కొత్త కవితలు, Uncategorized

“మళ్ళీ” వద్దు

రాత్రి వెలిగించుకున్న దీపాలన్నీ
గాలికి రాలిపోయాయి…
పొద్దున్నే ఎవరో వీధినంతా
ఊడ్చేస్తూ వెళ్తుంటే
మరీ ఒంటరైపోయా
మరీ చీకటైపోయా-

mallee vaddu pic

అదే రాత్రి
కన్నీటి బిందువుకు దేహమై వేలాడి
ఆడి ఆడి పడిపోయినప్పుడు
తెగిన జలపాతంలా
తెలీని అగాధంలోకి-

మునివేళ్ళ మీద పెదాలు పూయించిన
దేహాకాశాన్ని పరవశిస్తూ
కాలిన క్షణంలా
రాలిపోయాక…
స్మృతికీ గతికీ మధ్య
చితికిపోయి…’చితి’కి పోతూ…

ఇంకిప్పుడు చేయందించడానికి
ఎవరున్నారని?

అయినా…
లోతెంతో తెలుసుకోవాలని
తహతహలాడుతున్నవాడికి
ఎవరో అందించే చేయితో ఏం పని?

మళ్ళీ కలవాలన్న ఆశ కూడా లేదు
అసలు ఏదీ కూడా
‘మళ్ళీ’ చేయాలని లేదు-

వ్యాసాలు, Uncategorized

అసలైన కవి ఓ sniper అన్న ‘అకవి’ నికనోర్ పర్రా

nicnore parraతెల్ల కాగితం మీద కవిత్వం రాస్తే…
తెల్ల కాగితం కన్నా బాగుండాలి
కాకపోతే, తెల్ల కాగితాన్ని
పాడు చెయ్యటమెందుకూ?

ఈ నాలుగే నాలుగు పంక్తులు నాలుగు రోజుల కింద ఇక్కడ పోస్ట్ చేసినప్పుడు అది చాలా మందికి నచ్చింది. అంత గొప్ప వాక్యాలు రాసిన కవి గురించి అలా నాలుగు ముక్కలు చెప్పి వదిలేస్తే ఎలా అనిపించింది. అందుకే, ఆ కవి ఎవరో, నాకెందుకు నచ్చాడో నలుగురితో పంచుకోవాలనిపించింది. పదాలను నగ్నంగా విసిరి… అందంతో, వ్యంగ్యంతో చూసే కళ్ళనీ, చూపే హృదయాన్నీ కోసుకుపోయేలా చేసిన ఆ కవి గురించి, ‘అకవి’ గురించి చెబుతూ అతడి అకవిత్వాన్ని కాస్త మీతో కలసి మననం చేసుకోవాలనిపించింది.

ఇరవయ్యో శతాబ్దపు అత్యాధునికుల్లో ఒకడైన ఆ కవి పేరు నికనోర్ పర్రా. అతడి తల మీద జుట్టు నిక్కబొడుచుకుని అన్ని దిక్కులనూ గుచ్చినట్లు చూస్తుంది. ఈ లాటిన్ అమెరికన్ కవి చిలీ దేశంలో పుట్టాడు. స్పానిష్ భాషలో కవిత్వం రాశాడు. చిలీలోనే తన కన్నా పదేళ్ళ ముందు పుట్టిన మరో మహానుభావుడు రొమాంటిక్ రాడికల్ పాబ్లో నెరుడానే భీకరంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాడు. 1954లో నికనోర్ మొదటి కవితల పుస్తకం Poemas y antipoemas (కవితలు – అకవితలు) అచ్చు వేయించే పని నెరూడానే భుజాలకెత్తుకున్నాడు. ఆపై కవిత్వంలో అతడి నీడనూ మోశాడు.

నికనోర్ పర్రాను నాకు పరిచయం చేసిన వాడు నాకిష్టుడైన సదాబాలకుడు ‘ఇస్మాయిల్’. కవిత్వంలో నిశ్శబ్దాన్ని ప్రతిపాదించిన ఈ చెట్టు కవి… దేశవిదేశాల కవుల్లో తన ప్రతిపాదనకు దగ్గరగా ఉన్నవారిని ఎంచుకుని వారి వ్యక్తిత్వాన్ని, కవిత్వాన్ని పరిచయం చేస్తూ ‘రెండో ప్రతిపాదన’ పుస్తకం ప్రచురించాడు. 1997లో నా చేతిలోకి వచ్చిన ఆ పుస్తకం నాకు నికనోర్ పర్రాను పరిచయం చేసింది.

సునీల్ గంగోపాధ్యాయ, శంఖ ఘోష్ వంటి బెంగాలీ కవులను మొదలుకొని బెర్‌టోల్ట్ బ్రెహ్ట్, నెరూడా, చోంగ్ హ్యోన్ – జోంగ్ వంటి కవుల సారాన్ని సరళంగా చెప్పుకొస్తారు ఇస్మాయిల్ అందులో. ఇంకా, సుజాతా భట్ “చెరుకు గడ” కవిత కూడా గుర్తు చేసి జీవితాంతం గుర్తుండేలా చేశాడు. ఈ వరసలో పుస్తకంలో చివరన కనిపించిన వాడు నికనోర్ పర్రా.

[‘చిలకలు వాలిన చెట్టు, రాత్రి వచ్చిన రహస్యపు వాన’తో ఇస్మాయిల్ నన్ను ఇరవైల్లో ఆవహించాడు. “కప్పల నిశ్శబ్దం” హైకూలు నన్ను కొన్ని హైకూలు రాసేలా ప్రేరేపించాయి. ‘కవిత్వంలో నిశ్శబ్దం, రెండో ప్రతిపాదన’ చదివాక నేను కవితల పుస్తకం అంటూ ప్రచురిస్తే అది ఇస్మాయిల్ గారి ముందుమాటతోనే అని నిర్ణయించుకున్నాాను. కానీ, ఆయనకు నా కవిత్వం ఆనుతుందా? నా అక్షరాలను ఇష్టపడతాడా? నా కోరికను మన్నిస్తాడా? అనే భయం. అడగడానికీ బెరకు. కానీ, ‘కరుణ ముఖ్యం’ అని చెప్పినవాడు నా కవితలను పోస్టులో పంపించి, ఒక కార్డు ముక్క రాస్తే కరుణించాడు. నా “అనేకవచనం” కవితా సంకలనానికి “పూర్వవచనం” ప్రసాదించాడు.]
https://anekavachanam.wordpress.com/2009/11/01/

‘రెండు పరస్పర వ్యతిరేక వైఖరుల్ని రంగరించి, తాకితే చుర్రుమనే అవహేళనా ద్రావకాన్ని తయారు చేసాడు పర్రా’ అని పరిచయం చేస్తూ ఆయన కవితలను-అకవితలను కొన్నింటిని శుభ్రంగా అనువదించి చూపించారు ఇస్మాయిల్. ఆయన మాటల్లోనే ‘శాస్త్రీయ దృక్పథాన్ని కవిత్వానికి వర్తింపచేసినవాడు పర్రా.’

నికనోర్ పర్రా కళాకారుల కుటుంబంలో 1914లో జన్మించాడు. ఆయన సోదరి వియోలెట్టా పర్రా ప్రఖ్యాత చిలీ జానపద గాయని. చిలీ యూనివర్సిటీలో ఆ తరువాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో గణిత, భౌతిక శాస్త్రాలు అధ్యయనం చేసిన నికనోర్ పర్రా సాహిత్యంలో శాస్త్రీయ దృక్పథాన్ని వినిపించే ప్రయత్నం చేశాడు. అదీ చాలా సులువైన భాషలో. పాబ్లో నెరుడా కవిత్వగానానికి భిన్నంగా అందరూ మాట్లాడుకునే భాషలోనే వ్యంగ్యాన్ని, పరిహాసాన్నీ ధ్వనించేలా కవిత్వ సృజన చేశాడు.

అలాగని, రాజకీయ కవిత్వం రాసినా, రాయబారిగా రాణించినా, చిలీ కమ్యూనిస్టు పార్టీ తరఫున అధ్యక్ష పదవికి నామినేట్ అయ్యే అవకాశాన్ని అందుకున్నా చివరకు ప్రేమ కవిగా, ప్రేమతో… చిన్మయానందంతో మృత్యువును జయించిన కవిగా నిలిచిపోయిన నెరుడాను ఎదిరించాడేమో కానీ వ్యతిరేకించలేదు నికనోర్ పర్రా.

‘నెరుడాను కొట్టిపారేయాలంటే రెండే మార్గాలున్నాయి.
ఒకటి అతడ్ని చదవకుండా ఉండడం
రెండు… అతడ్ని అపనమ్మకంతో చదవడం
కానీ, ఈ రెండు ప్రయత్నాల్లోనూ నేను విఫలమయ్యాను’ అంటాడు నికనోర్.

‘ఎన్నో ఏళ్ళు నెరుడాకు పొరుగువాడిగా, విద్యార్థిగా, పాఠకుడిగా ఉన్నాను. ఆయన నన్ను నిలువెల్లా ఆవహించాడు. ఆయన గురించి ఆలోచించకుండా గడిచిన రోజు నా జీవితంలో లేదు’ అని పర్రా ఓ సందర్భంలో చెప్పుకున్నాడు.

నెరుడా, విట్మన్‌లతో పాటు కాఫ్కా మాయలోనూ పడిన ఈ కవి తనదైన మార్గం ఎంచుకోవడం కోసం తీవ్రంగా ఉద్యమించాడు. కవిత్వాన్ని శ్రీశ్రీ అన్నట్లు భూమార్గం పట్టించడమే అతని మార్గం. ఛందో బందోబస్తులన్నీ ఛట్ ఫట్‌మని తెంచిన తరువాత వచ్చిన కవిత్వం కూడా మర్యాదస్తుల నాణ్యమైన భాషలో ఉండడమేమిటన్నది అతడి ప్రశ్న. రాజకీయోద్యమ కవిత్వంలోని ఒక తరహా ఇలీట్ నేచర్‌ను ధ్వంసం చేయాలనుకున్నాడు. నెరుడాతో అతడి పేచీ అంతా కూడా ఈ ఇలీట్ నేచర్ గురించే.

“ప్రజలు మాట్లాడుకుంటుంటే కవులు పాడుతున్నారు.. ఆ పాటలు పాడే పనేదో పక్షులకు వదిలేయండి” అంటాడు నికనోర్. ఒకసారి న్యూయార్క్ టైమ్స్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, ‘కవి తనను తాను నిందించుకుంటున్నప్పుడు, మానవత్వాన్ని నిలదీసేటప్పుడు… అందులో ఎంతో హాసం, పరిహాసం, వ్యంగ్యం ఉంటుంది. అప్పుడు కవి ఏదీ ఆలాపించడు. ఒక కథ చెబుతాడు, ఒక అకవిత చెబుతాడు’ అని అన్నాడు.

ఉద్యమ కవి లేదా కవి-యోధుడు ఉన్న చోటే ఉండి తుపాకిని గురి పెడితే, అకవి తన చేతి వేళ్ళ సమూహంతో పోరాడుతాడు. ఇద్దరి పోరాటం ఒక్కటే. లక్ష్యం ఒక్కటే. పంథా వేరు. ఆ మాటకొస్తే అకవే మాటు వేసి గురి చూసి కొడతాడు. అతడి టెక్నికే వేరంటాడు పర్రా. అలాగని, అకవి.. ఉద్యమకవిని తోసిపుచ్చడు. అతడికి దూరంగా ఉండి పని చేసుకుంటాడు. ఆ దూరం వల్ల అకవి మార్గం కొంత అస్పష్టంగా కనిపించవచ్చంటాడు. సాహిత్యంలో సామాజిక-వైయక్తికాల మీమాంసను అంత స్పష్టంగా తేల్చేస్తాడు.
ఆయన అకవిత్వ ధోరణి ఎలా ఉంటుందో చూడండి.

“I Take Back Everything I’ve Said” కవితకు ఇది నా అనువాదం.

‘నేను చెప్పిందంతా వెనక్కి తీసుకుంటాను”
…..
నేను వెళ్ళిపోయే ముందు
నేనొక చివరి కోరికను కోరాలి కదా:

ఉదార హృదయమున్న పాఠకుడా
ఈ పుస్తకాన్ని తగులబెట్టు

నేను చెప్పాలనుకున్నది ఇది కాదు

ఇది రక్తంతో రాసిందే అయినప్పటికీ
నేను చెప్పదలచుకున్నది ఇది కాదు.

నన్ను మించిన విచారమేదీ ఉండకపోవచ్చు
నేను నా నీడతోనే ఓడిపోయాను:
నా మాటలు నా మీదే ప్రతీకారం తీర్చుకున్నాయి.

నన్ను క్షమించు పాఠకుడా.. ఓ ప్రియ పాఠకుడా
నీకు నేను ఒక వెచ్చని కౌగిలింతతో వీడ్కోలు చెప్పలేను.
విచారంతో నిండిన ఒక బలవంతపు నవ్వుతో
నీ నుంచి సెలవు తీసుకుంటున్నాను.

బహుశా.. నా కథ అంతా అంతేనేమో
కానీ, నా చివరి మాట మాత్రం విను:

నేను చెప్పినదంతా వెనక్కి తీసుకుంటాను
ప్రపంచంలోని చేదునంతా భరిస్తూ
నా మాటలు నేను వెనక్కి తీసుకుంటాను.

(మిల్లర్ విలియమ్స్ చేసిన ఆంగ్లానువాదం నుంచి తెలుగులోకి)

యువకవులు అంటూ పర్రా రాసిందే మరో కవిత… ఇస్మాయిల్ సృజనానువాదం:

“Young Poets”
….
యువ కవుల్లారా
మనస్సు విప్పి మాట్లాడండి
మీ శైలిని మీరే ఎన్నుకోండి
రోడ్డు దాటటానికి ఒక్కటే పద్ధతని
లోకం చేత ఒప్పించటానికి
రక్తం కాలువలు కట్టించారు.

కవిత్వంలో అంతా మీ ఇష్టం.

తెల్ల కాగితం మీద కవిత్వం రాస్తే
తెల్లకాగితం కన్నా బాగుండాలి.
కాకపోతే, తెల్లకాగితాన్ని
పాడు చెయ్యటం ఎందుకూ?

అదన్నమాట తెల్లకాగితం కథ. తెల్లకాగితాన్ని తేజోవంతం చేసిన అతడి కవితలను చదవాలంటే ఈ తరం పాఠకుడికి ఏమంత కష్టం? గూగుల్ తల్లిని ఓ మాట అడిగితే చాలు.

‘ప్రేమ నేరాలన్నింటినీ క్షమించేయండి’ అని ప్రకటించిన నికనోర్ పర్రా కోసం మృత్యువు కూడా ప్రేమగా నిరీక్షించింది. ఈ అకవికి నిండు నూరేళ్లు కాదు 103 ఏళ్ళు నిండిన తరువాత మొన్న 2018లోనే తన వెంట తీసుకుని వెళ్ళిపోయింది.

– పసునూరు శ్రీధర్ బాబు

పుస్తక సమీక్షలు

‘ఇది ఆకాశం కోల్పోయిన పక్షి కథ… ఇది మనుషుల్ని కోల్పోతున్న భూమి కథ’

‘ఆమె తనను చూసి దించుకుంటున్న
కనురెప్పలపై నడుస్తోంది’

ఈ ఒక్క వాక్యంలో ఎంత బాధ? ఎంత కసి? ఎంత వేదన? ఎంత కవిత్వం? మన సిగ్గుమాలిన, చేతకాని, తిరగబడలేని, తిరోగామి బతుకులను తొక్కుకుంటూ ఆమె నడుస్తోంది. నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో బందీగా ఉన్న ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా సహచరి వసంతను చూసిన తరువాత కృష్ణుడు రాసిన ‘ఆమె పేరే ఆమె శ్వాస’ కవితలోని వాక్యాలివి.

‘ఏమైనా మారిందా? కాలంతో పాటు అన్నీ మారతాయంటారు. కానీ, ఏదీ మారలేదెందుకో అని వాపోతాడు కృష్ణుడు.

విప్లవం నిరంతర నినాదం
విముక్తి ఒక ఎండమావి
కాగడాలు వెలుగు చూపలేదు
దీపం కాంతులూ దారి చూపలేదు… అంటూ మూడో కవిత్వ సంపుటి ‘ఆకాశం కోల్పోయిన పక్షి’లో ఇన్నేళ్ళ ప్రయాణం మిగిల్చిన నిరాశను ధ్వనిస్తాడు. కానీ, ‘జేబుల్లో కాగితాలే జీవన సంగీతాలు’గా పాడుకుంటున్నవాడి ఆశ చావదు కదా. అందుకే, అంటాడు ‘మనిషి పాతబడతాడు. కానీ, నేను పాతబడని కవిత్వాన్ని చూశాను. సమాజం తిరగబడడాన్ని చూడలేదు. కవిత్వం తిరగబడడాన్ని చూశాను’ అని శుద్ధ వచనంలో ఈ పుస్తకానికి రాసుకున్న ముందుమాటలో.

akasham kolpoyina pakshi

తటస్థత్వాన్ని చీదరించుకుంటాడీ కవి. జ్ఞాపకాల ఓదార్పులను ఒక్కోచోట ఆశ్రయించినా నాస్టాల్జిక్ చితి మీద రొమాంటిక్ జ్ఞాపకాల్ని కాల్చుకు తినడాన్ని అసహ్యించుకుంటాడు.

‘నేనిప్పుడు
శవాన్ని మోయలేను
మిగతా ముగ్గురేమనుకున్నా సరే
నా భుజానికి స్వేచ్ఛ కావాలి’ అని ప్రకటిస్తాడు శవాన్ని మోయలేను అనే కవితలో. అంతేకాదు, ఆ భుజం ఎందుకు కావాలో కూడా చెబుతాడు. ‘చిగురిస్తున్న చెట్లను ఆలింగనం చేసుకోవడం కోసం, కేరింతలు కొట్టే పసిపాపను ఎత్తుకోవడం కోసం… ఒక జీవితం కోసం యుద్ధం చేయడం కోసం నాకు భుజాలు కావాలి’ అంటాడు. ఇదంతా ఎలా సాధ్యమంటే..

శవం ఒక గతం
నేనొక నిత్యవర్తమానం
శవాన్ని వదలించుకుంటేనే
రేపటి సూర్యకిరణం కోసం
నా పయనం…”

ఇదీ వరస. కృష్ణుడి దారి రహస్యమూ మార్మికమూ కాదు. అది బయటకూ లోపలికీ దారితీసినా దాని గమ్యం ఒక్కటే ఉద్యమించడం. ఏ మార్పునైతే కలగన్నామో అది ఎందుకు రాలేదని ఆగ్రహించడం. అందుకు అడ్డుపడుతున్న శక్తుల గుట్టు విప్పడం. చెమట తడి తెలియని చేతుల్లో లెక్క తెలియని నోట్లు ఎందుకున్నాయో ప్రశ్నించడం.

‘నీవు గర్జించినప్పుడు
వసంత మేఘంలో తడిసి ఆనందించాను’ అని కౌమార ప్రాయంలో రగిలిన జ్వాలను మోస్తున్న వాడు, దేశ రాజధానిలోని ఉదారీకరణ మధ్య – నెత్తురు ఉదారంగా ప్రవహించడమే నేడు ఉదారీకరణ అనేస్తాడోచోట – ఉపన్యాసాల కాలుష్యాల మధ్య నగరం కోల్పోతున్న చైతన్యాన్ని చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నాడు. శవవ్యాపారుల చరిత్ర హీనుల చట్టసభల్లో మృత్యుకేళిని వినిపిస్తున్నాడు. నినాదం ఆర్తనాదమైన సందర్భం ఇది… ఇది కదా కవిసమయం అని ఆక్రోశిస్తున్నాడు. చైతన్యమే ఆకాశం… పక్షి ఆకాశాన్నే కోల్పోయిందని తేల్చేస్తున్నాడు.

‘చేతివేళ్ళు
తగలని పుస్తకంలా
కొట్టుకుంటున్న జీవితం…
మనసు తన్లాడుతోంది
ఒక చిరునవ్వు
పలకరింపు కోసం-
పాడుబడిన గోడల మధ్య
మొలిచిన మొక్కే
నేటి సజీవ దృశ్యం..
పక్షి ఆకాశం కోల్పోయింది-‘
అంటూ ఈ కవిత్వ సంపుటాన్ని మొదలుపెడతాడు కృష్ణుడు.

ఇందులో దశాబ్దాల ప్రయాణంలోని జాడలూ, గాయాలూ ఉన్నాయి. ప్రేమలూ, ఎలిజీలూ ఉన్నాయి. కవిత్వం ఇప్పుడే కాదు యాభై ఏళ్ళ కిందటే అధునాతనమని తేల్చేస్తూ… అందుకు కారణం మనం ముందుకు వెళ్ళకపోవడమేనని నిందిస్తూ, నిగ్గదీస్తూ దిగంబర “దిక్’’లను తలచుకుంటూ తన కవిత్వంలోకి ఆహ్వానిస్తాడు.

‘ఇష్టం లేకపోయినా నీకు
వాతావరణం మారుతుంది
కాలం మారుతుంది…
ప్రశ్నలు నిన్ను చుట్టుముట్టకమానవు’ అని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్న కృష్ణుడు ఎక్కడా కవిత్వంలో నినాదప్రాయంలా తేలిపోలేదు. ప్రవచనకారుడిలా ఉద్యమ కవిత్వాన్ని ఫెటిష్‌గా మార్చకుండా అప్రమత్తంగా ఉన్నాడు. సామాజిక వేదనను అస్తిత్వవేదనగా తన లోతుల్లోంచి వ్యక్తం చేస్తున్నాడు. అలంకరణలను చూసి స్పందించే వాడిని కాదని చెప్పుకున్నప్పటికీ కవి సమయంలో ఈస్తటిక్స్ రహస్యాలు తెలిసినవాడు కాబట్టే ఇలా వ్యక్తమయ్యాడు:

‘ఆకాశం
అమ్మకళ్ళలా
ఏడ్చి ఏడ్చి
ఎర్రబడ్డట్లుంది.’ (నాన్నలో నేను)

ఏ విగ్రహం ముఖంలోనూ
ప్రశాంతత లేదు
హారతి దించాక వెలుగూ లేదు (హరహర)

ప్రకృతి మృత్యులాస్యం
ఆడుతున్నప్పుడు
ప్రతి చెట్టూ అమరవీరుడి స్తూపమే. (చెట్టు)

నిశ్శబ్దం మంచిదే
తెరిచిన కనురెప్పల్లో
వెలుగు ఆరనంతవరకూ... (అర్థం కాలేదు…)

ఆకాశం వైపు నాలుగు చేతులు చాచి
అల్లాను ప్రార్థిస్తున్న చార్మినార్
నెత్తుటితో కలుషితం కాని
మతాన్ని ప్రసాదించమని

వెంటాడుతున్న పురాస్మృతులు
ఎప్పుడూ
తెరుచుకున్న వీరుడి కళ్ళలాంటివి.. (రేపు)

కొన్ని వ్యక్తీకరణలు మనసును కదిలిస్తే… మరికొన్ని గుండెకు గాయం చేస్తాయి. ఇలాంటి వెంటాడే వాక్యాలతో వర్తమాన ఛిద్ర దృశ్యాన్ని వైయక్తిక వేదనలా వినిపిస్తాడు కాబట్టే కృష్ణుడు తన కవిత్వం వెంట మనల్ని నడిపించగలుగుతున్నాడు.

“ఆ శవం నాది
ఆ మరణమూ నాదే
ఆ రోదనా నాదే
ఆ చితిమంటలూ నావే
ఆ చితాభస్మమూ నాదే…’ అని ఆపేస్తే నిశ్శబ్ద నీరవావేదనగా మిగిలిపోయేవాడేమో? కానీ, ఆ తరువాత అంటాడిలా ఒక పిడిగుద్దులా…

‘నీ హంతక శరీరం వెనుక
నీడ కూడా నాదే’.

నడుస్తున్న దుర్మార్గపు హీన చరిత్రను దగ్గరుండి చూసే జర్నలిస్టు కూడా కావడం కృష్ణుడి ఆత్మిక వేదనకు ఓ శాపంగా మారిందనిపిస్తుంది. పాత్రికేయుడుగా రాసిన అసంఖ్యాక వాక్యాల నడుమ తారట్లాడే వ్యక్తావ్యక్తాలాపన ఈ కవిత్వంలో కనిపిస్తుంది.
తెలంగాణ ఉద్యమం గురించి నిర్దిష్టంగా ప్రస్తావించిన ‘ప్రశ్న’ అనే కవితలోని ముగింపు వాక్యాలు చూడండి. ఉద్యమ భావావేశం ప్రజల్లో ఎంత గాఢంగా ఉందో చెప్పడానికి ఇంతకన్నా వేరే వాక్యాలేం కావాలి?

నీటిలో ప్రశ్న
గాలిలో ప్రశ్న
రహదారిలో ప్రశ్న
ప్రశ్నార్థకమైన దేహంతో ఇంట్లోకి అడుగుపెడితే
మరణశయ్యపైఉన్న
అవ్వ అడిగింది
బిడ్డా..
ఇస్తరా… లేదా?

ఇది ఆకాశం కోల్పోయిన పక్షి కథ.
ఇది మనుషుల్ని కోల్పోతున్న భూమి కథ.

(కృష్ణుడు అక్టోబర్ 12న కవి యాకూబ్ ఏర్పాటు చేసిన ‘రొట్టమాకు రేవు కవిత్వ పురస్కారం’ అందుకుంటున్న సందర్భంగా)

***

సినిమా రివ్యూ

Joker (2019) Movie Review: మనమంతా జోకర్లమే

joker pic

Extreme closeups… రెండు వైపులా పట్టి పైకి సాగదీసిన పెదాల మీద అతుకులూడిపోయే నవ్వే కాదు, కుతకుతలాడే కరడు గట్టిన దుఃఖమూ కనిపిస్తుంది. చర్మ రంధ్రాలలో స్వేదం ఉబుకుతున్న గద్గద రవాన్ని వినిపిస్తూ, చూపించే డిజిటల్ ఏజ్ ఛాయాగ్రహణం ఐమ్యాక్స్ తెర మీంచి ఆవహించినంత మాత్రాన ఒక ప్రయాణం ఏమీ మొదలు కాకపోవచ్చు. కానీ, జీవన అనుక్షణికాలను 4కే పిక్సెల్స్‌గా విడగొట్టి దరి చేర్చి ఒక రహస్యాన్ని ఆవిష్కరించినప్పుడు మాత్రం కచ్చితంగా ఆ గుట్టును సకలేంద్రియాలతో కనిపెట్టేందుకు ఆ వెలుగు నీడల క్రీడలోకి దూకేస్తాం. అంతా అయిపోయాక ఒంటి మీదా లోపలా అంటుకున్న సెల్యులాయిడ్ వర్ణాలను గోళ్ళతో గీక్కుంటూ కొంతకాలం గడిపేస్తాం.

నటుడి ఆత్మిక దిగంతంలోకి తలుపులు తెరిచే extreme closeups అంటే మహామహా దర్శకులకే చచ్చేంత భయం. పాత్రలో అంత లోతు, నటుడిలో అంత గాంభీర్యం, దర్శకుడిలో తీవ్రమైన దృక్పథం ఉంటే కానీ వెండితెర మీద అలాంటి అతి సన్నిహిత సన్నివేశాలు సఫలం కావు. జోకర్‌గా దడపుట్టించిన వాకీన్ ఫీనిక్స్ అలా ప్రేక్షకుడి మీద మీదకు పడుతూ మాట్లాడుతుంటే సమాజంలోని అంతరం, దరిద్రం, పట్టనితనం చేసే గాయాల సలపరింత ఏమిటో తెలుస్తుంది. అలా ఉంటుందని తెలిసి తెలిసీ చేశాడు దర్శకుడు టాడ్ ఫిలిప్. తెర మీద రక్తం చిమ్మినప్పుడు మనలోని అనాగరికుడు రొమాంటిక్‌గా చిందులేస్తే అదెంత నీచమో అతనికి తెలుసు. అతడు ప్రతి రక్తపు చుక్కతో ఒక గాయాన్నిచ్చి అదేమిటో తెలుసుకోమన్నాడు. అంతేకాదు, తన ప్రోటాగనిస్ట్‌తో సహానుభూతి చెందాల్సిన పనిలేదు పొమ్మన్నాడు.

బ్యాట్‌మన్ గ్రాఫిక్ నవల The Killing Jokeను బేస్ చేసుకుని తనదైన శైలిలో క్రిస్టఫర్ నోలన్ మూడు మాస్టర్ పీస్‌లతో – బ్యాట్‌మన్ బిగిన్స్, డార్క్‌ నైట్, డార్క్ నైట్ రైసెస్ – సినిమా ప్రియుల మనసుల్లో గోథం నగరాన్ని నిజంగానే నిలబెట్టాడు. అందులో హీరో బ్రూస్ వేన్ సంగతి సరే… జోకర్ పాత్రను ఫరెవర్ లివింగ్ బీయింగ్‌గా మార్చేశాడు. డార్క్ నైట్ లోని విలన్ జోకర్ హీత్ లెడ్జర్ చనిపోతేనేం… జోకర్‌గా బతికే ఉంటాడు.
అలాగని, వాకీన్ ఫీనిక్స్‌ను హీత్ లెడ్జర్‌తోనో, జాక్ నికల్సన్‌తోనో పోల్చడం నాన్సెన్స్. కామిక్స్‌లోంచి లిబరేట్ అయిన ఈ జోకర్ ఎనభైల నాటి గోథం సిటీలోని తన బతుకును మిలీనియల్ అడల్ట్స్‌కు ఇలా కొత్తగా చెప్పుకున్నాడు. బ్యాట్‌మన్‌కు కొరకరాని కొయ్యలాంటి వయెలెంట్ ఎనిమీ కథేమీటో చూడమన్నాడు.
Everything Must Go అనే ప్లకార్డు పట్టుకుని నగర వీధుల్లో తిరుగుతుంటే నలుగురూ కలిసి సందులో పడేసి కుక్కను కొట్టినట్లు కొట్టి వెళ్ళిపోతే జోకర్ నవ్వుల్ని ఎలా దాచి పెట్టుకుంటాడు. I want to become a comedian but my life is tragedy అని వగరుస్తాడు.

స్టాండప్ కమెడియన్ కావాలన్న కలను నిజం చేసుకోలేకపోయిన ఒక విఫల జీవి… తనలోకి తాను కుంచించుకుపోతూ… ఒక్కసారిగా విస్ఫోటిస్తాడు. జీవితమంతా మెట్లెక్కుతూ ఎక్కుతూ దిగిపోతుంటాడు. ‘నా జీవితంలో నాకెప్పుడూ నేనొకడ్ని ఈ భూమ్మీద ఉన్నానని నాకనిపించలేదు. కానీ, ఇప్పుడు అనిపిస్తోంది. నన్ను కొందరు గుర్తిస్తున్నారు’ అని అస్తిత్వవేదన వ్యక్తం చేస్తాడు జోకర్. పక్కింటి సోఫీ కాస్త పలకరించి, భుజం మీద చేయి వేసి ఓదార్పు అయినప్పుడు కొంత తేరుకున్నట్లు కనిపిస్తాడు. ఆ అస్తిత్వవేదన అతన్ని ఎంతవరకు తీసుకువెళ్ళిందన్నదే ఈ కథ.
We are all Clowns అనే పాసింగ్ క్లౌడ్స్ లాంటి sub-text మెరుపులు, జోకర్ జీవితానికి ప్రతీకలా ఓ ఎత్తయిన స్టెయిర్ కేస్‌ను ఓ మెటఫర్‌లా వాడడం, బక్కచిక్కిన అతని శరీరం మీద కెమేరా నడిపించడం వంటి దర్శకత్వ మెరుపులు… నెరేషన్‌లో మనల్ని ఇమ్మర్స్ చేస్తాయి.

ఇక, రాబర్ట్ డి నీరో ఎంత పెద్ద స్టారో మనకు తెలుసు. కానీ, ఈ సినిమాలో ఓ టీవీ హోస్టుగా మాత్రమే.. అంతకు మించి ఒక్క ఇంచి కూడా ఎక్కువ కనిపించకపోవడమన్నది దర్శకుడికున్న క్లారిటీ వల్లనా లేక ఆ నటుడిలోని సటిలిటీ మహత్మ్యమా అన్నది తేల్చుకోవల్సిందే.

మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్లూ లేని ఎనభైల నాటి వాతావరణాన్ని ఈ సినిమా ఒక చెదిరిపోని జ్ఞాపకంలా ఆవిష్కరించింది. అప్పటి టీవీలూ, రైళ్లూ, వీధులు, వాహనాలు, హోర్డింగులు మనల్ని కాలంలో వెనక్కి తీసుకెళ్తాయి.అన్ని రకాల చెత్తతో నిండిన గోథం నగరం కూడా ఈ చిత్రంలో ఓ బలమైన పాత్రగా కనిపించడానికి కారణం సినిమాటోగ్రాఫర్ లారెన్స్ షెర్.
చీకటి నిశ్శబ్దాన్ని విహ్వలంగా వినిపించిన మ్యూజిక్ స్కోరర్ హిల్దూర్ గ్వానాడోటిర్ కోసం వెబ్‌ను గాలిస్తే చెర్నోబిల్ ‌కు ఆమె అందించిన నేపథ్య సంగీతం దొరకడం… ఓ బోనస్.
ఎలాంటి ఫ్లాష్ బ్యాకులూ, గతాన్ని గుర్తు చేసే ఫ్లాష్ కట్సూ లేకుండా స్టెయిట్ నెరెషన్‌తో సాగే ఈ సినిమా జోకర్‌తో కలసి మనం చేసే ప్రయాణం. అతని ప్రపంచంలో మనం ఉండడం ఈ చిత్రం మనకిచ్చే అనుభవం.

– పసునూరు శ్రీధర్ బాబు

సినిమా రివ్యూ, Uncategorized

కబాలి… ఎలా ఉందంటే? (Kabali Review)

kab

కబాలి బోరింగా ఏమీ లేదు కానీ, prosaic గా ఉంది. Narration ప్రేక్షకుడిని absorb చేసుకుంటున్నట్లే ఉంటుంది. కానీ, ఉన్నట్టుండి మలేషిన్ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ మీంచి కథలోంచి బయటకు తోసేసినట్లు తోసేస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ మ్యాన్ లా గాల్లోకి దూకి మ్యాజిక్ కార్పెట్ తో అభిమాన ప్రేక్షకుల్ని మళ్ళీ తన వెంట తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాడు. కానీ, ఒక డిటాచ్ మెంట్ కొనసాగుతూనే ఉంటుంది. అది సినిమా కథతో మన జీవితాలకు ఉండే డిటాచ్మెంట్ కాదు. దాన్ని మనం ఎప్పుడో మరిచిపోయాం. నేను చెబుతున్నది సిల్వర్ స్క్రీన్ మీద అంతెత్తున కనిపించే పాత్రల మధ్య ఉండే ప్లాజిబిలిటీ (plausibility) గురించి, పాసిబిలిటీ కాదు. మళ్ళీ పాసిబిలిటీస్ గురించి మాట్లాడితే కమర్షియల్ సినిమా మనల్నే వెక్కిరిస్తుంది. Of course, పాసిబిలిటీ కూడా ఒక రిలేటివ్ టర్మే. సగటు బుర్రలకు ఈ మాయామేయ జగత్తులోని పాసిబిలిటీస్ గురించి తెలిసింది ఎంత? అయితే, తెలియని పాసిబిలిటీస్ కూడా తెలిసిన ఈక్వేషన్స్ బేస్డ్ గానే ఉండే అవకాశం ఉంది. అందుకే, కట్టు కథల్లో కూడా నమ్మదగిన కాకపోయినా, నమ్మబలికే ప్రయత్నమైనా ఉంటే ప్రేక్షకుడు ఒక ఉపరితల పార్శ్వంలోనైనా కనెక్ట్ అవుతాడు. కబాలిలో అలాంటి కనెక్టివిటీ చాలా చోట్ల మిస్సవడంతో సినిమా ఒక well crafted శకలాల కుప్పగా కనిపిస్తుంది.

నిజానికి, దర్శకుడు రంజిత్ ఈ సినిమా మేకింగ్ లో తాను ఎంచుకున్న జాన్రాకు కట్టుబడే ఉన్నాడు. గ్యాంగ్ స్టర్ మూవీ కాబట్టి సెట్లు, స్టెప్పులు, గ్రూపు డాన్సుల పాటల జోలికి వెళ్ళకపోవడం బాగుంది. సన్నివేశాల పరంపర కొనసాగుతుంటే, ఇంకా పాట రాదేం.. అని అలవాటైన ప్రాణం అప్పుడప్పుడూ కొట్టుకుంటుంది కూడా. కథ కొంతవరకు గ్రిప్పింగ్ గా ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ, purposeful గా అనిపించదు. అంటే, సీన్ల కోసం కథ తయారైంది. కానీ, కథ కోసం సీన్లు తయారవలేదు. నిజానికి, ఈ కథను ఫ్లాషెస్ ఫ్లాష్ బ్యాక్ లో కాకుండా.. లీనియర్ నెరేషన్ లో చెబితే.. నాయకుడు సినిమాకు దగ్గరగానైనా వచ్చేది. మల్టీ లేయర్డ్ స్క్రీన్ ప్లే.. మన సినిమాల్లో నాకు తెలిసినంతవరకు మణిరత్నం –సఖిలో బాగా వర్కవుటైంది. ఆ పంథాలో వచ్చిన చాలా సినిమాలు, ఫ్లాష్ బ్యాక్ ను ముక్కలు చేసి చెప్పడమనే జిమ్మిక్కులకే పరిమితమయ్యాయి. నిజానికి, దర్శకుడు కథను దాచిపెట్టి.. సస్పెన్స్ లేదా క్యూరియాసిటీని సృష్టించడం పెద్ద గొప్ప విషయం కాదు. ప్రేక్షకుల ముందు సంభవిస్తున్న సన్నివేశాలతోనే ఆ తరువాత కథ ఏ మలుపు తిరుగుతుందన్న ఉత్కంఠ క్రియేట్ చేయగలిగితే అది గొప్ప నెరేషన్. హత్యనూ, హంతకుడినీ ముందే చూపించి హంటింగ్ ను ఎంచాంటింగా చూపించడం.. బహుశా ఒక్క హిచ్ కాక్ కే తెలుసేమో. మన రామ్ గోపాల్ వర్మ కూడా తాను తీసిన ఏ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ల జోలికి వెళ్ళలేదు. అది ఆయన బిగ్గెస్ట్ స్ట్రెంత్. రాము చిత్రాల్లో కథా కాలం ముందుకే వెళుతుంది. సినిమా చరిత్రలో క్లాసిక్స్ అనదగిన చాలా చిత్రాలు అలాంటివే. ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే, రజనీకాంత్ “బాషా” సినిమా మనకో క్లాసిక్ అయి కూర్చోవడం. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర… ఇలాంటివన్నీ ఒక wild contrast తో హీరో గతాన్ని ఫ్లాష్ బ్యాక్ లో రివీల్ చేసే పంథాలోనే వచ్చాయి. దాంతో, కథ తన form ను తీసుకోవడమనే పద్ధతి మంటగలిసింది. కబాలిదీ అదే కథ. ఇందులో కబాలీని వలస కార్మికుల నాయకుడి నుంచి మాఫియా డాన్ గా ఎదిగిన క్రమాన్ని స్ట్రెయిట్ గా చెప్పుకుంటూ పోతే… ప్రేక్షకులు ఆయనతో కలిసి ప్రయాణించేవారు. ఎందుకంటే, పాయింట్ బాగుంది. మరో పాయింట్ ఏమిటంటే, రజనీ తెల్లగెడ్డంతో స్క్రీన్ మీద కొత్తగా, piercing looks తో కనిపిస్తాడు. యువ రజనీ కథ మొదటి పది నిమిషాల్లో ముగిసిపోయి.. డాన్ స్టోరీ చివరిదాకా కొనసాగి ఉంటే.. స్క్రీన్ ప్లే లో ఇమోషనల్ గ్రాఫ్ డయాగ్నల్ గా పైకి వెళ్ళేది. చివరలో.. The hero is shot dead. మాపియా కథ అంటే.. సత్య సినిమా వరకూ చూపించిన ఎండింగే ఉండాలనుకున్నాడు డైరెక్టర్ రంజిత్.

ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ, రజనీ స్టయిలిష్ పర్ఫామెన్స్ కచ్చితంగా మెస్మరైజ్ చేస్తుంది. రాధికా ఆప్టే ప్రజెన్స్.. సినిమా అంతటా ఒక వాతావరణంలా అల్లుకుపోయింది. విలన్స్  హత్యకు గురైన తరువాత గ్లాస్ విండో లోంచి రజనీని చూపించే షాట్… సీతారామరాజు నడి రోడ్డు మీద కారులో హత్యకు గురైన దృశ్యం.. సినిమాటోగ్రాఫర్ సిగ్నేచర్స్ లా మెరుస్తాయి. షారుఖ్ ఖాన్ డాన్ సినిమా లో మలేషియాను చూసిన తరువాత ఇంతకన్నా బాగా ఇంకెవరు చూపిస్తారు ఈ దేశాన్ని అనుకుంటే.. కబాలీ మురళి మరింత మురిపించాడు. ఈ సినిమాలో నాకు నచ్చిన మరో విషయం.. బ్యాగ్రౌండ్ స్కోర్. సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం రొటీన్ కు భిన్నంగా ఆడియన్స్ ఇమోషన్ లెవెల్స్ తో ఆడుకుంటుంది. నిజానికి, ఈ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక బలమైన పాత్ర. గాడ్ ఫాదర్, సిటీ ఆఫ్ గాడ్, సత్య, ఫర్హాన్ అఖ్తర్ డాన్ చిత్రాల ప్రభావాలతో డైరెక్టర్ రంజిత్.. రజనీకాంత్ వయసును కుడా జస్టిఫై చేసే హీరోయిజంతో గ్యాంగ్ స్టర్ స్టోరీ చెప్పారు. కానీ, మాఫియా ఇంట్రికసీస్ ను పెద్దగా పట్టించుకోలేదు. రజనీకాంత్ మాత్రం ఎంతకని కవర్ చేయగలడు? అన్నట్లు.. మరో డిసప్పాయింట్ మెంట్ ఏమిటంటే.. ఇంత పెద్ద గ్యాంగ్ స్టర్ కథలో ఒళ్ళు గగుర్పొడిచే ఓ చేజింగ్ సీనైనా లేకపోవడం.

Still, నాకెందుకో ఈ సినిమా బాగా లేదని చెప్పాలనిపించడం లేదు. నిప్పురా అంటూ… దడ దడ లాడించిన ఈ సిన్మాలో కొన్ని మెరుపులున్నాయి. కొన్ని గ్రాండియర్ టేకింగ్స్ ఉన్నాయి. ఉలిక్కి పడేలా చేసే.. యాక్షన్ సీన్స్ ఉన్నాయి. కిల్లర్ డాన్ వల వల ఏడ్చే vulnerabilities ఉన్నాయి, తల్లీ చెల్లి సెంటిమెంట్ల రొటీన్ ఇమోషన్స్ కాకుండా.. భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చూపించడం ఉంది. బిడ్డను కలిసినప్పటికన్నా భార్యను కలిసినప్పటి ఇమోషన్ ను డైరెక్టర్ ఎలివేట్ చేయడం ఈ తరానికి బాగా అవసరమని అనిపించింది. మరీ ముఖ్యంగా, ఒక సబాల్ట్రన్ కసిని (కమర్షియల్ ప్లేన్ లోనే అయినప్పటికీ) మాస్ హీరోయిజంగా మలిచే ప్రయత్నం నాకు నచ్చింది. ఈ  మెరుపులన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నాననంటే… సినిమాను ప్రేక్షకులు – చాలా మంది so called critics అనుకుంటున్నట్లు – కథ కోసం మాత్రమే చూడరని చెప్పడం కోసం. కథ sub-text గా మారి.. visual nuances ప్రధాన కథగా మారి చరిత్ర సృష్టించిన సినిమాలూ ఎన్నో ఉన్నాయి. (ఈ చివరి వాక్యానికి కబాలికి ఏ సంబంధమూ లేదు).

– పసునూరు శ్రీధర్ బాబు

 

 

కొత్త కవితలు

నిశి చింత

దేహం ఆకాశం
ఉదయం
అస్తమయం
నక్షత్ర నగరం
ఖాళీ లోలకం
లోతెరుగని అగాధం
ఒక్క కన్నీటి చుక్కకే పొంగి పొరలే శూన్యం
***
NIshi

పాదాల కింద నక్షత్ర క్షతాలు
కళ్ళల్లో కరకు నెలవంకలు
వాగువంకల సిరలూ ధమనులు
గుండెలో గిరులూ తరువులూ
***
చింకి పాతల ఆకాశాన్ని గోచీ కట్టుకుని
ఉదయాన్ని తుపుక్కున ఉమ్మేసి
చీకట్లోకి వెళ్ళిపోతున్నాడొకడు
ఇప్పటిదాకా చూసిందంతా పెరట్లో వదిలేసి
ఇక…
చూసేందుకు వెలుగుతో పని లేదని
అసలు కళ్ళే అక్కర్లేదని

***
(రాత్రి 9.15 గం.లు, 20 ఫిబ్రవరి, 2015)

కొత్త కవితలు

ఒక్క కవిత్వమే

నాకోసం నేను చేసే పని
నాకోసం మాత్రమే నేను చేసే పని
గుండెలోకి నిండుగా గాలిని పీల్చుకున్నట్టు
చూపుతో సమస్త ప్రపంచాన్ని వడబోసి
లోపలికి ఒంపుకున్నట్టు…
పరిపూర్ణంగా నాకోసమే నేను చేసే పని
బహుశా… కవిత్వమేనేమో!

ఎవరిదో బొమ్మ వేయడం కాకుండా
నేనే అనేకానేక చిత్రఖండాలైపోయే పని…
నా ఉనికికి మొలిచిన ముళ్ళూ పూలల్లా పొగరుగా తలెత్తుకు నిలిచే పని
నాకిష్టమో అయిష్టమో తెలియకుండానే
అసంకల్పితంగా… అనివార్యంగా… చేయకతప్పని పని..
ఒక్క కవిత్వమేనేమో!

only poetry

సకలేంద్రియాలు దేహాత్మలతో
సంభాషిస్తున్నప్పుడు.. సంఘర్షిస్తున్నప్పుడు..
సంశయిస్తున్నప్పుడు… సంచలిస్తున్నప్పుడు
ఎవరూ లేని రాలేని… దేహద్వీపంలో
లాంతరు పట్టుకుని కాసేపు భయంగా…
మరికాసేపు ఉద్విగ్నంగా… అంతలోనే విహ్వలంగా…
నాకోసం నేను చేసే సంచారం..
నన్ను నేను మీటుకుని వినిపించే సంగీతం
వెన్నులోంచి సన్నని సెగలా పెల్లుబికే గానం
ఒక్క కవిత్వమేనేమో!?

దిగుడుబావిలోకి దిగుతూ దిగుతూ
ఆకాశాన్ని మరిచిపోయి
పెను చీకట్లోకి ఈదుకుంటూ పోయే పని
మెట్లెక్కుతూ ఎక్కుతూ…
కాళ్ళ కింద మెట్లు గల్లంతైనా
ఆగని ఆరోహణ లాంటి పని-
మొత్తం దేహమంతా గుండెలా కొట్టుకుంటుంటే
సెకండ్ల ముళ్ళు కదిలే చప్పుడు ఘనీభవించిన సరళరేఖ మీద
తలకిందులైన మహోద్ధృత జలపాతంలా
పదాల్ని రోదసిలోకి ఎగజిమ్మే పని-

అన్నీ మరచిపోయి
నన్నే మరిచిపోయి
క్షరమై… మరు మరు క్షణమొక
అక్షరమై చేసే పని…
ఒక్క కవిత్వమేనేమో..?
ఊహూ…
ఒక్క కవిత్వమే-

***
(నవంబర్ 2014)

కొత్త కవితలు

ఏం చేద్దాం?

ఏం చేద్దాం?
దుఃఖాన్ని ఏ చిరునవ్వుతో బంధించి అబద్ధం చేద్దాం?

ఏం చేద్దాం?
గాయాన్ని ఏ రెప్పలతో మూసి రాత్రిని కలల్తో అలంకరిద్దాం?

ఏం చేద్దాం?
ఏకాంతాన్ని ఏ భయంతో అంటించి కన్నీటి బిందువై పేలిపోదాం?
questions
ఏం చేద్దాం?
చీకటి దుప్పటి కప్పుకుని బూడిదై రోజూ పొద్దున్నే ఏ కొత్త ముఖం తొడుక్కుందాం?

ఏం చేద్దాం?
ఊహూ… ఇలా కాదు-
ఏదో ఒకటి చేద్దాం….
బతుక్కిదే చిట్ట చివరి క్షణమైనట్లు నిట్ట నిలువునా నిప్పుకణమై భగ్గుమందాం
తగులబడిపోనీ ఊరంతా
కాలిన మొండి గోడల్ని చీల్చుకుని ఎన్ని గింజలు తలెత్తుకుని చిగురించడం లేదూ…?
అలాగే… మనమూ మళ్ళీ…

(12.36 A.M 04 Oct, ’14)

కొత్త కవితలు

దుఃఖం

దుఃఖంతో కళ్ళను శుభ్రంగా కడుక్కోవడం తెలీకపోతే
దేన్నయినా ఎలా చూస్తావ్ స్పష్టంగా?

దుఃఖం నీ కళ్ళలోని చెత్తను కడిగిపారేస్తుంది
నువ్వు నిజంగా చూడలేకపోయిన చిత్రాలను స్వచ్ఛంగా చూపిస్తుంది
కన్నీళ్ళు కురవందే నీ వినీల నేత్రాకాశం ఎలా నిర్మలమవుతుంది?

eye

కళ్ళంటే రెటీనా తెరలు… గాజు పలకలు కాదు
రెప్పలు మూసుకున్నప్పుడు తెరచుకునే లోపలి నేత్రాలు కూడా-
దుఃఖం నిన్ను లోలోపలి నుంచి కడిగిపారేస్తుంది-

కడుపు నిండా ఏడ్వలేనివాడు
గుండె నిండా నవ్వలేడు-
అందుకే.. దుఃఖాన్ని అకారణంగా బంధించకు
కాకపోతే… కారణాన్ని మాత్రం పిడికిట్లో పదిలంగా పట్టుకో-

వానలో తడిసి పొద్దుటి ఎండకు మెరిసే కొబ్బరి చెట్టులా
పచ్చని కళ్ళతో ఆకాశాన్ని నిమురుతూ తేరుకుంటున్నప్పుడు
గుప్పిట్లో దాగిన రహస్యం…
రెక్కలు తొడుక్కుని ఎగిరిపోనూవచ్చు సీతాకోకచిలుకలా
లేదూ…
శిశిర రాగాల వసంత కోకిలలా నీలోపలి అడవిలోకి చొచ్చుకుపోనూవచ్చు-

ఏమైనా…
నువ్వొక పచ్చని పాటవ్వడం కోసం
దుఃఖంలో తడిసిపోవల్సిందే.. లోపలా, బయటా!
***
05/10/2014

కొత్త కవితలు

నువ్వు నేను మృత్యువు

వెలుగులోకి చీకటి జూలు విదిల్చి నెమ్మదిగా అడుగుపెడుతున్నట్టు ప్రాణంలోకి మృత్యువు చొరబడుతున్న క్షణాల్లో గుర్తొచ్చే బతికిన క్షణాల్లో వినిపించే రాగాల నయగారాలు ఉవ్వెత్తున ఎగసిపడి మీద పడి తడిమేసి తడిపేసి తోసేసినప్పుడు నువ్వు నేను మృత్యువు కలిసే కదా ఆ సంబరంలో కొట్టుకుపోయాం?

లోలోపల తవ్వుకుంటూ విత్తనాలు జల్లుకుంటూ నైరుతి రుతుపవనాల కోసం రెప్పలు తెరుచుకుని తాటి తోపులో ముంజలు వొలిచిన కాయలమై ఏటి ఇసుకలో దొర్లుకుంటూ పోయినప్పుడు వేసవితో వేసారి ఆవిరైన వాగు శకలాల్లో కనిపించిన ఆకాశమే కదా మన ప్రతిబింబం అనుకున్నాం!nuvvu nenu mrityuvu

పుట్టి బుద్ధెరిగినప్పటినుంచీ ప్రతి రాత్రీ చీకటితో కలల ముడుపులు కట్టి మొలతాడుకు వేలాడేసుకుని నదీ స్నానంతో సూర్యోదయంలోకి వెళ్ళి దహన సంస్కారం చేసుకుని సూర్యాస్తమయం నుంచి నివురు గప్పిన నిప్పులా నిష్క్రమిస్తున్నప్పుడు కాలిన గాయమైన దైహికైహిక ధూపంలోంచి విడిపోతున్న సాంబ్రాణి సువాసన నువ్వే కదా?

ఎండిన కుంటలో కళ్ళన్ని ముళ్ళు చేసుకుని నిలబడ్డ తుమ్మచెట్ల మీద ఆరేసుకున్న వెన్నెల బొంత మీద చిరుగుల్ని నిమిరి కుమిలిపోతున్నప్పుడు ఊరినంతా కప్పేసిన అమాస గబ్బిలం రెక్కల్లో మృత్యువు వెచ్చదనాన్ని అనుభవించిన మొక్కవోని ధైర్యంతో ఒంటరిగా మనమేగా?

గుత్తులు గుత్తుల తంగేడు పూలను బస్తాలో వేసుకుంటూ గుట్టలెంబడి పుట్టలెంబడి గునుగు పూలు తెంపుకుంటూ సజ్జ కంకుల గింజలను ఒడుపుగా తింటూ చెట్టు మీది మక్క సిత్ఫాల పండ్లను తిని తరించిన కాలం చిన్నప్పటి దోస్తులా చేజారిపోతే వెనక్కితిరిగి చూసుకోలేక ఆ తరువాతెపుడో బస్టాపుల్లో రైల్వే ఫ్లాటుఫారాల మీద దేవులాడుతుంటే నువ్వొక రేపటి జ్ఞాపకంలా నను చేయిపట్టుకుని తీసుకువెళ్ళినప్పుడు చితి వెలుగులాంటి గమ్యం కనిపించింది కదా మనిద్దరికీ?

రణమైనా.. ప్రణయమైనా… గమ్యం చేరని ప్రయాణమే కదా మనం కోరుకున్నాం!
వలపుల తలపుల మలుపుల ఝరిలా సముద్రాన్ని ధిక్కరించాలని కదా నిర్ణయించుకున్నాం-
ఇంద్రజాలికుడి కత్తుల పంజరంలో మాయమైన పావురంలా మృత్యువు కూడా ఈ ప్రయాణంలో మనకు తోడుగా వచ్చే బాటసారేనని కూడా తెలుసుకున్నాం-

తలమీంచి టోపీతీసి పావురాన్ని అలా ఒయ్యారంగా గాలిలోకి వదిలేసిన మాయావిని చూసి అందరూ చప్పట్లు కొడుతుంటే..
మనం మాత్రం నవ్వుకుంటూనే ఉన్నాం కదా!

***
(ఉ. 2.22 గంటలు 9 అక్టోబర్ 2014)