తెలంగాణ మహోదయం

చరిత్రలో కొన్ని క్షణాలు అద్భుతమైనవి. అవి అద్భుతమైనవని ముందే తెలియడం ఒక గొప్ప అదృష్టం. ఆ క్షణాల్ని అద్భుతంగా జీవించాలి. జీవిత పర్యంతం ఆస్వాదించేంత మహత్తరంగా జీవించాలి. ఉద్విగ్న క్షణాలు ఎప్పుడూ జ్వలిస్తూనే ఉంటాయి. ఆనందాన్ని కొత్తగా నిర్వచించే అనంతానంద క్షణాలను తెలిసి తెలిసీ చేజార్చుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది? ఆనందం విలువ తెలియని వాళ్ళకు, జ్ఞాపకాల పుస్తకం ముఖచిత్రంగా నిన్ను నీవే తడుముకోవడం ఎంత బాగుంటుంది?
సమయం: 2014 జూన్ 1, ఆదివారం. మామూలుకన్నా నెమ్మదిగా గడిచిపోతుందేమిటీ అన్న సందేహం పగలంతా! రాత్రి అవుతున్న కొద్దీ ఆకాశంలో చుక్కలు ఒక్కొక్కటే పొడుస్తున్నట్లు లోపల్లోపల ఎడతెగని జ్ఞాపకాల గాయాలు గానాలు రెక్క విప్పుతున్న చప్పుడు. సాయంత్రం ఏడు గంటలకు హైదరాబాద్ నగరంలోని సైనిక్ పురిలో చల్లని జల్లు కిటికీ రెక్కల పక్కన కురుస్తున్న చప్పుడు. ఆరు దశాబ్దాల ఉద్యమంలో ఆత్మత్యాగం చేసిన అమర వీరుల ఆనందబాష్పాలు కురుస్తున్న దిగులు లాంటి వెలుగులాంటి చప్పుడు. గుండెలో పొడుస్తున్న కొత్త పొద్దు లాంటి చప్పుడు. ఇంకొన్ని గంటల్లో ఒక కల నిజంగా మారుతున్న ఉద్విగ్న సందర్భం. ఒక మహోదయాన్ని స్వాగతిస్తున్న అర్థరాత్రికి ఇవతలి గట్టున సంధ్యారవం స్వరకల్పన చేసుకుంటున్న తరుణం.

వాన చినుకులు నేల మీద ఒదిగిపోయాయి. చెట్ల ఆకుల గలగలల్లోంచి లేత రంగు చీకటిలో తడిసిన గాలి మెత్తగా మీద వాలుతోంది. పక్షుల గుంపులోకి అల్లరిగా చొరబడినట్లు ఉత్సాహంగా గాలిలోకి దూసుకుపోయాను. టపటపా రెక్కలు కొట్టుకుంటున్న వివశత్వంలాంటి శబ్దంలోకి బైకు మీద పరుగుతీశాను.
ధగద్ధగాయమానంగా వెలుగుతున్న నగరం. గులాబీవనంలా పరిమళిస్తున్న నగరం. యుద్ధం గెలిచిన వీరుడి కళ్ళల్లా మిరమిట్లు గొలుపుతున్న నగరం. వీరుడ్ని అక్కున చేర్చుకున్న కన్నతల్లి కన్నీటిలో తడిసిన వేసవి నగరం. వేడుకలో మురిసిపోతున్న నగరం. మునుపెన్నడూ లేనంత ముచ్చటేస్తున్న నగరంలోకి ప్రయాణించాను.
తొలి మజిలీ.. మిత్రుడు రఘురాములు కుమారుడు అమన్ పెళ్ళి విందు జరిగిన ఉప్పల్ లో. అలాయ్ బలాయ్ గా మారిన విందులో అన్న సురేంద్రరాజు, ఏలె లక్ష్మణ్, దుర్గం రవిందర్, కాసుల ప్రతాపరెడ్డి, రాజా రమేశ్, మోహన్ రుషి, బ్రహ్మం, ప్రసాదమూర్తి, వికటకవి అవినాష్, చక్రి, కొండల్, గుర్రం సీతారాములు, ఇంకా ఎందరెందరో మిత్రులతో ఆత్మీయ ఆలింగనం.
అక్కడి నుంచి నేరుగా సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ కు ప్రయాణం. దారిలో దీపాల తోరణాలతో మెరిసిపోతున్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజి బిల్డింగును చూడడం ఒక కన్నీటి జ్ఞాపకాన్ని దాచుకున్న ఉద్విగ్న సందర్భం. ప్రెస్ క్లబ్ చేరుకునేప్పటికి అర్థరాత్రికి సరిగ్గా అయిదు నిమిషాలుంది. టిజెఎఫ్ మిత్రులు పెద్ద కేక్ తో సంబరాలు చేస్తున్నారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా… పోరు తెలంగాణమా.. అంటూ గద్దరన్న గొంతు స్పీకర్లలో మార్మోగుతోంది. అక్కడికి అడుగుపెట్టగానే మిత్రులు వాసన్, జనార్దన్ లు ఆత్మీయంగా హత్తుకున్నారు. మిత్రుడు క్రాంతి, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, టంకశాల అశోక్, 10టీవీ సిఇఓ అరుణ్ సాగర్, స్టూడియో ఎన్ డైరెక్టర్ శైలేశ్ రెడ్డి వంటి జర్నలిస్టులంతా తెలంగాణ హోరులో చిందేయడం ప్రెస్ క్లబ్ కొక చిరస్మరణీయ ఘట్టం.
అర్థరాత్రి పన్నెండు దాటింది. టపాసులు పేలాయి. ఆకాశం మెరిసింది. గాలి దద్దరిల్లింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆనందం అర్ణవమైంది. గంటలు నిమిషాలైపోయాయి. తెల్లవారుజామున 2 గంటలకు గన్ పార్క్ కు వెళ్ళాం. తొలి ముఖ్యమంత్రి నివాళిని అందుకునేందుకు పూలమాలలతో అలంకృతమవుతోంది అమరవీరుల స్మారక స్థూపం. పదిలంగా రెండు అరిచేతులతో తాకి.. చేతులెత్తి మొక్కాం తెలంగాణ త్యాగధనుల ప్రతీకకు. మొబైల్ ఫోన్లలో కెమేరాలు తెరిచి ఫోటోలు దిగాం.. ముఖ్యంగా తెలంగాణ రాజముద్ర రచించిన చిత్రకారుడు మా ఏలె లక్ష్మణన్నతో కలిసి.
మళ్ళీ ప్రెస్ క్లబ్ కు వచ్చాం. రాత్రి తెల్లవారేందుకు తొందరపడుతోంది. అల్లమన్న, కృష్ణమూర్తి, చల్లా శ్రీనివాస్, సుధీర్ తదితరులతో తెలంగాణ పోరు జ్ఞాపకాలను తరిచి చూసుకున్నాం. తరించిపోయాం. అయిదు గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరాం. వెలుగు వాకిళ్ళుగా స్వాగతం పలికిన నెక్లెస్ రోడ్ చౌరస్తా, సెక్రటేరియట్, టాంక్ బండ్ ల మీదుగా ప్రయాణం. సికింద్రాబాద్ ప్యాట్నీ చౌరస్తాలో చల్లాతో కలిసి ఓ మీఠా పాన్.
ఆకాశం ఊదారంగులోకి మారింది. కొత్త వెలుగు హాయిగా ఆవరిస్తోంది. మాతో పాటే మేల్కొన్న రాత్రి.. ఆరు దశాబ్దాల కలను నిజం చేసింది. మా తరానికి ఉద్యమ ఫలాన్ని కానుక చేసింది.
మా ఇంటి బాల్కనీలో శుభోదయం.
తెలంగాణ మహోదయం.

– పసునూరు శ్రీధర్ బాబు
సైనిక్ పురి,
హైదరాబాద్,
తెలంగాణ రాష్ట్రం
(ఉదయం 6.30 గం.లు, సోమవారం 2 జూన్, 2014)

Advertisements

సిగ్గుమాలిన అరాచకీయం

సిగ్గుమాలిన అరాచకీయం.
అనివార్యతల్ని అర్థం చేసుకోలేని మూర్ఖత్వం.
ప్రజల్ని నీచంగా అంచనా వేసి పబ్బం గడుపుకునే దౌర్భాగ్యం.
ధనమదాంధులకు గుడ్డిగా టికెట్లు కట్టబెట్టి చట్టసభల గేట్లు బార్లా తెరిచిన ప్రమాదకర సంస్కృతికి పర్యవసానం..
నిన్న పార్లమెంటులో జరిగిన దుర్మార్గం.
సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఏం కొంప మునిగిందని ఇంత యాగీ చేస్తున్నారు? తెలంగాణ విడిపోతే సీమాంధ్ర ప్రజలకు కాదు ఈ నాయకులకే బోలెడంత నష్టం. ఇన్నేళ్లూ సాగించిన దౌర్జన్యం, ఆధిపత్యాలతో పెరిగిన బలుపంతా కరిగి శల్యమైపోతామేమోనన్న భయం. అందుకే, వారు కనివిని ఎరుగని నిరాశా నిస్పృహలతో విలవిల్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలకు తమ నుంచి విముక్తి ఎంత అవసరమో చెప్పకనే చెబుతున్నారు.
అరవయ్యేళ్ళ స్వతంత్ర భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య 14 నుంచి 28కి పెరిగింది. ముందు ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఒకే భాష మాట్లాడే ప్రజలే రెండు మూడు కాదు అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలుగా ఏర్పడిపోవచ్చు. దాన్ని విడిపోవడంగా చూసే సంకుచితత్వం నుంచి బయటపడాలి. ఒక రాష్ట్రం భౌగోళికంగా రెండు పాలన వ్యవస్థలుగా మారడం కొంత కాలం తరువాత చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. అయినా, ఈ పరిణామం మీకు తెలియకుండా సంభవిస్తోందా? మీరు ఇంతకాలంగా కళ్ళకు గంతలు కట్టుకున్నారా?telangana_ap
పుష్కర కాలం కిందటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నియమించిన అధ్యయన బృందం తెలంగాణ, విదర్భ ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లను పరిశీలించి పార్టీకి నివేదిక అందించింది. ఆ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ పార్టీ తాను తెలంగాణ, విదర్భ రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమేనని 2001లోనే ప్రకటించింది. అప్పుడు అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ సీమాంధ్ర నాయకుడూ బయటకు రాలేదేం? రాష్ట్ర విభజనకు అంగీకరించిన కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేది లేదని ఏ ఒక్క సీమాంధ్ర నాయకుడూ పెదవి విప్పి నిందించలేదేం?
2004లో కాంగ్రెస్ నాయకత్వంలోని యు.పి.ఏ అధికారం చేపట్టింది. తొలి యు.పి.ఏ సంకీర్ణం తన కనీస ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేర్చినప్పుడు ఏ జగడపాటీ రగడ చేయలేదే? ఎప్పటికప్పుడు పబ్బం గడుపుకునే హరిబాబులెవ్వరూ నిరసన కీర్తనలు వినిపించలేదే? పదేళ్ళ కింద ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందామని పార్టీ అధ్యక్షురాలు చెబితే.. చరమాంకంలో సీమాంధ్ర నాయకులు వెర్రిబాగుల వేషాలు చూసి అక్కడి ప్రజలు కూడా హర్షిస్తారని అనుకోలేం. నీతీ రీతీ లేనిది ఇటలీ నుంచి ఇండియాను సొంతిల్లు చేసుకున్న సోనియా గాంధీకా లేక సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకా?
ఇక, ఘనత వహించిన చంద్రబాబునాయుడు గారు 2008 అక్టోబర్ 18న ప్రణబ్ కమిటీకి లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటుకు తాము అనుకూలమేనని ఆ లేఖలో వక్కాణించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో తెలంగాణ అంశాన్ని క్షుణ్ణంగా చర్చించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అఁగీకరించిందని తెలుపుతూ బాబుగారు రాసిన నాటి ఆ లేఖ అంతర్జాలంలో ఇప్పటికీ అనాయాసంగానే లభిస్తుంది. అదే బాబు 2009లో మొదటిసారి తెలంగాణ ప్రకటన వెలువడినప్పుడు ఏం చేశారు.. అర్థరాత్రి ప్రకటిస్తారా అని కుటిలసాకులు చెప్పుకొచ్చారు. “తెలంగాణ అంశాన్ని ఇంకెంత కాలం నాన్చుతారు? సత్వరమే పరిష్కరించండి” అంటూ 2012 సెప్టెంబరులో ఈ సీమాంధ్ర నాయుడుగారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు మరో లేఖ రాశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక మీద నిర్ణయం తీసుకోవడం కూడా మీకు చేతకాలేదా అని ప్రధానిని నిందించారు.
అంతా మీ కోరిక ప్రకారమే జరిగింది కదా బాబుగారూ.. మరెందుకు ఇప్పుడు గొడవ చేస్తున్నారు? తొందరగా తేల్చండని ఒత్తిడి చేసిన మీరే తీరా తెలంగాణ తీర్మానం జరిగిన తరువాత హడావిడిగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయమని నోరుపారేసుకుని అమాయక ప్రజలను రెచ్చగొడతారేమిటి? మీ పార్టీలోని సీమాంధ్ర నాయకులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే నైతిక శక్తి నిజంగానే ఉందనుకుంటున్నారా?
ఇక, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా 2012 డిసెంబర్ 28న కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు లేఖ రాస్తూ, “తెలంగాణ ప్రజల మనోభావాలను మా పార్టీ గౌరవిస్తుందని మరోసారి గుర్తు చేస్తున్నాం. అయితే, ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం” అని రాశారు. ఇప్పుడేమో సమైక్య నీతులు చెబుతున్నారు.
సిడబ్ల్యుసి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, పార్టీ అధిష్టానాన్ని గౌరవిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ చరిత్రాత్మక అంశాన్ని బంతులాట స్థాయికి దిగజార్చారు. తెలిసో తెలియకో సామాజిక తెలంగాణ అనే నినాదాన్ని వల్లించిన చిరంజీవి ప్రజారాజ్యం జెండాను క్యాబినెట్ బెర్తు మీద కర్చీఫ్ లా విసిరేసి క్లయిమాక్స్ లో యాంటీహీరో అవతారమెత్తారు. ఈ యూటీవాలా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయండని సీమాంధ్ర ప్రజల సాక్షిగా, సీమాంధ్ర మీడియా సాక్షిగా లిఖిత పూర్వకంగా సమ్మతి తెలిపిన వారు ఇప్పుడు నోటి మాటలతో యాగీ చేస్తున్నారు. తెలుగువారి పరువును ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారు. పార్లమెంటు భవనంలో తమ మూర్ఖత్వాన్ని, అసాంఘిక నైజాన్ని పెప్పర్ స్ప్రేలా ఎగజిమ్ముతున్నారు.
సీమాంధ్ర నాయకుల్లారా.. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా మనమంతా తెలుగువాళ్ళమే. తెలుగువాళ్ళంటే దేశమంతా అసహ్యించుకునేలా చేయకండి. సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేసే పరిష్కారం తెలంగాణ ప్రజలకు కూడా సమ్మతం కాదు. మీరంతా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని ప్రకటించారు కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారు కాబట్టి తెలంగాణ బిల్లును అడ్డుకునే నైతిక హక్కు మీకు లేదు. సీమాంధ్ర ప్రజలు కూడా మీ నుంచి ఈ చండాలాన్ని కోరుకోవడం లేదు. భగత్ సింగ్ పేరును భ్రష్టు పట్టించే దివాళాకోరు ఉపమానాలను తలకెత్తుకోవడానికి తలలో గుజ్జున్న వాడెవడూ ఇష్టపడడు. మీరు నిజంగా సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరగకూడదనుకుంటే, ఈ విభజన ద్వారా ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకుంటున్నట్లయితే బిల్లు మీద చర్చకు సిద్ధంకండి. తెలంగాణ ఏర్పాటు అనివార్యమైతే సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏయే అంశాలను ప్రస్తావించాలనే ఆలోచన కూడా చేయకపోవడమే ఇప్పటి మీ దివాళాకోరుతనానికి ప్రధాన కారణం.
మీరు నిజమైన సీమాంధ్ర ప్రజా ప్రతినిధులైతే ఇకనైనా.. అక్కడి సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించండి. హైదరాబాదులో వందలు వేల ఎకరాలను, కోట్లకు కోట్లు దండుకున్న గుప్పెడు మంది కోసం గాభరాపడిపోవడం మానండి. అలాంటి వారు ఏ రాష్ట్రంలోనైనా, ఏ యూటీలోనైనా దర్జాగా బతికేస్తూనే ఉంటారు. వారికోసం ఎలాంటి ఉద్యమాలు అక్కర్లేదు. నిజంగా సామాన్య సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలే మీకు ముఖ్యమైతే అవి ఎలా నెరవేరుతాయో చర్చించండి. అంతేకానీ, సమైక్య సింహాలమని మాస్కులు వేసుకుని రేపటి ఎన్నికల రణరంగంలోకి దిగితే సీమాంధ్ర ప్రజలే మిమ్మల్ని గ్రామసింహాలను తరిమినట్లు తరుముతారు. ప్రజాస్వామ్య దేశంలో చట్టసభలు ఉన్నవి సమస్యలను చర్చించుకోవడానికే. చారిత్రక సందర్భాల్లో సాలోచనగా దిశానిర్దేశం చేసుకోవడానికే. ఇప్పటికైనా, ఈ నిజాన్ని గ్రహించండి. లేదంటే, సీమాంధ్ర ప్రజ గుత్తేదార్లు, అక్రమవ్యాపారవేత్తలు, అసాంఘిక శక్తుల ప్రాతినిధ్యం నుంచి విముక్తమయ్యేందుకు కొత్త నాయకత్వాన్ని నిర్మించుకుంటుంది. ఈ నిర్మాణానికి తెలంగాణ కూడా మినహాయింపు కాదు.
ఏకగ్రీవంగా తెలంగాణ బిల్లును తిరస్కరిస్తున్నామంటూ రాష్ట్ర అసెంబ్లీలో మీరు చేసిన తీర్మానం సమైక్యాంధ్రప్రదేశ్ లో మీ దాష్టీకానికి తుది తార్కాణం. అక్కడితో మీ కథ ముగిసింది. తెలంగాణ కల నిజమవుతోంది. మీరు ఇప్పుడు సీమాంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అనే కొత్త అధ్యాయాన్ని రచించేందుకు ఉపక్రమించాలి. ఆ ప్రక్రియను పార్లమెంటులో చర్చ ద్వారా ప్రారంభించాలి. అది తప్ప మీకు ప్రత్యామ్నాయం లేదు. సభ ఇంకో వారం రోజులు కొనసాగుతుంది. ఈలోగా మీకు జ్ఞానోదయం కలుగుగాక!

***

సమైక్య వైఫల్యం

సీమాంధ్ర ఉద్యమానికి చోదకశక్తిగా పని చేస్తున్న భావోద్వేగాలలో సహేతుకత లేదన్నదే నా వాదన. అంతేకానీ, అందులోని ప్రజల భాగస్వామ్యాన్ని, నిజాయతీని శంకించడం లేదు. ఉద్యమం నిజమైనది కాబట్టి దాని లక్ష్యం ఉదాత్తమైనదని అనుకోవాల్సిన పని లేదు. పొరుగువాడికి ఇష్టం లేని సహజీవనాన్ని బలవంతపెట్టడం దాష్టీకం. ఇది వ్యక్తి స్థాయిలో అయితే జుత్తు పట్టుకుని నాతోనే ఉండన్నట్లుగా ఉంటుంది. సమాజంలో ఒక్కోసారి ఇలా ఉద్యమంలా గందరగోళపరుస్తుంది. ఇద్దరికీ పడనప్పుడు పంపకాల గురించి మాట్లాడాలి. నీ హక్కుల కోసం నువ్వు పోరాడు. మరొకరి మీద హక్కు కోసం పోరాడకు. అలాంటి పోరాటానికి చరిత్రలో ఉద్యమ గౌరవం లభించదు.

నిజానికి, సీమాంధ్ర ఉద్యమం సమైక్యతను ఇంతవరకూ నిర్వచించలేదు. హైదరాబాదు అభివృద్ధిలో తన భాగస్వామ్వాన్ని మాత్రమే క్లెయిమ్ చేస్తోంది. చర్చ అంతవరకు పరిమితమైతే సమస్య లేదు. పరిష్కరించుకోవచ్చు. సమైక్యమనే ఇల్లాజికల్ కంక్లూజన్ లో వారికే నచ్చని అంశమేదో వారిని ఆగ్రహానికి గురి చేస్తోంది. ఆ ఆగ్రహంతోనే వారు తెలంగాణ ప్రతీకలుగా కేసీఆర్, సోనియాల దిష్టి బొమ్మలను తగలబెడుతున్నారు. సమాధులు కడ్తున్నారు. పిండాలు పెడుతున్నారు. అంటే, ద్వేషాన్నే పెంచుతున్నారు. సమైక్య ఉద్యమం లక్ష్యం అదేనా? ఉద్యమ వ్యక్తీకరణలో అలాంటివి ఉండకుండా ఉఁటాయా అంటే మన సమాజంలో ఉంటూనే ఉన్నాయి.ఇక్కడి తెలంగాణ ఉద్యమంలో అలాంటివి లేవనేమీ గుడ్డిగా వాదించడం లేదు. ఉద్వమ స్వభావం ఏదైనా, స్వరూపాన్ని మాత్రం ఆ జాతి నాగరిక స్థాయి నిర్దేశిస్తుంది. ఆ కోణంలో మన తెలుగువాళ్ళమంతా ఒక్కటే.

కానీ, సీమాంధ్రులు నిజంగా చేస్తున్నది సమైక్య రాష్ట్ర ఉద్యమమే అయితే అది సఖ్యతను పెంచడానికి దోహదపడాలి. సఖ్యతను పెంచడానికి చేయాల్సిన ఉద్యమం ఉదాత్తమైనది. దాని స్వరూపం కూడా ఉదాత్తంగా ఉండాలి. వెళ్ళిపోతానన్నవాడు పెడసరంగా మాట్లాడినా కూడా కలసి ఉండాలని కోరుకునేవాడు అనునయిస్తూ మాట్లాడాలి. వెళ్ళిపోతానన్న వాడి గాయాన్ని పరామర్శించగలగాలి. అంత ఔన్నత్యం ఈ ఉద్యమానికి లేదు. అసలలాంటి అవకాశం ఉంటుందని కూడా సీమాంధ్ర గుర్తించలేదు. పుష్కరకాల మౌనం, 2009 డిసెంబర్ 9 నిర్ణయం తరువాత సామూహిక రాజీనామాల అఘాయిత్యాలే అందుకు నిదర్శనం. ఇప్పుటికీ, రాష్ట్ర విభజనకు మూల కారణాలను గుర్తించకుండా కేసీఆర్ సమైక్య ద్రోహి, సోనియా వంచకురాలు, రాహుల్ ను ప్రధాని చేయడానికే ఈ కుట్ర అంటూ తెలంగాణ కాజ్ ను మరింత చులకన చేస్తోంది సీమాంధ్ర ఉద్యమ నాయకత్వం. కాదూ కూడదంటే హైదరాబాద్ సంగతేమిటో తేల్చుకుందామని సవాళ్ళు విసురుతున్నారు. కొత్తగా వజ్రాల మూటల కథలు ప్రచారం చేస్తున్నారు. ఇట్లా సాగుతోంది సమైక్య సమరం.

ఒక్క తెలంగాణవాదినికూడా పునరాలోచనలో పడేయలేని సమైక్య ఉద్యమం నిష్ఫలమే కదా?
భౌగోళిక విభజనను అడ్డుకోవడం ద్వారా సీమాంధ్రులు సమైక్యతను ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ విషయాన్ని అందరూ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

***

August ’13

సమైక్య ఉద్యమం.. రెండు ప్రశ్నలు..

సమైక్యత అన్న పదం గొప్పగా ధ్వనిస్తుంది. ముఖ్యంగా, జాతి సమైక్యత గురించి జరిగే ఉద్యమాలు ఆదర్శప్రాయంగా కనిపిస్తాయి. కానీ, సమైక్యత కొనసాగడం కోసం కాపాడుకోవాల్సిన విలువలను విస్మరించడం సమైక్యస్పూర్తి అవుతుందా? అన్ని ప్రాంతాల ప్రజలు భాషా ప్రాతిపదికన ప్రేమగా కలసిమెలసి బతకాలని బలంగా ఆశించిన వాళ్ళు ఐక్యతకు బాసటగా నిలిచే ఒప్పందాలను నిర్లక్ష్యం చేయడం సమైక్య స్ఫూర్తి ఎట్లా అవుతుంది? సమైక్య స్ఫూర్తి అరవయ్యేళ్ళుగా గాయపడి.. చితికి ఛిద్రమైపోతుంటే పట్టని వాళ్ళు ఇప్పుడు సమైక్యరాగం వినిపించడం ప్రజాస్వామిక న్యాయమా? ఒక చారిత్రక అపరాధానికి దిద్దుబాటు కావాలి. దిద్దుబాటును అడ్డుకోవాలని ప్రయత్నించడం ఉద్యమం అవుతుందా? అది జులుం అవుతుంది. దాష్టీకం అవుతుంది. దాష్టీకానికి వ్యతిరేకంగా జరగాల్సిన ఉద్యమాలు.. దాష్టీకం కోసం జరగడం ఒక విచిత్రం.

రాయలాంధ్ర ఆలోచనాపరులు రెండే రెండు ప్రశ్నలకు ఇప్పుడు జవాబు చెప్పుకోవాలి. ఒకటి, సమైక్య ఉద్యమం ఏ ఫలం కోసం జరుగుతోంది? రెండు, ఆ ఫలితంతో సమైక్యత సాధ్యమవుతుందా లేక అది వైషమ్యాన్ని శాశ్వతం చేస్తుందా? తెలుగు ప్రజల పట్ల నిజమైన ప్రేమ ఉన్నవారు నిజాయతీగా ఈ ప్రశ్నలకు చెప్పే సమాధానాలు.. సమైక్య ఉద్యమాన్ని నిలువరించినా.. కొనసాగించినా స్వాగతిస్తాం.

తెలంగాణ రాష్ట్రం అనివార్యమే. ఎందుకంటే..?

రెండు వైపుల నుంచీ ఆలోచిస్తున్నా. ప్రాంతం కోసం కాదు పాలన కోసమే ఆలోచిస్తున్నా. అరవయ్యేళ్ళ స్వాతంత్ర్యంలో అర్థశతాబ్దానికి పైగా పాలితులుగానే ఉన్న ప్రాంతానికి స్వయంపాలన లభిస్తే తప్పేమిటని బాధపడ్తున్నా. కలిపిన ప్రాంతాన్ని ఎప్పట్లా ప్రత్యేకంగా ఉంచడానికి ఇన్నేళ్ళ భావోద్వేగాలు, ప్రాణాలు ఖర్చు కావడమేమిటని కుమిలిపోతున్నా. ఎవరి భావోద్వేగాల్నీ కించపరచడం లేదు. కించపరచబడిన భావోద్వేగాల గురించి మాత్రమే చెబ్తున్నా. ఏ ఉద్యమాన్నీ తప్పుపట్టడం లేదు. సామాన్యుడు ఎలుగెత్తి వినిపించే స్వరం మీద.. బిగించిన పిడికిలి మీద అపార గౌరవం నాకు. కానీ, ఒక ఉద్యమం చివరి దశకు చేరుకున్నాక.. జరిగే ప్రత్యుద్యమంలోని ఔచిత్యాన్ని అర్థం చేసుకోవడానికి సతమతమవుతున్నా. ఇన్నేళ్ళ ప్రత్యేక ఉద్యమాన్ని ఏ సమైక్య భావనతోనూ సర్ది చెప్పాల్సిన అవసరాన్ని అలక్ష్యం చేసిన సాటి తెలుగు సోదరుల ఆధిపత్యానికి బాధపడ్తున్నా. నష్టపోయానన్న వాడికి సహానుభూతిని కూడా ప్రకటించడానికి ఇష్టపడక వేయిన్నొక్క అబద్ధాలను అంటగట్టిన గొంతునొక్కే ప్రయత్నాల చూసి వూపిరాడక తల్లడిల్లా. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆరో వేలును పీకి పడేసి.. ఆ తరువాత పదేళ్ళకు మళ్ళీ ఉద్యమ సెగ రేగినప్పుడు నాటకీయంగా అతికించుకున్న వైనానికి దిగులుపడ్డా. ఆర సూత్రాల నుంచి ఆరువందల పది జీవో దాకా గొడవ రగులుతుంటే.. ఇప్పటికైనా సరిదిద్దుకుంటే ఇల్లు చక్కబడుతుందనుకున్న తెలుగు తేజం ఎన్టీరామారావును చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టేసిన ఆకతాయితనాన్ని నిలదీస్తున్నా. ఏవీ.. దిద్దుబాటు చర్యలేవీ? కనీసం.. 2009 ప్రకటనను రాజకీయ జులుంతో వెనక్కి నెట్టేసిన తరువాతైనా.. వచ్చి కూర్చుని ఉద్యమానికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారా ఎవరైనా? భాషైక్యతే మిగిలిన ప్రజల మధ్య భావైక్యతను సాధించేందుకు ప్రయత్నించారా ఎవరైనా? ఒప్పందాల ఉల్లంఘన జరుగుతుంటే.. నిఘా వేసిందా ఏ కేంద్ర ప్రభుత్వమైనా? విడిపోవడం సుతారామూ నచ్చని సమైక్య విశాల హృదయుల ఆలోచన హైదరాబాదును దాటి తెలంగాణ పల్లెల్లోకి ఒక్క అడుగైనా వేసిందా ఎప్పుడైనా? నేను ప్రజల్ని తప్పు పట్టడం లేదు. ప్రజా ఉద్యమాలను తప్పు పట్టడం లేదు. రాజకీయ పాక్షిక ధోరణుల ఫలితంగా ఈరోజున ఈ పరిస్థితి వచ్చిందని అర్థం చేసుకోమంటున్నాను. దీనికి తెలంగాణవారు కారణం కాదంటున్నాను. అర్థ శతాబ్దానికి పైగా ఈ రాష్ట్రాన్ని పాలించినా.. సమైక్య స్ఫూర్తిని పరిపూర్ణంగా నిర్లక్ష్యం చేసిన తెలంగాణేతర పాలకులదేనని అర్థం చేసుకోమంటున్నాను.

ఇప్పటికైనా.. ఏమైందని రెండు వైపుల నుంచి ఆలోచించాలి. ఒక రాష్ట్రం ఎప్పట్లా రెండు భౌగోళిక ప్రాంతాలుగా విడిపోతోంది. చరిత్రలో చర్నింగ్ మూమెంట్స్ ఏజాతికైనా కావాలి. అరవయ్యేళ్ళ స్దబ్దతలోంచి ఒక ఉలికిపాటు కావాలి. ఈ మలుపు రెండు ప్రాంతాలనూ కొత్త మలుపు తిప్పుతుందన్న నమ్మకం నాది. పాలనలో.. పాలకుల్లో సమూల మార్పునకు ఈ సంఘర్షణ పునాదవుతుందన్న బలమైన భావన నాది. మానసికంగా సఖ్యంగా ఉండడానికి మన మధ్య అడ్డుగోడలేమీ లేవు. ఇన్నేళ్ళ సహజీవనంలో…నగర జీవన సమాగమంలో – ఎందుకంటే.. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ సమైక్యవాద చర్చ హైదరాబాదు నగరం వద్దే మోహరిస్తుంది కాబట్టి – మనల్ని కలిపి ఉంచిన అనుబంధాల జాడలే ఈరోజు మిగలలేదా? మిగిలితే వాటిని కొనసాగించడం సాధ్యం కాదా? హైదరాబాదును ప్రేమించేవాళ్ళకు అది ఏ రాష్ట్రంలో ఉంటే ఏమిటి? ఇంపీయరిలిస్టిక్ గుత్తేదార్లకుండే సమస్యలతో సహజీవన సౌందర్యాన్ని ప్రేమించే సామాన్యులకు పనేమిటి?

మా ఇంట్ల మేముంటం.. మీ ఇంట్ల మీరుండ్రుండి

మా ఇంట్ల మేముంటం.. మీ ఇంట్ల మీరుండ్రుండంటె ఎందుకు కొట్లాడుతున్నరో అర్థమైతలేదు. మీకు ఇల్లు లేదా.. నీళ్ళు లేవా ఏం లేదని గిట్ల యాగి చేస్తున్నరు? మీ కొట్లాట చూస్తుంటె.. మీ కడుపుల గింత కసుందా అని భయమైతంది. హమ్మో.. గిసుమంటోళ్ళతోని కలిసుండుడెట్లా అని గిప్పటిదాంక భయం లేనోళ్ళకు కూడ దడ పుడ్తంది. ఇది కలిసుందామని చేసే వుద్యమం లెక్క లేదు.. ఎప్పటికీ మీరు మీరే.. మేం మేమే అని రాళ్ళిసిరేసి కొడ్తున్నట్లుంది. ఇన్నేళ్ళు ఇక్కడ సుఖంగ.. సంతోషంగా ఉండి.. ఇప్పుడేమో మాతో ఉంటందుకు భయమైతుందని అంటందుకు మీకు మనసెట్లొచ్చింది? మమ్మల్ని గిట్ల కూడ అవమానిస్తరా? మిమ్మల్నేమన్న అంటిమా.. పొమ్మంటిమా..? మా రాష్ట్రం మేం ఏలుకుంటమన్నం. అరవై ఏళ్ళ సంది చేస్తున్న పోరాటం ఇయ్యాళ ఫలిస్తె కళ్ళళ్ళ నిప్పులు పోసుకుంటరా? మేమూ తెలుగోళ్ళమే కద. మా మీద నిజంగా మీకు అభిమానముంటె.. సాటి తెలుగోళ్ళు ఏళ్ళ సంది చేస్తున్న పోరాటం ఫలించిందని మీరు కూడా సంబరపడాలె. మా పండగను మీరు కూడ చేసుకోవాలె. మీ ఇంటిని మీరు బాగ చేసుకోవాలె. మా ఇంటిని మమ్మల్ని బాగ చేసుకోనివ్వాలె. అది సమైక్యమంటే. దోస్తీ అంటే. ఒకరేమో వీసా అంటరు.. ఒకరేమో పాకిస్తానంటరు.. ఒకరేమో హైదరాబాదును మీకొద్దు మాకొద్దు ఢిల్లీవోళ్ళకిచ్చేద్దామంటరు… ఏంది ఇదంతా? కలిసిబతికే షెకలేనా? రాష్ట్రం విడిపోతే ఏమైతది? రోడ్లు మూసేస్తున్నరా? తలుపులు పెట్టేస్తున్నరా? మీరే గుండెల్లో మంట పెడ్తున్నరు. మాసిపోని మాటలంటున్నరు. ఏడ తప్పు దొరుకుతదా అని కోడిగుడ్డు మీద ఈకలెతుకుతున్నరు. వొద్దొద్దు.. సమైక్య ఉద్యమం పేరుతో అనైక్యత గోడలు కట్టొద్దు. మావోళ్ళే వందల మంది సచ్చిపోయిండ్రు. ఆ బాధే మమ్మల్ని ముద్ద మింగనిస్త లేదు. మళ్ళ మీ వోళ్ళను కూడా రెచ్చగొట్టి సచ్చిపోయేటట్లు చేయొద్దు. ఎక్కడి బిడ్డలైనా ఉసురు తీసుకుంటె మా కడుపు సెరువైపోతుంది. వొద్దొద్దు.. ఇయ్యన్ని వొద్దు. అరవయ్యేళ్ళు పోరాడినం. మీవోళ్ళ ఏలుబడిలనే బతికనం. ఇప్పట్నుంచైన మా గోసేదో మమ్మల్ని చూసుకోనియ్యుండ్రి. మా బాధేదో మమ్మల్ని పడనియ్యుండ్రి. మా ఇంట్ల మమ్మల్ని బతకనియ్యండ్రి. మీ ఇంట్ల మీరు సల్లంగ ఉండుండ్రి. మీ అందరికీ నిండు గుండెతో పెడ్తున్న దండం.

ఫలించిన అరవై ఏళ్ళ కల.. తెలంగాణ

అరవయ్యేళ్ళ కల ఫలించింది.
అలుపెరుగని నిరంతర ఉద్యమం విజయపతాకాన్ని ఎగురవేసింది.
ఉద్యమంతో ఆశయం సిద్ధిస్తుందన్న నమ్మకాన్ని ప్రజాస్వామ్యం పరిరక్షించింది.
తెలంగాణ ప్రజలకొక ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించడానికి రంగం సిద్ధమైంది.
నా తెలంగాణ… కోటి రతనాల వీణ అని పల్లవించిన దాశరథి కైత.. తెలంగాణ ఉనికి పోరాటాన్ని ఉత్సవ సౌరభంలో ముంచెత్తింది.

Jai Telangana
ఒప్పందాలను నమ్మి ఒప్పుకుంది చాలమ్మా.. ఎవరి ప్రాంతమును వారిని ఏలనియ్యి ఇందిరమ్మా అని కాళోజీ అప్పుడెప్పుడో నినదిస్తే.. ఇప్పుడు సోనియమ్మకు వినిపించింది.
పదరా పోదాం పదా.. తెలంగాణ సాధిద్దాం పదా.. అన్న ప్రజాకవి ఘోష వర్తమాన నినాదంగా మార్మోగుతుంటే…. దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం గమ్యాన్ని అధిగమించింది.
జైతెలంగాణ నినాదానికి పర్యాయపదమై బతికిన జయశంకర్ సారు ఆత్మసాక్షిగా.. యుపిఏ కూటమి ఏకగ్రీవ తీర్మానం చేసింది. సి.డబ్ల్యు.సి తెలంగాణను 29వ రాష్ట్రంగా ప్రకటించింది.
1956లో సమైక్య రాష్ట్రంలో అయిష్టంగానే భాగమైన తెలంగాణ.. దశాబ్దం తిరిగే సరికే.. మా రాష్ట్రాన్ని మేమే పాలించుకుంటామని గొంతెత్తింది. 1969లో తెలంగాణ హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష.. 2001లో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో బలంగా తెర ముందుకు వచ్చింది. నాటి నుంచి పుష్కర కాలంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో సాగుతున్న ఉద్యమం ఎన్నో ప్రతిబంధకాలను ఎదుర్కొని నిలిచింది.
విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, విద్యావేత్తలు,. విభిన్న రంగాల్లో జీవనపోరాటం చేస్తున్న వారంతా సంయుక్త కార్యాచరణ సంఘాలుగా ఏర్పడి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. సకల జనుల సమ్మెతో తెలంగాణ ఆకాంక్ష వినిపించారు. మానవహారంగా ఏర్పడి మౌనంగా తమ డిమాండ్ ను వినిపించారు. చలో అసెంబ్లీ అన్నారు. పోలీసుల దెబ్బలు కాచారు. బాష్పవాయువులను భరించారు. ఉస్మానియా,.. కాకతీయ.. తదితర విద్యాలయాల్లో ఎమర్జెన్సీని తలపించిన అణచివేతను సహించారు. సొంత ఇంట్లోనే పరాయీకరణకు గురయ్యారు. నిర్బంధాన్ని సహించారు. బాధను పంటి బిగువున భరించారు. సహనమే ఉద్యమ స్వభావమని చాటారు. నైరాశ్యానికి లోనైన వందలాది యువకులు ప్రాణత్యాగాలు చేశారు. ఆకాంక్షను అర్థం చేసుకోమని ఆక్రోశించారు.
ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం. హింసను ఆశ్రయించకుండా లక్ష్యం సాధించవచ్చని నిరూపించిన ఉద్యమం. రాజకీయ వ్యూహాలను ప్రజా చైతన్యం దిశగా నడిపించిన ఉద్యమం.
ఇది ఒకరిని ఓడించేందుకు నడిచిన పోరాటం కాదు. ఇది ఒకరిని పరాజితుల్ని చేసే విజయం కాదు. ఇది ప్రజల ఆకాంక్ష ఫలించిన సందర్భం. సాటి ప్రజల ఆకాంక్ష ఫలించినందుకు సమైక్యంగా ఆమోదించాల్సిన తరుణం. తెలుగువారి చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టం. ఇది తెలుగు ప్రజలందరి సమష్టి ప్రగతికి ప్రణాళికలు రచించాల్సిన తరుణం. కార్యాచరణకు సిద్ధం కావాల్సిన తరుణం. మన ముందున్నది మహత్తర లక్ష్యం. అరవయ్యేళ్ళ ప్రయాణం ముగియలేదు. ఇప్పుడే ఒక మలుపు తిరిగింది.