darwish is more political. ఆయన Zionism కు వ్యతిరేకంగా రాశారనే విమర్శలు వచ్చాయి. కానీ, ‘I have right to this whole inheritance’ all civilisations in history have come to Palestine అని స్పష్టం చేస్తూ పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు భిన్న ధ్రువాలు కాదంటాడు దర్వీష్. ఇజ్రాయెల్ ట్యాంకుల మధ్య నా మాజీ యూదు ప్రేయసిని స్మరించుకోవడమే నా మానవీయ స్పృహ అని తేల్చేస్తాడు. ఏమైనా, ఇది యుద్ధం కాదు, జీవన విధ్వంసం అన్న వేదన ఇద్దరి కవిత్వాల్లో మహాద్భుతంగా కనిపిస్తుంది.

ఇంకా ఏమంటున్నాడు యెహూదా ‘జెరూసలెం 1967’ కవితలో…

God it angry with me

Because I always force him

to create the world once again

from chaos, light, a second day, until

man, and back to beginning.

అని ఈ ప్రపంచాన్ని మళ్ళీ మొదటి నుంచి కొత్తగా నిర్మించమంటున్నాడు. ఈ అసమానతలు, ద్వేషాలు, యుద్ధాలతో ప్రపంచం దారి తప్పింది. దీని ప్రయాణాన్ని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాలని పదే పదే అడుగుతున్నందుకు దేవుడికి కోపం వస్తోందట.

Jerusalem is full of Jews used by history

Second-hand Jews, with small flaws, bargains.

చరిత్ర వాడి పడేసిన యూదులతో జెరూసలేం నిండిపోయిందని తీవ్రావేదన వ్యక్తం చేసిన యెహూదా జెరూసలేం నగరంలోని శిథిలాలూ, ఉద్యానాలూ, సరస్సులూ అన్నీ కూడా జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంలో మునిగిపోయాయని అంటారు.

ఇంతటి బలమైన సామాజిక కవిత్వాన్ని రాసిన యెహూదా తన కవిత్వాన్ని సామాన్యుడి ‘pain and joy’ అనే నిర్వచించుకున్నాడు. ఆ ‘joy’ ఆయన కవిత్వంలో ఎంతో లోతైన ప్రేమగా వ్యక్తమవుతుంది.

A young girl goes out in the morning, like a knight

A young girl goes out in the morning

Pony-tailed and swaying as if on horseback.

Dresses and handbags, sunglasses, chain and buckles,

Are like armor on her.

But beneath all this

She’s light and slender.

Sometimes at night she’s naked and alone.

And sometimes she’s naked and not alone.

You can hear the sound of bare feet

Running away: that was death.

And afterwards the sound of a kiss

Like the fluttering of a moth

Caught between two panes of glass.

రాత్రిపూట కొన్ని సార్లు ఆమె నగ్నంగా ఒంటరిగా, మరికొన్ని సార్లు ఆమె నగ్నంగా… ఒంటరిగా కాదు అనడంతో ఒక మోహాన్ని వాక్యాలతో వెదజల్లుతాడు. అప్పుడేమవుతుంది? మృత్యువు నగ్నపాదాల చప్పుడు వినిపిస్తుంది. ఆ తరువాత ఒక ముద్దు శబ్దం. అదెలా ఉంటుందంటే, కిటికీ తలుపుల మధ్య ఇరుక్కున్న సీతాకోక రెక్కల చప్పుడులాగా! ఇక ఆ తెల్లవారుజామున ఆ అందాల యువతి శూరవనితలా అలా వెళ్లిపోతుంది.

‘The Selected Poetry of Yehuda Amichai’ లో 1955-70 ల మధ్య కవిత్వాన్ని Stephen Mitchel అనుదిస్తే, ఆ తరువాతే 1971 నుంచి రాసిన కవిత్వాన్ని Chana Bloch అందించారు. ఆమె అయితే, ‘Love is the centre of Amichai’s world’ అంటారు.

A pity, We were Such a Good Invention అనే కవిత చదివితే ఆమె అలా ఎందుకన్నారో తెలుస్తుంది. అమిహాయ్‌ స్మరించుకునే వాళ్లెవరైనా ఈ కవితా వాక్యాలను ఉటంకించకుండా ఉండరు. ప్రేమికులు విడిపోవడం ఎంత బాధాకరంగా ఉంటుందో ఇంతకన్నా తీవ్రంగా ఎవరూ చెప్పి ఉండరు. ఇది యెహూదా దాదాపు పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు రాసిన కవిత.

They amputated

Your thighs from my hips.

As far as I’m concerned, they’re always

Doctors, All of them.

They dismantled us

from each other. As far as I’m concerned,

they are engineers.

A pity. We were such a good and loving

Invention: an airplane made of a man and woman,

wings and all:

we event got off

the ground a little.

We even flew.

నా కటి నుంచి నీ తొడల్ని తెగ్గోశారనడంతోనే పాఠకుడు ఒక సంచలనానికి గురవుతాడు. అంత బాధ పెట్టిందీ ఈ సమాజం. వాళ్లు ఆచారాలు, కట్టుబాట్లు అనే పేరుతో సున్నితంగా విడదీస్తారు. నాకు సంబంధించినంతవరకు వాళ్లు వైద్యులే అంటాడు. ఇద్దరినీ ఒకరి నుంచి మరొకరిని వేరు చేశారు, ఇంజనీర్లు అని నిష్టురపడుతూ ‘మనమే ఒక చక్కని ప్రేమ సృష్టి’ కదా, మనం చక్కగా రెక్కలు కట్టుకుని ఎగరడం కూడా నేర్చుకున్నాం కదా… ఇంతలోనే అంత దారుణమా?

ఒక అనుభవాన్ని కళ్లకు కట్టించే దృశ్యాన్ని చేసి, ఆ దృశ్యాన్ని అద్భుతమైన formలో బంధించి, తిరిగి ఆ అనుభవంలోకి లాక్కెళ్లే ఈ Ludwig Pfeuffer (అమిహాయ్ అసలు పేరు) కవిత్వాన్ని పలవరిస్తుంటే, నాకిష్టమైన మరో Ludwig (Wittgenstein) గుర్తుకు వస్తున్నాడు. ‘The possibility of all the similes, of all the imagery of language, rests on the logic of representation’ అంటాడీ జర్మన్ తత్వవేత్త. ఎందుకంటే, …the thought is expressed perceptibly through the senses కాబట్టి. అనుభవాన్ని ఇంద్రియానుభూతం చేయడానికి గొప్ప కవి పదాలకున్న ప్రాతినిధ్యాల్ని పునర్నిర్వచిస్తాడు. అందుకొక విస్తృత ఉదాహరణ అమిహాయ్ కవిత్వం.

Airhostess, I don’t know if history repeats itself, Six poems for Tamar, Poems for a woman, Love song, My father in a white Space suite, A Quiet Joy… ఇలా ఒక్కో కవితా ఒక్కో అనుభవం. ఇది యెహూదా ప్రపంచం. ఈ ప్రపంచంలో నిల్చుని నేనూ అంటున్నానిలా:

‘I am standing in a place where I once loved

The rain is falling. The rain is my home.’ (A Quiet Joy)

ఇది యెహూదా అమిహాయ్ కవిత్వం. నేను ప్రేమించిన కవిత్వం. నా మీద వర్షిస్తున్న కవిత్వం. ఈ వర్షం నా నివాసం.

అందుకే అన్నాను:

ఇతడు ఇంతదాకా నువ్వు రాసిన కవిత్వాన్ని మార్చగలడు. నిన్ను చరిత్రలోకి వేళ్లూనుకున్న చెట్టును చేసి నిన్ను నేటి తుపానులో నిలబెట్టగలడు. నీ శిరస్సు మీద రేపటి సూర్యోదయం మొగ్గ తొడిగేలా చేయగలడు. ఒక్క మాటలో… అతడు నిన్ను నీకివ్వగలడు.

***

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s