వ్యాసాలు, Uncategorized

ప్రేమతో తొణికిసలాడే వాక్యం… శివారెడ్డి కవిత్వం

Poetry is ordinary language raised to the Nth power. Poetry is boned with ideas, nerved and blooded with emotions, all held together by the delicate, tough skin of words.
– Paul Engle
నిజమే. ఊపిరి ఆడడం లేదు. (కరోనావైరస్ వల్ల కాదు. ప్రజాస్వామిక భావాలను contagious గా భావించి quarantine చేస్తున్న ఆధిపత్య రాజకీయాల వల్ల. నిజానికి, కరోనావైరస్ తెలుగు నేల నుంచి బతుకు జీవుడా అంటూ ఎప్పుడో పారిపోయి ఉండాల్సింది డ్రైనేజీ స్కీము లేక డేంజరుగా మారుతున్న కరోనా కవిత్వ ప్రవాహాన్ని చూసి జడుసుకుని. ఇంత కవిత్వాన్ని అది ఎలా తట్టుకుని నిలబడిందో అర్థం కావడం లేదు). ఈ నిర్బంధంలో అనాది స్వేచ్ఛా గీతాన్నే మళ్ళీ మళ్ళీ పాడుకోవాల్సి వస్తోంది. రాజ్యం ఎంత గొప్పది?కవిత్వానికి relevance పోకుండా ఎంత బాగా చూసుకుంటోంది! ఇప్పటికీ, ఈ కొత్త మిలీనియంలో ఆధునికత, అత్యాధునిక, ఉత్తరాధునికతల వంటి యుగాలు దాటి కవి అదే పాట పాడుతున్నాడు. అదే ఆశను శ్వాసిస్తున్నాడు. అదే శ్వాసను ఆదేశిస్తున్నాడు.
కొంచెం స్వేచ్ఛగావాలి
మనిషిని మనిషని చెబటానికి
పశువును పశువని చెబటానికి
కొంచెం స్వేచ్ఛగావాలి
రాత్రిని రాత్రని చెబటానికి
పగటిని పగలని చెబటానికి
కొంచెం స్వేచ్ఛగావాలి
రెక్కలల్లార్చి గాల్లో ఎగరటానికి-
k sivareddy
యాభై ఏళ్ళుగా ఇదే కలను మెలకువలో కంటూ అక్షరాల్లో వెలిగిస్తూ అనేకానేక సంకలనాలను వెలువరించారు ప్రఖ్యాత కవి కె. శివారెడ్డి. ఇన్నేళ్ళుగా ఆయన కవిత్వమంతా మనిషి-స్వేచ్ఛ చుట్టూనే తిరిగింది. అందుకే, ‘కొంచెం స్వేచ్ఛ గావాలి’ అనే ఈ కవిత అంతకు ముందే ముద్రించిన “పక్కకి ఒత్తిగిలితే”సంకలనంలో ఉన్నప్పటికీ, ‘ఇప్పటి ఈ స్థితికి మరింతగా సరిపోతుందని’ కొత్త సంపుటిలో మొదటి కవితగా ప్రతిష్ఠించారు. మొత్తం సంకలనానికీ ఆ పేరే పెట్టారు.
ఓ కొమ్మ మీద వాన చినుకులకు తడిసి మునగదీసుకున్న పక్షి తానే అయి ఈ పద్యం ఎత్తుకుంటాడు కవి… కొంచెం స్వేచ్ఛగావాలి అంటూ.
రెక్కలల్లార్చడానికి
చినుకుపడ్డ రెక్కల్ని విదల్చటానికి
ఈ కాలు యిలా, ఆ కాలు అలా చాచటానికి-
‘టప్’ మని ఒక చినుకు నెత్తి మీద పడితే
తల పైకెత్తి చెట్ల ఆకుల కేసి చూడటానికి-
మహా మృదువుగా గాలి వీస్తే
ముకుపుటాలు పెద్దవి చేసి కళ్లతో గాలి పీల్చటానికి-
కొంచెం స్వేచ్ఛగావాలి…
ఇలా మొదలవుతుందీ కవిత. మొదట కోట్ చేసింది ఈ కవిత ముగింపు. ఈ కాలు యిలా, ఆ కాలు అలా చాచటానికి… అనడం ఎంత మృదువైన ఆలోచన! చివరికి టప్ మని ఒక చినుకు నెత్తి మీద పడితే తల పైకెత్తి కనీసం చెట్ల ఆకులకేసి అయినా చూడాలి కదా? ఆ స్వేచ్ఛ కూడా హరించుకు పోయిందనడం ఎంత సున్నితమైన వేదన! ఆ తరువాత వాక్యాల నుంచి కవిత అద్భుతంగా మానవీయ స్పృహలోకి మళ్లుతుంది… మనిషిని మనిషని చెబటానికి, పశువును పశువని చెబటానికి అంటూ పదనైన satireను విసిరేస్తుంది. నలుపు, నలుపని తెలుపు తెలుపని చెప్పలేని దుస్థితి పట్ల కలిగిన ఒక తీవ్రమైన ఆగ్రహ ప్రకటనను composedగా వినిపిస్తుంది. చివరికి కవి observed నుంచి observer గా విముక్తమై, “రెక్కలల్లార్చి గాల్లోకి ఎగరటానికి” అని ముగిస్తూ స్వేచ్ఛ దేనికో చెబుతాడు. వాన వెలిసింతర్వాత రెక్కలు విదుల్చుకుని పక్షి మళ్ళీ గాల్లోకి ఎగిరిపోతుంది. ఇక్కడ ఎగరలేని అవస్థలో ఉన్నవాడు మనిషే. పంజరంలో ఉన్న మనిషి.
పైకి చాలా సాదాసీదాగా కనిపించే కవిత. మామూలు పదాలతో, వస్త్వైక్యంలోని celebration కన్నా కొంత ఎక్కువగా narration శైలిలో సాగిన కవిత. కానీ, చెదరని సింటాక్స్‌తో కుదురైన శిల్పంతో పోత పోసుకుంది. Intrinsicగా ఈ కవితలోకి వెళ్ళిపోవచ్చు. Extrinsic factors అదుపు లేకుండా ఆవహిస్తూనే ఉండడం కాకతాళీయం కాదు, కవి వ్యూహంలో భాగం. ఎందుకిలా జరుగుతోంది? ఒక చిన్న (పంక్తుల సంఖ్యను బట్టి) కవిత ఎందుకింత ప్రాపంచిక వేదనని తట్టి లేపుతోంది? ఎందుకంటే, ఇది ఒక personal poem. తానొక పక్షిగా మారిన అనుభవాన్ని కవి లోపల్లోపలికి తీసుకుని వ్యక్తమయ్యాడు. ఆ వ్యక్తమవడంలో ఒక దృక్పథం ధ్వనించింది. అంతేకానీ, ఇక్కడ కవి ఒక దృక్పథాన్ని నినాదం చేసే తాలు పనికి పాల్పడలేదు.
ఒక అనుభవాన్ని నీ లోపల్లోపలికి పరిపూర్ణంగా ఒంపుకుని అంతశ్చేతనతో సంఘర్షించినప్పుడు కదా పుడుతుంది కవిత్వం. ఈ చర్య లేకుండా కాగితం మీద పోగేసిన అక్షరాలన్నీ చెత్తతో సమానం కదా. భాష మీద సాధికారత, శిల్ప నైపుణ్యం సాంకేతిక లక్షణాలైతే, లోపలి కొలిమిలో జరిగే చర్య భావోద్వేగభరితం. దాని నుంచే కవిత్వానికి ఆత్మ సిద్ధిస్తుంది.
స్వేచ్ఛకు metaphorగా పక్షిని తీసుకోవడం కొత్తేమీ కాదు. చాలా మంది కవులు ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఓ చోట పక్షి-స్వేచ్ఛ-ఆకాశం అని రాసుకుని పలవరించినవారే. అదే పక్షి పంజరంలో ఉంటే అది నిర్బంధానికి ప్రతీక. ఈ పక్షులూ, పంజరాలూ, స్వేచ్ఛలూ అనగానే నాకు అజరామరమైన, I know why the caged bird sings పేరుతో నల్లజాతి అమెరికన్ కవి మాయా ఆంజిలో యాభై ఏళ్ళ కిందటే వినిపించిన ఆత్మగాథ గుర్తొస్తుంది. A free bird dares to claim the sky అని చెప్పిన మాయా, అదే వరసలో పంజరంలోని పక్షి గురించి ఏమన్నారో చూడండి:
But a bird that stalks
down his narrow cage
can seldom see through
his bars of rage
his wings are clipped and
his feet are tied
so he opens his throat to sing
రెక్కలు విరిచి, కాళ్ళు కట్టిపడేసిన పక్షి ఆ ఇరుకు పంజరంలోంచి ఏం చూడగలదు… ఏం చేయగలదు? అందుకే, అది గొంతు విప్పి పాడుతుంది. నల్లజాతి అణచివేతపై తిరగబడిన ఈ ఉద్యమ కవిత్వంలో మాయా ఆంజిలో ఆత్మిక వేదన అంతర్లయగా తారాడుతుంది. అందుకే, అది కేవలం ఒక తాత్పర్యంగా కాక ఒక అనుభవంగా పఠితను చేరుతుంది.
“సగం కవిత నువ్వు రాస్తే
రెండో సగం నే పూర్తి చేయాలి” అని శివారెడ్డి ఇదే సంకలనంలో మరో చోట అన్నప్పుడు… అర్థం చేసుకోవాల్సింది ఆ రెండో సగం లోపలికి ఒంపుకున్న అనుభవమేనని.
‘కొంచెం స్వేచ్ఛగావాలి’ కవిత కూడా ప్రతీకలు, పద చిత్రాలు పాతవైనా అందులోని వైయక్తికాంశ వల్ల ఒక కొత్త అనుభవంలా మనల్ని చేరుకుంటోంది. కవిత్వం స్వభావరీత్యా వైయక్తికమే. ప్రతి వ్యక్తీ unique అన్నట్లుగానే, ప్రతి ఒక్కరి అనుభవమూ ప్రత్యేకమైనదే. ఆ ప్రత్యేకతను ఆవిష్కరించేదే కవిత్వం. సామాజిక దృక్పథం అని చెప్పుకునేదేదైనా వ్యక్తి అంతః సంఘర్షణ నుంచి పుట్టినప్పుడే అది ఒక భావోద్వేగంగా transmit అవుతుంది. కవిత్వంలో గొప్ప ఆదర్శాలు, లక్ష్యాలు ఉండొచ్చు. కానీ, గొప్ప ఆదర్శాలను, లక్ష్యాలను వినిపించినంత మాత్రాన అది గొప్ప కవిత్వమయ్యే అవకాశం లేదు. అందుకే, నక్షత్రపురం తోవకు నాంది ప్రస్తావిస్తున్నప్పుడే అన్నాను, poetry first అని. సామాజిక విధ్వంసాన్ని విధ్వంసకరంగా ప్రశ్నించిన అమెరికన్ కవి Allen Ginsbergను నెత్తిన పెట్టుకునే వాళ్ళు కూడా ఆయన చెప్పిన ఈ మాటను ఎందుకు విస్మరిస్తారో అర్థం కాదు.
“Poetry is not an expression of the party line. It’s that time of night, lying in bed, thinking what you really thing, making private world public, that’s wat the poet does.” అని కదా Ginsberg చెప్పింది. వైయక్తిక ప్రపంచాన్ని వ్యక్తం చేయడం అంటున్నాడు… అర్థమవుతోందా?
ఈ రహస్యం తెలిసిన కవి శివారెడ్డి. ఈ నలభై యాభై ఏళ్ళలో ఆయనతో తిరిగినవారు, ఆయనతో ప్రేరణ పొందినవారు, ఆయన వెన్నుతడితే కవిత్వ రాసిన వారిలో చాలా మంది శివారెడ్డి గారిలోని ప్రాసంగిక శైలిని, narrative formatను, ఇంకా చెప్పాలంటే సాంద్రత లోపించిన వాచ్య సందర్భాల్ని కూడా తమ వశం చేసుకున్నారు. కానీ, ఆ రహస్యాన్ని మాత్రం అందుకోలేకపోయారు. దాన్ని చాలా కొద్ది మంది మాత్రమే పట్టుకోగలిగారు. ఆ పట్టుకున్న వారిలో కొందరు మరింత సాంద్రంగా రాటుదేలారు. Inspire అయినవాళ్ళు అలా కొత్త దారులు నిర్మించుకునే ప్రయత్నం చేస్తే, కేవలం influence అయిన వాళ్ళు నకళ్ళుగా తేలిపోయారు. యాభై ఏళ్ళుగా కవిత్వం రాస్తున్న వ్యక్తి తనకు తెలియకుండానే తన చుట్టూరా ఒక ప్రపంచాన్ని నిర్మిస్తారు. ఆ ప్రపంచంలోనూ మిగతా ప్రపంచంలో మాదిరిగానే సకల సాధారణ అవలక్షణాలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇదంతా చెప్పాల్సి వస్తోంది.
శివారెడ్డి గారితో నాకు 1988-90 ప్రాంతంలో పరిచయం. సిద్ధిపేటలో మంజీరా రచయితల సంఘం సమావేశానికి శివారెడ్డి గారు వస్తున్నారని, నందిని సిధారెడ్డి నాకు చెప్పడమే కాదు. కవిత్వం పట్ల నాకున్న ఆసక్తిని గమనించి మెదక్ నుంచి వెంట తీసుకుని వెళ్ళారు. అక్కడే గాలి నాసరరెడ్డిగారిని మొదటిసారి కలిశాను. కవిత్వంలో క్లుప్తత అంటే ఏమిటో ఆయన నుంచే నేర్చుకోవాలి. కవి గాయకుడిగా కొత్త కెరటంలా ఎగసిపడుతున్న యువ దేశపతి శ్రీనివాస్‌తో పరిచయమైందీ అప్పుడే. ఆ సందర్భానికి సంబంధించి చెరిగిపోని మరో మంచి జ్ఞాపకం నలిమెల భాస్కర్. సభ సాయంత్రమైతే, పగలంతా చాలా మంది కవిత్వ ప్రియులు ఇన్‌స్పెక్షన్ బంగళాలో శివారెడ్డిగారి చుట్టూ చేరి, ఆయన చెప్పేది వింటున్నారు. ఆయన కవితలు వినిపిస్తుంటే నాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. “ధ్వంసం చేయతగిందేదీ లేకపోతే నీకీ లోకంలో/ నువ్వు తప్పకుండా ధ్వంసం చేయదగిన వ్యక్తివి” అన్న మాటలు ఆయనన నోటెంట విన్నది అప్పుడే.
అప్పటి నుంచీ ఆయన నన్నూ వెంటాడుతూనే ఉన్నాడు. ఆంధ్రా యూనివర్సిటీలో నేను లా చదువుతున్నప్పుడు, 90ల మొదట్లో, శివారెడ్డి గారు విశాఖ వస్తే నాకిష్టమైన వసీరా, శిఖామణిలతో కలసి హోటల్‌ గదికి పరుగు తీసేవాడ్ని. ఆయన కవిత్వాన్ని వినిపిస్తుంటే నేను ఇప్పటికీ మెస్మరైజ్ అయిపోతుంటాను. హైదరాబాద్ వచ్చి జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్న తరువాత ద్వారకలో ఆయనతో అనుబంధం పెరిగింది. ఆయన మనుషుల్ని ప్రేమించే మనిషి. ఒక మనిషి మరొకడితో ఎంత ప్రేమగా ఉండవచ్చో ఆయన చూసి తెలుసుకోవచ్చు. అంతెందుకు, ఈ మధ్య నాలుగైదు నెలల కిందట 2019సెప్టెంబర్‌లో, ఇదిగో ఇదే “కొంచెం స్వేచ్ఛగావాలి” సంకలనానికి సరస్వతి సమ్మాన్ పురస్కారం అందుకోవడానికి దిల్లీ వచ్చినప్పుడూ అదే ఆప్యాయత. కొంతమంది తెలుగు విద్యార్థులు ఆంధ్రాభవన్‌కు వచ్చి ఆయన చుట్టూ మూగారు. ఆ నవతరం అమ్మాయిలు, అబ్బాయిలతో శివారెడ్డి తన కవితలను చదివి వినిపిస్తుంటే అదే మెస్మరిజం. ‘ఎవరై వుంటారు / ఇంటి ముందు నుంచుని ఏడుస్తున్నారు/ ఎక్కిళ్ళు కూడా వినిపిస్తున్నాయి…’ అనే కవిత చదివి వినిపిస్తూ.. మనసులోకి ఒక భారాన్ని ఒంపారాయన. పది మందిలో ఉన్నప్పుడు ఆయన ఎంత ఉల్లాసంగా ఉంటారో చెప్పలేం. అలాంటి కవి ఏకాంతంలో ఎంత నిగూఢంగా ఉంటారో అనిపిస్తుంది. ఆయనకు ఎప్పుడూ మనుషులు కావాలి.
“ఎప్పుడూ
ఒక కుర్చీ వేసి అట్టిపెడతా
పొద్దున్నే టీ తాగే సమయానికి
ఎవరో ఒకరు రాకపోతారా అని”
అంటారు దేవులాట అనే కవితలో. ఆ తరువాత, ఎవరూ రాకపోయినా కుర్చీ ఉంటుంది కదా అనీ అంటారు. అంతేకాదు, ఖాళీ కుర్చీ ఎప్పుడూ ఖాళీగా వుండదు” అని పద్యాన్ని ముగించేస్తారు. ఎన్ని జీవితాలతో పెనవేసుకుంటే ఒక కవి జీవితమో కదా!
రక్తం సూర్యుడు (1973)తో మొదలై దాదాపు అర్థ శతాబ్ద కాలంగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ కవిత్వ జైత్రయాత్రలో పాతికకు పైగా సంపుటాలు వెలుగు చూశాయి. వాటన్నింటిలో నన్ను బాగా వెంటాడింది “మోహనా ఓ మోహనా”. ఆ తరువాత “నా కలలనది అంచున” సంపుటిలో నేను ఎన్నిసార్లు మునిగితేలానో నాకే తెలియదు. ఇప్పుడీ “కొంచెం స్వేచ్ఛగావాలి”ని దిల్లీకి వచ్చినప్పుడే చేతిలో పెట్టారు చేవ్రాలుతో. అప్పట్నుంచీ ఈ పుస్తకాన్ని చదువుతూనే ఉన్నాను.
ఇన్నేళ్ళుగా ఒక కవి కవిగా కొనసాగడం ఎలా సాధ్యం? కొనసాగడమే కాదు ఇంత విస్తృతంగా రాయడం ఎలా సాధ్యం? మరీ ముఖ్యంగా, ఎన్నో కఠిన, నిష్ఠుర సందర్భాల్ని దాటుకుంటూ గుండెలో తడిని, కళ్ళల్లో చెమ్మను కాపాడుకుంటూ అంతర్జనమై జీవిస్తూ ఉండడం ఎలా సాధ్యం? అందుకే, శివారెడ్డి అజేయం.
ఇది “కొంచెం స్వేచ్ఛగావాలి” సంపుటిపై నా విశ్లేషణ కాదు. ఈ పుస్తకం తెరవగానే నాలో మొదలై కొనసాగుతున్న ప్రయాణం. అలా అని సమీక్ష కూడా కాదు. ఒక కవితతో తలుపులు తెరిచి ఒక హృద్యమైన కవిత్వయాత్రకు పలుకుతున్న ఆత్మీయ ఆహ్వానం.
మచ్చుకు మరికొన్ని వాక్యాలు:
ఒంటరితనం ఎంతగా కిక్కిరిసిపోయింది (ఒంటరితనం)
ముగింపు గురించి భయమేల
ఎట్టా ముగిసినా ఆనందమే-
అన్ని ముగింపులకు సిద్ధమయ్యే కదా యింత దూరం వచ్చింది (ముగింపు గురించి);
పద్యం లోపలి పద్యం మరణించదు
… అన్ని పద్యాలూ ఒక పద్యంలో ఒదుగుతాయి (దారం కొస);
ఏముందిక్కడ
ప్రయాణం మొత్తం నువ్వు నువ్వుగావడమే (ఏదీ ఆగదు);
ఆకాశం పాముల్ని వర్షిస్తుంది
మరపుకీ, జ్ఞాపకానికీ మధ్య లింకు తెగుతుంది
రాతి దేవత ఒకతె ఊరి మధ్య నడుస్తూ పోతుంది (రాతి దేవత);
ఈ దేహాంతర నరక స్థితి
నీకెలా అందుతుంది
నువ్వొక దేహంతర నరకస్థితిలో వుంటే తప్ప (దేహాంతర);
ఎవరయి వుంటారు?
చెవులు చాలా స్పష్టంగా చూస్తున్నాయి ఏడ్పుని
…. నిద్రలోకి గూడా విన్పించే ఏడ్పు
లోలోపల తగలబడుతున్న అడవి
ఎవరో నిరంతరాయంగా ఏడుస్తున్నారు (ఇంటి ముందు నుంచొని);
ఒక్కడు లేకపోతే
యింత ఖాళీయా? (ఒక్కడు లేకపోతే);
మామూలుగా అయితే
ఎదురుగా నుంచున్న స్ప్రింగ్ డోర్‌కేమీ విలువలేదు
పెద్దగా గమనించాల్సిన అవసరమూ లేదు
కానీ, మిత్రుడొస్తానన్నాడు
ఎదురు చూస్తూ డోర్ కేసి చూస్తూ – నేను (మామూలుగా అయితే);
మంచు కురుస్తున్న
ఓ శీతాకాలం పొద్దుటిపూట
మరో కవితో సంభాషణ-
… మాటల్లో దొర్లుతున్న సజీవ చరిత్ర ద్వారా
‘కిలమానూర్ మధు’ న్యూమోనియా పద్యం
దేశమంగళం కర్ఫ్యూ మళ్లీ బతుకుతాయి
సీమస్ హీనీ, మెట్టా నాగేశ్వరరావు,
డా. ముత్యం సుబ్బారావు పాణిగ్రాహి – అన్నీ కలగలిసి
ఈ పొద్దుటిపూటలో కలిసి, కదిలిపోతాయి
గతానికి వర్తమానానికి ఒక సంభాషణ ఈ పొద్దుటిపూట
….ఇలాంటి పొద్దుటి పూట
ఎవరో పోకిరి పిల్లాడు ఒక రాయి విసురుతాడు
చెరువులో బుడుంగున మునిగి చక్రాలు చుడుతుంది
ఈ పొద్దుటిపూట మాట్లాడుతుంది
చిన్న నీటి పిట్ట వాక్యాన్ని నేస్తూ పోతుంది (నీటిపిట్టల వాక్యం);
ప్రేమతో తొణికిసలాడే వాక్యం గొప్పదని… జీవితాన్ని వాక్యమయం, పద్యమయం చేసుకున్న కవి శివారెడ్డి. ఈ సంకలనం ఇన్నేళ్ళ కవిత్వయానంలో ఆయన అనుభవాల సారాంశం. దీంట్లో ఇదమిత్థంగా వస్తువంటూ ఏమీ లేదు. కశ్మీర్ మీద కవిత రాశారా, సీఏఏ మీద ఏమైనా చేయి చేసుకున్నారా, కఠువా మీద కన్నీళ్ళెట్టుకున్నారా అని అడిగేవాళ్ళకు అర్థమవుతుందో లేదో కానీ, ఇందులో అన్నీ ఉన్నాయి.
‘పేజీ తిప్పినట్లు తెలవారుతున్న ప్రతి రోజు’లోకి వాక్యమై నడిచిపోతున్న కవి పాద ముద్రలివి.
***
©PasunuruSreedharBabu
Uncategorized

స్వేచ్ఛా గీతాన్ని మంత్రంలా మ్రోగించిన బాబ్ మార్లీ

“ఈ స్వేచ్ఛా గీతాల్ని
పాడడానికి నీవు సాయపడలేవా
నా దగ్గర ఉన్నవల్లా
విముక్తి గీతాలే
విముక్తి గీతాలే
ఈ స్వేచ్ఛా గీతాలే”
బాబ్ మార్లీ రాసిన ఈ Redemption Songను నిన్న గుర్తు చేశారు జర్నలిస్ట్, పౌర హక్కుల ఉద్యమకారుడూ అయిన గౌతమ్ నవలఖా నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఎదుట లొంగిపోవడానికి ముందు రాసిన బహిరంగ లేఖలో. దళిత మేధావి, రచయిత అయిన ఆనంద్ తేల్‌తుంబ్డే కూడా అదే రోజు లొంగిపోయారు. అంబేడ్కర్‌ మనుమరాలు ఆయన భార్య. అంబేడ్కర్ జయంతి రోజునే వారు Unlawful Activities (Prevention) Act (UAPA) కింద అరెస్టయ్యారు. భీమాకోరేగావ్ కేసులో అరెస్టుల పరంపర రెండేళ్ల నుంచీ కొనసాగుతోంది. తెలుగు కవి, విరసం నేత వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరేరా తదితరులు ఇప్పటికీ పుణెలోని యరవాడ జైలులో ఉన్నారు.
ఆనంద్ తేల్‌తుంబ్డే కూడా ఎన్ఐఏ ఎదుట లొంగిపోవడానికి ముందు ఈ దేశ ప్రజలను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేవారి మీద కూడా దేశద్రోహులనే ముద్ర వేసే గడ్డు రోజుల్లో ఈ పరిస్థితి ఎవరికైనా రావచ్చని ఆయన హెచ్చరించారు. “మీ వంతు రాక ముందే మీరు గొంతెత్తుతారని ఆశిస్తున్నా” అని ముగించారు.
ఇద్దరూ కోరింది ఒక్కటే విముక్తి గీతంతో గొంతు కలపమని. ఇక్కడ జమైకా గీతకారుడు బాబ్ మార్లీని తలచుకోవడంతో ఆ విషాద భారం ఒక్కసారిగా గొంతులో దిగబడినట్లయింది నాకు.
bob morley
ఎవరీ బాబ్ మార్లీ? నడుస్తున్న భారతానికీ ఆయన పాటకీ ఏమిటి సంబంధం? అది అణచివేతకూ, విముక్తి ఉద్యమానికీ ఉన్న సంబంధం. వివక్షకూ, నిరసనకూ ఉన్న సంబంధం. స్థలకాలాలకు అతీతమైన ఉద్విగ్న సంబంధం. మరీ ముఖ్యంగా గాయానికీ గీతానికీ ఉన్న అసంకల్పిత ప్రతీకార చర్యలాంటి బంధం.
Love the life you live. Live the life you love అంటూ జీవితాంతం కలల్ని వేటాడిన వేటగాడు. కటిక పేదరికం నుంచి గొంతెత్తి నిల్చుని యౌవనాన్ని పోరాట గీతానికి ధారపోసినవాడు. ఇక ఆ తరువాత జీవితం అక్కర్లేదన్నట్లుగా 36 ఏళ్ళకే తనువు చాలించి యోధుడిగానే గుర్తుండిపోయినవాడు. ఎంత సంపాదించావనన్నది కాదు, నీ చుట్టూ ఉన్నవాళ్ళను చైతన్యంతో ఎంత ఉత్తేజపరిచావన్నదే అసలైన గొప్పతనమని చాటింపు వేసి, పోరాడే హృదయాల్లో చాటింపుగా నిలిచిపోయినవాడు.
నాలుగు దశాబ్దాల కిందట (1981) శాశ్వతంగా మూగబోయన ఈ గొంతు… ఈరోజున ఖండాలు దాటి ఒక నిలువెత్తు ప్రశ్నలా నిలిచిన ఉత్తరంలో మార్మోగింది. ఆ ప్రకంపన ఎలా ఉంటుందో ఆ రాసిన వ్యక్తికి బాగా తెలుసు. కాబట్టే, ఆ నాలుగు వాక్యాలతో లేఖను ముగించాడు.
హాటెన్ టాట్, జూలూ, నీగ్రో
ఖండాంతర నానా జాతులు
చారిత్రక యధార్థ తత్వం
చాటిస్తారొక గొంతుకతో… అన్నాడుగా మహాకవి శ్రీశ్రీ. అచ్చంగా అలాంటి ఒక గొంతుక బాబ్ మార్లీ.
శ్రీశ్రీయే చెప్పినట్లు, ‘నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ/ నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని’ తపించినవాడు బాబ్ మార్లీ.
నల్లజాతిని బానిసలుగా చేసిన చరిత్రను ప్రశ్నిస్తూ, విముక్తి పోరాటాన్ని గానం చేస్తాడు బాబ్ మార్లీ ఈ Redemptions Songలో. ఒక్కొక్క పదాన్నీ గుండెలో అచ్చు గుద్దినట్లు దింపుతాడు. ఇదీ ఆ పాట పూర్తి పాఠం. ఈ పాటనూ, పాఠాన్నీ మళ్ళీ మళ్లీ విందాం. రేపు మన వంతు కూడా వచ్చే లోగా ఏం చేయాలో కొంతైనా తెల్సుకుందాం.
ఆ పాటలోని శక్తి అనువాదంలోకీ ఎలాగూ రాదు. అందుకు క్షమించండి. కాకపోతే, ఈ ప్రయత్నం మిమ్మల్నిఅతడి పాటల్ని అర్థం చేసుకుని పలవరించేందుకు ప్రేరేపిస్తే అంతే చాలు.
‘విముక్తి గీతం’
ప్రాచీన సముద్రపు దొంగలు
అడుగులేని అగాధంలోంచి
నన్ను పైకి లాగి, నిమిషాల్లో
నన్ను వర్తక నౌకల వాళ్ళకు అమ్మేశారు
కానీ, నా చేయి చాల గట్టిది
శక్తిమంతుడైన దేవుడి చేయి పట్టుకుని
మనం ఈ తరం దాకా ముందడుగు వేశాం
ఘన విజయంతో…
ఈ స్వేచ్ఛా గీతాలు పాడేందుకు
నీవు సాయం చేయవా?
ఎందుకంటే, నావద్ద ఉన్నవల్లా
విముక్తి గీతాలే
విముక్తి గీతాలే
నిన్ను నీవు మానసిక బానిసత్వం నుంచి విముక్తం చేసుకో
మన మనసులకు స్వేచ్ఛ ఇవ్వాల్సింది మనమే
అణుశక్తిని చూసి భయపడకు
అవేవీ కాలాన్ని ఆపలేవు
మనం అలా పక్కన నిలబడి చూస్తుంటే
ఎంతకాలం వాళ్ళు మన ప్రవక్తలను చంపుతూ పోతారు?
ఇదంతా మామూలే కదా అంటారు కొందరు
కానీ, మనం పుస్తకాన్ని నిండుగా రాసుకోవాలి
నీవు సాయం రావా
ఈ స్వేచ్ఛాగీతాల్ని పాడడానికి?
నా వద్ద ఉన్నవల్లా
విముక్తి గీతాలే
విముక్తి గీతాలే
విముక్తి గీతాలే
నా వద్ద ఉన్నవి
విముక్తి గీతాలే
ఈ స్వేచ్ఛా గీతాలే
స్వేచ్ఛా గీతాలే.
క్యాన్సర్ రూపంలో మృత్యువు తరిమేస్తుందని తెలిసీ పాటల్తో రోజుల్ని లెక్కించుకుంటున్న 1980లో ఈ పాటను రచించి, గానం చేశాడు మార్లీ. ఈ గీతం అతడు సృజించిన అద్బుత గీతాల్లో అత్యుత్తమైందని అంటారు. వివక్ష మీద సాగుతున్న చిరకాల పోరాటాలకు ఇదొక ప్రతిజ్ఞాగీతం లాంటిదని అంటారు. కేవలం అకాస్టిక్ గిటార్ మాత్రమే వాయిస్తూ ఈ పాట పాడతాడు మార్లే. బానిస జీవితాల నుంచి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నినదించిన విముక్తి విశ్వాసాల మీదుగా ఈ పాటను మోగిస్తాడు.
Get up, Stand up, Stir it up, Buffalo soldier, Is this love, Sun is shining వంటి గొప్ప పాటలెన్నో ఆయన గళం నుంచి వినాల్సిందే. ఆయన పాడినవన్నీ మరణం లేని చరణాలే.
I want to love you
I want to love you, and treat you right
I want you love you, every day and every night. అంటాడు ఎంతో సింపుల్‌గా Is this love పాటలో. Treat you right అన్నది ఇప్పటికీ ఒక తీరని కల కావడమే విషాదం. కాబట్టి…
Get up, stand up
Stand up for your rights
Get up, stand up
Don’t give up the fight
అంటున్నాడు.
యూట్యూబ్‌లో Bob Marley అని కొడితే చాలు వెల్లువలా వచ్చి పడతాయి అతడి పాటలు. అవి తెల్లవారుజామున తుపాను వర్షంలా ముంచెత్తే పాటలు. ఆ పాటల్లో కేవలం తడిసిపోకండి. వాటిని అనుభవించండి.
Some people feel the rain.
Others just get wet. – Bob Marley
***
Uncategorized

ఒక అత్యాధునికుడి ఆదిమ తపన… శ్రీకాంత్

srikant
In you the wars and the flights accumulated.
From you the wings of the song birds rose.
You swallowed everything, like distance,
Like the sea, like time. In you everything sank!
అని నెరూడా లాగా అనగలడు. కానీ,
It is the hour of departure, oh deserted one అంటో Song of despair లేమీ ఆలాపించడు.
అలాగని విచారమేమీ లేదని కాదు. ఉన్నదంతా విచారమే. దిగులే. కోల్పోవడం గురించి కాదు. పొందుతున్నవేదన. పొగిలి పోతున్న దుఃఖం. ‘గుండెలో ఒక కందిలి పగిలి’ వేడి గాజు పెంకులు గుచ్చుకుని రక్తమోడుతున్న హింస.
రాయాలని కూర్చొంటే, తెల్లటి తడితో కళ్ళలోంచి రాలుతున్నాయి నల్లటి పదాలై ఈ పై అక్షరాలు
కొంత ధూళై కొంత దూరమై
కొంత నెత్తురై కొంత శాపమై
నేను ఎప్పటికీ తిరిగి తాకలేని ఒక మహా కాంతి లోకమై… అంటాడు. “మృగాలు సంచరించే చదరపు గదుల హృదయాల” మధ్యకు ఎదుగుతున్న పూవుల్లాంటి బిడ్డల్లాంటి మహా కాంతిలోకాలకు దూరం దూరమవుతూన్న దగ్ధత్వంతో.
Leaning into the afternoons I cast my sad nets
towards your oceanic eyes.
There in the highest blaze my solitude lengthens and flames,
its arms turning like a drowning man’s అంటూ ప్రేమలో సముద్ర నేత్రాల్లోకి విషాదాల వలల్ని విసిరి సమున్నత జ్వాలల్లో సుదీర్ఘ ఏకాంతంలా కాలిపోతూ మునిగిపోతూ చేతులెత్తి మొక్కుతూనే ఉంటాడేమో ప్రేమంత్రనగరికి అరుదైన అతిథిలా వచ్చి వెళ్ళిపోయిన నెరూడాలానే మళ్ళీ. తప్పదు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నప్పుడు అప్పుడప్పుడే మెరిసి నా ఆత్మలా మిణుకు మిణుకు మంటున్న తొలి నక్షత్రాలను చీకటి పక్షులు ముక్కుతో గిల్లుతుంటాయి కదా.
The birds of night peck at the first stars
that flash like my soul when I love you. (Leaning into the afternoons)
అవును కదా. ఆత్మల్ని వెలిగించే జ్యోతులు కదా స్త్రీలు.
అందుకే అంటాడు శ్రీకాంత్:
నన్ను నిర్వచించే నన్ను రచించే
నాకు మిగిలిన ఒకే ఒక జననం
అని పిలువనా నిన్ను?
నాకు మిగిలిన ఒకే ఒక మృత్యువు
అని పిలవనా నిన్ను.
నాకున్న ఒకే ఒక సత్యం
అని పిలువనా నిన్ను.
స్త్రీకి దేహమే కాదు. హృదయం ఉంది. ఆలోచన ఉంది అని గుర్తు చేయడానికి వేల ఏళ్ళ పుక్కిటి పురాణాల అరణ్యాల తరువాత, తేనెలు పూసిన ప్రబంధాల గాయాల తరువాత చలం లాంటి విధ్వంసకుడొకడు పుట్టాల్సి వచ్చింది. అయినా బీటలు పడ్డాయి కానీ గోడలింకా కూలనే లేదు. అలాంటి చోట “అనేక డిస్కోర్సుల వాచక కర్మాగారాలలోంచి, వివిధ ప్రతీకలలోంచి, వివిధ చిహ్నాలలోంచీ వివిధ ప్రతిరూపాలలోంచీ స్త్రీకి ఆపాదించబడిన ప్రత్యేక లక్షణాలలోంచి స్త్రీని విడదీసి స్త్రీని చూడటం ఎలా?” అని అడుగుతున్నాడు ఈ కవి. “When we say woman, do we have a possibility to reach women, as such?” అని తనను తానే ప్రశ్నించుకుంటున్నాడు. స్త్రీకి దరి చేరే దారులను వెతుక్కుంటున్నాడు. Cliched images నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న స్త్రీలకు పురుష వాచకాలతో తోరణం కడుతున్నాడు.
నీళ్ళని చీల్చే పాదాలూ, ఎదురీదీ నిర్మలంగా వెళ్ళే కళ్ళూ నీవి
అలా ఎదురు చూడకు
దీపం అంటిన చీకటి
మెరుస్తోంది ఇక్కడ. నీ వద్దకు రాలేని ఈ గోడలపై నిలువెత్తు
నీడలై నేనై –
అందుకే ఆ వెంటనే పశ్చాత్తప్తుడై అంటున్నాడిలా:
చర్మాన్ని వొలిచి, వెలుపలికి మలిచి
బల్లపై ఒక కూజా వలె, ఒక పూల పాత్ర వలె ఉంచి వినమ్రతగా
తప్పుకోగలను: ఊయలలూపే నీ చేతులు
క్షణకాలం ఆగిన చోట నుంచి –
ఇక్కడ నాకు సదా బాలకుడు ఇస్మాయిల్ గుర్తుకు వస్తున్నాడు.
“నీ బాహువుల్లో నన్ను బంధించి
నా దేహానికి కొత్త ద్వారాలు తెరుస్తావు!
నీ వ్రేళ్ళ మంటల్తో నన్ను కాల్చేసి
నా దేహానికి క్రొత్త చర్మం తొడుగుతావు.
ఇస్మాయిల్ కవితలోనూ స్త్రీని ఉన్నతంగా, మహిమాన్వితంగా చూపినప్పటికీ అది వైయక్తికం. శ్రీకాంత్ స్త్రీ ప్రేమను taken for granted గా తీసుకోకపోవడమే కాకుండా, ప్రేమానుభవ సాంద్రతను గాఢంగా గ్రహించడమే కాకుండా, ‘ఆమె’ను conscious గా చారిత్రక, సామాజిక నేపథ్యంలోంచి దర్శిస్తూ, guilt నీ వ్యక్తం చేస్తున్నాడు.
Familistic hegemony నుంచి, Ideological constructs నుంచి, సంకెళ్ళ వంటి మెటఫర్ల నుంచి, దేహం చుట్టూ అల్లిన రాజకీయాల ముళ్ళ కంచెల నుంచి బయటపడడానికి పోరాడుతున్న స్త్రీని ప్రేమిస్తున్నాడు. ఆమె పోరాటాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ కవితల పుస్తకంలోకి తెలుపు తెరుస్తూనే…
ఏమీ కానీ స్త్రీలు, ఏమీ మిగుల్చుకోని స్త్రీలు… ఎందుకో కానీ ప్రేమిస్తారు… అంటూ తప్త గీతాన్ని ఆలపిస్తాడు శ్రీకాంత్.
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
ప్రేమ అనుకుని, ప్రేమను అందుకుందామని
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
…..
అద్దాలలోంచి మన ముఖాల్ని లాగడానికీ
ముఖాల్లోంచి అద్దాలను తీసివేయడానికీ, మన హృదయాలను భక్షించి
తమ హృదయాలను శిక్షించుకుని, చిందరవందర అయ్యేందుకూ
ఉక్కిరి బిక్కిరి చేసేందుకూ
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు….
వచనంగా ఒక్కోసారి వాచ్యంగానూ భ్రమింప చేసే ఈ సాదా సీదా వాక్యాల అంతర్లయలో ప్రచ్ఛన్నంగా ధ్వనించే ఒక విరోధాభాస, ఆలోచన కన్నా ముందే గుండెను కుదిపేసే గాఢత మనల్ని వెంటాడుతుంది. పునరుక్తిని ఒక నిర్మాణ వ్యూహంగా సంధిస్తూ అద్భుతంగా ఈ పద్యాన్ని నడిపిస్తాడు శ్రీకాంత్.
ఇలా ఈ పుస్తకంలో స్త్రీల గురించి, gender sensibilities గురించి, స్త్రీ పురుషుల ప్రేమల గురించి, స్త్రీల బహు రూపాల గురించి రాసిన కవితలు dominant గా కనిపిస్తాయి. ఒక్కోసారి ఒకే కవితలో స్త్రీలను వారి విభిన్న రూపాలలో ప్రేమిస్తున్న complexity ద్యోతకమవుతుంది.
నిన్ను చదువుదామని అనుకుంటాను ఎలాగో ఒకలా. ..
తెలుసు నేనొక నిస్సహాయుడిని. పదాలనే హత్తుకుని ఆఖరి నెత్తురు చుక్క వరకూ నీ వద్దకు పారాడే ఒక శరణార్థిననీ…
నిన్ను చదువుదామని అనుకుని, రాత్రిని ఒక మంట చేసి వెలిగిస్తే, శరీరం అంటుకుని కాలుతుంది తెల్లటి పరదాలలో నిన్నిక చదవద్ద్దో చదవద్దో అంటో, నీడల్ని ఆర్పే వేకువ కాంతై, వేకువ కాంతిని ఆర్పే పొగమంచై, తెల్లగా, ఇక నుదిటిపై అరచేయంత చల్లగా, తల్లి దీవెనలాగ, ఇలాగ, నీలాగ. (ఇలాగ).
తనువంతా చిట్లిన అమ్మ
తనువే లేకుండా మిగిలిపోయిన చిట్టి అమ్మ – అటువంటి అమ్మని
రాత్రి తనువుని పెనవేసుకుని
అటువైపుకు తిరిగి నిదురోయే అమ్మని, ఎందుకైనా ఎవరైనా ఎలా కదపటం? (అమ్మ)
ఇంకా, “మన అమ్మలు, నువ్వు లేక, వంట చేసిన ఆ అరచేతులు, ఒక అమ్మ, అమ్మ చెప్పిన కథ, అమ్మ కళ్ళు, తను, నీలాంటి చీకటి, అమ్మలే, అమ్మీ, మా చిన్ని అమ్మ, నీ హృదయం…” ఇలా శ్రీకాంత్ కవిత్వావరణంలో స్త్రీలు రకరకాల రూపాల్లో కనిపిస్తారు. మనకు తెలిసీ తెలిసీ గుర్తించని, గ్రహించని రూపాల్లో, మన sub-conscious biased natureతో గడ్డ కట్టుకుపోయిన prejudicesతో చీకటిలో చూడలేక పోతున్న స్త్రీమూర్తుల గాథలను ఈ కవి మనకు వినిపిస్తాడు.
ఒక paragraphicలో ‘ఆమె’ వైపు నుంచి narration వినిపిస్తూ, “మీ మగవాళ్ళకెందుకు ఎప్పుడూ అదే యావ కాసింత సేపు మాట్లాడలేరా ప్రేమగా” అని తిట్టిస్తాడు. ఆ మాట ఎప్పుడంటుంది తను: “ఇక తను మోహంతో నిను గాట్టిగా చుట్టుకుని వదలకుండా పెనవేసుకొన్న సంగతి అంటావా కొండ చెలువల కౌగిలి నెమలీకలతో సమానం: మురుగా ఇక తరువాత ఏమిటీ అంటే చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు… ఇంతా చేసి ఆనక తీరికగా అంటుంది.
ఇళ్లకు మగవాళ్లు సమయానికి ఎందుకు రారోనని ఆనక తినీ తినక కడుపులోకి ముడుచుకుని పడుకున్న ఆమె ముంగిట్లోకి తూలుతూ చేసుకున్న ఓ Confession ‘ఒక సాధారణ వాచకం’:
విరిగి విరిగి నిదుర లేక తిరిగి లేచి, నన్నే
ఈ స్మశానాన్నే శుభ్రం చేసి
నా తల వద్ద ఒక ప్రమిదె వెలిగించినదీ నీవే.
శ్రీకాంత్ తను దేశ దిమ్మరిని, దేహదిమ్మరిని, భాషా దిమ్మరిననీ అని చెప్పుకుంటాడు ఇంతకు ముందు 2002లో ప్రచురించిన “యితర” కవిత్వ సంపుటిలో. యితరుడిలోంచి యితరుడిలోకి గాయాన్ని మోస్తున్న పాటలా సంచరిస్తాడు ఆ కవిత్వంలో. దాన్ని తొంభై తొమ్మిది శోకాల శ్లోక గీతం అన్నాడు వేగుంట ‘మో’హన ప్రసాద్.
అంతకు రెండేళ్ల ముందు “కొన్ని సమయాలు” అంటూ మొదటి పుస్తకం వేశాడు. ‘ప్రేమించేదారిలో మనుషులు ఒంటరి వాళ్ళవుతారు… గాయపడతారు. ఈ దేహం ఇక సహకరించకపోవచ్చు కవిత్వంలో కవిత్వం లేనంతగా.’ అంటూ తెలుగు కవిత్వంలోకి తనదైన డిక్షన్‌తో వచ్చాడు. Content విషయంలో కొత్తదంతో పాటు formలో తనదైన సంతకాన్ని – దేహాన్ని ఉలితో చెక్కుకుంటున్న గాయాలతో చిప్పిల్లిన రక్తంతోనే చేశాడు.
యితరకు వచ్చేటప్పటికి experimentalist లాగా తను లక్ష్యిస్తున్న రూపం ఇదీ అని చెప్పగలిగాడు. అయితే, అతడి కవిత్వ పర్యావరణం ఇప్పటికీ స్థూలంగా అలాగే ఉంది. అందులోనే కొత్త ఉద్యానాలూ, తుపానులూ, ఉత్పాతాలూ కొత్త రూపాల్లో సాక్షాత్కరిస్తున్నాయి మరింత matured planeలో మరింత లోతుగా, మరింత సన్నిహితంగా ఈ కొత్త సంకలనంలో.
ఈ కవితా సంకలనం పేరు ‘శ్రీకాంత్’. Does this text, does this body, does this textual body carry the name Srikant? అని అడుగుతాడు శ్రీకాంత్ ఈ పుస్తకం చివరి పేజీలలో ముద్రించిన 2013లో సారంగ కోసం అఫ్సర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఏమైనా శరీర వాచకం, వాచక శరీరాలు రెండింటికీ కలిపి ఉన్న ఏకైక భౌతిక గుర్తింపు “శ్రీకాంత్”యే కాబట్టి, ఆ పేరే టార్కోవస్కీ నలుపు-తెలుపుల నాస్టాల్జియా నిశ్చల చిత్రంతో టైటిల్‌గా సెటిలై పోయిందనుకుందాం. ‘కవిత్వం నాకు ఒక గూడు’ అనే శీర్షికతో సాగిన ఈ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ తనను తాను కోల్పోయి ‘రాతలో శరణార్థి’గా ఉన్నానని చెప్పుకుంటాడు. ఇదొక prologue లాంటిది. అతడి కవిత్వంలోకి open అవడానికి ఇది ఒక తాళం చెవిలా పనికొస్తుంది)
‘వాచక విముక్తం లేక, వినిర్మాణం కాలేక శరీరమంత తోలుమందం వాక్యాల పునరుక్తమై…” అంటూ అలమటిస్తున్నాడు శ్రీకాంత్ ఈ కొత్త కవిత్వంలో ఇంకా భాషతో పేచీ ఒక కొలిక్కి రాక.
ఇది ఇంకా కొనసాగే యుద్ధమే. కానీ, ఈ అభిమన్యుడు ఇప్పటికే చాలా దూరాన్నే ఛేదించాడు. ‘కృష్ణబిలాల’ మాయలన్నీ ధ్వంసం చేసే పనిలోనూ ఉన్నాడు. పదాలు పాతవే, పద చిత్రాలు కొత్తవి. వాటితో కొత్త రంగుల్ని, అర్థాల్ని ఆవిష్కరించే collage చేస్తున్నాడు కవిత్వంలో. అంతకన్నా వినిర్మాణం ఏముంది?
“నేను నవ్వి, నేను ఏడ్చి, నేను పగిలి, పిగిలి ‘నేను’ లేకుండాపోయి, ఇదిగో వచ్చి ఇల్లా రాస్తున్నాను ఈ అమృత క్షుద్ర పదాలని, ఒక మార్మిక ఆదిమ తపనతో. ఒక తొలి మలి రహస్య దాహంతో.”
సిగ్గుతో చితికిన గుజరాత్ గాయం లాంటి దేశంలో, “పురుషాంగమే ఒక దేశమైన, దేశమంటేనే పురుషావయవమైన ఒక కాలంగా… ఈ ఒక్క పూటకి ఇలా నేను: నన్ను నన్నుగానే ఉంచు” అని, Don’t you know that I aint a metaphor అని ఖాండ్రించిన తెంపరితనమూ ఉంది ఈ క్షుద్ర పదాలలో అమృతంతో పాటు.
ఇంకా పిల్లల గురించి రాసిన కవితలు కొన్ని తాదాత్మ్యం కలిగిస్తాయి. నిదురలో ఏదో కలవరించి లేచిన మూడడుగుల మల్లెపూవు లాంటి బిడ్డ వచ్చి నిద్ర లేపితే, ‘తెల్ల గులాబీ మొగ్గల వంటి ఆ కళ్ళనీ / ఇలా చూసుకుంటూ, ఇక ఈ రాత్రి / నువ్వైనా నేనైనా ఎలా నిదురోగలం? అంటాడొక చోట.
“నిండుగా పారే ఆ పిల్లల నిదురలోకి నువ్వు నీ ఆత్మనీ, శరీరాన్నీ కోల్పోయిన వేళ? ఏమైనా జరగనీ, ఏమైనా కానీ, కానీ ఒకరినొకరు గట్టిగా పెనవేసుకొని నిదురించే పిల్లలనీ, వాళ్ళ కాలాన్నీ కలలోనైనా కదిలించకు. ఊహామాత్రంగానైనా పిలవకు. ఎందుకంటే నీ పునర్జన్మ నీ ముందే రూపుదిద్దుకునే సరైన ఇంద్రజాల సమయం జనిస్తోంది ఇప్పుడే, ఇక్కడే, అందుకే! (పిల్లల నిద్ర)
“ఏం చేయాలో తెలియదు నీకు, పిల్లలు నిన్ను పట్టుకుని బావురుమన్నప్పుడు –
ఎంత మిట్ట మధ్యాహ్నం అయినా, నీ లోపలి ఆవరణలో కురుస్తుందో నల్లని మంచు.
….. చూడండి నిజంగా తెలియదు నాకు. ఏం చేయాలో, పిల్లలు అలా నన్ను వాటేసుకుని బావురుమని ఏడ్చినప్పుడూ, వెక్కిళ్ళతో అలా తినకుండా నిదురోయినప్పుడూ. మరి అప్పుడు, అక్కడ వాలిన పూలను చూస్తూ చేయాలో, మీకేమైనా తెలుసా ఇంతకూ?” (పిల్లలు నిన్ను పట్టుకుని ఏడ్చినపుడు)
అంతేకాదు,
“అయిపోయాం పెద్దరికంతో పేదవాళ్ళం ఎపుడో
ఇక చిన్నారుల తోటలోకి అడుగు పెట్టడం ఎలా?అని దిగులుపడుతున్నాడు. సంపదనంతా కోల్పోతూ మనం ఏ
దారిద్ర్యంలోకి పెరుగుతున్నామో కూడా చెబుతాడు.
“ఇంధ్రధనుసులు తెలియని
ఏక రంగోన్మాదులు వాళ్ళు
నా పిడికెడు స్థలంలో వామనుడి పాదాలతో వాళ్ళు (పిడికెడు)
…..
ఇది జీవితం. ఊరుకో హత్యలకు గురి కాకుండా కలలతో మిగిలిన మనిషి ఎవరూ లేరిక్కడ (కథలు చెప్పే మనిషి)
ఇట్లా ఈ కవిత్వం… ప్రేమలు, ఆత్మలు, దేహాలు, దేహ రాజకీయాలు, దేశ రాజకీయాలు, ముఖపుస్తకాలు నక్షత్ర ప్రసారాలు మాత్రమే తెలిసిన ఇరుకు చూపులు, మనుషులు లేని అంతర్జాలాలు, కాగి కాగీ చిక్కగా మరుగుతున్న Subaltern దుఃఖాలలో దేశ/హ దిమ్మరిలా తిరుగుతోంది.
అయినా ఏ దేహమూ మిగుల్చుకోలేదు, ఏ పదాలూ దాచుకోలేదు (యితర) అంటాడు శ్రీకాంత్. కవి తాను పదను పెట్టి, రాటు దేల్చిన పదాలతో కొత్త భాషను సృష్టించుకుంటాడు. ఆ భాష ఒక వాచకంలా (ఈ paragrahical/ prose poetryని, అవ్యాకరణ వాక్య సమూహాల్నిశ్రీకాంత్ కవిత్వమనేమీ చెప్పడం లేదు. Text అనే అంటున్నాడు) వెలిగిపోయి, ఒక ప్రశ్నలా నిలబడితే అంతకన్నా గొప్ప కవిత్వమేముంది.
ఇంతకీ ఆ ప్రశ్న స్థూలంగా:
“గీతకు ఇవతలా, గీతకు అవతలా సరే. కానీ, గీత గీసింది ఎవరు? గీతను కాపాడుతున్నది ఎవరు?”
ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. ‘భూమి పైకి ఒంగి పరిహసిస్తున్న కాళరాత్రి’ కింద నడుస్తున్న …
బాటసారీ దేహధారీ
వెలిగించుకున్నావా ఒక దీపం?
అట్టే పెట్టుకో మరి నిన్ను నువ్వు
ఆ రెండు అరచేతుల మధ్య-
ఇక ఆరిపోనివ్వకు
నీ హృదయాన్ని.
***
అనువాదాలు, Uncategorized

శ్వాస ఒక్కటే

rumi pic

నేను క్రైస్తవుడిని కాదు.
యూదు లేదా ముస్లింనూ కాదు.
హిందువును కాదు, బౌద్దుడినీ కాదు, 
సూఫీని కాదు జెన్‌నీ కాదు, అసలు
నాకే మతమూ లేదు

ఏ సంస్కృతీ సాంప్రదాయిక చట్రమూ
నా చుట్టూ లేదు
నేను తూర్పు నుంచి రాలేదు
పశ్చిమం నుంచీ రాలేదు
నేల మీంచో సముద్రం లోంచో రాలేదు

సహజంగానో అసహజంగానో ఊడి పడలేదు,
ఏ మూలకాల సంయోజనాన్నీ కాదు.
అసలు ‘నేను’ లేను

ఈ లోకంలోనో
మరో లోకంలోనో
నా మనుగడ లేదు
ఆదాము, ఈవ్‌ల వారసుడ్ని
అసలే కాను.

నాకే మూల కథ లేదు.
నాకే ఊరు లేదు, నా ఆచూకీకి
అనవాలు లేదు
దేహమూ లేదు, ఆత్మా లేదు.

నేనంతా నా దేవుడే
నేను రెండు ప్రపంచాలనీ
నేను ఒకటిగా చూశాను,
కోరుకోవల్సిందీ,
తెలుసుకోవల్సింది అదే.

ఆదిలో అంతంలో
లోపలా, బయటా
ఉన్నదొకటే శ్వాస
మనిషి శ్వాసిస్తున్న శ్వాస.

– జలాలుద్దీన్ రూమీ (Only Breath)
అనువాదం: పసునూరు శ్రీధర్‌బాబు

వ్యాసాలు, Uncategorized

హృదయానికి తలుపులు తెరిచే మార్మికత… రూమీ కవిత

maulana-rumi
వాన కురుస్తుంటే తడవకుండా ఓ మూలన నక్కి కూర్చుని చూస్తూ ఉండడం ఒక పద్ధతి. చేతులు రెండూ ఆకాశానికి తెరిచి పెట్టి నిలువునా తడిసిపోవడం ఇంకొక పద్ధతి. ఎవరి స్పర్శా అంటని చినుకులు నేరుగా ఆకాశ వీధుల్లోంచి వచ్చి నిన్నుమాత్రమే స్పృశిస్తుంటే, నీ శరీరంలోని ప్రతి కణంలో కలకలం రేపి అలరిస్తుంటే అప్పుడు తెలిసిపోతుంది తడిసిపోవడంలోని ఆనందం ఏమిటో…
ఈ వాన ఎప్పుడు ఆగిపోతుందో అన్న ప్రశ్న కాకుండా ఈ వాన ఆగిపోతుందేమో అన్న దిగులు పెరుగుతూంటుంది చూడూ… అప్పుడు మొదలవుతుంది అసలు దాహం.
కురవనీ వర్షం… ఈ పగలూ రాత్రీ
కలలలో కలతలో నిండా తడిసిపోయాక
రానీ… పొద్దుటి సూర్యుడు
వచ్చి ఈ తడిసి ముద్దయిన దేహంలోంచి ఒక్కో చినుకును
ఒక్కటొక్కటిగా తీసుకుపోనీ
సూర్యుడికి కూడా ఇవ్వగలిగిందొకటి కలిగి ఉండడం
ఎంత గొప్ప విషయం!
ఇది రూమీ కవిత్వంలో మునిగి తేలుతూ నన్ను నేను అనునయించుకుంటూ చెప్పుకున్న కవిత్వం.
రూమీని చదువుతూ ఉండడం ఆకుపచ్చ మైదానాల మీద వెండి తీగల్లా కురుస్తున్న వర్షంలో వర్షమై తడిసిపోవడం. కరిగిన దేహంలో మిగిలిన ఆత్మతో ఆ వాన తీగల్ని మీటుకుంటూ ఆ సంగీతంలో డెర్విష్ నృత్యకారుడిలా గిరగిరా గుండ్రంగా తిరుగుతూ కళ్ళు తిరిగి పడిపోవడం. పొద్దుటి ఎండలో వెచ్చగా అక్షరాలుగా ఆవిరైపోవడం.
Listen, O drop, give yourself up without regret,
And in exchange gain the ocean.
Listen, O drop, bestow upon yourself this honour,
and in the arms of the Sea be secure.
Who indeed should be so fortunate?
An Ocean wooing a drop!
In God’s name, in God’s name, sell and buy at once!
Give a drop, and take this Sea full of pearls.
అంటాడు మౌలానా జలాలుద్దీన్ రూమీ. ఓ చినుకా నిన్ను నీవు సముద్రానికి సమర్పించుకో. సముద్ర లాలనలో మురిసిపోవడం కన్నా అదృష్టం ఏముంది? ఒక్క చినుకును ఇచ్చి ముత్యాలతో నిండిన ఈ సముద్రాన్ని తీసుకో.
సముద్రాన్ని తీసుకోగల శక్తి నీకుందా?
ఏడు స్వర్గాలను స్వప్నంలో చూశానని, మార్మికుడు పరిపూర్ణంగా మార్మికతలో కలిసిపోవడమే ఏకత్వం (సాలోకం నుంచి సాయుజ్యం దాకా) అని చెప్పిన తొమ్మిదో శతాబ్దపు ఇరానీ సూఫీ అబూ యాజిద్ అల్-బేస్తామీనే… సముద్రంలోంచి చెంబెడు నీళ్ళు తీసుకుని వెళ్ళిపోయినవాడే కదా అని పెదవి విరుస్తూ షమ్స్‌కు చెప్పాడు కదా రూమీ. అలాంటివాడు రూమీ సముద్రంలో కలిసి సంద్రమై వేలాది ముత్యాల హారాల్ని నీటిదారాలతోనే అల్లి ఈ లోకానికి పంచాడు.
రూమీ రాసిన రుబాయతులు, గజళ్ళ సంకలనం పేరు ‘దివాన్-ఎ-షమ్స్-ఎ-తబ్రిజి’ – The works of Shams of Tabriz. షామ్స్ కోసం వెతికి వెతికీ అసలు నేనెందుకు వెతకాలి, నేనే షామ్స్… అతని సారమే నాలో పలుకుతోంది అంటూ రాసిన అపార కవిత్వాన్ని షమ్స్ పేరుతోనే ప్రకటించాడు రూమీ. జీవన ప్రస్థానంలో చివరి రోజుల్లో ఆయన రాసిన గ్రంథం “మస్నవీ”. ఇది ఆరు సంపుటాలకు విస్తరించిన 26 వేల ఆధ్యాత్మిక ద్విపదల ప్రవాహం. ఇది కాకుండా ‘ఫిహి మా ఫిహి’ (In It What’s in it) అనే అంతరంతర్ద్వారాలను తెరిచే మరో గ్రంథం. రూమీ చేసిన 71 ప్రసంగాలను ఆయన శిష్యులు ఏర్చి కూర్చిన సంపద ఇది. ఇంకా ఏడు సభల్లో ఆయన చేసిన ప్రసంగాలతో Seven Sessions; ఆయన తన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శిష్యులకు, పాలకులకు రాసిన లేఖలతో “మకాతిబ్” పుస్తకాలు వెలువడ్డాయి. వీటిలో “మస్నవీ” ఎంతో ప్రాచుర్యం పొందింది. దీన్ని పర్షియా భాషలో రాసిన ఖొరాన్ అని కీర్తిస్తారు.
ఏడెనిమిదేళ్ళ వయసులో ఆఫ్గానిస్తాన్‌ నుంచి టర్కీకి వలస వచ్చి కోన్యా పట్టణంలో స్థిరపడిన రూమీ జీవితాన్ని 37 ఏళ్ళ వయసులో షమ్స్ పరిచయం పూర్తిగా మలుపు తిప్పింది. షమ్స్ తన జీవితంలోంచి అదృశ్యం కావడం రూమీని ఒక తీవ్రాన్వేషిగా, మార్మికుడిగా మార్చేసింది. ఆ సందర్భంలో రూమీయే చెప్పుకున్నాడు, “నేను ప్రార్థనలు రాసేవాడిని ఇప్పుడు కవిత్వం రాస్తున్నాను. పాటలు రాస్తున్నాను. గానం చేస్తూ నాట్యం చేస్తున్నాను” అని.
కవిత్వ, సంగీత, నృత్యాలను ఆధ్యాత్మిక సాధనలో మేళవించిన రూమీ తన చుట్టూ తాను గిర గిరా తిరుగుతూ ధ్యానముద్రలోకి వెళ్ళిపోయేవాడట. ఆ స్థితిలోంచే తన పద్యాలకు బాణీలు కట్టేవాడు. ఆ స్థితిలోంచే కవిత్వం పలుకుతుంటే శిష్యులు గ్రంథస్థం చేసేవారు. ఆ నృత్య రీతి ఇప్పటికీ డెర్విష్ (సూఫీల తెగ) ధ్యాననృత్య సంప్రదాయంగా కొనసాగుతోంది.
రూమీ కవిత్వాన్ని మొదట్లో R.A. Ncholoson, A.J. Arberry, Annemare Schimmel, William Chittick, Franklin Louis వంటి పాశ్చాత్య సాహిత్య పరిశోధకులు ఇంగ్లీషులోకి అనువదించారు. వీరు స్వయంగా పారసీ భాషను నేర్చుకుని రూమీని ఇంగ్లీషులోకి తర్జుమా చేశారు. నాదర్ ఖలీలీ, మరియం మఫీ వంటి కొందరు పర్షియన్లు ఇంగ్లీషు నేర్చుకుని రూమీని మాతృభాష నుంచి ఇంగ్లీషులోకి అనువదించారు. ఈ రెండు వర్గాల వారు కాకుండా రూమీ ఇంగ్లీషు అనువాదాలనే చదివి వాటిని తమదైన శైలిలో అందించే ప్రయత్నం చేశారు మరికొందరు. ఈ కోవకు చెందినవాడే Coleman Barks. ఇరవయ్యో శతాబ్దంలో మొదలైన ఈ కృషితో రూమీ పేరు అటు అమెరికా, యూరప్‌లతో పాటు దక్షిణాసియాలో మార్మోగిపోవడం మొదలైంది. భారతదేశంలోనే కాకుండా తెలుగు సాహిత్యంలో కూడా ఈ కాలంలోనే రూమీ సాహిత్యానికి ఆకర్షణ పెరిగింది.
The Essential Rumi, The Soul of Rumi, Rumi: The book of Love వంటి పుస్తకాలతో రూమీని అమెరికాలో పాపులర్ చేసినవాడు Coleman Barks. గానయోగ్యంగా ఛందోబద్ధంగా ఉన్న రూమీ విక్టోరియన్ అనువాదాలను Barks అమెరికన్ వచన సాహిత్యంగా అనువదించి రూమీని సామాన్యులకు చేరువ చేశాడు.
అయితే, రూమీ కవిత్వ అనువాదాలు ఎంతవరకు రూమీని అచ్చంగా ఆవిష్కరించగలిగాయన్న ప్రశ్నఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఏదైనా గొప్ప సాహిత్యాన్ని కవి సొంత భాషలో చదువుకోగలగడమే పాఠకుడికి వరం. అప్పుడే ఆ కవిత్వంలోని సున్నితత్వం, సునిశితత్వం నేరుగా హృదయాన్ని తాకుతుంది. ఇంగ్లీషు నుంచి కాకుండా రూమీని పారసీలో చదివి ఇంగ్లీషులోకి అనువదించిన ఇండో-బ్రిటిష్ రచయిత ఫారూఖ్ ధోండీ పుస్తకం Rumi: A New Translations ఆ మధ్య వెలువడింది. అయితే, ధోండీ తాను ఛందస్సును నిక్కచ్చిగా పాటించానని చెప్పుకున్నాడు. కవిత్వానువాదాలలో ఛందస్సు ప్రతిబంధకమే తప్ప బలం అయ్యే అవకాశాలు ఉండవు. మీటర్‌కు కట్టుబడి ఉంటే ఇస్మాయిల్, నాసరరెడ్డి వంటి వారు అంత గొప్ప హైకూలను రాయగలిగేవారే కాదు. కాబట్టి, కవిత్వానువాదంలో spirit ముఖ్యం.
జీవితంలో చాలా భాగాన్ని రూమీకే అంకితం చేసిన ఆంగ్ల సాహిత్య విద్యావేత్త Coleman Barks ఆ మార్మికుడి హృదయాన్ని వచన కవిత్వంగా అందించడం చాలా మందికి నచ్చింది. అయితే, రూమీ కవిత్వాన్ని ప్రాచుర్యంలోకి తేవాలన్న ఆరాటంతో అందులోని ఇస్లాంను తుడిచే ప్రయత్నం చేశారనే ఆరోపణలూ ఆయన మీద ఉన్నాయి. “అలా ప్రయత్నపూర్వకంగా ఏమీ చేయలేదు. రూమీ అవ్యక్త భావాల అనుభూతిని పాఠకుడికి అందించడానికి కొంత స్వేచ్ఛ తీసుకున్న మాట నిజం” అని అమెరికాలోని సాహిత్య జర్నల్ The Newyorker కు చెప్పారు Barks. ఏమైనా, ఈ తరం యువత కూడా రూమీని యూట్యూబ్ వీడియోలలో, బ్లాగుల్లో, ఫేస్ బుక్, ట్విటర్లలో స్మరిస్తుండడం వెనుక Barks కృషి ఉందనడానికి సందేహం లేదు. 1971 నుంచి రూమీ అధ్యయనంలో మునిగిన Barks రాసిన డజనుకు పైగా రూమీ పుస్తకాలు మిలియన్లలో అమ్ముడయ్యాయి.
ఎనిమిది వందల ఏళ్ళ తరువాత కూడా రూమీ కవిత్వం సరిహద్దులు దాటుకుని ప్రజల అభిమానం ఎలా చూరగొంటోంది? ప్రపంచవ్యాప్తంగా కవులు, రచయితలే కాదు ఎంతోమంది సామాన్య పాఠకులు కూడా రూమీ మోహంలో పడడానికి కారణం ఏమిటి? అసలు ఆ కవిత్వంలో ఏముంది?
దీనికి Barks చెప్పిన అతి క్లుప్తమైన, సునిశితమైన సమాధానం: “హృదయాన్ని తెరిచే మార్మికతే రూమీ కవిత్వం.”
రూమీ కవిత్వం 13వ శతాబ్దపు కళారూపంగా మ్యూజియంలో పడి ఉండిపోకూడదు, ఆయన అక్షరాలు మనుషులకు అన్నపానీయాల్లాంటివి, అవి అందరికీ చెందాలి అంటాడు Barks.
ప్రగాఢమైన భక్తి పారవశ్యానికి మార్గంలా కనిపించే సూఫీ తత్వం అంతిమ లక్ష్యం ప్రేమ. అన్నింటిలోనూ ప్రేమను చూడడం, ఆ ప్రేమలోనే దైవత్వాన్ని దర్శించడం ఎలాగో సూఫీ కవిత్వం చెబుతుంది. మరీ ముఖ్యంగా, చట్రంలో ఒదిగిన సిద్ధాంతాలను ప్రశ్నిస్తూ, స్వేచ్ఛను గానం చేయడం సూఫీ కవిత్వంలో సమున్నత స్థితి.
శ్వాస ఒక్కటే (Only Breath)
నేను క్రైస్తవుడిని కాదు. యూదు లేదా ముస్లింనూ కాదు.
హిందువునీ కాదు, బౌద్దుడిని కాదు, సూఫీనీ కాదు జెన్‌నీ కాదు, అసలు నాకే మతమూ లేదు
ఏ సంస్కృతీ సాంప్రదాయిక చట్రమూ నా చుట్టూ లేదు
నేల నుంచో నీళ్ళ నుంచో రాలేదు
సహజంగానో అసహజంగానో ఊడి పడలేదు,
ఏ మూలకాలతోనూ రూపం తీసుకోలేదు… అసలు ‘నేను’ లేను
ఈ ప్రపంచంలోనో రేపటి ప్రపంచంలోనో నా మనుగడ లేదు
ఆదాము, ఈవ్‌ల నుంచి రాలేదు, నాకే మూల కథ లేదు.
నేనున్న చోటు.. చోటు కాదు, నా ఆచూకీకి అనవాలు లేదు
దేహమూ లేదు, ఆత్మా లేదు
నేనంతా నా ప్రేమికుడే, నేను రెండు ప్రపంచాలనీ
ఒకటిగా చూశాను, అదే నాకు కావల్సింది, తెలుసుకోవల్సింది,,
మొదట్లో, ఆఖరున, బయటా, లోపలా ఉన్నది
ఒకటే శ్వాస… మనిషి శ్వాసిస్తున్న శ్వాస.
స్థూలంగా, సూక్ష్మంగా ఇదీ రూమీ కవిత్వం. ఇదీ సూఫీ తత్వం. కృత్రిమంగా అద్దుకున్న రంగులన్నీ కడిగేసుకుంటే మిగిలేది శ్వాస ఒక్కటే. మనుషులందరిలోనూ ఉండే శ్వాస ఒక్కటే. ఈ గాలిలోనే మనమంతా ఉన్నాం. ఉన్నదొకటే లోకం అంటున్నాడు రూమీ.
ఏమీ తెలియనితనంలోని ఖాళీ శిథిలాల మధ్య నిలబడితే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి రూమీ కవిత్వం సాయం చేస్తుంది. ఏమాత్రం తెలియని మనిషిని, ఎప్పుడూ కలుసుకోని మనిషిని, అయినప్పటికీ బాగా లోతుగా తెలిసినట్లుండే మనిషిని ప్రేమించడం ఎలా ఉంటుందో అనుభవంలోకి తెస్తుంది. గుండె పగిలి, నిర్నిమిత్తంగా, అకారణంగా అలవికాని దాహంతో అనంత సీమల్లో తిరుగాడే మానసిక స్థితిలోకీ తీసుకు వెళతాయి రూమీ కవితలు.
గుండె తెరుచుకునేంతవరకూ దానిని పగలగొడుతూనే ఉండు అంటాడు రూమీ. మరీ ముఖ్యంగా, ఒంటరి వాద్యం చేసే గాయంతో పడే ప్రేమికుడి వేదనే అదంతా అంటాడు. దేనికోసమో పడే ఆరాటం… ఖాళీతనానికి మనమిచ్చే రూపం అంటాడు.
*
ఢంకా మోత గాలిలో పెరుగుతోంది
అది నా గుండె చప్పుడు.
ఆ చప్పుడులోని స్వరం చెబుతోంది,
‘నాకు తెలుసు నీవు అలసిపోయావు,
కానీ, రా… ఇదొక్కటే దారి’
*
సముద్ర ఔదార్యాన్ని చూస్తే నీకు అసూయగా ఉందా?
ఈ ఆనందాన్ని ఎవరికైనా ఇవ్వడానికి
నీవెందుకు నిరాకరిస్తావ్?
పవిత్ర జలాలను చేపలు కప్పులో దాచుకోవాలనుకోవు!
ఆ అనంత స్వేచ్ఛా జలాల్లో అని హాయిగా ఈదులాడతాయి.
*
మంటలను మరింత మండించేందుకు ప్రయత్నించకు
గాయాన్ని ఎప్పుడూ రక్తంతో కడుక్కోకు!
*
నువ్వెంత వేగంగా పరుగెత్తినా
నీ నీడ నీవెంటే ఉంటుంది
ఒక్కోసారి అది నీకన్నా ముందుంటుంది!
నిండు సూర్యుడు నీ నెత్తి మీద నిట్టనిలువుగా ఉన్నప్పుడే
నీ నీడ కుంచించుకుపోతుంది.
*
కథలా సాగే కవితలు, ప్రవచనాల్లా సాగే పంక్తులు, జీవనసారాన్ని ఒక వెలుతురు మొగ్గలా చేత్తో పట్టి చూపించే చిన్న చిన్న పద సముచ్ఛయాలు. ఇది కేవలం చదవడం కాదు. రూమీతో కలసి ప్రయాణించడం. రూమీ కూడా నీకేదో ఇస్తున్నానని ఎన్నడూ చెప్పడు. తలుపులు తెరుస్తున్నా… నీలోకే అంటాడు. అప్పుడు నీవు కొవ్వొత్తిలా వెలిగిపోతుంటావు.
A Just-Finishing Candle
పూర్తిగా జ్వలించడానికే కొవ్వొత్తిని తయారు చేస్తారు
అలా అది అంతరించిపోతున్నప్పుడు
దానికి నీడ ఉండదు.
అది మరేమీ కాదు…
దేహం గురించి వివరిస్తున్న వెలుగు నాలిక
ఇటు చూడు
చివరకంటా కాలి కరిగిపోయిన ఈ కొవ్వొత్తి ఎలా ఉందో…
మంచీ చెడుల సంఘర్షణ నుంచి
వాటి నుంచి ఆపాదించుకున్న
గౌరవాలూ, అవమానాల నుంచి
ఎట్టకేలకు బయటపడిన మనిషిలా-
*
‘హంసలదీవి’ వంటి సూఫీ తరహా సున్నితమైన కవిత్వాన్ని రాసిన ప్రముఖ కవి దీవి సుబ్బారావు గారు, సూఫీ కవిత్వం పేరుతో 2004లో రూమీ కవితల తెలుగు అనువాదాలను ఒక పుస్తకంగా తెచ్చారు. ఆయన ద్వారానే నాకు రూమీ కవిత్వంతో పరిచయం మొదలైంది. అలా నాలోకి నాకు తలుపులు తెరిచినందుకు సుబ్బారావు గారిని నేను ఎప్పటికీ మరిచిపోను. ఆయన అనువదించిన రూమీ కవితల్లో ఇది ఒకటి:
కళ్ళ నీరు
దిగుడు బావి నుండి ఏతంతో నీళ్ళను పైకి తోడినట్లు
ఏడుపుతో నీ కళ్ళను నీటితో ఉబికిపోనీ.
నీ హృదయపు మాగాణి పొలంలో
పచ్చటి చివురులు మొలకెత్తనీ.
కన్నీరు కావలిస్తే
కన్నీరు కార్చేవాళ్ళతో దయగా వుండు.
దయ కావలిస్తే
నిస్సహాయులపట్ల దయచూపు.
*
‘నిర్వికల్ప సంగీతం’ వినిపిస్తూ, ‘నీటి రంగుల చిత్రాల’ను దర్శనం చేయిస్తున్న ప్రముఖ కవి వాడ్రేవు చినవీరభద్రుడు గారు కూడా కొన్ని రూమీ కవితలను అనువదించారు. ఆయన బ్లాగు ‘నా కుటీరం’లో వాటిని చదువుకోవచ్చు. ఆయన రాసిన ఓ రూమీ గజల్‌లో కొంత భాగం:
ఈ ప్రపంచానికి సహనం లేదు, స్థిరత్వంలేదు, నేనింకా ఎంతకాలం ఈ పంకంలో పడి పొర్లాలి? నా ప్రేమికుడికి నా ప్రేమ కూడా అక్కర్లేదు.
అతడే నా దుకాణమూ, నా బజారూ అయ్యాక నాకు మరో అంగడి తెరవాల్సిన పనేముంది? నేను నా ఆత్మకే సుల్తానుని, ఈ ప్రపంచాన్నింకా సేవకుడిలా ఎందుకు సేవించాలి?
ఈ అంగడి మూసేస్తాను. అతడి ప్రేమనే నా భాండాగారం. రత్నాల గని దొరికిందినాకు, ఇంకా అంగడి నడుపుకుంటూ కూర్చోడమెందుకు?
నా నెత్తిన గాయమేదీ లేదు. తలకి కట్టు కట్టుకుని తిరగడమెందుకు? నేనీ ప్రపంచానికే వైద్యుణ్ణి. నేనింకా రోగగ్రస్తుడిలాగా కనిపించడం అవసరమా?
హృదయోద్యానవనంలో కోయిలని నేను, గుడ్లగూబలాగా బతకడం తప్పు. అతడి తోటలో గులాబి మొక్కను. ఒక ముల్లులాగా బతకడం కన్నా అపరాధముంటుందా?
*
మతాలకు, సంస్కృతికి మధ్య ప్రేమ వంతెనగా కవిత్వాన్ని నిర్మించిన రూమీ, ‘మనం మరణించిన తరువాత మన సమాధులను భూమి లోపల కాక మనుషుల గుండెలలో చూసుకోవాలి” అని అంటాడు. అలాగే నిలిచాడు. స్థలకాలాలకు అతీతంగా, ప్రయోజనం అనే పలుపుతాళ్ళ బంధనాలకు అతీతంగా ఆయన కవిత్వం జీవనదిలా ప్రవహిస్తోంది.
‘I know you’re tired,
but come. This is the way!’
***
వ్యాసాలు, Uncategorized

పర్షియా ఎడారిని తడిపిన నెత్తుటిలో పెరిగిన సూఫీ తోట

Rumi
‘నా ఆత్మ బంధువు ఎవరు?
ఈ ప్రయాణంలో నాకు సరైన తోడు ఎవరు?’
‘ఆ వ్యక్తి ఎవరో ఎదురుపడితే బదులుగా ఏమిస్తావ్?’ ఎక్కడి నుంచో వినిపించిందొక ప్రశ్న.
‘నా తలను కానుక చేస్తాను’ స్థిరంగా వచ్చింది జవాబు.
తోడు కోసం ఆ ఫకీరు చేస్తున్న అన్వేషణకు కారణమైన అసలు ప్రశ్న వేరే ఉంది. ఆ ప్రశ్నకు జవాబు చెప్పగలవాడే తన ఆత్మబంధువు. ఆ వ్యక్తితోనే తన ప్రయాణం పునీతమవుతుందని అతడి నమ్మకం. ఆ ప్రశ్నకు జవాబు చెప్పగల మనిషి కోసం అతడు ఎన్నో ఊళ్ళూ పట్టణాలూ తిరిగాడు. వీధులూ సందులూ గాలించాడు. అందరూ తాము చదివిని పుస్తకాల్లోంచి జవాబులు అప్పజెప్పే ప్రయత్నమే చేశారు. ఎవరూ తమ అనుభవం లోంచి జవాబు జాడను తడిమే ప్రయత్నం చేయలేదు. హృదయంలోంచి ఎవరూ వ్యక్తం కాలేకపోయారు.
అక్షరాల కీకారణ్యాలకు ఆవల ఉన్న దేవుడి హృదయంలోకి వెళ్లాలన్నది అతడి కోరిక. అందుకు మరొక మనిషి హృదయమే మార్గమన్నది అతడి నిశ్చయం.
అలాంటి మనిషి ఒకడు అతడికి కోన్యా పట్టణ వీధుల్లో తారసపడ్డాడు. శిష్యులతో కలసి బజారులో తిరుగుతున్న ఆ ప్రబోధకుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. ఆ ఫకీరుకు నమ్మకం కలిగింది. ఇక ఆలస్యం చేయలేదు. అడిగాడు:
“మహమ్మద్ ప్రవక్త గొప్పవాడా? మహా ప్రబోధకుడు బేస్తామీ గొప్పవాడా?”
“ప్రవక్త మహమ్మదే గొప్ప”
“దేవుడు నాలోనే ఉన్నాడు కాబట్టి నేను గొప్ప అన్నాడు కదా బేస్తామీ. మహమ్మద్ ప్రవక్త ఏమో ‘అనంతమైన కరుణతో నిండిన దేవుడు గొప్పవాడు’ అని చెప్పాడు. దీనికేమంటావు?”
ఆ ప్రశ్నలోని వైయక్తిక మీమాంసను గుర్తించిన మత గురువు ఆ ఫకీరుకు మోకరిల్లాడు. కాసేపటికి తేరుకుని, “దైవంలోని ఒక కోణాన్నే చూశాడు బేస్తామీ. ప్రవక్త అందుకు భిన్నంగా సృష్టికర్త అనంతత్వాన్ని గుర్తించాడు. దాన్ని తెలుసుకోవాలని తపిస్తున్నాడు. తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా తెలియనిది చాలా ఉందని తెలుసుకుంటున్నాడు. తెలుసుకోవాల్సిన రీతిలో తెలుసుకోలేదని ఒప్పుకుంటున్నాడు” అని బదులిచ్చాడు.
మురిసిపోయిన ఫకీరు రెండు చేతులూ సాచి అతడ్ని కావలించుకున్నాడు. ఆ మత గురువు ఫకీరును తన హృదయంలోకి ఆహ్వానించాడు.
చరిత్ర పుటల్లో పదమూడో శతాబ్దపు అధ్యాయంలో ఇప్పటి టర్కీలోని కోన్యా పట్టణంలో జరిగిన కథ ఇది. కచ్చితంగా వాళ్ళు అట్లాగే మాట్లాడుకున్నారా అంటే చెప్పలేం. కానీ, వారి అనంతర యానంలోకి వెళితే వారు కలుసుకున్న ఆ సందర్భం మరింత మహత్పూర్వకంగానే ఉండి ఉంటుందనిపిస్తుంది.
జోలెలో ప్రశ్నలు వేసుకుని వీధులు తిరిగిన ఆ దేశదిమ్మరి పేరు షామ్స్ టాబ్రిజి.
అతడి అంతరాత్మ ఏ మత గ్రంథాలూ చెప్పని రహస్యాలను వినిపిస్తుందని నమ్మినవాడు మౌలానా జలాలుద్దీన్ మొహమ్మద్ బల్ఖీ. అనంతర కాలంలో సూఫీ కవిగా సుప్రసిద్ధుడైన “రూమీ” అతడే.
మూఢ భక్తికీ, సత్య శోధనకూ మధ్య అనంత దూరాలున్నాయి. వ్యవస్థీకృత మతం – అది ఏదైనా సరే ‘దైవాన్ని’ తెలుసుకోవడానికి అడ్డంకిగానే ఉంటుందని ఈ జంట కవులు భావించారు. మత గ్రంథాలలో దేవుడి గురించిన భావనలు, ఆదర్శాలనే చూసిన రూమీకి తన ఆత్మబంధువైన షామ్స్‌ జీవితంలోని ప్రతి మలుపులో కనిపించే ప్రతి వస్తువులో, ప్రతిని సన్నివేశంలో దేవుడ్ని చూడగలగడం కొత్తగా అనిపించింది. ఆ పారవశ్యాన్నిషామ్స్ తనతో పరిపూర్ణంగా పంచుకోవడం రూమీని అతడి పట్ల వివశుడ్ని చేసింది. ఈ జీవిత సత్యాన్ని, ప్రాపంచిక దృక్పథాన్ని, మానవ ప్రేమలని ఒకే రకమైన తీవ్రతతో శోధించడానికి సిద్దపడ్డారు వారిద్దరూ. సముద్రంలోంచి ఓ చెంబుడు నీళ్ళు తీసుకుని ఆగిపోయిన బేస్తమీ లాగా కాకుండా ప్రయాణిస్తున్న కొద్దీ తలుపులు తెరుచుకునే ప్రవక్త మార్గంలో ఒకే హృదయమై నడిచారు. వారి స్నేహం ఒక మార్మిక బంధం.
కోన్యాలోని ఇరుకిరుకు సందుల్లో వారు ఎడారి ధూళితో కలిసి ఎగసి పడుతున్న సాంబ్రాణి ధూమాన్ని పీల్చుతూ తిరిగారు. కుప్పలు పోసిన లవంగాలు, యాలకుల పరిమళాలతో అలరారే బజార్లలో సూర్య కాంతిని పరావర్తనం చేసే లోహ పాత్రల మిలమిలల్లో దేహ భారాన్ని విడిచి తేలిపోయారు. చూడడం, స్పర్శించడం కాకుండా ప్రతిదీ దర్శించారు. లోపల్లోపలికి ఒంపుకున్న అనుభవాలను హృదయం ద్వారా వ్యక్తం చేయడం తెలుసుకున్నారు. ఎన్నో నెలల పాటు భౌతిక అవసరాలతో పని లేకుండా నిరాడంబరంగా జీవించారు. స్వచ్ఛమైన సెలయేళ్ళలా సంభాషించుకుంటూ తమ చుట్టూ ఒక కొత్త ప్రకృతిని నిర్మించుకున్నారు.
వారి మార్మిక బంధం మత పరిరక్షక సమూహాలకు సహజంగానే కంటగింపుగా మారింది. గురువు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని రూమీ శిష్యులు కోపం తెచ్చుకున్నారు. సమస్యను గుర్తించిన షామ్స్ ఉన్నట్లుండి అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. రూమీ ఒంటరయ్యాడు. షామ్స్ లేని బాధ అతడ్ని కలచివేసింది. షామ్స్‌తో గడిపిన దట్టమైన అనుభవాలతో నిండిన జీవితం నుంచి ఒక్కసారిగా వెలితిలో పడగానే తల్లడిల్లిపోయాడు.
“అప్పుడే ఆయన కవిగా మారాడు. ఓ మార్మిక కళాకారుడిగా పునరుత్థానమయ్యాడు. సంగీతం వినడం ప్రారంభించాడు. వీధుల్లో తిరుగుతూ పాటలు పాడడం మొదలెట్టాడు” అని రూమీ కవిత్వ శోధనకు నలభయ్యేళ్ల జీవితాన్ని అంకితం చేసిన Annemarie Schimmel అనే జర్మన్ పరిశోధకురాలు భావించారు. ఆమె టర్కీలోని అంకారా యూనివర్సిటీలో History of religion శాఖలో ప్రొఫెసర్‌గా పని చేశారు. “Rumi’s World: The Life and Work of the Great Sufi Poet” పేరుతో పరిశోధనాత్మక గ్రంథాన్ని ప్రచురించిన Annemarie, “షామ్స్ సాహచర్యంలో రూమీ mystical ecstacy స్థితికి చేరుకున్నారని విశ్లేషించారు. ఆ మానసిక స్థితికి కొనసాగింపే రూమీ కవిత్వం.
ఇంతలో షామ్స్ డమాస్కస్‌లో ఉన్నాడనే కబురు రూమీ చెవిన పడింది. తన కొడుకు సుల్తాన్ వేలాద్‌ను సిరియా పంపించాడు షామ్స్‌ను వెతికి పట్టుకుని తీసుకురమ్మని.
షామ్స్, రూమీలు రెండోసారి కలుసుకున్నప్పుడు ఒకరి కాళ్ళ మీద మరొకరు పడ్డారు. ఎవరు ప్రేమికుడో, ఎవరు పూజారో ఎవరికీ తెలియదు. ఒకర్నొకరు పట్టుకుని వలవలా ఏడ్చారు.
“నన్ను వదిలి అలా ఎలా వెళ్ళిపోయావ్?” అడిగాడు రూమీ.
“నా మౌన రోదనలు వింటూ వెంటే రావచ్చు కదా. నీ కోసం తివాచీ పరిచే ఉంచాను.” అని బదులిచ్చాడు షామ్స్.
“నేను నిస్పృహలో మునిగాను. నువ్వు నాకేం చేశావో తెలుసా?”
“నువ్వు నన్నేం అడిగావో తెలుసా…”
“నేను నిన్నేమీ అడగలేదు”
“నువ్వు నీ జీవితాన్ని మార్చమని అడగకనే అడిగావు. నేను మార్చాను. బాధపడకు. ఇక నీతోనే ఉంటా”
మళ్ళీ మార్మిక సంభాషణల ప్రవాహం మొదలైంది. చుట్టుపక్కల మళ్ళీ అసూయాద్వేషాలు రగిలాయి. ఈసారి రూమీతో మాటల్లో మునిగిన షామ్స్‌ను ఎవరో పెరట్లోకి పిలిచారు. అలా వెళ్ళిన షామ్స్ మళ్ళీ తిరిగి రాలేదు.
గోనె సంచీలో బందీ అయిన షామ్స్ కళ్ళు తెరిచి కట్లు విప్పుకుని చూసేటప్పటికి చుట్టూ అంతులేని ఎడారి. మండుతున్న సూర్యుడి వేపు రక్తమోడుతున్న ముఖాన్ని పైకెత్తి… రెండు చేతులూ సాచి అడిగాడట షామ్స్ ఇలా: “దేవుడా నిన్నెంత ప్రేమించానో అంతలా మరొకరిని ప్రేమించినందుకు ఇదేనా నువ్వు నాకిచ్చే కానుక?”
మండుటెడారిలో అవిసిపోయాక, చీకటి చల్లదనంలోకి వెళ్ళిపోతూ, “ఈ జీవితాన్నిచ్చినందుకు, నన్నిలా హింసించిన వారి పట్ల క్షమతో ఉండగలిగే శక్తినిచ్చినందుకు దేవుడా నీకు ధన్యవాదాలు” అని పాటలు పాడాడట షామ్స్.
ఆత్మబంధువు నిజంగానే ఎదురుపడితే బదులుగా ఏమిస్తావ్ అన్న ప్రశ్నకు ‘తల తీసి ఇస్తా’ అన్న షామ్స్ చివరికి అన్నంత పని చేశాడు.
ఈసారి రూమీ వద్ద షామ్స్ లేని వెలితి తప్ప మరేమీ లేకుండా పోయింది. డమాస్కస్ వెళ్ళాడు. ఎక్కడెక్కడో అతని కోసం వెతికాడు. ఆ వెతుకులాటలో అతనికి దొరకిన పద్యం… సత్యం:
నేను ఎవరి కోసం వెతకాలి?
అతనే నేను కదా, అతని సారం నాలో పలుకుతోంది కదా…
అవును ఇంతకాలం నన్ను నేనే వెతుక్కుంటున్నాను.
అప్పుడు వాళ్ళిద్దరి కలయిక పరిపూర్ణమైంది అంటాడు The Soul of Rumi, Rumi: The Book of Love, The Essential Rumi పుస్తకాలు రాసిన Coleman Barks. అక్కడి నుంచి రూమీ కవిత్వమై ప్రవహించాడు.
నేను వెళ్ళిపోయే రోజు సమీపిస్తోంది
కానీ, నా చెవిలో ఉన్నదెవరు… నన్ను వింటున్నదెవరు?
నా నోటితో ఈ మాటలు పలికిస్తున్నదెవరు?
అని అంటూ తన కవిత్వ కృతి కర్త షామ్సే అని ప్రకటించాడు. షామ్స్ పేరుతోనే కవిత్వం రాశాడు. అలా పన్నెండేళ్లు పారసీక కవిత్వమై వికసించి… అక్షరాలతో మహా ఉద్యానాన్ని నిర్మించి 1273లో చనిపోయాడు. ఏడు వందల ఏళ్ళు దాటినా ఆ ఉద్యానం వెల్లివిరుస్తూనే ఉంది. దానికి శిశిరం లేదు. అది నిత్య వసంతం.
బాధను ఖాళీ చేయి
ఆ ఆలోచనను ఎవడు సృష్టించాడో ఆలోచించు –
మనిషిని సాత్వికుడిగా, ప్రేమికుడిగా మాత్రమే మిగల్చగల శక్తి ఉన్న ఇలాంటి ఎన్నో సూఫీ తత్వాల్ని వేలాదిగా వినిపించాడు రూమీ. అరబ్బీ భాషలో సుఫ్ అంటే ముతక ఉన్ని అని అర్థం. దానితో నేసిన బట్ట కట్టుకునేవాడు సూఫీ. స్వచ్ఛమైన, నిరాడంబరమైన జీవితానికి ఆ కట్టు ఒక నిదర్శనం. సూఫీగా జీవించినవాడే సూఫీ కవిత్వం రాయగలడు. సూఫీ కవిత్వం చదివితే ఆ తత్వం బోధపడుతుంది.
ఎవరైనా నిన్ను దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటే
ముందుగా నువ్వు చేతులు తెరిచి పెట్టుకో…
***
(రూమీ కవిత్వం గురించి కాకుండా నేపథ్యంలోకి వెళ్ళడానికి కారణం, ఆ జీవనయానం నన్ను కదిలింపచేయడం మాత్రమే కాదు. మనిషి కవిగా మారడానికి ఒక పూర్వ స్థితి ఉంటుందని గుర్తు చేయడం కూడా. ఆ స్థితి లేని వాడు తేలిపోతాడు. నువ్వు కవిత్వమయ్యే ముందు నిన్ను కుదిపేసిన గాయమేంటి? నీలో సంచలనాన్ని సృష్టిస్తున్న తుపాను పేరేమిటి? అది పర్షియా ఎడారి ఇసుకను తడిపేసిన వేడి వేడి రక్తమంత తీవ్రమైనది కాకపోవచ్చు. కానీ, అదేమిటో నీకు తెలియాలి.)
***
వ్యాసాలు, Uncategorized

కోలరిడ్జ్ ‘కుబ్లాఖాన్’ స్వప్న శకలం – వెంటాడే మార్మిక చిత్కళ

కలకూ కవిత్వానికీ ఏమిటి సంబంధం?
గాఢ నిద్రలో లోపల్లోపలి నేత్రాలు దర్శించే ‘చిత్కళ’ మర్మమేమిటి?
సుప్త చేతనావస్థలో దృశ్యంతో పాటు పోగులు పోగులుగా విడిపోతున్న పారదర్శక మనోఫలకం మీద రక్తి కట్టిస్తున్న పాత్రల నడుమ… నాలాగా ఒకడున్నాడు’ అంటూ నలుగురితో కలిసి బెదిరిపోయి… చెదిరిపోయిన కవి పుంగవుడి మెలకువ చెప్పే రహస్యమేమిటి?
నిజమేనా? Every dream is an unorganised poem అన్నది నిజమే కదా! కల అంటే creativity ఒకానొక deeper level of imaginationలోకి వెళ్ళిపోవడమే కదా! ఆ Intensity ఎలా ఉంటుందో అనుభవంలోకి వచ్చింది Samuel Taylor Coleridge రాసిన ‘Kubla Khan, a vision in a dream. A Fragment’ కవిత చదివాక.
coleridge
కుబ్లాఖాన్ కవిత నా జీవితంలోకి రావడం ఒక కలలాగే జరిగింది. ఒక కలతోనే జరిగింది. బహుశా 2003లో ఒకానొక రాత్రి అగాధ నిద్రలోంచి నేను దిగ్గున లేచాను. తెల్లవారడానికి ఇంకా చాలా సమయం ఉంది. అప్పటిదాకా చూసిన గాఢమైన కలకు ఇంధనంలా గుండె ఇంకా Idle modeలో కొట్టుకుంటోంది. నుదుటి మీద చెమట చిగుళ్లు వేసినట్లుగా పొడుచుకొస్తోంది. క్షణం ఆలస్యం చేయకుండా పెన్నూ పేపరు తీసుకుని నేను చూసిన కలను యథాతథంగా రాసేశాను. ‘నిదురపోని మెలకువ చెప్పిన కల’ అని దానికి పేరు పెట్టాను. అది కవిత్వమని కూడా ఏమీ అనుకోలేదు. పొద్దున్నే ఆ కాయితాన్ని అలాగే కవర్లో పెట్టి “బతికిన క్షణాలు” నా మీద గుమ్మరించిన వేగుంట ‘మో’హన ప్రసాద్ గారికి పోస్ట్ చేశాను. అంతటితో ఆ జ్వరం నుంచి బయటపడ్డాను. సరిగ్గా ఆరు రోజులకు ‘మో’ నుంచి ఉత్తరం. ‘Dream Poem చాలా బాగుంది. కోలరిడ్జ్ రాసిన ‘కుబ్లాఖాన్’ కవిత చదివావా…’ అని అడిగారు. ఆరోగ్యం బాలేక ఆస్పత్రి మంచం మీద ఉన్నానని కూడా ‘మో’ ఆ లేఖలో చెప్పుకొచ్చారు.
అప్పటిదాకా నాకు కోలరిడ్జ్ గురించి అస్సలు తెలియదు. వెంటనే నెట్‌లో కుబ్లా ఖాన్ పొయెం సెర్చ్ చేసి చూశాను. ఒకటి రెండు మూడు నాలుగు అయిదు ఆరు… సార్లు చదివాను (ఇప్పటికీ చదువుతూనే ఉన్నాను). చదువుతున్న కొద్దీ విస్మయం నన్ను స్థాణువుని చేయడం తెలుస్తూనే ఉంది. కుబ్లాఖాన్ ఒక మహాద్భుత స్వప్నం.
నా “నిదురపోని మెలకువ చెప్పిన కల” కవితను కుబ్లాఖాన్‌తో పోల్చే దుస్సాహసమేమీ చేయడం లేదు. కానీ, 1797లో ఒక కవి అనుభవించిన మానసిక స్థితి, 2003లో నేను అనుభవించిన మానసిక స్థితి ఒక్కటేనని మాత్రం చెప్పగలను. రెండూ విభిన్న స్థలకాలాల్లో logicకు అతీతంగా కవిత్వంలోకి అనువదితమైన అచ్చమైన కలలే. ఆ mysterious coincidence నన్ను ఇప్పటికీ వెంటాడుతూంటుంది.
ఒక స్వప్నం కవిత్వమవుతుందా? ఒక కవిత్వం స్వప్నం అవుతున్నప్పుడు… స్వప్నం కూడా కచ్చితంగా కవిత్వం అవుతుంది. నిద్రలో ఉన్నా మెలకువలో ఉన్నా కవిత్వ స్థితే ఒక స్వాప్నిక స్థితి అనిపిస్తుంది నాకు. Poetry is an act of dream అంటారు కదా.
వాస్తవ ప్రపంచాన్ని గాక కాలావధులకు అతీతంగా కలలపై పరిభ్రమిస్తున్న నైరూప్య ప్రపంచాన్ని ఆవిష్కరించడమే కవిత్వం చేయాల్సిన పని అన్న ‘పదచిత్రాల పికాసో’ అజంతా ఇంకా ఏమన్నాడు?
“మనిషిలో అంతర్భూతమై ఉన్న స్వప్నశక్తిని వినిర్గతం చేయడం ద్వారా అతడు ఆశిస్తున్న కొత్త ప్రపంచాన్ని ఆవిష్కృతం చేయగలగాలన్నదే నా కవిత్వ పంథా” అని ప్రకటించాడు.
“అసుర సంధ్య వేల అద్దంలో ఒకరోజు నా ముఖం చూసుకున్నాను
రెండు ఖండాలుగా చీలిన ప్రతిబింబం వెనుక ఎవరో ఉవ్వెత్తుగా లేచిన మనిషి
విచ్చుకత్తుల వలె మెరుస్తున్న అతని చేతులలో నా ఖండిత శిరస్సు…”
వైరుధ్యాల్నివెన్నెముకగా ధరించిన అజంతా ‘స్వప్నలిపి’లోని ఈ కవితలో ‘విచ్చుకత్తుల వలె మెరుస్తున్న ఆ ఉవ్వెత్తున లేచిన మనిషి’ అన్న వాక్యం కూడా కుబ్లాఖాన్ కవితనే గుర్తు చేసింది.
ఆ స్వప్నశక్తి ఎలాంటిదో అనుభవంలోకి తెచ్చుకునేందుకు Kubla Khan కవితలోకి ప్రయాణిద్దాం.
Kubla Khan
a vision in a dream. A Fragment.
In Xanadu did Kubla Khan
A stately pleasure-dome decree:
Where Alph, the sacred river, ran
Through caverns measureless to man
Down to a sunless sea.
So twice five miles of fertile ground
With walls and towers were girdled round;
And there were gardens bright with sinuous rills,
Where blossomed many an incense-bearing tree;
And here were forests ancient as the hills,
Enfolding sunny spots of greenery.
But oh! that deep romantic chasm which slanted
Down the green hill athwart a cedarn cover!
A savage place! as holy and enchanted
As e’er beneath a waning moon was haunted
By woman wailing for her demon-lover!
And from this chasm, with ceaseless turmoil seething,
As if this earth in fast thick pants were breathing,
A mighty fountain momently was forced:
Amid whose swift half-intermitted burst
Huge fragments vaulted like rebounding hail,
Or chaffy grain beneath the thresher’s flail:
And mid these dancing rocks at once and ever
It flung up momently the sacred river.
Five miles meandering with a mazy motion
Through wood and dale the sacred river ran,
Then reached the caverns measureless to man,
And sank in tumult to a lifeless ocean;
And ’mid this tumult Kubla heard from far
Ancestral voices prophesying war!
The shadow of the dome of pleasure
Floated midway on the waves;
Where was heard the mingled measure
From the fountain and the caves.
It was a miracle of rare device,
A sunny pleasure-dome with caves of ice!
A damsel with a dulcimer
In a vision once I saw:
It was an Abyssinian maid
And on her dulcimer she played,
Singing of Mount Abora.
Could I revive within me
Her symphony and song,
To such a deep delight ’twould win me,
That with music loud and long,
I would build that dome in air,
That sunny dome! those caves of ice!
And all who heard should see them there,
And all should cry, Beware! Beware!
His flashing eyes, his floating hair!
Weave a circle round him thrice,
And close your eyes with holy dread
For he on honey-dew hath fed,
And drunk the milk of Paradise.
ఒళ్ళు నొప్పులు వేధిస్తుంటే మత్తు మందు తీసుకోవడానికి అలవాటుపడిన కోలరిడ్జ్ తన గాఢ నిద్రలో చూసిన దృశ్యాన్నంతా ఇలా కవిత్వంగా రాశాడు. అప్పటిదాకా చదివిన కుబ్లా ఖాన్ – చెంఘిజ్ ఖాన్ మనుమడు – కథ ప్రభావం ఆయన కల మీద తీవ్రంగా పడింది. ఆ కలలో అతనొక అద్భుత దృశ్యాన్ని దర్శిస్తాడు.
దాదాపు మూడు వందల పంక్తులకు సరిపోయే కలను అక్షరబద్ధం చేస్తున్న క్రమంలో పోర్లాక్ నుంచి ఎవడో వచ్చి ఆయన ఏకాగ్రతకు భంగం కలిగిస్తాడు. అలా ఆ కవితను అసంపూర్ణంగానే వదిలేస్తాడు కోలరిడ్జ్. రాయనైతే రాశాడు కానీ దాన్ని దాదాపు ఇరవయ్యేళ్ల దాకా ప్రచురించలేదు.
1816లో ప్రచురితమయ్యాక చాలా మంది విమర్శకులు దాన్ని చదివి పెదవి విరిచారు. ఇది కవిత్వం కానే కాదు పొమ్మన్నారు. కానీ, ఆ తరువాత ఆధునిక విమర్శకులు ఈ కవితను నెత్తిన పెట్టుకున్నారు. ఇదొక స్వాప్నిక ప్రవాహమని, గాఢమైన అనుభవం సహజంగానే సంక్లిష్టంగా ఉంటుందని, లోతైన కాల్పనిక మార్మికతను ఆవిష్కరించిన ఈ కవిత కోలరిడ్జ్ కవిత్వంలోని మూడు అత్యుత్తమ కవితల్లో ఒకటి అని (మిగతా రెండు: The Rime of the Ancient Mariner, Christabel) తీర్మానించారు.
Stream of consciousness లాగా ఇదొక Stream of dreams. ఒకేసారి కన్న కలే అయినప్పటికీ, ఒకే ప్రదేశంలో జరుగుతున్న సన్నివేశాల సమాహారంగా కనిపించినప్పటికీ, దీనిలోని వైరుధ్యాల నడుమ సారూప్యాలను శోధించడం ఒక సౌందర్యాత్మక హింస. కానీ, కవి స్వాప్నిక మానసిక స్థితిని మనలోకి తీసుకున్నప్పుడు అనుభవంలోకి వచ్చే ప్రయాణం ఎంతో ఉద్విగ్నభరితంగా ఉంటుంది. Deeper intensityని అనుభవించగలం కానీ, ఒక్కోసారి పరిపూర్ణంగా అర్థం చేసుకోలేకపోవచ్చు. అనుభవంలోకి వచ్చిన తరువాత దేన్నయినా అర్థం చేసుకోవాల్సిన అవసరమూ ఉండకపోవచ్చు. అందుకే, ఇలాంటి కవితల విషయంలో అనువాదాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది.
ఈ కవితలో కుబ్లాఖాన్ ఒక్కడే నిజం. ఇక, గ్జనాడూ అనే అందమైన పచ్చని ప్రదేశం, అందులోని రాచ మహలు, నదులు, సెలయేళ్ళు. మంచు గుహలు అన్నీ… హేతువుతో నిమిత్తంలేని మార్మికతను నివేదించే దృశ్యాలే.
గ్జనాడూలోని అద్భుతమైన, ఆహ్లాదకరమైన రాచమహలును, చక్కని గుమ్మటంతో అలరారే భవంతిని ఆల్ఫ్ నదీ తీరాన నిర్మించాలని కుబ్లాఖాన్ ఆదేశించాడంటూ ఈ కవిత మొదలవుతుంది. ఆ ఆల్ఫ్ నది ఎలాంటిది? మానవమాత్రుడి ఊహకందనంత పొడవైన నది. పవిత్ర నది. సూర్యుడు కనిపించని సముద్రంలో అది కలిసిపోయేందుకు పరుగులు తీస్తోందట. ఆల్ఫ్ అరబ్ భాషలో మొదటి అక్షరం. దాని ఆర్థం జ్ఞానం. అంటే, ఆ సౌందర్యావరణంలో ఓ జ్ఞాన ప్రవాహాన్ని గుర్తు చేస్తున్నాడు మహా రొమాంటిసిస్ట్ కవి. తన స్వప్నసీమను భౌగోళికంగా వర్ణిస్తూ… కొండలంత ప్రాచీనమైన అడవులు, పరిమళాలు వెదజల్లే చెట్లు… సూర్యకాంతిని ఆవిష్కరించే హరిత మైదానాలను కళ్ళకు కట్టిస్తాడు. ఇంతలో అక్కడి ఎత్తయిన కొండల నడుమ లోతైన లోయలో లోతైన లోయలో దేవదారు వృక్షాలతో నిండిన పవిత్ర ప్రదేశంలో క్రూరుడైన ప్రియుడి కోసం విలపిస్తూ కుంగిపోతున్న చంద్రుడిని వెంటాడే ఓ స్త్రీని దర్శిస్తాడు.
ఆపైన అనేకానేక మలుపులు తిరుగుతూ జీవం లేని సముద్రంలో ఆ నది కలిసిపోతున్న చప్పుడులో కుబ్లా ఖాన్ . రేపటి యుద్ధం గురించి పూర్వీకులు చెప్పిన కాలజ్ఞానం విన్నాడు.
అలల మీద రాచ మహలు గుమ్మటం నీడ తెరలు తెరలుగా ఊగుతుంటుంది. సూర్యకాంతితో మెరిసే మహలు గుమ్మటం… మంచు గుహలు ఒకే చోట ఉండడమనే అద్భుతం అక్కడ సాక్షాత్కరిస్తుంది. మళ్ళీ మరొక విరోధాభాస. కోలరిడ్జ్ వినిపిస్తున్న ఈ కల… కళ్ళనేే కాదు. సకల ఇంద్రియాలనూ ఓ కుదుపు కుదిపేస్తుంది. తాను చూసిన దృశ్యాల తాలూకు వెచ్చదనాన్ని, చల్లదనాన్నీ, సెలయేటి గులకరాళ్ళు పైకీ కిందకూ కదులుతున్న చప్పుడునీ, విఫల ప్రేమిక దుఃఖంలోని జీరనీ, చెట్ల సువాసనల్నీ మన ఇంద్రియాలకు అనుభవైకవేద్యం చేస్తున్నాడు.
చివరి చరణంలో ఈ కల మరో మలుపు తిరుగుతుంది. ఓ అబిస్సీనియన్ నల్ల కన్య డల్సిమర్ వాయిస్తూ అబోరా పర్వతాన్ని గానం చేస్తుంటుంది. ఆమె గీతాన్నీ, సంగీతాన్నీ తనలోకి ఒంపుకుని… బిగ్గరగా గానం చేస్తూ గాలిలో రాచమహలును – మంచు గుహలనూ నిర్మిస్తానని కవి కలలో కలగంటున్నాడు. అంతిమంగా తనను తాను మెరిసే కళ్ళు, చెలరేగే జుత్తుతో ఓ అతీతశక్తిగా, అందరూ చూసి భయపడి బెదిరిపోయే రూపంగా సంభావించుకుంటాడు. ఆ మాయావి చుట్టూ మూడు వృత్తాలు గీసి, భయంతో భక్తితో కళ్ళు మూసుకోండని చెబుతున్నాడు. ఎందుకంటే, అతడు స్వర్గలోకపు అమృతాన్ని తాగిన వాడట.
Creative urgeకు సరిహద్దులను పునర్నిర్వచిస్తూ… మనిషి అంతశ్చేతన శక్తిని,అక్షరాల్లోకి అద్వితీయంగా తర్జుమా చేసినందుకో, జీవితానుభవాలతో కొత్త కాంతిని సంతరించుకునే ఆత్మిక సౌందర్యాన్ని స్వచ్ఛంగా నివేదించే ప్రయత్నం చేసినందుకో… మరెందుకో కానీ ఈ కవిత నన్ను వెంటాడుతూనే ఉంది. నిజంగానే, కవి చుట్టూ కాకపోయినా, ఈ కవిత చుట్టూ మూడు చుట్లు గీసి కళ్ళు మూసుకుంటా అప్పుడప్పుడూ భయం భయంగా ఇంకా ఏవో అర్థాలు తెలుస్తాయని.
కుబ్లాఖాన్ కవిత నాకు పరిచయం కావడానికి ముందు నేను రాసిన ‘నిదురపోని మెలకువ చెప్పిన కల’
https://anekavachanam.wordpress.com/2010/06/10/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B0%AA%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B0%95%E0%B1%81%E0%B0%B5-%E0%B0%9A%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A8/ కూడా ఇలా ఓ కొత్త స్వాప్నిక ప్రపంచాన్ని నాకు చూపించింది. ‘ఆంధ్రజ్యోతి వివిధ’లో ఈ కవిత అచ్చయినప్పుడు “మృత్యుశయ్య మీద ప్రత్యక్షమైన కవి పుంగవుడు” ఎవరో పోల్చి చెబుతూ, ఆ కవి రాసిన “నుంచుని చూసే కల”ను గుర్తు చేసి నా స్వప్నంలోకి తలుపులు తెరుచుకుని వచ్చి పలకరించాడు కవి మిత్రుడు Naresh Nunna.
“ఇంతకీ ఆ మూడు నౌకలు దేనికి సంకేతం” అని ప్రశ్నిస్తూ రంగుల అక్షరాలతో అందంగాా ఓ పోస్టుకార్డు రాశారు చెట్టు కవి ఇస్మాయిల్. నేను మాత్రం బదులివ్వలేదు.
పోర్లాక్ నుంచి వచ్చిన వాడెవడో తలుపు కొట్టి కోలరిడ్జ్‌ను డిస్ట్రబ్ చేసి మూడు వందల పంక్తుల కవితను 54 లైన్లకే పరిమితం చేసే పాపం మూటగట్టకున్నాడని చెప్పాను కదా. వాడిని తిట్టుకుంటూ, “An opium influenced dream ఎవరో తట్టి లేపితే చెదిరిపోతే ఎవడు రాయాలిరా అంతటితో ఆగిపోయిన కవిత్వాన్ని” అంటూ పదేళ్ల తరువాత 2013లో రాసిన కవిత “నేనొక కల.” https://anekavachanam.wordpress.com/2013/11/
నిద్రలోంచో నిర్నిద్రలోంచో… లోలోతుల నుంచి అసంకల్పితంగా బయటకు తన్నుకొచ్చిన మార్మిక సృజనకు ఎంత బలం ఉంటుందో చెప్పడానికే ప్రయత్నం. ఇలాంటి కవితలను చదవడమంటే, కవి వెళ్ళిపోయినా అతడి కవిత్వ హృదయంలో ఆత్మికంగా సంచరించడం. అతడి కవి సమయంలో పలవరించడం.
మన జీవితంలో దొరకని కొన్ని అమోఘమైన అనుభవాలలో మన ఆత్మల్ని తరింప చేసే అద్భుతమే కవిత్వం.
***
© PasunuruSreedharBabu