శీతవేళ.. తూనీగ శబ్దం.. వసంత వర్షం.. కొన్ని జపనీ హైకూలు..!

.
(మరొకసారి హైకూ ప్రపంచంలోకి వెళితే.. కొన్నింటిని మిత్రులతో పంచుకోవాలనిపించింది. ఇది జపనీ మహనీయుల హైకూలను తెలుగులో ఒకసారి గుర్తు చేసుకోవడమే కానీ.. సాధికారిక అనువాదమనే అహంకార ప్రకటన కాదు. అందుకే.. ఇది వినమ్ర నివేదన)

మత్సువో బషో (1644-1694)


పాత సరస్సు
నీళ్ళ శబ్దంలోకి
కప్ప దుమికింది
.
ప్రశాంత నిశ్శబ్దం
తూనీగ శబ్దం
బండరాయిలోకి చొచ్చుకుపోతోంది
.
కొంగ కాళ్ళు
చిన్నవైనాయి
వసంత వర్షంలో
.
శీతల ఉద్యానం
నూలుపోగులా సన్నబడ్డ చంద్రుడు
కీటకాల పాట
.
***

యోసా బుసాన్ (1716-1783).


శీతవేళ
గంట శబ్దం
గంటను వదిలి వెళ్తోంది
.
వేసవి నదిని
దాటుతున్నా
చెప్పుల్ని చేతబట్టుకుని
.
ఖాళీ అయిన పొలంలో
దిష్టిబొమ్మ కాళ్ళు
ఎంత పొడుగ్గా, ఎంత సన్నగా ఉన్నాయి?
.
***

కోబాయాషీ ఇస్సా (1763-1827).


కీచురాయి
దిష్టిబొమ్మ పొట్టలోంచి
అరుస్తోంది
.
ఇదంతా నీదే
సీతాకోకచిలుకా, ఓ పుట్టగొడుగు మీద
విశ్రాంతి తీసుకో!
.
సూర్యాస్తమయాన్ని
గుర్రం పిల్లతో పంచుకుంటూ…
ఓ నత్త
.
పిల్లి పిల్ల నర్తిస్తోంది
గిరగిరా తిరుగుతూ…
రాలుతున్న ఆకులు
.
గడ్డిలో దాగుడు మూతలు
ఆడుతూ..
కప్ప
.
***

మసావోకా షికి (1867-1902).


చెట్టు తెగిపడింది
నా చిన్ని కిటికీలో
తొందరగా సూర్యోదయం
.
నిశ్చలం…
కొలను నీటి మీద
మెరుస్తున్న మిణుగురులు
.
ఎలా పాడాలీ అని
కప్పల బడి, కోకిలల బడి
కలబడుకుంటున్నాయి
.

***

Advertisements