“ప్రకృతి పరిణామాన్ని దర్శించిన శ్రీధర్ బాబు” -సౌభాగ్య

కవిత్వమొక కాలాతీత కాంతిరేఖ. ఒక మెరుపు. ప్రణాళికాబద్ధమైన వాటికి అది లొంగదు. సిసిరో అన్నట్లు అది ప్రకృతి నుంచే సరాసరి కవులకు అందుతుంది. ఆ వెలుగులో కవి జ్వలిస్తాడు. రూపాంతరం చెందుతాడు. తక్షణ అనుభూతిని కవి వజ్రంలా మెరిపిస్తాడు. నక్షత్ర వర్షం కురిపిస్తాడు. ప్రతి కవికీ ఒక ఫిలాసఫీ ఉంటుంది. అది సామాజికం కాదు. వ్యక్తిగతమైంది. వ్యక్తినిష్ఠమైంది. పసునూరు శ్రీధర్ బాబు “నిన్ను నీవు వ్యక్తీకరించుకోవడంలోని అసంపూర్ణత్వంలో ఆనందముంది” అంటాడు. భావనలో, అనుభూతిలో ఉన్న అసంపూర్ణం కాదది. అనుభవం తాలూకు అసంపూర్ణమది. ‘కవిత్వం పుట్టుకకు స్థలకాలాలు ఉన్నప్పటికీ కవి నుంచి వేరుపడిన తరువాత అది Independent entity అవుతుంది. అని కవితకు ఒక స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తున్నాడు.

Image

ఒక పరిసరాన్ని పారవశ్యంగా సమీక్షిస్తాడు ‘నల్ల సముద్రంలో రాలిన తెల్లచంద్రుడు తీరం వేపు కొట్టుకొస్తున్నాడు/ సహారా ఎడారిని వెంటేసుకొచ్చిన వైణికుడు నక్షత్రాల్ని  రాల్చుతున్నాడు/ గాలి మౌనంగా ఉంది.. ఆకాశం ప్రేక్షకునిలా ఉంది’ అని తన మనసు పొరల్లోని జ్ఞాపక సుమం విచ్చుకోవడానికి ఒక వాతావరణాన్ని, అనుకూలాన్ని ఆయాచితంగా అందుకున్నాడు. అక్కడినించీ పరిసరాన్ని మరిపించే ఒక పరివేదన, ప్రశాంతంతో సమన్వయించిన ఒక కలత కలలా వస్తుంది.

‘నువ్వు గుర్తుకు వస్తావ్ నా జలసమాధిలో జీవానంతర పరీమళంలా/ నన్ను మరిచిపోతాను నక్షత్రాలన్నా రాలిన ఆకాశంలా” అంటూ చలిస్తాడు. సౌకుమార్యమన్నది స్వచ్ఛమైనది. గతాన్నీ భవిష్యత్తునూ అసరమైతే వెలిగిస్తుంది. వద్దనుకుంటే విదిలిస్తుంది. అక్షరాల గుండా ఒక సంగీతం ఆనందం దుఃఖపు జీర కలగలిసిపోతాయి.
ఏదో సందర్భంలో మనిషి తన అస్తిత్వాన్ని గురించి ఆలోచనలో పడతాడు. శరీరం మనసు సానుకూల పరిస్థితిలో స్వరపరిచిన సంగీతంలా సానుకూలంగా సాగుతాయి. ఒక గాయం, ఒక వేదన, అనుకోనివి జరగడం, జరిగినవి అనుకోకపోవడం వంటివి మానవ జీవితానికి అనివార్యం. అనివార్యం నించే కళ జన్మిస్తుంది. అప్పుడు కవి తన అస్తిత్వ రహస్య అన్వేషణలో మునుగుతాడు. మహా సుకుమారమైన అనుభూతులకు అక్షర రూపాన్నివ్వడం శ్రీధర్ బాబుకు తెలుసు. అనుభూతికి అలౌకిక స్పర్శనివ్వగలిగే అక్షరశక్తి అతన్ది. తన్మయత్వపు పల్చటి పొరలు విప్పుతూ ఆశ్చర్యపరుస్తాడు.
‘మెత్తని చీకట్లో పారదర్శక రాగాలనేకం/ ప్రపంచం మౌనంగా నిద్రిస్తున్నప్పుడు స్వరాలు పరాగమై హత్తుకున్న గమ్మత్తయిన అలికిడి… ఇలా నైరూపయ అనుభూతికి
విస్పష్టమైన రూపాల్ని ఇస్తూ సాగుతాడు.
వంకీలు తిరుగుతున్న హృద్యమైన వూపిరి/ పలకరించే జ్ఞాపకాలు పక్షుల్లా వచ్చి ఓ వరసలో కూర్చుంటాయ్.. అన్నీ తెల్లనివే’ అంటాడు.
అమూర్తాలకు మూర్తిమత్వాన్నివ్వడానికి విచిత్ర రస సంయోజన అవసరం. ఆ రసాయనం కవి దగ్గర మాత్రమే వుంటుంది. జీవితం దుఃఖమయం. ఎంతమంది తాత్వికులు ఎన్ని మార్గాలు చెప్పినా బతుకు మనిషిని గాయపరుస్తూ ఉల్లాసంగా సాగుతుంది. మనిషి పడే బాధని, మనసు పడే వేదనను శ్రీధర్ బాబు గాఢంగా ఆవిష్కరిస్తాడు.
ప్రకృతి పరిణామాన్ని నిశితంగా దర్శించినవాడు శ్రీధర్ బాబు. గాలి, మబ్బులు, ఆకాశం వింత వింత హొయలు చిమ్ముతూ అతని మనసు మీదుగా సాగుతాయి. స్పందనల్ని వాటికి అందించి పంపుతాడు.
కవుల వూహలకు అంతుండదు. అంతుంటే అతను కవి కాడు. అనుకరిస్తే కవి కాడు. వూహ స్వతంత్రమైనది. మౌలికమైనది ఐతేనే అతను నిజమైన కవి. శ్రీధర్ బాబు స్వతంత్ర భావుకుడు. మనిషి ఏకవచనం కాదు, అనేకవచనమంటాడు. ఎన్నో నేనులు కలిస్తే ఒక నేను అవుతాడు. ‘నేను నీలోంచీ… నీవు నాలోంచీ.. మనిద్దరమూ మరెవడిలోంచో… సామూహిక ఆత్మల సహస్ర విచ్ఛేదనలోంచి..’

ఈ జననం వెనక ఈ జన్మ వెనక వున్న అనంత ప్రవాహాన్నీ ప్రదర్శిస్తాడు. ఒక తన్మయత్వం, ఒక స్వప్నపు జీర శ్రీధర్ బాబు వూహల్ని అక్షరాలని తాకుతూ వుంటుంది. దేన్నయినా భావించేటప్పుడు ఒక పారవశ్యపు కెరటం దృశ్యాన్ని కమ్ముకుంటుంది.
తప్త స్వప్నమ్ అన్న కవితలో… ‘స్వప్న సరోవరంలో ఎవరదీ?/ పట్టుకుచ్చుల వింజామరల్ని భుజాన వేసుకుని నీళ్ళూపడానికి వస్తున్న మీనమా?’ అంటాడు. సమస్యని సాదాసీదాగా వర్ణించి ఫలానా పని చేస్తే పరిష్కారం దొరుకుతుంది అంటూ రాసేవన్నీ పేలవ నినాదాలుగా మారిన పాత కవిత్వ పరిచయం వున్న ఆధునిక కవులు కవిత్వ స్పృహతో వుంటారు. మౌనానికి కవిత్వానికి మధ్య వున్న తేడా వాళ్ళకు తెలుసు. కవిత్వమంటే ఏమిటో తెలిసినవాడు పసునూరు శ్రీధర్ బాబు.
ఒక అద్భుత ద్వీపం నుంచి వచ్చిన అపురూపమైన ఆనందం కవిత్వమవుతుంది. ‘మేడ మీద కుర్చీ.. కుర్చీ చుట్టూరా వెన్నెల.. వెన్నెలకు పూసిన రెండు చేతులు../ నను నిమిరిన బిడియపు స్పర్శలు వెంటేసుకుని ఈ దారినే వెళ్తూంటుందప్పుడప్పుడూ..” ఇలాంటి మధుర మనోహర వూహల్లో మన మనసు వుల్లాస తరంగితమవుతుంది.
ప్రకృతి పరివర్తనకి, రుతుధర్మానికి మానవ రాగద్వేషాలకు అజ్ఞాత అంతరంగిక సంబంధముందని కవి చెబుతాడు. అది సహజంగా చెప్పినట్లుంటుంది. పనిగట్టుకు పరిశోధించినట్లుండదు.
“వర్షాలకీ జ్ఞాపకాలకీ ఏదో గొప్ప సంబంధమే వుంది” అంటూ ఆలోచనలో పడతాడు. దేనికో ఒకదానికి లొంగిపోవడంలో జీవితం లేదు. ఆమోదించడం వేరు. ఆత్మ సమర్పణ వేరు. నిరంతర స్పృహతో జీవించడం వేరు. అసలు జీవితమంటే అదనీ ఇదనీ చాలా గొప్పదనీ దానికి ఎన్నో రంగులు పులిమి రచ్చకీడుస్తూ వుంటాం.
“నన్ను నేను పట్టుకోలేకపోయినప్పుడే నేను జీవిస్తుంటాను
అప్పుడు కొన్ని భవిష్యత్ జ్ఞాపకాలు పలకరిస్తాయి
ఈ జీవితం పెద్ద గొప్పదేం కాదు
దీన్ని మళ్ళీ అనుభవించాల్సిన పని లేదు”
ఈ మాటల్లో పసునూరు శ్రీధర్ బాబు మౌలిక తత్వం ఇమిడి వుంది. తన అదుపులో తను లేనప్పుడు, అదుపులో తను లేనన్న స్పృహ వున్నప్పుడు మనిషి సజీవంగా వుంటాడన్నది శ్రీధర్ బాబు నమ్మకం. అంతేకాదు, జీవితం మరీ గొప్పదేం కాదు. రెండోసారి జీవించడానికి కాదు అన్న నిర్ణయం అతన్ది.
విచిత్రమైన వూహల్లో స్వతంత్ర చింతనతో ఆకర్షించే ఈ కవి అందర్నీ ఆకర్షిస్తాడు.

***

(నాకిష్టమైన సుకుమార భావుకుడు సౌభాగ్య “ఈకాలం కవులు” శీర్ఖికన ఆంధ్రభూమి దినపత్రిక “సాహితి” అనుబంధంలో 8 మే, 2008న రాసిన వ్యాసం.)

Advertisements

ప్రేలాపన

ఏ గొల్లభామో దొంగిలించిన వెన్నముద్ద కోసం
మతిలేని గోపయ్య
పిల్లనగ్రోవిలో కన్నీళ్ళు వొలకబోసుకుంటాడు
రాధమ్మ వెనీలా ముద్దల్ని
చెక్క చెంచాతో చప్పరిస్తూ ఉంటుంది-
శంఖం పూరించిన గోవర్థనుడు
పెదాల ఒత్తిడిలోంచి మెడవంపుల వీచిన గాలి
…. నాదమో? అనునాదమో!?
.
ఇప్పుడు సత్యభామ కాలిబొటన వేలి గోరు చిట్లే ఉంటుంది
మంచం కోడుకు తగులుకుని!
రుక్మిణి చిటికెన వేలు ఒంటరై కంపిస్తూ ఉంటుంది
పదహారువేల జతల చురకత్తులు గుచ్చుకుని
జల్లెడైన నీలాకాశం కుండపోతగా వర్షిస్తుంది-
పక్కింటి పడగ్గది ప్రైవసీలో పొడిచిన సూర్యుడు
వేడివాన…. ఉక్కపోత!
రామ రామా… నాకు మరో జన్మ లేదురా తండ్రీ!
నా ఒంటరి రామచిలుక
ముక్కు గిల్లుకుంటూ కిలకిలమంటూ
ఏ కొమ్మ మీదో నిలవని కాళ్ళ దిటవుతో
తడబడుతూ ఉంటుంది….
జామ చెట్టు కళ్ళన్నీ కాయలు కాసినై-
***

వెంటాడే కాళ్ళు

.
మాటలన్నీ కుప్పబోసినట్లు
వెంటాడే ఒక నిశ్శబ్దరావం
భుక్తాయాసంతో తలచుట్టూ తిరిగే తుమ్మెద
నిస్వన పంజరంలో ఇరుక్కున సరస్సు
గాలుల్ని మోయలేక… ఎటూ కదలలేక…
..
.
.
పండుటాకులు ఒక్కొక్కటిగా రాలిపడుతుంటాయి
ఈదుతూ పోయే రాయంచపాదాలు
కళ్ళల్లో కుశల ప్రశ్నలు చిలకరిస్తూ
.
రాలిన రేకులన్నీ ఒక్కటిగా గాల్లోకెగసినప్పుడు
గులాబీయానంలో హేమంతం వెళ్ళిపోతుంది
ఆవిరై ఘనీభవించి
ఆకాశానికీ భూమికీ నడుమ పొరలు పొరలుగా
కొత్త కొత్త ఆకారాలుగా ఆత్మసృజన-
.
***
మేడ మీద కుర్చీ
కుర్చీ చుట్టూరా వెన్నెల
వెన్నెలకు పూసిన రెండు అరిచేతులు
నను నిమిరిన బిడియపు స్పర్శలు వెంటేసుకుని
ఈ దారినే వెళ్తూంటుందప్పుడప్పుడూ
ఘల్లు ఘల్లుమని
ఘుంఘురూల సవ్వడితో…
.
( …… ఒక భావనకు)

డజన్ హైకూలు

తల్లి ఒడిలో
ముద్దొచ్చే కవలపిల్లలు
ఒకరికొకరు అద్దం

.
***
గట్టు మీద కుర్రాడు
ఈత నేర్పుతా రారమ్మని
సైగ చేస్తో సరస్సు

.
***
కోనేట్లో దూకితే
జాబిల్లి
కావలించుకుంది

.

***
వంతెన మీద
ఆడపిల్ల
వాగులో కొట్టుకుపోతూ

.
***
తెలతెలవారిపోతోంది
చందమామ
చిన్నబుచ్చుకుంది

.
***
ఆరుబయట
కోయిల కూత
నేనేమో స్నానాల గదిలో

.
***
చిలక కొరికిన
జాంపండు
నాతో తీయగా మాట్లాడింది

.
***
పూల సజ్జతో
అమ్మాయి
వెనకాలే పూజారి

.
***
పొడవాటి జడతో
ఆమె వెళ్తోంది
చెవుల్లో మెత్తటి శబ్దం

.
***
డాల్ఫిన్ నోస్ మీద
ఒక పిట్ట
ఎర్రని మేఘాన్ని ఏదో అడిగింది

.
***
సరుగుడు చెట్ల మధ్య నుంచి
సముద్రం
మనల్ని ఎగిరెగిరి చూస్తోంది

.
***
చెదిరిన ముంగురుల్ని
తనే సవరించుకుంది
నాకెందుకో బాధ

.
***

తప్త స్వప్నమ్!

.
స్వప్న సరోవరంలో ఎవరదీ?
పట్టుకుచ్చుల వింజామరల్ని భుజానేసుకుని
నీళ్ళూపడానికి వస్తున్న మీనమా…
ఎవరికోసమనీ… ఎవరి కోసమనీ…?
నా చేతివేళ్ళకు దొరకని నేను
నిద్రిత గగనంలో విద్యుత్పుంజమాల-
వాగులై వంకలై వరదలై ఎచటికనీ?
చీకట్లోంచి ఎగురుతూ వచ్చి వీధి దీపావర్తనంలో
పగడం పారేసుకున్న మిణుగురు పురుగు మల్లే
వెలుగుధూపమై వెళుతున్నది నేనా!?
ఒకానొక పలిత గ్రహం వాలుమీద
జారుడుబండాట ఆడుకోవల్సిందే…
ముందే తెల్సినా నిచ్చెనలుండవని!
.
బాన కడుపుతో తిమింగలం
ఆబగా అత్యాశగా మొత్తం సరోవరాన్నే
దాహానికి బలిగైకొన్నాక
ఉక్కిరిబిక్కిరై పొట్టపగిలి
దూదిరేకుల్లా చెల్లాచెదురై
అనంతపురి నడిమేనిపై ఒక్కణ్ణే వరుణ జపం చేస్తూ…
నా మోచేతుల కింద ఎవరు వీళ్ళంతా?
పాలమూరు సూడాన్ బుగ్గల మీద
పెదాలు చాలక దేహం మొత్తంతో ముద్దెట్టుకున్నా
ఏమాత్రం అంటని మట్టి….
అద్భుత ప్రాచీన గ్రంథం తాలూకు శిథిల పత్రాలై
ముద్దుల కానుకగా వాటేసుకున్న ఇసుకవనం
ననుగన్న నల్లగొండ కుచాగ్రం కుచ్చుకుని చిట్లిన పెదవి నుండి
రాలిన ఎర్రని కన్నీళ్ళ కోసం
మడిలోని పగులు మధ్య ఎండిన గడ్డి పరక పట్టిన దోసిలి….
.
ఎవరదీ.. ఎవరదీ..?
స్వప్నశిఖల్ని ఎడారుల మండించి
వజ్రాల్ని పండించాలని చూస్తున్నది?
తనువున తగరపుటేరుల సలసల….
నన్ను నేనే వీడ్కోలు తీస్కున్న విస్తృత కారడవిలో
తిరిగి నిర్దయగా కరచాలించిన జీవస్పృహతో….
రేవెలుగు కౌగిట్లో!
.
***

దుస్సహం

.
trappedతెల్లారగానే సూర్యుడు అలల మీంచి దొర్లుకుంటూ వచ్చి ఒళ్ళో వాలతాడు
కౌగిలించుకో ఆ వెలుగు ముద్దను ముద్దు పెట్టుకో హనుమంతుని మూతల్లే కాలితే కాలుతుంది
పారదర్శక దేహంతో ప్రపంచంలోని ప్రతి ఆకారంలోంచీ చొచ్చుకుపో….
తరువాత భళ్ళున పగిలిపో గాజు బొమ్మలా
ఆ సీసం పెంకుల్లో కవిత్వపు చెమ్మ… కలిపి కుడితే ఒక ప్రవాహం
కవిత్వం భీకర ప్రవాహంలా గిరుల మీంచి దూకనక్కర్లేదు
నాలుగైదు చినుకులుగా మోహపు పెదాలను తడుపుకుంటూ పోనూ వచ్చు
ఈ కంప్యూటర్ యుగంలో ప్రోగ్రామ్ ను చెడగొట్టే వైరస్సే గొప్ప కవిత్వం-
సందేహాలుంటే ఎవరైనా ఫార్మాట్ చేసుకోవడం మంచిది బుర్రల్ని….
ఖాళీగా… ఖాళీగా… గదులన్నీ ఖాళీగా… దేంతోనే నిండిపోయినంత ఖాళీగా
డెస్ట్రాయర్….. మోస్ట్ వెల్ కమ్!
ఇవాళ్టి నా అవసరానికి నువ్వు…..
రావా…. రావా….. ఒక్కసారి వచ్చి గొర్రెల తోకల కింద నుంచి రాలుతున్న కవిత్వాలని
కాముకత్వాలని ధ్వంసం చేసేయ్ వా ప్లీజ్!
.
క్లోనింగ్ కావాలిట నా కవులకి ఒకటి కార్పొరేటైజ్ డ్ సివిలియన్ లా బతకడానికి
మరొకటి విధాతగా ప్రదాతగా తరం మీద కూర్చోవడానికి
ఒకడి గురించి ఇంకొకడెవడూ ఆలోచించడు
కవి కూడా… ఆ స్పృహ లేని కొన్ని మధుర క్షణాల్లో తప్పితే
చీకట్లో చంద్రుణ్ణి చుట్టుకుని శూన్యంలోకి దొర్లిపోవడం ఒక అనుభవం
వానలో మట్టి కింద మగ్గిపోవడం ఒక అనుభవం
చితి మీద పదే పదే స్వీయ దహన సంస్కారమాచరించడం ఒక అనుభవం
సిగ్గు లేకుండా… కాలుజారిన అనుభవాన్ని చెప్పుకోవడం ఒక అనుభవం
బతుక్కి స్వచ్ఛత లేదు
నిజాయితీగా మురికి అక్షరాలనే రాసుకుందాం
కనీసం అక్షరాలైనా బతుకుతాయ్….
రైమింగూ రైజింగూ గెయినింగూ వద్దురా కవీ
తోచిందేదో రాసెయ్…
నిన్న నీ పెళ్ళామో ప్రియురాలో
పొత్తి కడుపులో ఫెటీల్మని తన్నిన గాయాన్నైనా సరే!
.
***

అనిర్వచనం

.
(అనేకవచనం కవితా సంపుటికి స్వీయవచనం)
.

కవిత్వం నాకొక spiritual activity. ఏమవుతుందో తెలియదు. ఉన్నట్టుండి నన్ను నేను కోల్పోతాను. నన్ను నేను పొందుతుంటాను. ముందు నుంచి వెనక్కీ, వెనక నుంచి ముందుకీ జీవిస్తుంటాను. Time is a myth కదా! మేల్కొంటాను అనేకానేక నేనులుగా. దేహాన్నొక processor గా వదిలేసి, దాని చేతుల్లో పెన్నూ పేపరూ పెట్టి మేమంతా చుట్టూ చేరి ఖేదాన్నో మోదాన్నో celebrate చేసుకుంటాం. చీకటి చిక్కనై చిక్కనై చివరకు కాటుకై అంటుకునే వేళ, కాగితంపై తెల్లదనం వెక్కిరిస్తుంటుంది.
.
కవితను పూర్తి చెయ్యడం సాధ్యమయ్యే పని కాదని నా నమ్మకం. కవి కవితను ఎక్కడో ఓ చోట వదిలేస్తాడంతే! కవిత్వం లక్ష్యం దిశగా దూసుకుపోయే బాణం అంటే నాకు నవ్వొస్తుంది. కవిత్వం ఏక కాలంలో ఆకాశంలోకీ భూమిలోకీ శాఖోపశాఖలుగా విస్తరించే చెట్టు తన ప్రాణంగా అందించే ఫలం. అలాంటి ఫలాన్ని re-design / rewrite చేయడమంటే కవిత్వపు sanctityని అవమానించడమేనని భావిస్తాను. నిన్ను నీవు వ్యక్తీకరించుకోలేక పోవడంలోని అసంపూర్ణత్వంలో ఆనందం ఉంది. అది వైఫల్యానందం. ఇతరుల కవిత్వంలో నేనీ ఆనంద ఛాయల కోసం దేవులాడుకుంటాను. కవి వదిలేసిన వాక్యాలను తడుముకోగలిగితే అంతకన్నా ఇంకేం కావాలి? అందుకే, ఇదంతా purely sensitive business.
.
Internal sufficiency వల్లనే కవిత్వం బతుకుతుంది. కవిత్వం పుట్టుకకు నిర్ణీత స్థల కాలాలు ఉన్నప్పటికీ, కవి నుంచి వేరు పడిన తరువాత అది independent entity అవుతుంది. అందుకే, కవితలకు తారీఖుల తోకలు తగిలించడమొక వ్యర్థ ప్రయాస. ఇప్పుడీ ఇరవయ్యో శతాబ్దపు తుది ఘడియల్లో, technocracy కౌగిట్లో ఉన్న మనమంతా ఒక programmeని జీవిస్తున్నామని దిగులు నాకు. కవిత్వం- దాన్ని చెడగొట్టే వైరస్ కావాలన్నది నా కోరిక.
.
తిలక్ అన్నట్టు, “కవిత్వం అల్టిమేట్గా సబ్జెక్టివ్ కదా. నా కవిత్వంలో నేను దొరుకుతాను.” రెప్పలు మూసుకున్నప్పుడు నాకు తరచూ వాన వెలిసిన తరువాత ఒకట్రెండు చినుకుల్ని మోస్తున్న పచ్చని ఆకు కనిపిస్తుంటుంది. నిద్రలో, దారీ తెన్నూ లేని నిశీధిలో పరుగు తీస్తున్న నేనో మరొకడెవడో కనిపిస్తాడు. భౌతిక ప్రపంచంలోకి తేరుకున్నప్పుడు నా గది గోడ మీద Living is Easy అన్న ముచ్చటైన మూడు పదాలు కనిపిస్తాయి. “I know that I am just part of the wind and the rain and the earth. And these things make me happy” అని ఒరియా కవి జయంత మహాపాత్ర నాలోంచే చెప్పి ఉంటాడు.
.
ఇట్లా కవిత్వంలోకి విముక్తం కావడాన్ని మా బాపు నాకు పసితనంలోనే నేర్పించారు. అయిదారేళ్ళ నన్ను మా బాపు ఒళ్ళో కూర్చోబెట్టుకుని శ్రీశ్రీ మహాప్రస్థానాన్నీ, కరుణశ్రీ పద్యాల్నీ ధారగా వినిపించి నాకు జన్మనీ, జీవితాన్నీ ప్రసాదించారు. చిన్ననాటి వ్యామోహంలో నేను రాసుకున్న కవితల ( ! ) నోట్ బుక్కును కొట్టేసి అజాపజా లేకుండా పోయిన నా మూడో తరగతి సహచరుడిని నోరారా తిట్టుకోని రోజంటూ లేదు. బాపు కవిత్వమైన ఒళ్ళోకి తీసుకుంటే, నిరాడంబర ప్రేమతో అమ్మ నా గుండెకు కంపించడం నేర్పింది. కళ్ళలో క్షమను ధరించడం చూపించింది. అందుకే, దేన్నీ దాచుకోలేని ముఖంతో, అశక్తతతో, కవిత్వంతో……
.
– పసునూరు శ్రీధర్ బాబు
.
***