కబాలి… ఎలా ఉందంటే? (Kabali Review)

kab

కబాలి బోరింగా ఏమీ లేదు కానీ, prosaic గా ఉంది. Narration ప్రేక్షకుడిని absorb చేసుకుంటున్నట్లే ఉంటుంది. కానీ, ఉన్నట్టుండి మలేషిన్ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ మీంచి కథలోంచి బయటకు తోసేసినట్లు తోసేస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ మ్యాన్ లా గాల్లోకి దూకి మ్యాజిక్ కార్పెట్ తో అభిమాన ప్రేక్షకుల్ని మళ్ళీ తన వెంట తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాడు. కానీ, ఒక డిటాచ్ మెంట్ కొనసాగుతూనే ఉంటుంది. అది సినిమా కథతో మన జీవితాలకు ఉండే డిటాచ్మెంట్ కాదు. దాన్ని మనం ఎప్పుడో మరిచిపోయాం. నేను చెబుతున్నది సిల్వర్ స్క్రీన్ మీద అంతెత్తున కనిపించే పాత్రల మధ్య ఉండే ప్లాజిబిలిటీ (plausibility) గురించి, పాసిబిలిటీ కాదు. మళ్ళీ పాసిబిలిటీస్ గురించి మాట్లాడితే కమర్షియల్ సినిమా మనల్నే వెక్కిరిస్తుంది. Of course, పాసిబిలిటీ కూడా ఒక రిలేటివ్ టర్మే. సగటు బుర్రలకు ఈ మాయామేయ జగత్తులోని పాసిబిలిటీస్ గురించి తెలిసింది ఎంత? అయితే, తెలియని పాసిబిలిటీస్ కూడా తెలిసిన ఈక్వేషన్స్ బేస్డ్ గానే ఉండే అవకాశం ఉంది. అందుకే, కట్టు కథల్లో కూడా నమ్మదగిన కాకపోయినా, నమ్మబలికే ప్రయత్నమైనా ఉంటే ప్రేక్షకుడు ఒక ఉపరితల పార్శ్వంలోనైనా కనెక్ట్ అవుతాడు. కబాలిలో అలాంటి కనెక్టివిటీ చాలా చోట్ల మిస్సవడంతో సినిమా ఒక well crafted శకలాల కుప్పగా కనిపిస్తుంది.

నిజానికి, దర్శకుడు రంజిత్ ఈ సినిమా మేకింగ్ లో తాను ఎంచుకున్న జాన్రాకు కట్టుబడే ఉన్నాడు. గ్యాంగ్ స్టర్ మూవీ కాబట్టి సెట్లు, స్టెప్పులు, గ్రూపు డాన్సుల పాటల జోలికి వెళ్ళకపోవడం బాగుంది. సన్నివేశాల పరంపర కొనసాగుతుంటే, ఇంకా పాట రాదేం.. అని అలవాటైన ప్రాణం అప్పుడప్పుడూ కొట్టుకుంటుంది కూడా. కథ కొంతవరకు గ్రిప్పింగ్ గా ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ, purposeful గా అనిపించదు. అంటే, సీన్ల కోసం కథ తయారైంది. కానీ, కథ కోసం సీన్లు తయారవలేదు. నిజానికి, ఈ కథను ఫ్లాషెస్ ఫ్లాష్ బ్యాక్ లో కాకుండా.. లీనియర్ నెరేషన్ లో చెబితే.. నాయకుడు సినిమాకు దగ్గరగానైనా వచ్చేది. మల్టీ లేయర్డ్ స్క్రీన్ ప్లే.. మన సినిమాల్లో నాకు తెలిసినంతవరకు మణిరత్నం –సఖిలో బాగా వర్కవుటైంది. ఆ పంథాలో వచ్చిన చాలా సినిమాలు, ఫ్లాష్ బ్యాక్ ను ముక్కలు చేసి చెప్పడమనే జిమ్మిక్కులకే పరిమితమయ్యాయి. నిజానికి, దర్శకుడు కథను దాచిపెట్టి.. సస్పెన్స్ లేదా క్యూరియాసిటీని సృష్టించడం పెద్ద గొప్ప విషయం కాదు. ప్రేక్షకుల ముందు సంభవిస్తున్న సన్నివేశాలతోనే ఆ తరువాత కథ ఏ మలుపు తిరుగుతుందన్న ఉత్కంఠ క్రియేట్ చేయగలిగితే అది గొప్ప నెరేషన్. హత్యనూ, హంతకుడినీ ముందే చూపించి హంటింగ్ ను ఎంచాంటింగా చూపించడం.. బహుశా ఒక్క హిచ్ కాక్ కే తెలుసేమో. మన రామ్ గోపాల్ వర్మ కూడా తాను తీసిన ఏ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ల జోలికి వెళ్ళలేదు. అది ఆయన బిగ్గెస్ట్ స్ట్రెంత్. రాము చిత్రాల్లో కథా కాలం ముందుకే వెళుతుంది. సినిమా చరిత్రలో క్లాసిక్స్ అనదగిన చాలా చిత్రాలు అలాంటివే. ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే, రజనీకాంత్ “బాషా” సినిమా మనకో క్లాసిక్ అయి కూర్చోవడం. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర… ఇలాంటివన్నీ ఒక wild contrast తో హీరో గతాన్ని ఫ్లాష్ బ్యాక్ లో రివీల్ చేసే పంథాలోనే వచ్చాయి. దాంతో, కథ తన form ను తీసుకోవడమనే పద్ధతి మంటగలిసింది. కబాలిదీ అదే కథ. ఇందులో కబాలీని వలస కార్మికుల నాయకుడి నుంచి మాఫియా డాన్ గా ఎదిగిన క్రమాన్ని స్ట్రెయిట్ గా చెప్పుకుంటూ పోతే… ప్రేక్షకులు ఆయనతో కలిసి ప్రయాణించేవారు. ఎందుకంటే, పాయింట్ బాగుంది. మరో పాయింట్ ఏమిటంటే, రజనీ తెల్లగెడ్డంతో స్క్రీన్ మీద కొత్తగా, piercing looks తో కనిపిస్తాడు. యువ రజనీ కథ మొదటి పది నిమిషాల్లో ముగిసిపోయి.. డాన్ స్టోరీ చివరిదాకా కొనసాగి ఉంటే.. స్క్రీన్ ప్లే లో ఇమోషనల్ గ్రాఫ్ డయాగ్నల్ గా పైకి వెళ్ళేది. చివరలో.. The hero is shot dead. మాపియా కథ అంటే.. సత్య సినిమా వరకూ చూపించిన ఎండింగే ఉండాలనుకున్నాడు డైరెక్టర్ రంజిత్.

ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ, రజనీ స్టయిలిష్ పర్ఫామెన్స్ కచ్చితంగా మెస్మరైజ్ చేస్తుంది. రాధికా ఆప్టే ప్రజెన్స్.. సినిమా అంతటా ఒక వాతావరణంలా అల్లుకుపోయింది. విలన్స్  హత్యకు గురైన తరువాత గ్లాస్ విండో లోంచి రజనీని చూపించే షాట్… సీతారామరాజు నడి రోడ్డు మీద కారులో హత్యకు గురైన దృశ్యం.. సినిమాటోగ్రాఫర్ సిగ్నేచర్స్ లా మెరుస్తాయి. షారుఖ్ ఖాన్ డాన్ సినిమా లో మలేషియాను చూసిన తరువాత ఇంతకన్నా బాగా ఇంకెవరు చూపిస్తారు ఈ దేశాన్ని అనుకుంటే.. కబాలీ మురళి మరింత మురిపించాడు. ఈ సినిమాలో నాకు నచ్చిన మరో విషయం.. బ్యాగ్రౌండ్ స్కోర్. సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం రొటీన్ కు భిన్నంగా ఆడియన్స్ ఇమోషన్ లెవెల్స్ తో ఆడుకుంటుంది. నిజానికి, ఈ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక బలమైన పాత్ర. గాడ్ ఫాదర్, సిటీ ఆఫ్ గాడ్, సత్య, ఫర్హాన్ అఖ్తర్ డాన్ చిత్రాల ప్రభావాలతో డైరెక్టర్ రంజిత్.. రజనీకాంత్ వయసును కుడా జస్టిఫై చేసే హీరోయిజంతో గ్యాంగ్ స్టర్ స్టోరీ చెప్పారు. కానీ, మాఫియా ఇంట్రికసీస్ ను పెద్దగా పట్టించుకోలేదు. రజనీకాంత్ మాత్రం ఎంతకని కవర్ చేయగలడు? అన్నట్లు.. మరో డిసప్పాయింట్ మెంట్ ఏమిటంటే.. ఇంత పెద్ద గ్యాంగ్ స్టర్ కథలో ఒళ్ళు గగుర్పొడిచే ఓ చేజింగ్ సీనైనా లేకపోవడం.

Still, నాకెందుకో ఈ సినిమా బాగా లేదని చెప్పాలనిపించడం లేదు. నిప్పురా అంటూ… దడ దడ లాడించిన ఈ సిన్మాలో కొన్ని మెరుపులున్నాయి. కొన్ని గ్రాండియర్ టేకింగ్స్ ఉన్నాయి. ఉలిక్కి పడేలా చేసే.. యాక్షన్ సీన్స్ ఉన్నాయి. కిల్లర్ డాన్ వల వల ఏడ్చే vulnerabilities ఉన్నాయి, తల్లీ చెల్లి సెంటిమెంట్ల రొటీన్ ఇమోషన్స్ కాకుండా.. భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చూపించడం ఉంది. బిడ్డను కలిసినప్పటికన్నా భార్యను కలిసినప్పటి ఇమోషన్ ను డైరెక్టర్ ఎలివేట్ చేయడం ఈ తరానికి బాగా అవసరమని అనిపించింది. మరీ ముఖ్యంగా, ఒక సబాల్ట్రన్ కసిని (కమర్షియల్ ప్లేన్ లోనే అయినప్పటికీ) మాస్ హీరోయిజంగా మలిచే ప్రయత్నం నాకు నచ్చింది. ఈ  మెరుపులన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నాననంటే… సినిమాను ప్రేక్షకులు – చాలా మంది so called critics అనుకుంటున్నట్లు – కథ కోసం మాత్రమే చూడరని చెప్పడం కోసం. కథ sub-text గా మారి.. visual nuances ప్రధాన కథగా మారి చరిత్ర సృష్టించిన సినిమాలూ ఎన్నో ఉన్నాయి. (ఈ చివరి వాక్యానికి కబాలికి ఏ సంబంధమూ లేదు).

– పసునూరు శ్రీధర్ బాబు

 

 

Advertisements

నీ ప్రేయసికి కూడా నువ్వక్కర్లేదు!

నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే
గాలి నీ పెదాల మీద వాలి గారాలు పోతుంది
తరతరాలుగా దాచుకున్న స్వరాల సోయగాల సిగ్గు ముడి విప్పుతుంది

నువ్వొంటరిగా ఉన్నప్పుడే మేఘాల గూఢ లిపి నీకర్థమవుతుంది
సాంద్ర జ్ఞాపకాల రూపకాలంకారాల వ్యాకరణం
సులువుగా తెలిసిపోతుంది

You Lefft Me Alone by Rokkur Rokkur (Argentina)

నువ్వొక్కడిగా విశాల మైదానంలోకి వచ్చినప్పుడు
మొత్తంగా ఆకాశం నీ నుదుటిపై వాలుతుంది
చిగురు తొడుగుతున్న విత్తనంలాంటి నీ గుండెను
భూమి మెత్తగా నిమురుతుంది-

నువ్వొంటరిగా ఉన్నప్పుడే…
పచ్చని చెట్లు.. రంగు రంగుల పువ్వులు
నీతో మనసు విప్పి మాట్లాడుతాయి

సూర్యోదయాలూ సూర్యాస్తమయాలూ
నీలోంచి ప్రయాణించేదీ
నువ్వొంటరిగా ఉన్నప్పుడే-

రహస్యాల రాత్రి నీ ముందు మోకరిల్లి
కాంతులీనే నక్షత్రాలతో మహాద్భుత సంగీత రూపకానికి తెరతీసేదీ
నువ్వొంటరిగా ఉన్నప్పుడే-

ఒంటరిగా ఉన్నప్పుడే.. నీలోని ప్రపంచంలో నువ్వుంటావ్-
నలుగురిలో ఉన్నప్పుడు నీతో వాటికేం పని?
నలుగురిలో ఉన్నప్పుడు
కనీసం నీ ప్రేయసికి కూడా నువ్వక్కర్లేదు!
***
(సా. 6.50 గం.లు, 30 జూన్, 2014)

అగరుపొగల వెచ్చలి

(నా కవిత్వంపై స్వాతి కుమారిగారి “నిభాయించుకోలేని వివశత్వం” సారంగలో..)

 Posted on by

గుండెపొదిలోని శీతాంశుశరాలని చూసి జ్ఞాపకాల పక్షులు బెదురుతూ వచ్చి ఓ వరసలో కూర్చున్నప్పుడు-  చీలిన చంద్రబింబాల్లాంటి తన అక్షరాల అరచేతుల్లోని మబ్బు పింజలతో వాటికి నుదురు తుడుస్తాడు కవి.

అన్నిటికన్నా భాషే ఎక్కువగా బాధించిందని అశ్రురహిత దుఃఖంతో లోలోకాలుగా ఊగిపోతుంటాడు. “నీతో ప్రత్యేకంగా మాట్లాడటం నీకే కాదు నాకు కూడా శిక్షే, ఐనా నాలో ఎవరు ఆమెకు దాసోహమయ్యారో తేల్చుకోవాలి,గులాబియానంలో వెళ్ళిపోతున్న హేమంతానికి పుప్పొడి దప్పిక తీర్చిమరీ పంపాలి” అంటూ కొలనుకీ, ఏరుకీ నచ్చజెప్పి, జలజలా అవి దారికడ్డు తప్పుకున్నాక “రెప్పలకింద దాచుకున్న రెండు పావురాల్నుండీ ఇక రహదారులేవీ తప్పించుకోలేవు, అందుకేగా ఒక్క కళ్ల కోసం ఈ సమస్త దేహాన్నీ మోస్తూ తిరుగుతున్నది.”అనుకుంటూ వివశత్వాన్ని నిభాయించుకుంటాడు.

 

పసునూరు  శ్రీధర్ గారిలోని కవి “కొలనులోకి చేతులు జొనపకు పొద్దున్నే/అద్దం ముక్కలు గుచ్చుకుంటాయి”అని ఎవరో చెప్పగా విని మరో దారి లేక తన చుట్టూరా గాలిని వృత్తంగా తెగ్గోసి ఇక స్పృశించడానికేం లేదు అంతా స్పర్శాలోలత్వమే అనే నమ్మకం కుదిరాక, గిరులమీంచి దూకే భీకర ప్రవాహంలా కాక మోహపు పెదాల్ని తడిపే నాలుగైదు వానచినుకులుగా కవిత్వాన్ని చిలకరిస్తారు. ఆ వానలో కురిసిన అనేకవచనాల్లోని ఒక కవిత్వపు చినుకుని ఇక్కడ కొనగోటితో మీటుకుందాం!

 

మాయాదర్పణం

కన్రెమ్మల మీద వాలి

వడ్రంగిపిట్ట కోనేట్లో నీటిని చిలకరిస్తూ ఉంటుంది

ద్రవ వృత్తాలు ఒక కేంద్రం నుండి

వీడ్కోలు తీసుకున్నట్టుగా మభ్యపెడతాయి-

చీకటి కొమ్మకు వేలాడిన

దేహపంజరంలోకి

పొగవెన్నెలలా చొరబడిన పక్షి

తెరుచుకునే ఉన్న గవాక్షాల వంక కన్నెత్తైనా చూడదు!

వాక్య సర్ప పరిష్వంగంలో

చేతులు రెండూ వెనక్కి చుట్టుకుపోతాయి

రాత్రిని రెండు ముక్కలు చేసిన

దుప్పటి కిందే విశ్వమంత రాత్రి-

బయట చిన్ని శకలమొక్కటే

కాలిన కాగితంలా మబ్బుల మీంచి

దొర్లుతూ పోతుందనుకుంటా!

రావిచెట్టు గాలొక్కతే తురాయి శిరస్సును

జోకొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది-

ఒక తులాదండ భారంతో

భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటుంది

మాయాదర్పణమై కోనేరు

మాంత్రికుడినే పాత్రను చేస్తుంది!

వెలుగురేకలు వెదజల్లబడిందాకా

స్వీయబంధనంలో పక్షి

తలమునకలవుతూనే ఉంటుంది-

***

 

వర్షధారకీ కోనేటి అలకీ మధ్య చినుకుల కప్పగంతులు, పిట్ట ముక్కుకీ చెట్టు బెరడుకీ మధ్య పుట్టే టకటక శబ్దం, గులకరాయి కదలికకీ నీటి నిద్రకీ మధ్య కలల్లాగా వలయాలు- మాయేనా?

దృశ్యాలపై మెత్తగా మూత పెట్టే పూరెమ్మల్లాంటి కనురెప్పలూ, చిప్పిల్లిన తుంపరని పైన చల్లుకునీ తడవని తామరాకులు, ఆకుకదలికల సడిలో రాలిపడే పక్షి ఈకలూ- దర్పణాలా?

ఆలోచనలు ఒక మూలం దగ్గర మొదలై వేటికవి సుడులుగా తిరిగి, కన్నీళ్ళూ వేదనా ఒక ఘటనలోంచి ఊరి బయటపడక లోలోపల ఆర్తితో లుంగలు చుట్టుకుంటూ “ద్రవ వృత్తాలు ఒక కేంద్రం నుండి వీడ్కోలు తీసుకున్నట్టుగా మభ్యపెడతాయి.” లాంతరు చిమ్నీ లోపలివైపు మంచు ఆవిరి తుడిచి ఒత్తి అంటించిన కాసేపటికి మెల్లగా వెలుతురూ, సెగ పరచుకునే వ్యవధిలో చల్లటి స్తబ్ధత కరిగిపోయి, చేతన మిణుకుమనే రెక్కలను పంజరపు గదినిండా చాపుకుని వ్యాపించి “తెరుచుకునే ఉన్న గవాక్షాల వంక కన్నెత్తైనా చూడదు”.

sridhar

పెగలని పదాలు లోలోపల ఒకదానికొకటి అల్లుకుని చిక్కుపడిపోగా, తెమిలిన వాక్యాలు, అనేసిన మాటలు, చెప్పేసిన పంక్తులు బయటికొచ్చెయ్యడం వల్ల పరిపూర్ణమయిన బలంతో వక్తను పెడరెక్కలు విరిచి కట్టి పెనవేస్తాయి.  చేతుల ప్రమేయం లేక, చేతలుడిగి  మాట్లాడ్దం తప్ప మరేం చెయ్యలేని నిస్సహాయత ఆ బంధనం పొడుగునా పామై జలదరింపజేస్తుంది. ఆ స్థితినే కాబోలు “వాక్య సర్ప పరిష్వంగం” గా భావించి అప్రమత్తుడవుతాడు కవి.

రాత్రివేళ లోకంలోని చీకటంతా దుప్పటి కిందా, కళ్ల వెనకా చిక్కనై మిగిలిపోయిన ఏ కాస్త ముక్కో పల్చగా గది బయటి వెన్నెలకింద గాఢత కోల్పోయి లేతరంగుగా “కాలిన కాగితంలా మబ్బుల మీంచి” తేలుతూ ఉన్న సమయం. ఊరంతా సద్దుమణిగి జోగుతున్నప్పుడు కాపలాగా ఒక్క రావిచెట్టు ఆకుచప్పుళ్ల అడుగులతో పహారా కాస్తూ  నిద్రపట్టని ఏ ఒంటరి పిట్ట తలనో గాలి వేళ్లతో మెత్తగా నిమురుతుంది.

త్రాసులో పైకి లేచిన వైపుని విశ్వాన్ని ఆవరించుకున్న శూన్యానికి వదిలేసి, బరువెక్కిన వైపు మాత్రం తనవంతుగా తీసుకున్న భూమి కుంగిపోకుండా తులాదండ న్యాయం కోసం తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ అద్దంలా ప్రతిబింబాల్ని చూపే కోనేటికి నీడల్ని మోసి విసుగొచ్చిందేమో!  ఒక మాయగా, అనూహ్యంగా తానొక నీటిబొట్టుగా మారిపోయి ఒడ్డుపై నడుస్తున్న మనిషి కంటిపాపల్లో దాక్కుంటుంది. అలాంటప్పుడు “మాయాదర్పణమై కోనేరు మాంత్రికుడినే పాత్రను చేస్తుంది!” అని ఊహించడం ఒట్టి ప్రేలాపన కాదు.

“చీకటి కొమ్మకు వేలాడిన దేహపంజరంలోకి పొగవెన్నెలలా చొరబడిన పక్షి” తిరిగి తెల్లవారు ఝామున వెలుతురు కిరణాలుగా, రెమ్మలుగా, గింజలుగా అన్ని దిక్కుల నుండీ వెదజల్లబడటం చూసి తన రెక్కల దుప్పటిలో చుట్టేసుకున్న దేహాన్ని బంధవిముక్తం చేసి బయటికి ఎగరవేస్తుంది.

(సారంగ ఆగస్టు 2013 లో ప్రచురితం)

నువ్వొంటరివే!

ఒక ఆశ్చర్యాన్ని  వేటాడుతున్నప్పుడు

ఒళ్ళు మరిచిన పరవశంలో

నువ్వు ఒంటరివే-

ఒక ఆనందాన్ని సముద్రంలా కప్పుకున్నప్పుడు

అలల వలల్లో తుళ్ళిపడే

ఒంటరి చేపవు నువ్వే-

aelay pic

ఒక పాట వెంట కాందిశీకుడిలా పరుగు తీసినప్పుడు

నిశ్శబ్ద అగాధంలోకి జారిపడ్డ

ఒంటరి అక్షరానివి నువ్వే-

 

చీకటిని తెరిచినప్పుడు

వెలుతురును మూసినప్పుడు

కాంతిరేఖల రహస్యం తెలుసుకుని మాడి మసైపోయిన

ఒంటరి మిణుగురు నువ్వే-

 

ఎవరినో కోరుకున్నప్పుడు

ఎవరూ కోరుకోనప్పుడు

నీ పగిలిన గాజుకన్నుకు గుచ్చుకుని వేలాడే

ఒంటరి కల… నువ్వే!

 

ఒక భయానికి ముక్కలుగా తెగిపోతున్నప్పుడు

వికల శకల సకలమైన ఒంటరివే నువ్వు!

 

ఒక విజయానికి రెక్కలతో ఎగిరిపోతున్నప్పుడు

శూన్యంలో పక్షిలానూ

నువ్వొక్కడివే-

 

ఒక దిగులు… నల్లని మల్లెల తీగలా పెనవేసుకున్నప్పుడు

నెత్తుటిని బిగపట్టిన గాయాల చెట్టులా

నువ్వొంటరివే…

 

ఒక స్వప్నం ఇసక తుపానులా

నిన్ను చీకట్లోకి విసిరిపారేసినప్పుడు

వెన్నెల ఒయాసిస్సు కోసం అర్రులు చాస్తూ

ఒక్కడివే… ఒంటరివే!

 

పుటకలోంచి బతుకులోకి

బతుకులోంచి చితిలోకి

చితిలోంచి చింతనలోకి

దేహంలానో

ధూపంలానో

ధూళిగానో

వెళ్తున్నప్పుడు

వెళ్ళి వస్తున్నప్పుడు

వస్తూ పోతున్నప్పుడు

ఒంటరివే…

నువ్వొంటరివే-

***

చిత్రం: లక్ష్మణ్ ఏలె

(సాయంత్రం 5.30 గం.లు, 30 జూన్, 2014)

సారంగ (వెబ్) సాహిత్య వారపత్రిక 17 జూలై, 2014లో ప్రచురితం

అప్రయాణం

రోడ్డు మీదకు వెళ్ళి కాసేపలా కదలకుండా నిల్చుంటే
ఒకడు నా మీదకు నిచ్చెనేసుకుని ఎక్కి కొత్త సినిమా పోస్టర్ అంటించి వెళ్ళిపోతాడు
జీరో సైజు హీరోయిను కరెంటు నరాల మీద వాలి ముక్కుతో గిల్లుతుంటే
పోస్టరుకు పూసిన జిగురు వాసనకు గిలిగింతల్ని వాంతి చేసుకుంటాను-
మరొకడు వినైల్ హోర్డింగ్ మీంచి జారి నా భుజాలపై కూర్చుని నన్నో గాడ్జెట్ ను చేసి
లేటెస్ట్ వెర్షన్ సాఫ్ట్ వేర్ ను నాలోకి డౌన్ లోడ్ చేస్తాడు-
నేను డిజైనర్ వెబ్ లో ఎలక్ట్రానిక్ కీటకాన్నై కొట్టుమిట్టాడుతూ డిశ్చార్జ్ అయిపోతాను-


ఇంకా కాసేపలా కదలకుండా నిల్చుంటే..
రద్దీ రోడ్డు నాలోకి మళ్ళుతుంది
నేనొక సొరంగంలా ఉండచుట్టుకుపోతాను తుదీ మొదలూ లేని సున్నాలా-

అలా రోడ్డు మీద కదలలేక నిల్చున్న కొద్దీ
నేను క్రమక్రమంగా రాయిలా మారుతుంటాను
శిల్పి నన్ను లోలోపల చెక్కుతూనే ఉంటాడు
ఏళ్ళకేళ్ళుగా లోపలికి కురుస్తున్న కన్నీటి వర్షానికి గుంతలు పడిన గుండె
మూడో ప్రపంచం గాయంలా ఒక రూపం తీసుకుంటూ ఉంటుంది-

శిలలానో శిల్పంలానో చౌరస్తాలో నిల్చున్నప్పుడు
తలమాసిన బిచ్చగత్తె
ఆమె చంకన మురికి బిడ్డ
జాతీయజెండాలు అమ్మే యువతీయువకులు
చిట్టి చిట్టి భూగోళాల్ని రంగు రంగుల బొమ్మల్ని కొనమని వెంటపడే
పోస్ట్ మాడరన్ సేల్స్ బాయ్స్ అండ్ గాళ్స్
అదంతా ఒక రెడ్ సిగ్నల్ బీభత్సం-
నేనొక విండో సన్ షేడ్ ను మాత్రం కొనుక్కుని కళ్ళకడ్డంగా తగిలించుకుని
గ్రీన్ సిగ్నల్ వేసుకుంటాను-
ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు పరుగులు తీస్తున్నారు
మోటారువాహనాల కు మొలిచిన ఇనుప దేహాల్లా
రోడ్డంతా హ్యూమన్ పొల్యూషన్-

సిగ్నల్ పడినా కదలని బండరాయిలా రోడ్డు మీద అలాగే పడి ఉన్నప్పుడు
ఈ వేగవంతమైన ప్రపంచం నన్ను కనీసం తొక్కుకుంటూ కూడా వెళ్ళదు
పక్కకు తప్పుకుని పరుగు తీస్తుంది నా ఉనికితో పని లేకుండా-
పరుగులు తీసే ప్రపంచంలో ఆగి చూడడం ఒక జబ్బు…
ఆగి చూస్తే.. సాగే కన్నీటిస్రావాన్ని ఆపేందుకు అయోడిన్ టింక్చర్ తో కట్టు కట్టే కాలం కాదిది
నాడి పట్టుకుని ఒడుపుగా వివరం చెప్పే డాక్టర్లు ఇప్పుడు ఎక్కడున్నారు?
ఇప్పుడు బతకాలంటే… ఎన్నెన్నో టెస్టులు పాసవ్వాలి
బీమాపత్రం సమర్పించాలి-
అప్పుడు ప్రేమించే భార్య ఏ లిమిటెడ్ కంపెనీలోనో లీవు చిక్కక చిక్కుకుపోయి ఉండవచ్చు
కన్నబిడ్డలు పరీక్ష హాలులో ఆన్సరు పేపర్లయి పెన్ను గాట్లను భరిస్తూ ఉండవచ్చు
తల్లితండ్రులు వృద్ధాశ్రమంలో గతం కొక్కేలకు ఉమ్మడిగా వేలాడుతూ ఉండవచ్చు
స్నేహితులు ఆత్మీయతను సైలెంట్ మోడ్ లో పెట్టేయవచ్చు
రెండు సెకండ్ల కాల్ కు ఒక పైసాయే అయినా ఎవరూ పలకరించకపోవచ్చు
ఒక కండోలెన్స్ మెసేజ్ సేవ్ డ్ డ్రాఫ్ట్ గా సిద్ధమై ఉండవచ్చు
ఎన్నెన్నో టెస్టులు పాసవ్వాలి ఒంటరిగా.. బతకాలంటే-

రోడ్డు మీద కదలకుండా దొంగెద్దులా కూలబడి ఇలా ఏవేవో నెమరేస్తున్నప్పుడు
కాలాన్ని ఆకలితో నమిలేస్తున్నప్పుడు
చీకటి రాకాసి గద్ద విహ్వలంగా వాలుతుంది…
అప్పుడు రోడ్డు కూడా కదలదు-

లోన ఎవడో చెక్కుతూనే ఉంటాడు ఉలీ సుత్తీ పట్టుకుని టప్ టప్ మంటూ చీకటి నిశ్శబ్దంలో…
రక్తం చిట్లుతున్న చప్పుడు మెరుపులా వినిపిస్తూనే ఉంటుంది-
కంకర రాళ్ళుగా ముక్కలైపోయి రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాక
బండెడు తారు పోసి రోడ్డు రోలర్ తో తొక్కేయడానికి పొద్దున్నే వస్తాడొక కంట్రాక్టరు
వాడి వెనకాలే వస్తాడొక పార్టీ నాయకుడు వాడి కార్యకర్తలూ-
అభివృద్ధికి వేసిన ఈ బాటలోనే బ్యాలట్ దాకా నడవండని చేతులు జోడిస్తారు
లేదా బ్యాలట్ నుంచే కొత్త బాట మొదలవుతుందని నమ్మిస్తారు-

రోడ్డు మీద కాసేపలా కదలకుండా నిల్చుని… కలకలమై… కలహననమై…
రాతి ధూళిగా మట్టిలో కలిసిపోయింతర్వాత కూడా
చచ్చిపోని కళ్ళు మాత్రం వచ్చే పోయే వాళ్ళను చూస్తూనే ఉంటాయ్
తారు చీకటి రహస్యాల్ని కథలు కథలుగా చెప్పే ప్రయత్నం చేస్తుంటాయి-
మనుషులు వాటిని పుస్తకాలుగా షెల్ఫుల్లోనే పెట్టుకుంటారు
లేదంటే సాఫ్ట్ కాపీలుగా ల్యాప్ టాప్స్ లో స్టోర్ చేస్తారు
దొంగతనంగా డౌన్ లోడ్ చేసుకుని మురిసిపోతారు..
అక్షరాలు గాయాలు చేస్తున్న సలపరింత మొదలవగానే అన్ ప్లగ్ అయిపోతారు-

అడవిలో పండుకోసుకున్నవాడికి చెట్టుతో ఉండే అనుబంధం
మార్కెట్ లో సీల్డ్ కవర్ తో పండు కొనుక్కున్నవాడికి ఎట్లా ఉంటుంది?
తోటలో పల్లవించే పూవుల మీద పరిమళమై వెలిగిపోవడం మానేసిన తరువాత
ప్లాస్టిక్ ఫ్లవర్ హ్యాంగింగ్స్ ను రెటీనాలతో మీటి ముచ్చటపడాల్సిందే-
బతుకు అడవి నుంచి ఉద్యానాల నుంచి హృదయాల నుంచి
మనిషినీ మనిషినీ కలిపే బాటల నుంచి రోడ్డున పడింది-
ఇక.. రోడ్లకిరువైపునా నాటిన ఏటీఎంలు పనికొస్తాయా
ఇమోషన్స్ ను విత్ డ్రా చేసుకోవడానికి?
జ్ఞాపకాలను డిపాజిట్ చేయడానికి?

ఒక మనిషిని మరొక మనిషిలోకి తీసుకుపోలేని ఈరోడ్డు
మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది?
రోడ్డు మీదకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేకపోతే
ఈ ప్రయాణం దేనికి?
***
(శుక్రవారం 14 మార్చి, 2014; కవితా! 25 మార్చి-ఏప్రిల్ 2014లో ప్రచురితమైన కవిత)

తెలంగాణ మహోదయం

చరిత్రలో కొన్ని క్షణాలు అద్భుతమైనవి. అవి అద్భుతమైనవని ముందే తెలియడం ఒక గొప్ప అదృష్టం. ఆ క్షణాల్ని అద్భుతంగా జీవించాలి. జీవిత పర్యంతం ఆస్వాదించేంత మహత్తరంగా జీవించాలి. ఉద్విగ్న క్షణాలు ఎప్పుడూ జ్వలిస్తూనే ఉంటాయి. ఆనందాన్ని కొత్తగా నిర్వచించే అనంతానంద క్షణాలను తెలిసి తెలిసీ చేజార్చుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది? ఆనందం విలువ తెలియని వాళ్ళకు, జ్ఞాపకాల పుస్తకం ముఖచిత్రంగా నిన్ను నీవే తడుముకోవడం ఎంత బాగుంటుంది?
సమయం: 2014 జూన్ 1, ఆదివారం. మామూలుకన్నా నెమ్మదిగా గడిచిపోతుందేమిటీ అన్న సందేహం పగలంతా! రాత్రి అవుతున్న కొద్దీ ఆకాశంలో చుక్కలు ఒక్కొక్కటే పొడుస్తున్నట్లు లోపల్లోపల ఎడతెగని జ్ఞాపకాల గాయాలు గానాలు రెక్క విప్పుతున్న చప్పుడు. సాయంత్రం ఏడు గంటలకు హైదరాబాద్ నగరంలోని సైనిక్ పురిలో చల్లని జల్లు కిటికీ రెక్కల పక్కన కురుస్తున్న చప్పుడు. ఆరు దశాబ్దాల ఉద్యమంలో ఆత్మత్యాగం చేసిన అమర వీరుల ఆనందబాష్పాలు కురుస్తున్న దిగులు లాంటి వెలుగులాంటి చప్పుడు. గుండెలో పొడుస్తున్న కొత్త పొద్దు లాంటి చప్పుడు. ఇంకొన్ని గంటల్లో ఒక కల నిజంగా మారుతున్న ఉద్విగ్న సందర్భం. ఒక మహోదయాన్ని స్వాగతిస్తున్న అర్థరాత్రికి ఇవతలి గట్టున సంధ్యారవం స్వరకల్పన చేసుకుంటున్న తరుణం.

వాన చినుకులు నేల మీద ఒదిగిపోయాయి. చెట్ల ఆకుల గలగలల్లోంచి లేత రంగు చీకటిలో తడిసిన గాలి మెత్తగా మీద వాలుతోంది. పక్షుల గుంపులోకి అల్లరిగా చొరబడినట్లు ఉత్సాహంగా గాలిలోకి దూసుకుపోయాను. టపటపా రెక్కలు కొట్టుకుంటున్న వివశత్వంలాంటి శబ్దంలోకి బైకు మీద పరుగుతీశాను.
ధగద్ధగాయమానంగా వెలుగుతున్న నగరం. గులాబీవనంలా పరిమళిస్తున్న నగరం. యుద్ధం గెలిచిన వీరుడి కళ్ళల్లా మిరమిట్లు గొలుపుతున్న నగరం. వీరుడ్ని అక్కున చేర్చుకున్న కన్నతల్లి కన్నీటిలో తడిసిన వేసవి నగరం. వేడుకలో మురిసిపోతున్న నగరం. మునుపెన్నడూ లేనంత ముచ్చటేస్తున్న నగరంలోకి ప్రయాణించాను.
తొలి మజిలీ.. మిత్రుడు రఘురాములు కుమారుడు అమన్ పెళ్ళి విందు జరిగిన ఉప్పల్ లో. అలాయ్ బలాయ్ గా మారిన విందులో అన్న సురేంద్రరాజు, ఏలె లక్ష్మణ్, దుర్గం రవిందర్, కాసుల ప్రతాపరెడ్డి, రాజా రమేశ్, మోహన్ రుషి, బ్రహ్మం, ప్రసాదమూర్తి, వికటకవి అవినాష్, చక్రి, కొండల్, గుర్రం సీతారాములు, ఇంకా ఎందరెందరో మిత్రులతో ఆత్మీయ ఆలింగనం.
అక్కడి నుంచి నేరుగా సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ కు ప్రయాణం. దారిలో దీపాల తోరణాలతో మెరిసిపోతున్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజి బిల్డింగును చూడడం ఒక కన్నీటి జ్ఞాపకాన్ని దాచుకున్న ఉద్విగ్న సందర్భం. ప్రెస్ క్లబ్ చేరుకునేప్పటికి అర్థరాత్రికి సరిగ్గా అయిదు నిమిషాలుంది. టిజెఎఫ్ మిత్రులు పెద్ద కేక్ తో సంబరాలు చేస్తున్నారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా… పోరు తెలంగాణమా.. అంటూ గద్దరన్న గొంతు స్పీకర్లలో మార్మోగుతోంది. అక్కడికి అడుగుపెట్టగానే మిత్రులు వాసన్, జనార్దన్ లు ఆత్మీయంగా హత్తుకున్నారు. మిత్రుడు క్రాంతి, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, టంకశాల అశోక్, 10టీవీ సిఇఓ అరుణ్ సాగర్, స్టూడియో ఎన్ డైరెక్టర్ శైలేశ్ రెడ్డి వంటి జర్నలిస్టులంతా తెలంగాణ హోరులో చిందేయడం ప్రెస్ క్లబ్ కొక చిరస్మరణీయ ఘట్టం.
అర్థరాత్రి పన్నెండు దాటింది. టపాసులు పేలాయి. ఆకాశం మెరిసింది. గాలి దద్దరిల్లింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆనందం అర్ణవమైంది. గంటలు నిమిషాలైపోయాయి. తెల్లవారుజామున 2 గంటలకు గన్ పార్క్ కు వెళ్ళాం. తొలి ముఖ్యమంత్రి నివాళిని అందుకునేందుకు పూలమాలలతో అలంకృతమవుతోంది అమరవీరుల స్మారక స్థూపం. పదిలంగా రెండు అరిచేతులతో తాకి.. చేతులెత్తి మొక్కాం తెలంగాణ త్యాగధనుల ప్రతీకకు. మొబైల్ ఫోన్లలో కెమేరాలు తెరిచి ఫోటోలు దిగాం.. ముఖ్యంగా తెలంగాణ రాజముద్ర రచించిన చిత్రకారుడు మా ఏలె లక్ష్మణన్నతో కలిసి.
మళ్ళీ ప్రెస్ క్లబ్ కు వచ్చాం. రాత్రి తెల్లవారేందుకు తొందరపడుతోంది. అల్లమన్న, కృష్ణమూర్తి, చల్లా శ్రీనివాస్, సుధీర్ తదితరులతో తెలంగాణ పోరు జ్ఞాపకాలను తరిచి చూసుకున్నాం. తరించిపోయాం. అయిదు గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరాం. వెలుగు వాకిళ్ళుగా స్వాగతం పలికిన నెక్లెస్ రోడ్ చౌరస్తా, సెక్రటేరియట్, టాంక్ బండ్ ల మీదుగా ప్రయాణం. సికింద్రాబాద్ ప్యాట్నీ చౌరస్తాలో చల్లాతో కలిసి ఓ మీఠా పాన్.
ఆకాశం ఊదారంగులోకి మారింది. కొత్త వెలుగు హాయిగా ఆవరిస్తోంది. మాతో పాటే మేల్కొన్న రాత్రి.. ఆరు దశాబ్దాల కలను నిజం చేసింది. మా తరానికి ఉద్యమ ఫలాన్ని కానుక చేసింది.
మా ఇంటి బాల్కనీలో శుభోదయం.
తెలంగాణ మహోదయం.

– పసునూరు శ్రీధర్ బాబు
సైనిక్ పురి,
హైదరాబాద్,
తెలంగాణ రాష్ట్రం
(ఉదయం 6.30 గం.లు, సోమవారం 2 జూన్, 2014)

మళ్ళీ మరొక్కసారి ప్రేమ గురించి…

మరొక్కసారి ప్రేమ గురించి
మళ్ళీ మళ్ళీ మరొక్కసారి వెళ్ళిపోయిన ప్రేమ గురించి

రాలిన పూవు మట్టిలో కలిసిపోతుంది
వాలిన చూపు ఎక్కడో నాటుకుపోతుంది

కురిసిన వర్షం వంకలో వాగులో చివరకు సముద్రంలో కలిసిపోతుంది
తడిసిన దేహం చివరి నిట్టూర్పు దాకా వణుకుతూనే ఉంటుంది

పొద్దుటి వెలుగు మీదకు చీకటి తరుముకొస్తుంది
చీకటి పంచిన కలలను ఏ వెలుగు తుడిచేయగలుగుతుంది?
lonely

శిశిరానికి కానుకైన మొదటి హరిత పత్రం
వసంతాన్ని స్మరిస్తుందా.. స్వప్నిస్తుందా?

నిన్నటి రాత్రి నేటి రాత్రి ఒక్కటి కాదు
నిన్నటి వెన్నెల ఇవాళ్టి వెన్నెల వేరు వేరే
మధ్యలో ఈ కాలం గొడవేమిటి నేనెప్పుడో నీదారి నీదే నాదారి నాదే అని చెప్పింతర్వాత!
గుండ్రని భూమికి ధిశలేమిటి?
ఎటు వెళ్ళినా నేను ముందుకే వెళ్తాను-

నా జీవితాన్ని నేను ఇటు నుంచి అటూ
అటు నుంచి ఇటూ జీవిస్తాను
ఎటు వెళ్ళినా ఇక్కడికే వస్తానో లేక ఎక్కడికైనా పోతానో?

ఏమైతేనేం?
నేను
నా కాలం
నా ప్రాణం
నా ప్రయాణం
ఒక్కటే అయినప్పుడు!

ఏమైపోతేనేం?
నేను
నా గానం
నా గాయం
నా జ్ఞాపకం
వెన్నంటే వస్తున్నప్పుడు!

అందుకే మరొక్కసారి ప్రేమ గురించి
ప్రతిక్షణాన్ని ప్రతీక్షణంతో వెలిగించి వెళ్ళిపోయిన ప్రేమ గురించి
వెళ్ళిపోయిన ప్రేమ వెంటే వెళ్ళిపోయిన నాగురించి

శిలువ మీద క్రీస్తులా
కాగితాల మీద అక్షరాలుగా వేలాడే క్షణాల గురించి
మళ్ళీ మరొక్కసారి నావెంటే వెళ్ళిపోయిన ప్రేమ గురించి…!

                                                                 – పసునూరు శ్రీధర్ బాబు
                                                                         (24 ఏప్రిల్ 2014)